||సుందరకాండ ||
||తత్త్వదీపిక - ఎనిమిదవ సర్గ ||
||ప్రాణమయకోశములో హనుమంతుడు||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ అష్టమస్సర్గః
తత్త్వదీపిక
ప్రాణమయకోశములో హనుమంతుడు
హనుమంతుడు సీతాన్వేషణలో రావణుడు ఉండే భవన సముదాయము చేరుతాడు.
ఆ పవనాత్మజుడు వీరుడు అగు హనుమంతుడు
ఆ భవన సముదాయముల మధ్యలో మణులు వజ్రములతో అలంకరింపబడిన
బంగారముతో చేయబడిన జాలలతో గల గవాక్షములు కల
ఒక మహత్తరమైన విమానమును చూచెను.
అది అప్రమేయమైనది తిరుగులేనిది.
స్వయముగా విశ్వకర్మ చేత నిర్మింపబడినది.
ఆ విమానము దివిలోకమునకు పోవు ఆకాశమార్గము లో సూర్యమార్గమునకు చిహ్నముగా ప్రకాశిస్తున్నది.
ఆ విమానములో విశేష ప్రయత్నము లేకుండా చేయబడనిది లేదు.
అ విమానములో మహత్తరమైన రత్నములతో చేయబడనిది లేదు.
అ విమానములో ఉన్న విశేషములు సుర లోకములో ఉన్నాయని చెప్పలేము.
ఆ విమానములో మహత్తరముగా విశేషము కానిది అంటూ ఏది లేదు.
ఆ విమానము తపశ్శక్తి తోనూ పరాక్రమము తోను అర్జించు కొనబడినది.
ఆ విమానము మనస్సులో నున్న కోరికలకి సమాధానముగా పోవును.
అ విమానము అనేకమైన విశేషమైన భాగములతో నిర్మితమైనది.
అ విమానము అక్కడక్కడ విశేషములతో దర్శనీయముగా నున్నది.
ఆ విమానము మనస్సులో ఉన్న ఊహలకు సమాధానమై శీఘ్రముగా పోగలది.
అ విమానము వాయువేగముతో సమానవేగముతో పోగలది.
ఆ విమానము మహాత్ములు పుణ్యాత్ములు తేజస్విలు మహదానందభరితులు వుండు ఆలయములా వున్నది.
ఆ విమానము విశిష్టమైన రీతిలో విశేషములతో నిర్మించబడినది.
ఆ విమానము శరత్కాలపు చంద్రునిలాగా మనస్సును ఆకర్షిస్తూఉన్నది.
ఆ విమానము విచిత్రమైన కూటములు శిఖరములు కల పర్వతములా ఉన్నది.
ఆ విమానము కుండలములతో శోభిస్తున్నముఖముకల వేలకొలది ఉన్న భూతములు ,
మహత్తరమైన కాయముకల వారు గగనవిహారులూ నిశాచరులు,
గుండ్రముగా విశాలముగావున్న కళ్ళూకలవారు వంకరగావున్నకళ్ళుకలవారు,
మహత్తరమైన శక్తికల భూతగణముల చేత
మోయబడుతున్నట్లు ఉన్నది.
వసంతఋతువులలోని పుష్పరాజముల అందముతో ఒప్పారు తూ వున్న,
వసంతమాసము కన్న రమ్యమైనదిగా ఉన్నట్టి
ఆ ఉత్తమమైన విమానమును అ వానరోత్తముడు దర్శించెను.
ఈ విధముగా వాల్మీకి సుందరకాండ ఎనిమిదవ సర్గలో
అతి సుందరమైన పుష్పకవిమాన వర్ణన
అతిమధురముగా అత్యంతసుందరముగా చేస్తాడు.
పంచకోశములలో అంతర్గతముగా వున్న ఆత్మ అన్వేషణములో ముముక్షువు,
ఐదు కోశములతో కప్పబడి యున్న అత్మను కనుక్కొంటాడు అని ఉపనిషత్తులు చెపుతాయి.
ఆ పంచకోశములు ఏమిటి అంటే అవే అన్నమయ , ప్రాణమయ ,మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు.
ఆత్మ ఈ అన్ని కోశములతో కప్పబడి కనబడకుండా ఉంటుంది.
అత్మాన్వేషణలో జీవుడు ఈ అన్నికోశములు దాటి
చివరికి ఆత్మను కనుక్కొంటాడు అని ఉపనిషత్తులు చెపుతాయి.
సీతాన్వేషణలో హనుమంతుడు భవనముల సముదాయమును దాటుతూ వుంటే
మనకి ఆ పంచ కోశములే స్ఫురిస్తాయి.
వాల్మీకి ఈ భనముల వర్ణలలో మూడు సార్లు
"అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్" అని రాస్తాడు.
అంటే " అ లక్ష్మీ వంతుడు రావణుని గృహము ప్రవేశించెను",
అలా చెప్పి ఆ గృహవర్ణన చేసి ముందుకు పోతువుంటాడు.
ఈ మూడు చోట్ల సీత లేదు.
కనక ఇవి ఆత్మ స్థాన అన్వేషణలో విజ్ఞానమయకోశమునకు ముందున్న మొదటి మూడు కోశములు
అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములు అని స్ఫురిస్తుంది అని అంటారు అప్పలాచార్యులుగారు.
ఇవి దాటుతున్న హనుమంతుని ప్రతి సారి లక్ష్మీవాన్ అని వర్ణిస్తాడు వాల్మీకి
ఐదవ సర్గ చివరిలో , ఆరవ సర్గమొదటిలో ప్రవేశించిన భవనసముదాయము అన్నమయ కోశము అని,
అలాగే ఈ ఎనిమిదవ సర్గలో పుష్పక విమాన వర్ణనలో
"దివం గతం వాయుపథ ప్రతిష్ఠితం" అన్న మాటతో
ఇది ప్రాణమయ కోశమా అని స్ఫురిస్తుంది అంటారు అప్పలాచార్యులవారు.
అంటే వాయుపథములో పోవు పుష్పక విమానము చూస్తూ వున్న హనుమంతుడు
ప్రాణమయకోశములో అత్మాన్వేషణ చేస్తున్నాడాఅన్నట్లు వుందన్నమాట.
మూడవ కోశము మనోమయ కోశము.
"అసత్ ప్రలాపాన్ రావయతి ఇతి రావణః" అని
అంటే అసత్యమైన ప్రలాపముకలిగించువాడు కనక రావణుడు
అంటే అసత్ప్రలాపములు కలిగించే మనస్సు ,
అదే రావణుడు అని మొదటిసర్గలో విన్నాము .
అంటే రావణుడి శయనాగారమే మనోమయ కోశము
అదే అప్పలాచర్యులవారి తత్త్వగీతలో చెప్పినమాట.
||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||