సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

మోక్షసన్న్యాస యోగము - అన్వయము


||ఓమ్ తత్ సత్ ||

అర్జున ఉవాచ:
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృష్కేశ పృథక్కేసి నిషూదన ||1||
"హే మహాబాహో ! ఇంద్రియ నిగ్రహముగల ఓ కృష్ణా ! సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యదార్ధమును తెలియగోరుచున్నాను."
-----
శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః
శ్రీమద్భగవద్గీత
అష్టాదశోధ్యాయః
మోక్షసన్యాసయోగము

ఇంతవరకు జ్ఞానముచే భగవదైక్యము (జ్ఞాన యోగము) భక్తి చే భగవదైక్యము ( భక్తి యోగము) అలాగే కర్మచే భగవదైక్యము ( కర్మయోగము) కలుగజేయు పద్ధతులను తెలుపు అధ్యాయములు విన్నాము.
ఈ అధ్యాయము - అంటే మోక్షసన్న్యస యోగము - మోక్షప్రదమగు సన్యాసము ద్వారా త్యాగముద్వారా లేక భగవదర్పణము ద్వారా లేక సర్వసంగరాహిత్యము ద్వారా యోగము భగవదైక్యము సిద్ధించునని తెలుపు అధ్యాయము. అందువలన ఈ అధ్యాయమునకు మోక్షసన్యాసమని పేరు కలిగి యుండవచ్చును.

మోక్షమనగా విడుదల. బంధమునుండి విడుదల. అట్టి బంధమోచన రూపమగు ముక్తి కైవల్యము త్యాగమువలననే లభించును. త్యాగమనినా సన్యాసమనినను ఒకటియే. ప్రపంచము, దేహము, మనస్సుఇత్యాది సమస్త దృశ్యపదార్ధముల యొక్క సంగము పరిత్యజించి మోక్ష రూపుడగు భగవంతునే శరణు పొందవలెను. ఆ క్షణముననే దృగ్వస్తువు ఆత్మగా శేషించును. అదియే మోక్ష స్థితి. క్షేత్రమును త్యజించుటచే క్షేత్రజ్ఞుడు శేషించును.

మోక్షసన్న్యసమునకు మరియొక అర్ధము.

మోక్షమనగా దైవము, సన్యాసమనగా సమస్త కర్మల ఫలమును అర్పించుట. అంటే మోక్షమును సన్యాసమనగా వదలుట. అప్పుడు మోక్షముకూడా సన్న్యసించగలవారు ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానము ఆత్మను ఎరిగిన వానికి బంధము ఉండదు. అట్టి బంధమే లేనివానికి మోక్షము గురించిన ప్రశ్నేలేదు. ముక్త స్థితి లో జీవుడు మోక్షభావన కూడ త్యజించును. పదిహేడు అధ్యాయములు బోధ వినిన తరువాత ఇక బంధ మెచట ? అంటే ఈ అధ్యాయములో మోక్షమును కూడా సన్యసించు యోగము కాబట్టి మోక్షసన్న్యాస యోగమని చెప్పబడినది.

అదే మాట - " అజోనిత్య శాశ్వతోయమ్ పురాణో"- అను నిత్య సత్యము ద్వారా మనకు తెలియునది సనాతనమగు ఆత్మను ఎరిగిన వానికి బంధము ఉండదు. అట్టి బంధమే లేనివానికి మోక్షము గురించిన ప్రశ్నేలేదు.

ఇంకొక ముఖ్య అంశము. ఈ అధ్యాయములో పదిహేడు అధ్యాయముల సారము కూడా తెలుపబడినది.

ఈ అధ్యాయము అర్జుని ప్రశ్నతో మొదలగుతుంది.

అర్జున ఉవాచ:
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృష్కేశ పృథక్కేసి నిషూదన ||1||
"హే మహాబాహో ! ఇంద్రియ నిగ్రహముగల ఓ కృష్ణా ! సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యదార్ధమును తెలియగోరుచున్నాను."

ఉపనిషత్తులందు " త్యాగే నైకేన అమృతత్వ మానసః , సన్యాసయోగాద్యత శుద్ధ సత్వాః ........." అని తెలుపబడినది. ఇక్కడ మొదటి శ్లోకమున అర్జునుడు భ్గగవంతుని విశేషణములద్వారా సంబోధించెను. ఇట్టి స్థుతి చేత శిష్యుని శ్రద్ధాభక్తులచే గురువు సంతోషించి జ్ఞానబోధను చేయును’

అర్జునిని ప్రశ్నకి సమాధానముగా భగవానుడు ఇట్లు చెప్పెను.

"ఓ అర్జునా , కామ్యకర్మలను వదలుటయే సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు మరికొందరు సమస్త కర్మలయొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని చెప్పుదురు. సమస్త కర్మలఫలమును త్యజించిన వాడు ఏ ఆశ్రమమునందున్ననూ త్యాగియే యగును".

ఇంకా కర్మత్యాగముగురించి కృష్ణభగవానుడు ఇలా చెపుతాడు.

శ్రీభగవానువాచ:
"నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరతసత్తమ|
త్యాగోహి పురుషవ్యాఘ్ర త్రివిధః సమ్ప్రకీర్తితః "||4||

" కర్మత్యాగవిషయమున నా నిశ్చితాభిప్రాయము చెప్పుదును వినుము. త్యాగము మూడు విధములుగ చెప్పబడినది యజ్ఞము దానము తపస్సు అనెడి కర్మలు త్యజించతగినవి కాదు. ఏలయన నిష్కామముగా ఆచరించిన కర్మలు చిత్తశుద్ధిని కలుగ జేయును".

యజ్ఞమనగా! జ్ఞానయజ్ఞము స్వాధ్యాయనాది చిత్త శుద్దికరములు చేయు వివిధ యజ్జములు.

పుణ్యకర్మలు చేయడము ముముక్షువునకు ఎంతయో అవసరము. వేదశాస్త్రాదులందు విధింపబడిన కర్మలు విడిచిపెట్టరాదు. ఎవరైనా అట్టి కర్మను విడిచి పెట్టిన అది తామస త్యాగమనబడును. వారు అవివేకులు మోహ పరవసులని నిశ్చయించుకొనవచ్చును.

