సుబ్బలక్ష్మి గారి కలములో ..

"నియతాం అక్షతాం దేవీం.." !!

సుబ్బలక్ష్మి గారి కలములో ..
"నియతాం అక్షతాం దేవీం.. !

ఇది సుందరకాండలో ఒక శ్లోకము లో మొదటి పాదము.

మొట్టమొదట సంక్షిప్త సుందరకాండ ప్రచురణ చేసినప్పుడు ఎప్పటికప్పుడు ప్రింటరు దగ్గరనుంచి వచ్చిన కాపీలు అమ్మకి చదివి వినిపించేవాడిని. అప్పుడు కథలో ఏమీ ఒడుదుడుకులు లేకుండా ఉండేటట్లుగా చూస్తూ మూడు వేల శ్లోకాల సుందరకాండని మూడు వందల శ్లోకాల సంక్షిప్త సుందరకాండలా కుదించిన రోజులవి. అమ్మ తన లెక్కలో ఏ శ్లోకాలు ఉండాలి అన్న మాట, నేను అర్థాలు సరిపోయి కథ అంతా సరిగ్గా వుందా అన్నమాట చూస్తూ ఆ సంక్షిప్త సుందరకాండ చేయడము అయినది. అప్పుడు నా ఆఫీసులో ఇసిఇల్ చైర్మన్ గా చాలా పనులలో మునిగి పోతూ వుండే రోజులవి. అయినా నా ఆఫీసు పని అంతా అయిపోయిన తరువాత రాత్రి ఆమ్మతో మాట్లాడుతూ సంక్షిప్త సుందరకాండ పూర్తి చేసిన కాలము అది. అంతాచేసి ప్రింటర్ కి కూడా ఇవ్వడము అయింది. పని అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు, అమ్మ హఠాత్తుగా అడిగింది- హనుమంతుడు చెప్పిన - "నియతాం అక్షతామ్ దేవీం" అన్నశ్లోకము ఉందిరా? అని.

అప్పుడు ఇంకా సంస్కృత భాష మీద అభిమానము వలన, అమ్మకి సుందరకాండ ఇష్టము అన్న మాట బట్టి, నేను సుందరకాండ చదవడములో వున్న రోజులు అవి. సందర్భానుసారముగా శ్లోకముల ప్రాముఖ్యత తెలుసుకొన గలిగిన రోజులవి. ఆ శ్లోకాల అంతరార్థము జోలికి ఎప్పుడూ పోలేదు. అమ్మ అడిగిన వెంటనే చూచి " అమ్మయ్య ఆ శ్లోకము సంక్షిప్త సుందరకాండలో ఉంది అమ్మా" అని అమ్మకి చెప్పాను.

అమ్మకి అంత ముఖ్యమైన ఆ శ్లోకము ఏమిటీ, అసలు సందర్భము ఏమిటీ అని వెంటనే చూశాను.

అది హనుమంతుడు లంకనుంచి తిరిగివచ్చిన తరువాత ఘట్టము.

సుందరకాండలో అరవై నాలుగవ సర్గ లో అంగదాది వానరవీరులు హనుమంతుని తో సహా వచ్చి రాముడున్న ప్రదేశము లో వాలిన తరువాత, హనుమంతుడు ముందుకు వచ్చి ప్రణమిల్లి రాముడితో చెప్పిన మొదటి మాట అది.

"నియతాం అక్షతామ్ దేవీ
రాఘవాయ న్యవేదయత్"||

"నియతాం అక్షతాం దేవీం" అని అంటే నియమములు పాటిస్తూ దేవి క్షేమముగా నున్నది అని. ఆ మాట రాఘవునికి హనుమంతుడు న్యవేదయత్ అంటే చెపుతాడు అన్నమాట. రాముడిని చూడగానే కథ అంతా మొదలెట్టకుండా కార్యము సఫలము అయినది అన్న విషయము ఆ ఒక్కమాటలో చెప్పబడడము అయినది.

"తతో రావణ నీతాయాః సీతాయాః ... ఇయేష పదం అన్వేష్టుమ్ " అంటూ మొదటి సర్గలో మొదటి శ్లోకముతో మొదలైన సీతాన్వేషణ కథ "నియతాం అక్షతాం దేవీం" అన్న మాటతో, కార్య సఫలతని చెపుతూ అంతమైనది అన్నమాట. అమ్మ సుందరకాండ పుస్తకములో ఆశ్లోకము క్రింద ఒక గీత రాసి వుంది. అంటే ఆమె మనస్సులో అంత ముఖ్యము.

ఆ విధముగా "నియతాం అక్షతాం దేవీం" అన్న అ మాట సుందరకాండలో చాలా ముఖ్యము.

ఆ తరువాత సుందరకాండ చదివినప్పుడల్లా , మన శ్లోకపారాయణ ధోరణిలో వెళ్ళిపోతూ ఆ అరవై నాలుగవ సర్గ దాటిపోయి, ఆ శ్లోకము ధ్యానము తో చదివామా లేదా అన్న సందేహముతో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆశ్లోకము చదవడము ఒక ఆనవాయితీ అయిపోయింది.

అప్పుడు " ఆ శ్లోకము ఉందిరా?" అని అన్న అమ్మ మాట ఇంకా వినిపిస్తూ ఉంటుంది.
అలా చదివి నప్పుడల్లా అమ్మని తలుచుకోవడమూ అవుతుంది.

|| ఓమ్ తత్ సత్||


||ఓమ్ తత్ సత్||