||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- పట్టాభిషేక సర్గ||
||" పునరాగమనము!"||
||ఓమ్ తత్ సత్||
తత్త్వదీపిక
సీతారామ పట్టాభిషేకము.
పునరాగమనము
( మనవి: రామాయణములో ముఖ్యమైన ఘట్టము సీతాన్వేషణ, అదే సుందరకాండ లో మనము వినేది. సీతాన్వేషణ అయిన పిమ్మట మిగిలినది రావధే. సీతమ్మ పాతివ్రత్యమహిమతో రావణ వధ అయినట్లే అని, ఆ వధకు రాముడు నిమిత్తమాత్రుడే అని హనుమ చెపుతాడు. అదే అధారముగా తరతరాలలనుంచి సుందరకాండ చదివిన పిమ్మట రామపట్టాభిషేక సర్గ చదవడము ఆనవాయితీ అయింది.
పట్టాభిషేక సర్గలో తత్త్వార్థము కూడా అప్పలాచార్యులవారి తత్త్వదీపికని అనుసరించే రాస్తున్నాము. అది రావణ వధ అయినతరువాత, రాములవారు అయోధ్యానగరమునకు బయలుదేరడముతో మొదలగుతుంది. దీనిని మూడు భాగాలలో వింటాము. ఒకటి పునరాగమనము అంటూ రాములవారు అయోధ్యచేరి పట్టాభిషేకమునకు అభిముఖుడు అయ్యేదాకా మొదటి భాగములో వింటాము.
రెండవ భాగము రామాయణములోని పట్టాభిషేక సర్గలో వశిష్ఠుడు తదితరులు పట్టాభిషేక ఘట్టము మొదలెట్టే దాకా జరిగిన వృత్తాంతము వింటాము. మూడవ భాగము లో పట్టాభిషేక ఘట్టము ఫలశృతి వింటాము. ఇక మొదటి భాగము పునరాగమనము).
||ఓమ్ తత్ సత్||
పునరాగమనము.
శ్రీరామచంద్రుడు రావణ వధానంతరము
పుష్పక విమానముపై విభీషణునితో
సుగ్రీవాది వానరులు వారి పత్నులతో కలిసి
భరద్వాజాశ్రమమునకు చేరెను.
అచట వారి ఆతిథ్యము స్వీకరించి,
నందిగ్రామమున వున్న భరతునకు
తనరాకను తెలుపుటకై హనుమను పంపెను.
పదునాలుగు సంవత్సరములు నిండగనే
తాను కనపడకపోయినచో భరతుడు
ప్రాణత్యాగము చేయునేమో అని హనుమను పంపి,
హనుమను దారిలో నున్న గుహునకు కూడా
తన క్షేమ వార్త తెలుపు మనెను.
గుహుడు తన "ఆత్మసమస్సఖా" అని రాముడు చెప్పెను.
హనుమను పంపుచూ ఒక మాట చెప్పెను.
"హనుమా భరతుని ముఖవర్ణమును,
దృష్టిని , సంభాషణ విధానమును
జాగ్రతతో పరికించి చూడుము.
రాజ్యము ఎంతటి వారి మనస్సునూ ఆకర్షించవచ్చును.
ఒకవేళ భరతునికి రాజ్యకాంక్ష కలిగినట్లు నీకు తోచినచో
వెంటనే వెనకకు రమ్ము.
అతడే రాజ్యము పాలించుగాక.
మేము నందిగ్రామము రాకమునుపే
నీవు మాకు ఎదురురమ్ము." అని చెప్పెను.
ఇందులో మనకి తెలిసికోదగిన సత్యాలు కనిపిస్తాయి.
రాముని త్యాగము ఔదార్యము లోకాతీతము.
రాముడు సోదరులయెందు అధికమైన ప్రేమ కలవాడు.
వారి మనస్సుకు ఏమాత్రము అనిష్టమైననూ అది తాను సహింపలేడు.
భరతునికి ఏమాత్రము రాజ్యకాంక్ష కలిగినచో
రాముడు 'అతడే పాలించు గాక' అనే ఆలోచనతో
తన ఔదార్యము ప్రకటిస్తున్నాడు.
రాముని సౌశీల్యము దీనిచే తెలుసుకొనవచ్చును.
ఈవిధముగా చెప్పబడిన హనుమ భరతుని దగ్గరకు వెళ్ళును.
భరతుడు ఎలా కనపడ్డాడుట ?
జటిలుడై , ఒడలంతయూ మలినము పట్టి,
అగ్రజుని ఆపదచే కృశించి
ఫలమూలములనే ఆహారముగా తీసుకొనుచూ
తాపసుడై, ధర్మచారియై వున్నాడుట.
అట్టి భరతునికి నమస్కరించి
"సీతాసమేతుడైన రాముడు తిరిగివచ్చుచున్నాడు.