ఎవరు శరీర ప్రయాస వలన భయము చేత దుఃఖము కలుగజేయునది అని తలంచి విద్యుక్తధర్మమును అంటే చేయవలసిన ధర్మమును విడచి పెట్టునో అట్టివాడు రాజస త్యాగమును గావించినవాడై త్యాగఫలమును పొందడు.

ఇది చేయతగినదే యని తలంచి శాస్త్ర విహిత కర్మను అభిమానము ఫలము విడిచి పెట్టి చేసిన త్యాగము సాత్విక త్యాగమనబడును. సత్వగుణముతో ఉన్న మేధావి త్యాగశీలుడు అశుభము అగు కర్మను ద్వేషించడు. శుభమును నిష్కామమును సుఖకరము యగు కర్మయందు ఆసక్తుడు కాడు అనగా అభిమానము కలిగి యుండడు. ఆట్టివాడు తనలో తటస్థ భావము కలిగి యుండును.

దేహధారియగు జీవుడు దేహ సంరక్షనార్ధము కర్మ చేయవలసియే యుండును. అందువలన ఆయాకర్మలు చేయుచూ కర్మ ఫలమును విడచిన చాలును. అపుడు అతడు బద్ధుడు కాడు. అట్టివాడె త్యాగియని చెప్పబడును.

శ్లో|| అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధః కర్మణః ఫలమ్|
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్||12||

ఇష్టమైనది [సుఖకరమైనస్వర్గాదులు] అయిష్టమైనది [దుఃఖకర నీచ జన్మాదులు ] ఇష్టానిష్ట మిశ్రమమైనది[ సుఖ దుఃఖములుగల మానవజన్మ] ఇవి కర్మఫలములను వదలక కర్మలను ఫలాసక్తి తో చేయువారికే కలుగును
ఫలాపేక్ష రహితముగా కర్మమును చేయువారికి చిత్తశుద్ధిద్వారా మోక్షము కలుగును. నిష్కామకర్మము ఏంతో మహిమతో కూడుకొనినదై యున్నది.

కర్మకాండ అంతమును బోధించు వేదాంతశాస్త్రమందు కర్మాచరణ విషయమున ఐదు కారణములు తెలుపబడినవి. అవి:
1 శరీరము
2 కర్త
3 వివిధములగు ఇంద్రియములు
4 పలువిధములగు క్రియలు
5 దైవము.

కరణములనగా పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు మనస్సు బుద్ధి వాని వ్యాపారములు.

దైవమనగా అధిష్టాన దేవతలు గాని పూర్వజన్మసంస్కారములు గాని అని చెప్పవచ్చును.

మనుజుడు శరీరము వాక్కు మనస్సు వీనిచేతను న్యాయమైనట్టి గాని, అన్యాయమైనట్టి గాని కర్మను ప్రారంభించు చున్నాడో దానికి ఈ ఐదును కారణములై యున్నవి.

సాక్షి యగు ఆత్మను కర్త యని తలంచువాడు అజ్ఞాని అవివేకి. అతనికి కర్మయొక్క వాస్తవ రూపము తెలియదు. అసంగమగు ఆత్మకు కర్తృత్వము ఆరోపించువాడు నేత్రములున్న గుడ్డివాడగును. ఎంతపాండిత్యమున్నను వారుపరమార్ధ దృష్టిలో దుర్మతులు.

ఎవనికి నేను కర్తను కాను అని, ఎవని యొక్క బుద్ధి కర్మలను అంటదో ఆ ప్రాణులన్నిటికి కర్మజనిత సుఖదుఃఖములుగాని పుణ్యపాపములుగాని అంటవు.

ఆ సత్యమే ఇచట చెప్పబడినది.

ఎవడు కర్తృత్వము లేనివాడై అసంగుడై ఈ దేహము మనస్సు నేను కాదని ఆత్మ యందే స్థితి కలిగి సమస్త ప్రాణులనుయందు తన ఆత్మనే చూచుటవల్ల ఎవరిని హింసించడు బాధించడు.

అనగా జీవుడు ఆత్మ స్థానము దిగివచ్చి దృశ్యముకల బుద్ధితో జేరి నేను చేయుచున్నానని తలంచుటయే కాని ఎపుడు సంగముపై ఆసక్తి లేదో అపుడు పుణ్యపాపములతో బంధములు అతనికి అంటవు.

అర్జునుడు క్షత్రియుడు.
దుష్ట శిక్షణ ప్రభు కర్తవ్యము ధర్మము.
కౌరవులు అధర్మము చేసి దుష్టులయిరి. వారిని అసంగ బుద్ధితో నిరహంకారముతో వధించినను వధించనట్లే యగును. బుద్ధినిదాటి అహంకారమును దాటి ఆత్మయందునెలకొనిన వానికి బుద్ధితో ఏ పనిని చేసినను చేయనట్లేయగును.

అయితే అట్టివాడు అసభ్యకరమైన పనిని చేయడు.

ఈ భావమును లోతుగా విచారించి పరప్రాణికి బాధ కలిగించకుండ ఆత్మయందుస్థితుడై అసంగబుద్ధితో ఆయాకార్యములునెరవేర్చుచూ బంధవిముక్తుడై వెలయవలెను.

కర్మమును నడిపించుటకు కారణము తెలివి, తెలియతగు వస్తువు తెలియువాడు.

కర్మమునకు ఆధారము సాధనములు మూడు- అవి బాహ్యాభ్యంతర ఇంద్రియములు, క్రియ, కర్త ( చేయువాడు). ఈ మూడును సాత్వికము రాజసము తామసికమై యున్నవి.

జ్ఞానము, కర్మ, కర్త అనువానియొక్క సాత్త్విక రాజసిక తామసిక రూపములు భగవానుడు వివరిస్తాడు.

