సుబ్బలక్ష్మి గారి కలములో ..
సెప్టెంబరు 1, సేమ్యా పరమాన్నము 2018: !!!
సుబ్బలక్ష్మి గారి కలములో ..
సెప్టెంబరు 1, సేమ్యా పరమాన్నము 2018:
ఈ సంవత్సరపు సేమ్యాపరమాన్నము
మళ్ళీ సెప్టెంబరు 1 వచ్చింది.
ఈ దినము సేమ్యాపరమాన్నము దినము. అమ్మ చేస్తూ వుండే ఒక ప్రత్యేకదినము.
చిన్నతనములో ఆ సేమ్యా పరమాన్నమే ముఖ్యముగా వున్నా, ఇప్పుడు అందరము ఆ సేమ్యాపరమాన్నము కన్నా దాని లో ఉన్న అంతరార్థము గురించే అలోచిస్తూ ఈ సంవత్సరపు సేమ్యా పరమాన్నము ఏమిటా అనే ఆలోచనలో వుంటాము. ఆ ఆలోచనలలో చిన్నప్పటి స్మృతులు గుర్తుకి వస్తాయి. ఈ సంవత్సరపు సేమ్యాపరమాన్నమే ఈ సారి కథ.
నాన్నగారు పని విషయములో చాలా కష్టపడే వారు అన్నది మాకు చిన్నప్పుడే తెలుసు. మా నాన్నగారికి వసతి గృహముగా మా ఇల్లు పోస్టాఫీసుకు ఆనుకునే ఉండేది. ఇంటిలోంచి పోస్టాఫీసుకు వెళ్ళడము కూడా చాలా చిన్నపని. మా ఇంటి వరాండాలో ఒక తలుపు తీసి పోస్టాఫీసు వరాండాలోకి వెళ్ళి, అక్కడనుంచి ఆఫీసులోకి దూరడమే. కర్నూలు, కాకినాడ,ఇంకా రాజమండ్రి పోస్టాఫీసులలో మా ఇల్లు అలాగే ఉండేది. నాన్నగారికి పనిమీద ఎంత శ్రద్ధ అంటే ఆఫీసులో పని పూర్తి అయి అందరు వేళ్ళేదాకా వుండి వాచ్ మన్ గా వుండే గూర్ఖా చేత తాళము వేయించి ఇంటికి చేరేవారు. సాయంత్రము ఏడు గంటలనుంచి అమ్మ చూసి రారా అంటే నేనో చంటో పరుగెత్తుకొని వెళ్ళి ఒకమాటు చూసి, మళ్ళీ నాన్నగారు చెప్పిన మాటవిని మళ్ళీ పరుగెత్తుకొని వచ్చేవాళ్ళము. అప్పుడప్పుడు నాన్నగారు వచ్చేసరికి రాత్రి పది గంటలయ్యేది. అంత లేటయినా మళ్ళీ పొద్దున్నే ఏడుగంటలకి తపాలాసంచులన్నీ ఓపెన్ చేయించి , అవన్నీపోస్టుమెన్ల వార్డు ప్రకారము విడి విడి గా చేయించి, పోస్టుమెన్ అందరినీ తొమ్మిది గంటలకి ఆ వుత్తరాలు పంచిపెట్టడానికి పంపించేసి, అప్పుడు మిగత పని చూసుకునే వారు . పనిలో అంత మునిగి పోయి ఉన్నా ఎప్పుడూ పని మీద విసుక్కోవడము కాని, కోపము తెచ్చుకోవడము కాని చూడలేదు. "work is worship" అని మనము వినే సామెత పదహారణాల నిజము ! కష్టపడి పనిచేయడము అదికూడా చిరునవ్వుతో చేయడము అన్నది మామూలే అనిపించేది. పిల్లలందరికీ కూడా అలాగే కష్టపడాలి అని కూర్చోపెట్టి ఎప్పుడూ చెప్పలేదు. కాని మా అందరికీ అధికార విషయాలలో చేయవలసిన కార్యాలు తప్పక వెంటనే చేయాలి అనే భావము చెప్ప కుండానే మాకు తెలిసేట్లు లాగా చేశారు.
