||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- అరువది ఎనిమిదవ సర్గ||

||"జగామ శాంతిం మమ మైథిలాత్మజ !"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టషష్టితమస్సర్గః||

తత్త్వదీపిక
సీతారామ పట్టాభిషేకము.

పట్టాభిషేక ఘట్టము

పట్టాభిషేక ఘట్టము వాల్మీకి ఈ శ్లోకాలతో ప్రారంభిస్తాడు

"తత్తస్సవ్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైస్సహ|
రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్||
వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథ కాశ్యపః|
కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా||
అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా
సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా ||"

అంటే నియమశీలుడు వృద్ధుడు అయిన వశిష్ఠుడు బ్రాహ్మణులతో కలిసి,
శ్రీరామచంద్రుని రత్నమయమైన పీఠముపై సీతమ్మ తో సహ కూర్చుండబెట్టెను.

వశిష్ఠుడు, వామ దేవుడు,జాబాలి, కాశ్యపుడు,
కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు విజయుడు,
అనబడు ఎనిమిదిమంది ఋషులు
సుగంధములు కలిపిన జలములతో
అష్టవసువులు ఇంద్రుని అభిషేకించినట్లు
రాముని అభిషేకించిరి.

ఆకాశమునుండి నలుగురు లోకపాలకులు,
సర్వదేవతలు, దేవులు సర్వ ఔషధీరసములతో అభిషేకించిరి.

శతృఘ్నుడు రామచంద్రప్రభువునకు తెల్లని ఛత్రమును పట్టెను.
సుగ్రీవుడు తెల్లని చామరము పట్టి వీచెను.
విభీషణుడు ఇంకొక తెల్లని చామరమును పట్టి వీచెను.
ఇంద్రుడు నూరు పూసలుగల బంగారు హారమును వాయువుచే సమర్పించెను.
దేవగంధర్వులు గానమొనర్చిరి.
అప్సరసలు నృత్యము చేసిరి.

పట్టాభిషేకమునకు తగిన రాముడు
పట్టాభిషిక్తుడు కాగానే భూమి సస్యవంతమై యుండెను.
వృక్షములు ఫలవంతములాయెను.
పుష్పములు సువాసనలను గుబాళించు చుండెను.

శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులకు అనేక దానములిచ్చెను.
సుగ్రీవునకు మణులతో కూర్చిన బంగారు హారము ఇచ్చెను.
అంగదునకు రత్నములు పొదిగిన అంగదములను రెండింటిని ఇచ్చెను.
సీతమ్మకు శ్రేష్ఠమగు రత్నములతో కూడిన ముత్యాలహారము ఇచ్చెను.

సీతమ్మ తన మెడలో ఉన్న హారము తీసిపట్టుకొని,
వానరులను భర్తను మరల మరల చూచుచుండెను.
సీతమ్మ మనో భావము గ్రహించిన రాముడు సీతమ్మ తో ఇట్లనెను.

" ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని|
పౌరుషం విక్రమో బుద్ధిః యస్మి న్నేతాని సర్వశః||
దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణా |

అంటే

"ఎవని చేత నీ మనస్సు సంతోషము పొందినదో ,
ఎవని యందు పౌరుషము , పరాక్రమము, బుద్ది పరిపూర్ణముగా వున్నాయో,
"ఓ సౌభాగ్యవతి అట్టివానికి ఈ హారము ఒసంగుము", అని.
అప్పుడు ఆ సీతాదేవి ఆ హారమును హనుమ కి ఇచ్చెను.

హనుమంతుడు సముద్రలంఘనము చేస్తున్న ఘట్టములో
హనుమ చేస్తున్న దుష్కరమైన కార్యములతరువాత
ఆకాశములో తిరిగే చారణులద్వారా హనుమ గురించి వింటాము.
ధృతి దృష్టి మతి దాక్ష్యం ఈ నాలుగూ,
"యస్యత్వేతాని చత్వారీ (స) స్వకర్మసు న సీదతి"
ఈ నాలుగు గుణములు కలవాడు
తన పనులలో విజయము సాధిస్తాడు అని.