శ్రీభగవానువాచ:
శ్లో||- సర్వ భూ తేషు ఏనైకంభావమవ్యయమీక్షతే|
అవిభక్తంవిభక్తేషు తజ్ఞానంవిద్ధి సాత్వికమ్||

ఆత్మవస్తువు లేక, దైవము యొక్క ఉనికి సకల చరాచర ప్రాణులందు విభజింపబడక ఏకమై నున్నట్లు ఏజ్ఞానము చేత తెలిసికొనుచున్నాడో అట్టి జ్ఞానము సాత్త్విక జ్ఞానమనబడును.

భగవంతుడు సకల ప్రాణులందు వ్యాపించియిన్నాడు. ప్రపంచము అనేక జీవరాసులు భిన్న భిన్నపదార్ధములు చూచినను వాని ఉపాధి రూపమున నామరూపములు వదలి అన్నిటియందు అవిభక్తమైన ఏకమైన ఆత్మనే చూచువాడు సాత్త్విక జ్ఞానము కలవాడని చెప్పబడును.

అనగా అనేకత్వములో ఏకత్వము,
నాశములో అవినాశిత్వము,
విభజిత వస్తువులలో అవిభక్త త్త్వము,
వీటిని వీక్షీంపగలుగుటయే ఉత్తమ జ్ఞానము.

ప్రపంచమున వస్తువులు అనేకములయినవి నాశవంతమైనవి విభాగముతో కూడినవి. ఆత్మ మాత్రము ఏకమైనది నాశరహితమైనది అవిభక్తమైనది. కనుక ఏప్రాణిని చూసినను అతని దేహము పైగాని గుణముపై గాని దృష్టినుంచక లోనకల ఆత్మపై దృ ష్టి నుంచవలెను. ఆత్మపై దృష్టి అనగా దైవదృష్టి కలవారు. అట్టివారు ఉత్తములు.

ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్త ప్రాణులందును వేరు వేరుగనున్న సమస్త జీవులను వేరు వేరుగ చూచు చున్నాడో అట్టివాడు రాజస జ్ఞానము కలవాడు అని చెప్పబడినది. ప్రాణులలో వీడు వేరు వీడు వేరు అని అనేకత్వము చూచుట ఉత్తమ జ్ఞానముకాదు రాజస జ్ఞానమగును.

తామస జ్ఞానముకలవాడు ఏదియో యొక దృశ్యవస్తువు పట్టుకొని దానియందే ఆశక్తి కలిగి అదియే సమస్తమని తలంచు చుండును. శరీరమే ఆత్మఅని తలంచు చుండును.

శాస్త్రముచే నియమింపబడి ఫలాపేక్ష లేకుండ అభిమానము రాగద్వేషములు లేకుండ చేయబడునది సాత్త్విక కర్మ యనబడును.

తన ఇష్టము వచ్చినట్లు చేయక శాస్త్రాదులచే నియమింపబడిన కర్మనే చేయవలెను. ప్రపంచములో మానవుడు కర్మ చేయకుండా వుండలేడు. కనుక శాస్త్ర నియమమైన కర్మ సంగరహితముగ రాగద్వేషములు లేకుండ ఫలాపేక్ష లేకుండ చేయవలెను.

అట్టికర్మ మోక్ష ప్రదమై యుండును..

ఫలాపేక్షతో అహంకారముతో చేయుకర్మ రాజస కర్మ అనబడును. కర్తృత్వ బుద్ధి ఫలాపేక్షతో చేయు కర్మలు అత్యంత ప్రయాసతో కూడు కొని యుండును.

భగవద్విముఖుడై స్వార్ధ సాధన కొరకు చేయు పనులు తామసకర్మలు అనబడును. అట్టివాడు అట్టి కర్మలను అవివేకముతో గుడ్డిగ చేయుట వలన అవి దుఃఖమును కలుగజేయును.

ఇంక కర్తను గురించి భగవంతుడు చెప్పుచున్నాడు.

శ్లో|| ముక్తసంగోనహంవాదీధృత్సాహసమన్వితః|
సిద్ద్యసిద్ధ్యోర్నిర్వికారఃకర్తాసాత్త్విక ఉచ్యతే ||

నేను కర్తను అను అభిమానము లేనివాడు అహంభావము లేనివాడు సంగము ఫలాపేక్ష లేనివాడు కార్యము సిద్ధించినను సిద్ధించ కున్నను వికారము చెందని వాడు సాత్త్విక కర్త అని చెప్పబడును.

ఇంక రాజస కర్త గురించి.

అనురాగము కలవాడు కర్మ ఫలమును ఆశించువాడు, లోభి శుచిత్వము లేనివాడు, కార్యము సిద్ధించినపుడు సంతోషముతోను, కార్యము చెడినపుడు దుఃఖముతోను గూడినవాడు రాజస కర్త అని చెప్పబడును.

వినయము నిగ్రహహము లేనివాడు, మోసగాడు సోమరితనము కలవాడు తామస కర్త అని చెప్పబడును.

ఏకాగ్రత లేనివాడు సంస్కారము లేనివాడు ఇతరుల కార్యములను చెడగొట్టువాడు (నైష్క్రతికః) , ఎప్పుడు ఏదో చింతతోను దుఃఖముతోనుండువాడు తామసిక కర్త యనబడును.

ఇంక బుద్ధి యొక్కయు ధైర్యము యొక్కయు బేధములను భగవానుడు చెప్పుచున్నారు:

శ్రీభగవానువాచ:
శ్లో|| ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయా భయే
బంధంమోక్షంచయావేత్తి బుద్ధిస్సా పార్ధ సాత్వికీ||

ఏ బుద్ధి ధర్మ ప్రవృత్తిని (లేక ప్రవృత్తిమార్గమగు కర్మమార్గమును), అధర్మమునుండి నివృత్తిని లేక నివృత్తి మార్గమగు సన్యాసమార్గమును , చేయతగిన దానిని చేయ తగనిదానిని , భయమును అభయమును బంధమును మోక్షమును తెలిసికొనుచున్నాడో అట్టి బుద్ధి సాత్త్వికమైనది యగును.