నీవు త్వరలో కలయగలవు" అని చెప్పెను.
ఆ మాటలను విని
భరతుడు ఆనంద పరవశుడై మూర్ఛపడ్డాడుట.
మరల లేచి హనుమను కౌగలించుకొని ఇలా అంటాడు.
"స్వామీ నీవు దేవుడవా? మనుష్యుడవా?
నాయందు దయతో ఈ ప్రియమైన వార్తను తెలిపిన
నీకు ఏమిచేయగలను"అని.
ఈ మాటలతో భరతుడు రామునికి తగిన తమ్ముడిలాగ కనిపిస్తాడు మనకు
అప్పుడు "సీతావృత్తాంత కోవిదు"డైన హనుమ ,
ఇప్పుడు సీతారామవృత్తాంతము భరతునికి నివేదించెను.
"రేపు పుష్యమీ నక్షత్రమున రాముని చూడగలవు" అని హనుమ చెప్పెను.
భరతుడానందముతో శత్రుఘ్నుని
శ్రీరామానుగమనముకు తగిన సన్నాహములు చేయుటకు నియమించెను.
రామదర్శనముకు అందరూ సిద్ధమైరి.
తెల్లవారినది.
భరతుడు రామానుగమనముకై వేచియుండెను.
దేనికోసమైన వేచి ఉన్నప్పుడు
క్షణములు యుగములులాగ కనిపిస్తాయి.
అదే భరతుని మనస్థితి.
తెల్లవారింది కాని ఇంకా రాముడు రాలేదు.
అప్పుడు భరతుడు హనుమతో ఇట్లనును.
"కచ్చిన్న ఖలు కాపేయీ సేవ్యతే చలచిత్తతా" అంటే
"వానరజాతికి సహజమగు చపలచిత్తముతో "
రాముడు వస్తున్నాడని "పలికితివా ఏమి?"అని.
భరతుడు హనుమను ఇంకా అడుగుతాడు
"రాముడింకను రాడేమి?
వానరులు కానరారేమి? అని.
నిరహంకార రూపుడైన హనుమ
"వానరులు చపలచిత్తులు" అన్న మాటలను పక్కనబెట్టి
తన వాక్చాతుర్యము తో ఇలా సమాధానము ఇస్తాడు.
" స్వామీ ఈ చెట్లు ఫలపుష్పములతో నిండియుండుటే నిదర్శనము.
భరద్వాజుని వరముచే వానరులకొఱకు ఈ వృక్షములు ఫలభరితములు.
అదిగో వానరఘోష వినపడుచున్నది.
మా వానరసేన గోమతీ నదిని దాటుచున్నది.
అదిగో స్వామి పుష్పక విమానము. కనపడుచున్నది"
ఇలా చెప్పగానే పుష్పక విమానము దగ్గరకు వచ్చెను,
చూస్తున్న ప్రజలందరూ "రామోsయం" "రామోsయం" అంటే
"అదిగోరాముడు" "అదిగోరాముడు" అని ఘోష చేసిరి.
భరతుడు విమానములో వున్న రామునికి నమస్కరించెను.
రాముని ఆజ్ఞతో పుష్పక విమానము భూమిపై దిగెను.
భరతుడు విమానము నెక్కి రామునివద్దకు చేరి నమస్కరించెను.
రాముడు భరతుని లేవదీసి కౌగలించుకొనెను.
భరతుడు లక్ష్మణుని చేరి వైదేహి కి నమస్కరించెను.
సుగ్రీవజాంబవంతాదులందరికి స్వాగతము పలికెను.
శతృఘ్నుడు కూడా అందరికీ నమస్కరించెను.
అప్పుడు శ్రీరామచంద్రుడు విమానము నుంచి దిగివచ్చి
తన తల్లికి , సుమిత్రకూ కైకేయికి నమస్కరించెను.
భరతుడు స్వయముగా రాముని పాదులకలను తెచ్చి
రాముని పాదములకు చేర్చెను.
శ్రీరామ భరతుల సోదర ప్రేమ చూచి
వానరులు విభీషణుడు మున్నగువారలు కనుల నీరు నింపుకొనిరి.
విమానము నుంచి అందరూ దిగిన పిమ్మట
రాముడు పుష్పక విమానమును కుబేరునివద్దకు వెళ్ళమని ఆదేశించెను.
రావణుని సంహరించిన రాముడు రావణుని పుష్పక విమానము తనది గా భావించలేదు.
రావణుడు అన్యాయముగా అర్జించిన సామగ్రులను
వారి న్యాయమైన స్థానములకు పంపుట న్యాయము.
అదే విధముగా రాముడు పుష్పక విమానమును కుబేరునికి పంపెను.