ఇక్కడ అలాగే రాములవారిద్వారా తన గుణముల ద్వారా
హనుమ మళ్ళీ గుర్తించ బడతాడు.

ఇక్కడ రాములవారు సీతమ్మకి ఉపయోగించిన సంబోధన "సుభగే" అని,
"సుభగే" అంటే సౌభాగ్యము కలదానా అని.
"సుభగే" అన్నమాటలో ఇంకో ధ్వని కూడా వస్తుంది.
"ఓ సీతా నీ సౌభాగ్యమునకు ఎవరు కారకుడో వానికి ఈ హరము ఇమ్ముఅని"
దానికి సమాధానముగా కూడా సీతమ్మ హనుమ కు హారము ఇచ్చెను.

అన్ని విధములుగా సుందరకాండలో ఆచార్యుడిలా
ముఖ్యమైన పాత్ర నిర్వహించి
సీతమ్మ మనస్సుకి కలిగిన తాపము తగ్గించి
శాంతి కూర్చిన హనుమ ఈ విధముగా
సీతమ్మ సౌభాగ్యమునకు కారకుడై
సీతమ్మ బహుమానము పొందుతాడు.

హనుమ సత్కరించబడి నట్లే వచ్చిన వానరులందరూ
బహుమానములతో సత్కరింపబడతారు.
విభీషణుడు కూడా అలాగే సత్కరింపబడతాడు.
విభీషణుని సత్కారము గురించి వాల్మీకి ద్వారా ఇలా వింటాము.

"లబ్ధ్వా కులధనమ్ రాజా
లంకాం ప్రాయాద్విభీషణః"

అంటే
"విభీషణుడు కులధనము ను పొంది
లంకానగరమునకు వెళ్ళెను" అని.
ఇక్కడ కులధనము అంటే
తాతముత్తాతల నుంచి వచ్చిన వస్తువు.

ఆ కులధనము శ్రీరంగ విమానము అని
శ్రీరంగమహాత్మ్యము అనే పురాణములో చెప్పబడినది

సముద్ర మంథనములో శ్రీరంగవిమానము అవిర్భవింపబడినది అని,
అది చాలాకాలము సత్యలోకములో నే వుండి
తదనంతరము ఇక్ష్వాకు రాజులద్వారా అయోధ్యకు తీసుకు రాబడినది అని,

రావణసంహారముతో అయోధ్య తిరిగివచ్చి ,
పుష్పక విమానము ను కుబేరుని వద్దకు పంపిన రాముడు,
విభీషణునికి తన కులధనమైన శ్రీరంగ విమానమును
విభీషణుకి ఇచ్చెను అని చెప్పబడుతుంది.

వాల్మీకి చెప్పిన ఆ "కులధనమే" శ్రీరంగ విమానము అంటారు.
ఆ శ్రీరంగ విమానము తిరుచురాపల్లి ప్రాంతములో భూమిపై దిగి
మళ్ళీ కదలకుండా అక్కడే వుండి పోయినదట.
అందుకని ఆ ప్రాంతము శ్రీరంగముగా ప్రశిద్ధి చెందినదిట.

"ఆ శ్రీరంగవిమానమే
కావేరీ మధ్యదేశములో సప్తప్రాకారముల మధ్యమున
ఇప్పటికీ భక్తులకు దర్శనమొసంగుచున్నది "అని .
అదే అప్పలా చార్యులవారు రాసినమాట.

పట్టాభిషేకము అయిపోయింది
పట్టాభిషిక్తుడైన రాముడు యౌవరాజ్య పట్టాభిషేకము
చేయదలంచి ధర్మజ్ఞుడు ధర్మ వత్సలుడు
అయిన లక్ష్మణునితో ఇలా అంటాడు.