"ఓఅర్జునా? మనుజుడు ధర్మమును అధర్మమును, చేయతగినదానిని చేయతగనిదనిని వున్నది వున్నట్లుగాక వేరొకవిధముగా తెలిసి కొనుచున్నడో అది రాజస బుద్ధి యనబడును"

ఏబుద్ధి అవివేకముచే కప్పబడినదై అధర్మమును ధర్మముగయెంచునో సమస్త పదార్ధములను విరుద్ధముగ తలచునో అట్టి బుద్ధి తామస బుద్ధియై యున్నది. లేని దేహము జగత్తు వారికి వున్నట్లు చూపట్టును. దుఃఖకరమైన విషయ భోగములు సుఖములుగా తోచును పరమానందకరమగు ఆత్మరుచింపకయేయుండును .

తరువాత కృష్ణ భగవానుడు మూడు ధైర్యముల గురించి విశదీకరిస్తాడు.

ఏధైర్యముచే మనుజుడు తన మనస్సును ఇంద్రియములను విషయభోగముల నుండి నిరోధించునో దృశ్యవ్యామోహమునుండి నివృత్తుడగునో అదియే గొప్ప ధైర్యము. అది నిశ్చలముగ నుండవలెను. దానిని సాత్త్విక ధైర్యము అంటారు.

ఏ ధైర్యముచేత మనుజుడు ఫలాపేక్షకలవాడై ధర్మమును అర్ధమును కామమును మిక్కిలి ఆసక్తితో అనుష్టించునో అట్టిది రాజస ధైర్యమనబడును.

ఏ ధైర్యము చేత దుర్బుద్ధిని నిద్రను భయమును శోకమును దిగులు మదమును విడువక యుండునో అది తామస ధైర్యమనబడును.

అలాగే మూడు విధములయిన సుఖములను గురించి కృష్ణుడు చెపుతాడు.

శ్రీభగవానువాచ:
శ్లో|| యత్తదగ్రే విషమివ పరిణామేఅమృతోపమమ్
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తంఆత్మబుద్ధిప్రసాదజమ్||

ఏసుఖము ప్రారంభమున విషమువలెను పర్యవసానమందు అమృతము పోలినదిగా నుండునో తనబుద్ధి యొక్క నిర్మలతత్వముచే నట్టి సుఖము సాత్త్విక సుఖమనబడును !

ప్రారంభమున సాధకునకు అభ్యాసకాలమందు బ్రహ్మనిష్ట ధ్యాన వైరాగ్యాదులు కష్టముగాతోచవచ్చును. అభ్యాసము పూర్తియగు కాలమున అదే అమృత తుల్యముగ నుండును.

సాధనలు కావించు సమయమున కష్టములకు జంకక బుద్ధిని నిర్మలముగ ఉంచుకొనవలెను.

ఏ సుఖము విషయేంద్రియ బంధమువలన మొదట అమృతమును బోలి పర్యవసానమున విషముగ నున్నచో అట్టి సుఖము రాజస సుఖముగ చెప్పబడినది.

నిద్ర సోమరితనము ప్రమత్తత అనువానివలన పుట్టినది. ఏ సుఖము ఆరంభమందు అంతమునందు తనకు మోహము అజ్ఞానము బాధను కలుగజేసినచో అది తామస సుఖమనబడును.

ప్రకృతి మాయనుండి పుట్టి ఈ మూడు గుణములములతో వుండని వస్తువ ఈ ప్రపంచముననే లేదు. భూలోకమందుగాని స్వర్గమందు గాని దేవతలయందు గాని ఎచటను లేదు. దేవతలుగూడ బంధమున నున్నవారే. వారుగూడ ఎప్పటికైన గుణాతీత స్థితికి వచ్చి జ్ఞానాదులు పొంది ముక్తి కావలసియున్నది.

కృష్ణ భగవానుడు వర్ణసంస్కారము గురించి కూడా చెపుతాడు.

"ఓఅర్జునా| బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు వారివారిజన్మాంతర సంస్కారమును బట్టిసృష్టింపబడిరి."- [చాతుర్వర్ణం మయాసృష్టంగుణకర్మ విభాగశః] (4.13)

వారివారి గుణస్వభావమును బట్టి కర్మలు వేరు వేరుగా విధింపబదినవి. దీనిని బట్టి వారి పుట్టుకతోనె వారి జాతి ఏర్పడుట లేదు వారి వారి గుణములను బట్టీయే జన్మకర్మలు ఏర్పడు చున్నవి.

ఎవరైనా ఊర్ధ్వస్థితికి వెళ్ళవలెనన్నజన్మతః నీచజాతి యందు పుట్టినప్పటికి వారి శుద్ధత్వము పవిత్రత పరమార్ధిక సాధనచే ఉత్తమ వర్ణస్థులుగా తయారుకావచ్చును.

శ్లో|| శమోదమస్తపఃశౌచంక్షాంతిరార్జవమేవచ;
జ్ఞానవిజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజమ్||

అంతరిన్ద్రియ నిగ్రహహము శమము ; బాహ్యేంద్రియ నిగ్రహహము దమము;శుచిత్వము రుజుమార్గము గురువు శాస్త్రము నందు నమ్మకము కలిగియుండుట, ఓర్పు మొదలగునవి కూడా బ్రహ్మణులకు స్వభావముగ వుండును.

శ్లో|| శౌర్యంతేజో ధ్రుతిర్దాక్ష్యమ యుద్ధేచాప్యలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మస్వభావజమ్||

శూరత్వము తేజస్సు (కీర్తి ప్రతాపము) ధైర్యము సామర్ధ్యము ; యుద్ధము నందుపారిపోకుండుట దానము ; ప్రజాపాలన శక్తి క్షత్రియులకు స్వభావము వలన పుట్టినవి.

వైశ్యునకు వ్యవసాయము గోసంరక్షణము వర్తకము స్వభావముగ నుండును.

శూద్రునకు సేవారూపకమయిన కర్మ స్వభావముగనుండును.