రామాయణములో గ్రహించవలసిన లోక నీతులలో ఇది ఒకటి.
అన్యాయముగా అర్జింపబడు ఆస్తులు
వాటి న్యాయస్థానమును చేరుటే న్యాయము.
అలా చేసినవాడే నిష్కామ కర్మ చేసినవాడౌతాడు.
శ్రీరామచంద్రుడు తమ వంశమునకు పురోహితుడగు వశిష్టుని
పాదపద్మములను పట్టి నమస్కరించి
ఇంద్రుడు బృహస్పతి ని చేరినట్లు
తాను వశిష్టును సన్నిధిని చేరి
వారితో పాటు తానుకూడా వేరొక ఆసనముపై కూర్చుండెను.
అప్పుడు భరతుడు మాట్లాడుతాడు.
భరతుడు ఎలా మాట్లాడాడో వర్ణిస్తూ వాల్మీకి ఇలారాస్తారు.
"శిరస్యంజలిమాధాయ కైకేయానందవర్థనః |
బభాషే భరతో జ్యేష్టం రామం సత్య పరాక్రమమ్"||
అంటే, కైకేయానందవర్థనుడైన భరతుడు,
శిరస్సుతో అంజలి ఘటించి,
సత్యపరాక్రముడు అయిన
జ్యేష్టుడు రామునితో ఇట్లు పలికెను.
ఇక్కడ రాముడు సత్యపరాక్రముడు అని చెప్పబడతాడు.
అంటే సత్యము చేతనే శత్రువులను జయించిన వాడు.
పరలోకములను వశము చేసికొనిన వాడు.
రాజ్యము మరల పొందినవాడు.
ఇవన్నీ సత్యముపై నిలబడి చేసిన సాధనలు.
ఇక ఇప్పుడు భరతుడు ఏమి చెపుతాడు?
"పూజితా మామికా మాతా దత్తం రాజ్యం ఇదం మమ|
తత్ దదామి పునః తుభ్యం యథా త్వమ్ ఆదదామమ"||
అంటే "స్వామీ ! మా అమ్మను పూజించితివి.
ఈ రాజ్యమును నాకు ఒసంగితివి.
నువ్వు నాకు ఇచ్చినట్లే,
అట్లే మరల నీకు ఒసంగుచున్నాను"
ఇది సత్యము.
ఇది జరగవలసినమాట,
అలాగే జరిగినమాట.
అయితే దీంట్లో గమనించవలసిన విషయము వుంది.
భరతుడు రాజ్యము పొంది,
తను రాజ్యపాలకుడైనా
రాజ్యము రాముడికే అర్పించినట్లు
రామపాదుకా పట్టాభిషేకము చేసి
రాజ్యము రామునికే చెందినదిగా భావించి
రాముని పునరాగమనముతో
మళ్ళీ రామునకే అర్పిస్తాడు.
మానవుడు శరీరమును ధరించి
సత్వరజస్తమో గుణములలో రజోగుణాభివృద్ధివలన
తనకున్న సర్వస్వము ,
తనదిగా భావించి తనే అనుభవించును.
అట్టి అనుభవము జీవితమునకు ప్రయోజనము కాదు.
ఇక్కడ భరతుడు తను చేసిన పనులతో
మనకి ఒక జీవిత సత్యము చెపుతున్నాడు
ఆ సర్వస్వము సర్వేశ్వరునుకి చెందినదిగా భావించి
అది సర్వేశ్వరునికే అర్పించుట మన కర్తవ్యము అని.
సర్వేశ్వరుడు మనము అనుభవించు సర్వ పదార్థములను
మనకు మనవిగా భావించుటకు తగునట్లే ఒసంగును.
మనము మనవి గా భావించి మమకారము పెంచుకుంటాము.
నేను దీనిని అనుభవించు చున్నాను.
ఇది నారక్షణలో వున్నది.
ఇది నాది అని అనుకుంటాము.
ఆ మార్గములో అహంకారము ఏర్పడుతుంది.
సమస్త పదార్థములనూ
విశ్వమంతయూ వ్యాపింపబడిన ఈశ్వరుని సొత్తు అని గ్రహించి,
వాడే కాపాడువాడు,
వాడే అనుభవించువాడు అని గ్రహించి,
అన్నీ ఈశ్వరార్పణము అని తలచుచూ ఈశ్వరునికి అర్పించి,
తాను చేయవలసిన కర్మలను చేయువాడు
బంధములకు అతీతుడై నిస్సంగత్వము పొందును.
నిస్సంగత్వము పొందినవాడు నిశ్చలతత్త్వము,
నిశ్చల తత్త్వము పొందినవాడు జీవన్ముక్తి పొందును.