"ధర్మజ్ఞ పూర్వరాజులగు మన్వాదులచే అధిష్టింపబడిన
ఈ భూమిని నాతోపాటు నీవుకూడా పాలింపుము.
మనతల్లితండ్రులు పాలించిన ఈ రాజ్యము పాలించుటలో
నీవుకూడా భారము వహించి యువరాజ పదవిని స్వీకరింపుము" అని

అలా అడగబడిన లక్ష్మణుడు ఎంతబ్రతిమాలిననూ అంగీకరింపడు.
అప్పుడు శ్రీరాముడు భరతునికి యువరాజుగా పట్టాభిషేకము చేస్తాడు.

ఇక్కడ లక్ష్మణుడు భరతుడికి రామునిపై గల భక్తి లో తారతమ్యము కనిపిస్తుంది.

లక్ష్మణుడు ప్రతిఫలాపేక్షలేక సర్వకాలావస్థల యందు రామునికే సేవచేస్తూ
తాను రామునికే చెందినవాడని ,
తన ప్రతిక్షణము రాముని సేవకే చెందవలననే ఆలోచనతో
యువరాజపట్టాభిషేకానికి అంగీకరింపడు.

ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు ఆత్మస్వరూపము ఎరిగినవాడు.
పరమాత్మకే ఉపయోగపడ తగిన ఆత్మ
ఇతర ప్రయోజనములకు ఉపయోగింపబడరాదని లక్ష్మణుని ఆలోచన.
అంటే ఇక్కడ భగవత్ శేషమే ఆత్మ అని అన్నమాట.
అది లక్ష్మణుడు తన నడవడికద్వారా నిరూపించిన విషయము.

భరతుడిని రాముడు అడగలేదు,
భరతుడికి తన ఇష్టా అనిష్టములతో ప్రమేయము లేదు.
భగవంతుని కొఱకై ఏది కావలెననిన అది చేయువాడు.
రాముడు యువరాజు కమ్ము అంటే యువరాజు అవుతాడు.

చేతనము కలిగియుండుయూ
అచేతనము కలవానివలె
పరమాత్మకే చెంది యుండుట భగవత్పారతంత్ర్యము.
అంటే భగవంతునికే పరతంత్రుడై వుండుట ఆత్మస్వరూపము
అని భరతుడు తన ఆచరణముతో నిరూపిస్తాడు.

ఆత్మ భగవత్ శేషము అని
ఆత్మ భగవత్పారతంత్ర్యము అని
రెండు విధములుగనూ కనిపిస్తుంది భక్తులకు.
అదే లక్ష్మణుడు భరతుడు ఇద్దరూ మనకి
తమ నడవడికలద్వారా చూపిస్తారు అంటారు అప్పలాచార్యులవారు.

రాముడు పట్టాభిషిక్తుడై పదివేలసంవత్సరములు పాలించాడుట.
అనేక యజ్ఞములు చేసి దేవతలకు తృప్తి కలిగించుచుండెను.

రామ రాజ్యములో
స్త్రీలు భర్తృహీనలై శోకించుటలేదు.
క్రూర జంతువుల భయము లేకుండెను.
వ్యాధులవలన భయము లేదు.
లోకమున చోరులు లేరు.

అనర్థమును పొందిన వారు లేరు.
బాలురు చిన్న వయసులో పోవుటవలన కలుగు దుఃఖాలు
దేశములో ఎవరికీ కలగలేదు.
విశ్వము అంతా సంతుష్ఠమై ఉండెను.
లోకము అంతా ధర్మమునే పాటించుచుండెను.
ప్రజలు రామునే దర్శించుచూ
ఒకరినొకరు హింసించుట మాని యుండిరి.
రామరాజ్యమున ప్రజలు
వేయేండ్లు రోగ రహితులై శోకరహితులై
పుత్ర సహస్రములతో సుఖించుచుండిరి.

రామరాజ్యములో ప్రజలందరూ
రాముడు రాముడు అంటూ
అన్నీ ప్రసంగములు రాముని పరమే అయివుండెను.

జగమంతయూ రామ మయమై ఉండెను.
వృక్షములు విస్తరించిన స్కంధములు కలవై
నిత్యము ఫలము పుష్పములతో శోభించుచుండెను.