శ్లో||యతఃప్రవ్రుత్తిర్భూతానాంయేనసర్ర్వమిదంతతం ..
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధింవిందంతిమానవః || 18.46)

తనతన స్వాభావిక కర్మఫలాభి సంధి రహితముగా ఈశ్వరార్పణముగ నిష్కామముగ ఆచరించుటచే చిత్తశుద్ధికలుగగా దానిచే జ్ఞానయోగ్యత కలుగు చున్నది. "..ఏనసర్వమిదమ్ తతమ్." పాలలోవెన్నవలె దేనిచే ప్రపంచము వ్యాపింపబడియున్నదో ఆ పరమాత్మ స్థూలనేత్రములకు గోచర ముకాకున్నను జ్ఞాననేత్రమునకు సర్వత్ర గోచరించును.

కర్మచేయుటయే నీవంతు ఫలితము భగవంతునికే అర్పింపుము. అతని సాన్నిధ్యము సర్వత్ర అనుభూతమొనర్చుకొనుచు పాపకృత్యములు ఎవ్వియు చేయక భక్తి భావ సమన్వితులై యుండవలెను.

కర్మ చేయుటయే నీవంతు ఫలితము భగవంతునికి అర్పింపుము. అప్పుడు మోక్షసిద్ధిని పొందగలవు అని గీతా సందేశము.

కర్మయను ప్రమిదలో భక్తి యను తైలము పోసి ధ్యానమను వత్తిని పెట్టి జ్ఞానమను జ్యోతినివెలిగింపుము అని భగవానుని సందేశము.

శ్లో|| శ్రేయాన్స్వధర్మోవిగుణఃపరధర్మాస్త్వనుష్టితాత్|
స్వభావ నియతంకర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం||47||

అంటే తనధర్మము గుణములేనిదిగ కనబడినను (అసంపూర్ణముగా అనుష్టింపబడినది అయిననూ) చక్కగా అనుష్టించబడిన ఇతర ధర్మముల కంటె శ్రేష్టమైనదే యగును.

స్వభావముచే ఏర్పడిన తన ధర్మమునకు తగిన కర్మమును చేయుచున్నయడల మనుజుడు పాపములను పొందడు;

ఇచట స్వధర్మమనగా ఆత్మచింతనాదులు. ఆత్మధ్యానాదులు ఒకింత ప్రయాసగా తోచినను చివరకు సుఖము కలుగ చేయును. పరధర్మములైన దృశ్య వస్తు ధర్మములు ప్రారంభములో సుఖవంతములుగ తోచినను చివరకు దుఃఖమునే కలుగజేయును.

స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమగు త్రిగుణములచేకప్పబడి,పొగచేత అగ్ని కప్పబడినట్లు, సమస్త కర్మములు త్రిగుణములను దోషములచే కప్పబడియున్నది. జీవిత యాత్రకై ఆయాకార్యములు జనులు తప్పక చేయవలసియే ఉన్నది.

ప్రాణులకు అన్నాదులోసగుట, అతిధులకు బ్రహ్మనిష్టులకు, దీనులకు భోజనాదులతో తృప్తిపరచుట చేయవలెను. ఇది అంతయూ కర్మయోగము గురించి విచారణ.

ఇంక జ్ఞానయోగము గురించి భగవానుడు విచారణ చేయుచున్నారు.

అన్ని విషయములనుండి విరక్తులై మనస్సును జయించి విరక్తులై యుండవలెను. బయట శత్రువులతోపాటు అంతఃశత్రువులను కూడ జయించవలెను.

దుష్ట మనస్సు భుజించువాని కంఠమున ముల్లు వలె బాధించునని శంకరులవారు చెప్పిరి. కర్మఫలత్యాగము, విషయ ఆశా పరిత్యాగముచే కర్మరహిత మోక్ష పదవి లభించ గలదని స్పష్టమగుచున్నది.

కర్మ సిద్ధిని పొందినవారు పరమాత్మను ఎలా పొందగలరో గీత యొక్క సారమంతయు భవానుడు క్లుప్తముగ నాలుగు శ్లోకములలో ఈ విధముగా తెలుపుచున్నాడు.

శ్రీభగవానువాచ:

శ్లో|| బుద్ధ్యావిశు ద్ధయా యుక్తో దృత్యాత్మానం నియమ్య చ
శబ్దాదీన్విషయాస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుద స్యచ ||51||

శ్లో|| వివిక్త సేవీ లఘ్వాశీ యతవా క్కాయ మానసః ”
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యంసముపాశ్రితః”||52||
శ్లో|| ”అహంకారం బలందర్పం కామం క్రోధంపరిగ్రహమ్”
విముత్య నిర్మమ శ్శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే||53||

దీనినే సంక్షిప్త గీత యని కూడ అందురు

మోక్షప్రాప్తికి -
1 బుద్ధినినిర్మలముగ యుంచుకొనవలెను.
2 ధైర్యముచే ఇంద్రియములను స్వాధీనము చేసికొనవలెను.
3 శబ్దస్పర్శాది విషయములను త్యజించవలెను.
4 రాగద్వేషములను విడిచి పెట్టవలెను.
5 ఏకాంతమైనస్థలమును ఆశ్రయించవలెను
6 మితాహారము సేవించవలెను
7 వాక్కును శరీరమును మనస్సును స్వాధీనమునందుంచుకొనవలెను
8 వైరాగ్యమును లెస్సగా ఆశ్రయించవలెను.
9 నిరంతరము ధ్యానతత్పరుడై యుండవలెను.
10 అహంకారము దుష్టకార్యములకుపయోగించు బలమును కామమును క్రోధమును పరిగ్రహమును [ ఇతరులనుండి వస్తువులను తీసుకొనుట] వదలి వేయవలెను.
11 మమకారము పోగొట్టుకొనవలెను
12 శాంతచిత్తుడై యుండవలెను.

పైన చెప్పినసుగుణములు కలవాడు బ్రహ్మప్రాప్తిని పొందుచున్నాడు.

బ్రహ్మ సాక్షాత్కారము పొందినవాడు నిర్మలమనస్సుకలవాడై ప్రాణులందు సమబుద్ధి కలిగినవాడై ఉత్తమ భగవద్భక్తిని పోందును.