ఇది ఆత్మస్వరూపము తెలిసికొనినవాడు చేయు విధానము
ఇక్కడ భరతుడు ఆ ధర్మమునే పాటించి
"ఇదం రాజ్యం మమ దత్తం"
ఈ రాజ్యము నాకు ఒసంగబడినది అని తలచి,
తనకి ఒసంగబడిన రాజ్యము
తనది కానిదిగా భావించి,
రాముని ప్రతినిధిగా పాలించి
వనవాసమునుంచి తిరిగివచ్చిన రామునకు
"తతః పునః తుభ్యం దదామి"
"మరల నీకు ఒసంగుచున్నాను" అంటూ,
రామునకు రాజ్యము అర్పించుచున్నాడు.
ఇది గుర్తించడమే జ్ఞానము.
సర్వము సర్వేశ్వరునిదే అని
సర్వేశ్వరునికి అర్పించుటయే
మానవుడు చేయతగిన కర్మ అని
భరతుడు తన ఆచరణముచే
మనకు ఉపదేశించుచున్నాడు.
ఇది ఒక ముఖ్యమైన మాట, గమనించవలసిన మాట.
ఈ రాజ్యము పాలించుటకు రాముడే ఎలా అర్హుడో అని
భరతుడు ఇంకా చెపుతాడు.
"బలసిన ఒంటరి వృషభము మోయగల భారము
లేగ దూడ ఎలామోయలేదో,
అలాగ ఈ రాజ్యభారమును నేను మోయలేను"
"ప్రవాహముచే గండిపడిన ఆనకట్టను
కట్టుటకు ఎంత కష్టమో
రాజ్యములోని ఛిద్రములను
ఆవరించుట అంత కష్టము".
"ఓ రామా,
రూపములోసామ్యము ఉన్నదని
గాడిద గుఱ్ఱమువలె నడచుటకు యత్నించినట్లు,
హంసనడకలను కాకి అనుకరించినట్లు,
నేను కూడా రాజపుత్రుడనే అని
నీవలె రాజ్యపాలనము చేయుటకు ప్రయత్నము
హాస్యాస్పదమగును."
ఇదంతా నీ రాజ్యము. నీవే ఏలాలి అని
రాముడికి చెప్పడానికి భరతుని ప్రయత్నము.
అంతేకాదు ఇంకా చెపుతాడు.
"ఓ రామా ఇంటి లోపల భాగమున నాటుకొనిన ఒక మొక్క
బాగుగా పెరిగి బలమైన కొమ్మలతో విస్తరించి
పూచి పండకుండా ఎండిపోయినచో
ఆ ఇంటి యజమాని ఎంత బాధపడునో
అలాగే ఈ నాడు నీవు రాజు కాకపోయినచో
లోకమంతా అంత బాధపడును".
"చక్రవర్తి తపోఫలముగా
చక్రవర్తి తనయునిగా జన్మించి
జ్యేష్టుడవై , గుణములలో సర్వలోక పూజ్యుడవై,
పట్టాభిషేకమునకు అర్హుడవై,
పట్టాభిషేకమునకు అంతయూ సిద్ధమైనప్పుడు,
విఘ్నమై అడవులకేగిన నువ్వు ,
ఈ నాడు రాజువు కానిచో
లోకమంతయూ బాధపడును".
"ఓ రామా, నీవు నీ భక్తులను భృత్యులనూ పాలింపుము"
ఇలా అన్నివిధాలుగా చెపుతూ
భరతుడు ఈ మాట చెపుతాడు.
"యావదావర్తతే చక్రం
యావతీచ వసుంధరా |
తావత్ త్వమిహ సర్వస్య
స్వామిత్వమనువర్తయ||"
అంటే
"ఈ కాలచక్రము ఎంతవరకు ఉండునో
ఈ భూమండలము ఎంతవరకు ఉండునో
అంతకాలము ఈ సర్వస్వమునకు
నీవు స్వామియై ఉండుదువు గాక"
ఈ శ్లోకము నిత్యము మనము భగవత్ సన్నిధిని విన్నవింపదగినది
అని అప్పలాచార్యులవారు అంటారు.
ఎందుకు?
స్వామి సర్వేశ్వరుడు.
సర్వజగత్తు ఆయన సొత్తు.
దానిని తన సొత్తుగా భావించి,
తనను తాను స్వతంత్రుడను అనుకోవడము అజ్ఞానము.
ఈ జగము అలాగే తాను కూడా సర్వేశ్వరునికే చెందినవారమని
ఎప్పుడు తెలుసుకొనునో
అప్పుడు మనము విన్నవింపవలసిన మాట ఇదియే.
ఆ భావనతో చదవ వలసిన శ్లోకము ఇదియే.
ఇదే సాంఖ్యము
ఇదే నిష్కామ కర్మ.
ఇలా భరతుడు నివేదింపగానే రాముడు సరే అని అంగీకరించెను.
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||