పర్జన్యుడు కాలమున వర్షించుచుండెను.
వాయువు సుఖ స్పర్శమై వీచుచుండెను.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు
ఇంకొకరి ద్రవ్యములపై కోరిక లేని వారై
తమకి విహితములై కర్మలను సంతోషముతో ఆచరించుచుండిరి.

రామరాజ్యములో ప్రజలు ధర్మముపై శ్రద్ధ కలవారై
అనృతము ఎఱుంగక జీవించుచుండిరి.
అందరూ లక్షణ సంపన్నులు, ధర్మ పరాయణులు అయివుండిరి.
ఈ విధముగా శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరములు పాలించెను.

ధనము యశస్యము ఆయుష్యము రాజులకు విజయప్రదము అగు
ఈ రామాయణమును వాల్మీకి రచించెను.
ఇది అర్షము అంటే పవిత్రమైన గ్రంథము.
దీనిని వినిన మానవుడు పాపవిముక్తుడగును.

వాల్మీకి ఈ రామాయణము
చదవడము, వినడము , రాయడము వలన
కలిగే ఫలశ్రుతి వివరముగా రాస్తాడు.
ఫలశ్రుతి పది శ్లోకాలలో చెప్పబడినది.

శ్రీరామాయణము చదివిననూ విన్ననూ
ఐశ్వర్యము పుత్రలాభము కలుగును.
చదువుటచే రామచంద్రుడు సంతుష్ఠుడగును.

రాముడే సనాతనుడగు విష్ణువు.
అతడే ఆదిదేవుడగు శ్రీహరి.
అతడే సర్వజగత్ప్రభువు అగు నారాయణుడు.

మహార్థపరిపూర్ణము శుభము అగు
ఈ శ్రీరామాయణ మహాకావ్యమును వినినవారు
కుటుంబవృద్ధి, ధనవృద్ధి, ధాన్య వృద్ధి, సుఖము పొందుదురు.

శ్రీరామాయణమనబడు ఆఖ్యానము ఓజస్సు ను కలిగించును.
అయుస్సును కీర్తిని, భాతృప్రేమను బుద్ధిని సుఖమును కలిగించును.

"ఏవమేతత్పురా వృత్తమాఖ్యానమ్ భద్రమస్తు వః|"
ఈ విధముగా కథ పూర్వము జరిగినది. మీకు భద్రము అగుగాక.

"ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్థతామ్"
విశ్వాసముతో" విష్ణువు బలము వృద్ధి నందును గాక" అని పలుకుడు.

రామాయణ పారాయణ చేయువారు
పారాయణము పూర్తి కాగానే
ఈ శ్లోకము చదివి స్వస్తి చెప్పవలెను.

రామాయణము కల్పిత కథ కాదు అని వాల్మీకి ఇక్కడ చెప్పినట్లు
మనము తెలిసికుంటే అది మనకు మంగళకరము.
అది కూడా వాల్మీకి చెపుతాడు.

ఆ రాముడే విష్ణువు.
విష్ణువు సమస్త పదార్థములందును వ్యాపించియుండును.
మనకు బలము అభ్యుదయము కలగవలెననిన
మనలో వున్న విష్ణు తత్త్వము యొక్క బలము వృద్ధిపొందవలెను.

అలా అభివృద్ధి పొందిననాడుబాహ్యమగు లోకము బలము కలదైవుండును.
అందుచే మనము చేయు ప్రతికర్మ స్వార్థముకాదు. పరార్థము.
ఆ పరుడే విష్ణువు.

శ్రీరామాయణము పఠించుటవలన లోకక్షేమము కలుగును.
దీనిని వినుటవలన ఎఱుంగుటవలన దేవతలు ప్రీతిపొందుదురు.
పితృదేవతలు సంతుష్టులగుదురు.

వాల్మీకి మహర్షినుంచి ఆవిర్భవించిన సంహితా రూపమగు
ఈ శ్రీరామాయణమును ఎవరు భక్తితో వ్రాయింతురో
వారుకూడా పరమ పదమున నిత్యవాసమును అందుకొనెదరు.

ఇది అంతా రామాయణములో యుద్ధకాండలో
రామపట్టాభిషేక సర్గ లో మనము విన్నది.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||