బ్రహ్మజ్ఞానము కలవాడు పరాభక్తి అనగా జ్ఞాననిష్టతో సమానమైన భక్తిని పొందును. భక్తి యనే పుష్పమే జ్ఞానమనే ఫలముగా మారుచున్నది. భక్తిద్వారా ఆత్మస్వరూపమును తెలిసికొని ఆ స్వరూపమునందు ప్రవేసించు చున్నాడు.

’ జ్ఞాతుం ద్రష్టుం ,,ప్రవేష్టుం,, చ పరంతప’" || 11.54||

జ్ఞానముచే ముక్తి లభించును. జ్ఞానము భక్తిచే లభించును. సమస్త కార్యములు చేయుచున్ననూ కేవలము భగవంతుని శరణు పొందినవాడు భగవాదనుగ్రహము వలన శాశ్వత మోక్షపదము పొందుచున్నాడు.

అన్నికార్యములు నిరంతరము చేయుచున్నను మనస్సు భగవంతుని యందు లగ్నమైనచో భగవాదానుగ్రహమువలన మోక్షము లభించ గలదు.

ఇందు కర్మఫల సన్యాసమే చెప్పబడినదిగాని కర్మ సన్యాసముకాదు.

మనుజుడు పరమాత్మను పరమ ప్రాప్యముగ నెంచి నిరంతరము భగవంతుని యందే సంలగ్నమొనర్పవలెను

ప్రీతితో భక్తిపూర్వకముగ తన్నుభజించువారికి బుద్ధియోగమును ఒసంగెదనని భగవానుడు 11 అధ్యాయములో తెలిపెను.

కృష భగవానుడు ఇలా చెప్పుచున్నాడు : " నాయందు చిత్తము నుంచినవాడవై నా అనుగ్రహమువలన సంసారదుఃఖమును దాటగలవు. అట్లుగాక అహంకారమువలన నా యీ వాక్యమును వినకుందువేని చెడిపోయెదవు".

మాయ జీవుని చుట్టు పెక్కు అడ్డు గోడలను, దుఃఖములను విఘ్నములను ఏర్పాటు చేసియుంచినది. అహంకారమువలన వినకున్న సంసార కూపముననే పడి అజ్ఞానులు నానా యాతనలు బాధలు పడుదురు.

కృష్ణుడు అర్జునినికి మళ్ళీ చెపుతాడూ "ఒకవేళ అహంకారము అవలంబించి నేను యుద్ధము చేయను అని తలంచెదవేని నీ ప్రయత్నము వ్యర్ధమే యగును నీ క్షత్రియ స్వభావము నిన్ను నియోగింపగలదు. ఓ అర్జునా! స్వభావముచే (పూర్వ జన్మ సంస్కారముచే) నీ యొక్క కర్మచే బంధింప బడినవాడవై యుద్ధము చేసి తీరెదవు. ఇహ జన్మ పురుష ప్రయత్నము అధికముగ నున్నచో, పూర్వజన్మ సంస్కారమును జయించి వేయబడును. కనుక తీవ్ర పురుషప్రయత్నముచే ఈ జన్మమునందు దైవిక సంస్కారమునే అలవాటు చేసుకొనిన పూర్వదుఃఖసంస్కారములు జయించబడును" అని

శ్రీభగవానువాచ:

స్లొ " ఈశ్వరసర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి ”
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా"||61||

అంటే సమస్త ప్రాణులహృదయమందుండి ఈశ్వరుడు జగన్నియామకుడుగ ప్రభువుగా శాశకుడుగ రాజు ప్రజలను శాశించినటుల సమస్త ప్రా ణికోట్లను శాశించును. వారివారి కర్మానుగుణముగ ఫలముల నొసంగును. రాజాజ్ఞను ఈశ్వరును ఆజ్ఞనుఉల్లంఘించినచో మనుజుడు అతనిచే శిక్షితుడై తనదుష్కర్మ ఫలితముగ ఘోరదుఃఖము అనుభవించును.

ఈశ్వరసన్నిధియని భావించుచు ధర్మమును సత్యమును ఎవ్వరూ ఉల్లంఘించరాదు.

ఈశ్వరుడు తనమాయ ద్వారా సంసార చక్రమును త్రిప్పుచున్నాడు. జీవులుదానిలో చిక్కుకొని తప్పించుకొనలేక తిరుగుచున్నారు.

సర్వవిధముల ఆ హ్రుదయస్థుడగు పరమాత్మనుశరణుపొందినచో అతని అనుగ్రహమువలన శాంతిని మోక్షమును పొందగలము.

దృశ్యభిలాషవదలి పూర్ణభావముతో పరమాత్మను ఆశ్రయించుటయే ఏకైక మార్గము.

కృష్ణుడు అర్జునునికి ఈ విధముగ రహస్యములన్నిటికి రహస్యమైన గీతా శాస్త్రము నీకు చెప్పితిని దీనినంతతిని బాగుగా విచారణ చేసి తదుపరి నీకెట్లు ఇష్టమో అట్లాచరించుము అని కూడా బోధిస్తాడు.

మహనీయులు తాము ధర్మము బోధించినప్పటికి దానిని గూర్చి ఆలోచించుటకు విమర్శించుటకు ఇతరులకు పూర్తిగా అధికారము ఇచ్చుదురు.

తాము చెప్పిన బోధనుపూర్వాపర విచారణ లేక స్వయముగా దానిని గురించి ఆలోచింపక అమాంతముగ గ్రహించుడని వారు చెప్పరు.

గురువు బోధించిన దానిని శిష్యుడు తనసొంత పరిజ్ఞానము తో చక్కగా శీలించి విమర్శించి తనకు నచ్చినదానిని అనుసరింపవచ్చును.

ఇట్టి స్వాతంత్ర్యము పూర్వముగురువులు శిష్యులకిచ్చిరి

అట్లే పరమాత్మ శ్రీకృష్ణుడు కూడా వ్యవహరించెను. ఆ విధముగా అటువంటి విశాలహృదయము ఔదార్యము శ్రీ కృష్ణడు ప్రకటించెను. ఇట్టివాక్యము ఉదారస్వబావులే తప్ప ఎవ్వరూ పలుకజాలరు.