అంతపనిలోనూ మా అందరిలో చదువులు, చదువుకోవడము ఎంతో ముఖ్యము అన్న మాట కూడా అమ్మా నాన్నగారు మాలో కలగచేశారు మా నాన్నగారు. మేము కూడా అ విషయము తప్పక పాటించేవాళ్ళము. ఓ ఆరునెలల తరువాత వచ్చే పెద్దపరీక్షలకోసము వినాయకచవితి నాడు పూజచేసి చదువు మొదలెట్టేవాళ్ళము అని గుర్తు. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూవుంటుంది. మేము ఎందుకు అంత పిచ్చిగా చదివాము ? కోంచెము బుర్రలేదోమో కూడా అని అనిపిస్తుంది. కాని అలా చదవడము వలన చివరికి లాభమే పొందాము. ఎది ఏమైనా మేము అలా చదివి పైకి వచ్చాము అంటే దానికి మా అమ్మా నాన్నగారే కారణము అని అనడములో ఏమీ సందేహము లేదు. మేము చదువులో ముందర వున్నాము అన్న విషయమువిన్నప్పుడు, రాముడన్నయ్య జలంధరులో చేరి నప్పుడు,పెద్దబాబి అన్నయ్య టారిఫ్ కమిషనులో చేరాడని వినినప్పుడు, కృష్ణుడు మెకంజీలో ఆడిట్ చేసి చెక్కు తీసుకువచ్చాడని వినినప్పుడు, సుబ్బులక్కయ్య మెడికల్ కాలేజీలో సీటు వచ్చినప్పుడు, లక్ష్మికి ప్రభుత్వము వారి స్కాలర్ షిప్పు వచ్చినదని తెలిసినప్పుడు, నాకు బెంగుళూరులో ఇండియన్ ఇన్టిట్యూటు ఆఫ్ సైన్సస్ లో సీటు వచ్చినప్పుడు, చంటికి ఎం యస్సీ లో సీటువచ్చినప్పుడు, విజయ పెళ్ళి ముహూర్తము కుదిరించి నప్పుడు నాన్నగారికి వచ్చిన ఆనందము ఎప్పటికీ మరిచిపోలేని మధురస్మృతి. అవన్నీ మధురస్మృతులు
అలాగ ఆ విద్యా భ్యాసము మీద కల నమ్మకమో లేక గౌరవమో అనుకోండి , కాసరబాద ట్రస్టు అయిన అథాతో ఫౌండేషను లో విద్యకి సంబంధించిన విషయాలే మూల అధారముగా చేసికొని రెండు పిల్లల స్కూళ్ళకి సహాయము , కొన్ని కాలేజీ లలో విద్యార్థులకు కాసరబాద స్కాలర్ షిప్ లు పెట్టడమైనది. ఆరేళ్ళక్రితము మాజేటి గురవయ్యా స్కూలులో రెండు బహుమతులతో మొదలు పెట్టి , ఈ సంవత్సరానికి అంటే 2018 కి , మొత్తము పన్నెండు స్కాలర్ షిప్పులు పెట్టగలిగాము. త్వరలో పదిహేను మంది దాకా ప్రతి సంవత్సరము కాసరబాద స్కాలర్ షిప్పులు ఇవ్వడము జరగాలని మా ఆశ. ఈ కాసరబాద స్కాలర్ షిప్పుల పథకానికి మూలా కారణము, మాలో విద్యాభ్యాసముపై గౌరవము కలిగించినది మా అమ్మా నాన్నగారే.
ఈ కాసరబాద అథాతో ఫౌండేషను పునాదులు పటిష్ఠము చేస్తూ ఈ సంవత్సరపు పిల్లల స్కూలులో బెంచీలకి, గాయత్రి కాలేజీలో రెండు స్కాలర్ షిప్పులకు సహాయముగా లక్షరూపాయలు ఇచ్చిన లక్ష్మీ విజయరాఘవరావు గారు, గాయత్రీకాలేజిలో రెండు స్కాలర్ షిప్పులకు సహాయముగా ముప్పైఆరువేలు ఇచ్చిన శ్రీమతి అలాగే శ్రీ చుండి సత్యనారాయణ గార్లకు మా శత సహస్ర కోటి కృతజ్ఞతలు.
ఈ సంవత్సరము అథాతో ఫౌండేషను ద్వారా ఎర్పాటుచేయగలిగిన పన్నెండు కాసరబాద స్కాలర్ షిప్పులే మా సేమ్యాపరమాన్నము.
||ఓమ్ తత్ సత్||
||ఓమ్ తత్ సత్||