గీత బోధయొక్క పరమ ప్రామాణ్యత్వము సత్యత్వము దీనిచే వ్యక్తమగుచున్నది.


శ్లో|| ఇతి తే జ్ఞానమాఖ్యాతం ద్గుహ్యాద్గుహ్యతరంమయా ”
విమృశ్యైతదశేషేణ యధేచ్చసితదాకురు|| 63 ||

" యధేచ్చసి తథా కురు", అంటే అట్లు విచారణ చేసినపిదప నీ కెట్లు వుచితమని తోచునో అట్లాచరింపుము అని భగవానుడు చెప్పెను.

శ్రీకృష్ణుడు కర్తృత్వము తనపై పెట్టుకొనలేదు.

పదునెనిమిది అధ్యాయములబోధను అనర్గళముగ ఉపదేశించి తుట్టతుదకు దాని ఫలము వాంచింపకయే విరమించెను. అర్జునునిచే యుద్ధముచేయించుటయే తన లక్ష్యమైనను ఫలితము వాంచింపకయే ముగించెను.

భగవానుడు అర్జునునితో అర్జునా| నీవు యుద్ధము చేయుము లేక చేయక యుండుము దానితో నాకు పనిలేదు నేను చెప్పవలసిన ధర్మము నీకుచెప్పివేసితిని అని విశాలదృష్టితో చెప్పెను.

అట్లుగాక కర్తృత్వము తమపై వేసికొనిన గురువులకు శాంతి యుండదు. కావున వారిధర్మము వారు నెరవేర్చుదురు . ఫలమును వాంచింపరు. కర్మ భక్తి ధ్యానానాదులు అన్ని బోధించి చివరకు జ్ఞానం అను ఒక్క పదములో ఇమిడ్చివేసెను.

.. జ్ఞానమే చరమ లక్ష్యము....

భగవానుడు రహస్యములన్నిటిలోకి పరమ రహస్యమైన శ్రేష్ట మైనవాక్యములుచెప్పుచున్నానని మరల మరల చెప్పెను.
కనుక సేవా శుష్రూతలద్వార, నమస్కారము ద్వారా, వినయ విధేయతల ద్వారా గురువుయొక్క ప్రీతిని సంపాదించుకొన్నచో ఇక ముక్తిమార్గము చేతికి అందినట్లే యగును.

కృష్ణుడు అర్జునితో - "నాకు ఇష్టుడవైనందున నీకుహితమును చెప్పుచున్నాను" అనెను:

శ్రీభగవానువాచ:
శ్లో||మన్మనాభవ మద్భక్తోమద్యాజి మాంనమస్కురు
మామెవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే"||65||

అంటే - " నాయందుమనస్సునుంచుము. నాయడల భక్తికలిగి యుందుము. నన్ను ఆరాధించుము. నాకు నమస్కరించుము. అట్లు కావించెదవేని నీవునన్నె పొందగలవు. నా కిష్టుడవై యున్నావుకనక ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను" అని.

సాక్షాత్తు కృష్ణమూర్తియే ఈవాక్యమును సత్యమని ప్రతిజ్ఞ చేసిచెప్పెను.

శ్లో|| స్సర్వధర్మాన్ ప రిత్యజ్య మామేకంశరణం వ్రజ|
అహంత్వాసర్వ పాపేభ్యొ మోక్ష యిష్యామి మాశుచః||66||

అంటే - "సమస్త ధర్మములను విడిచి పె ట్టి నన్నొకడిని మాత్రమే శరణుపొందుము. నేను సమస్త పాపముల నుండి విముక్తునిగ చేయుదును".

సమస్త కర్మలు ధర్మములన్నింటియొక్క ఫలితము శరణాగతి యొక్క ఫలితముననే ఇమిడియున్నది. దేనినిపొందినచో సమస్తము పొందబడినదియగునో అట్టి ఆత్మవస్తువు భగవంతుని ఆశ్రయించిన చాలును. కావున తన్నొక్కనినే శరణు పొందమని భగవానుడు ఉపదేశించెను.

దృశ్యపదార్ధములన్నిటిని వదలి దృక్వస్తువగు ఆత్మనొక్కదానినే శరణు పొందుము అని చెప్పెను. త్యాగము చేతనేమోక్షము లభించును. దృశ్యరూపక్షేత్రమును గురించిన భావము లను త్యజించి క్షేత్రజ్ఞుడగు పరమాత్మను శరణు పొందవలెను.

ఈసత్యము తెలిసికొని భగవంతుని శరణాగతి యొనర్చి ఇంక ఏమాత్రము శోకింపకుము అని భావన.

దుఃఖరహితమగు పరమాత్మ స్థానము లభించునపుడు ఇంక శోకమునకు ఆస్కారము లేదు.

” అశో చ్యానన్వశోచస్త్వం ” అను శోకరాహిత్య బోధ ద్వారా గీత ప్రారంభమై "మాశుచః" అను శోకరాహిత్య వాక్యముతో అంతమైనది కావున గీత లక్ష్యము శోకరాహిత్యమే.

ఆనంద ప్రాప్తి. బ్రహ్మానంద ప్రాప్తి. ఇవియే గీతా లక్ష్యము ...

ఈ శ్లోకమునందు అతిసులభమైన భక్తి ప్రపత్తి శరణాగతి మాత్రమే ముక్తికి హేతువుగ తెలుపబడుటచే గొప్ప గొప్ప శాస్త్రములు చదువలేనివారు ఈ శ్లోకమును సదా మననము చేయుట అత్యంత శ్రేయస్కరము.

భగవానుడు గీతాశాస్త్రము గురించి ఇట్లు చెప్పెను. "అర్జునా! నీకుబోధింపబడిన గీతా శాస్త్రము తపస్సులేనివారికి గాని భక్తుడుకానివానికిగాని వినుటకిష్టములేనివానికి గాని గురు సేవచేయనివారికిగాని, నన్ను దూషించువానికిగాని ఎన్నడును చెప్పతగినదికాదు" .

తపస్సుకలవారికి భక్తి కలవారికి గీతను బోధింపవచ్చును. ఎవరు అతిరహస్యమైన గీతా శాస్త్రము నాభక్తులకు చెప్పునో అట్టివాడునిస్సందేహముగ నన్నే పొందును అని భగవానుడు చెప్పెను. దేవునికి ప్రియమొనర్చుటకై మానవులు అనేక పుణ్యకార్యములు చేయుచున్నారు. వారందరికన్ననూ గీతశాస్త్ర బోధకుడే అధిక పుణ్యము సంపాదించు చున్నాడు అని్. గీతా ప్రచారము పుణ్యప్రదమైనది . అట్టి ప్రచారకుని జన్మ సార్ధకమైన ది.

శ్రీభగవానువాచ||

శ్లో|| అధేష్యతే చ య ఇమంధర్మ్యంసంవాదమావయోః|
జ్ఞాన యజ్ఞేన తేనాహమిష్ట స్స్యాహమితి మేమతిః ||70||

అంటే - "ఎవరు ధర్మయుక్తమైన ఈ సంభాషణము అధ్యయనము చేయునో అట్టి వానిచే జ్ఞానయజ్ఞముచే నేను ఆరాధింప బడిన వాడనగుదును".

శ్లో|| కచ్చిదేత చ్చ్రుతంపార్ధ త్వయైకాగ్రేణ చేతసా|
కచ్చిదజ్ఞానస మ్మోహః ప్రనష్టస్తే ధనంజయ||72||

అంటే "ఓ అర్జునా!నాయీ బోధను ఏకాగ్రముగ వింటివా? అజ్ఞానజనితమగు నీ భ్రమ సంపూర్ణముగ నశించినదా" అని.

ఏకాగ్రేణచేతసా అంటే ” ధ్యానించునపుడు గాని శ్రవణము చేయునపుడుగా ని విచారణసలుపునపుడుగాని మనస్సు ఏకాగ్రముగ యుండవలెను. అజ్ఞానము సమూలముగ నశింపచేసికొనుడు అని భగవానుడు గీతాశాస్త్రమందు అంతిమోపదేశము గావించెను తన బంధువులు చనిపోవుదురను దుఃఖము శ్రీకృష్ణుడు ఉపదేశించిన జ్ఞానముచే సమూలముగ నశించినది.

అప్పుడు అర్జునుడు చిట్టచివరగా చెప్పిన మాట ఇది:

శ్లో|| నష్టోమోహః స్మ్రతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా|
స్థితోస్మి గతసందేహః కరిష్యేవచనంతవ||73||

అంటే - "నీఅనుగ్రహమువలన నాఅజ్ఞానము నశించినది. సంశయములు తొలగినవి. ఇక నీఆజ్ఞను నెరవేర్చెదను"

శిష్యుడు ఎంతపైస్థితికిపోయినను గురు భ క్తిని గురువాక్యపాలనను వదలరాదు. దైవభ క్తిని శాస్త్రపాలనను ఏకాలమందు విడనాడరాదు.

ఇట్టి అద్భుతమైన సంవాదము వినిన సంజయుడు ధృతరాష్ట్రునకు ఇలా చెపుతాడు. "ఓ దృతరాష్ట్రా ! కృష్ణుడియొక్కయు అర్జునుడి యొక్కయు ఆశ్చర్యకరమైన పులకాంకురముకలుగజేయు సంభాషణమును వింటిని మోహగ్రస్తుడగు అర్జునుడు భగవానుని దివ్య బోధచే మహాత్ముడుగ మారిపోయెను.గీతా శాస్త్రము అపూర్వమైన మహిమకలది.అత్యాశ్చర్యమైనది".

వ్యాసుడు సంజయుడికి దూరదర్శన దూరశ్రనణ శక్తినొసంగెను. రణరంగమున జరిగిన సంవాదమును వినగలిగెను చూడ గలిగెను. సంజయుడు చెప్పినది సాక్షాత్తు భగవత్ప్రోక్తములైన వాక్యములే.

భగవానుడు స్వయముగా బోధించిన గీతాశాస్త్రము పుణ్యమైనది పావనమైనది. అట్టి గీతాశాస్త్రము వినిన సంజయుడు "ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణార్జునుల సంవాదము తలచి తలచి మాటి మాటికి ఆనందమును పోందు చున్నాను".

వినిన బోధను మాటిమాటికి తలచుకొని మనననిధిద్యాసలు గావించుకొని ఆనందముపొంది సంజయుడు సంతోషార్ణవమున ఓలలాడెను.

ఆ సంతోషముతో గీతలో చెప్పిన చివరి మాట !

శ్లో|| యత్ర యోగే శ్వరకృష్ణో యత్ర పార్ధోర్ధనుర్ధరః...
తత్రశ్రీర్విజయోభూతి ర్ధ్రువానీతిర్మతిర్మమమ||78||

అంటే - "ఎచట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండునో ఎచ ట ధనుర్ధారి అగు అర్జునుడు ఉండునో అచట సంపదలు విజయమును ఐశ్వర్యమును దృఢ మగు నీతియును ఉండునని నా అభిప్రాయము".

ధనుర్ధారియగు అర్జునుడు బాహ్య శత్రువులను జయించివేసి గీతాజ్ఞానరూపఖడ్గముచే అంతఃశత్రువులనుగూడాజయించివేసినభక్తుడు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండుచోట విజయాదులు వర్ధిల్లును గీతాజ్ఞానరూప మహాధనస్సు చేపట్టినవాడు నిష్కామభక్తి ధ్యాన వైరాగ్యాదులను అస్త్రములు ధరించిన భక్తుని చెంతకు సాక్షాద్భగవంతుని సాన్నిధ్యమువలె విజయాదులు వర్ధిల్లు చుండును .
ఈ విధముగా భగవద్గీత కృష్ణార్జునుల సంవాదము సమాప్తము అవుతుంది.

శ్రీమహాభారతేశ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గితా సూపనిషత్సు బ్ర్హ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే మోక్షసన్యాసయోగోనామ అష్టాదశోధ్యాయః
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః ||
||ఓం తత్ సత్ ||



||ఓం తత్ సత్ ||

 

 


.