సుబ్బలక్ష్మి గారి కలములో ..

గురుదక్షిణ!!!

ఓం
శ్రీ గణాధిపతయేనమః
శ్రీసద్గురవేనమః
శివాయగురవేనమః

గురుదక్షిణ

అది ఒక సశ్య శ్యామలమయిన ముని పల్లె.
పల్లెలో జనులు ధర్మానుష్టానపరులు
సౌమ్యులు సత్యవాక్పరిపాలనాశీలురు.
పవిత్ర యజ్ఞ కర్మలందు ఆసక్తి గల వారు. ||1||

ఆ పల్లెకు చేరువుననే వనమువుందు
ఆ వనమునందు వరతంతు మహాముని ఆశ్రమముందు.
అందు గురోత్తముడగు వరతంతు మహాముని,
శిష్యుల శ్రేయస్సే తన ధ్యేయముగ తలచు మహాముని.
వేదవేదాంగములను,
బ్రహ్మ తత్వంబును,
ధర్మ సూక్ష్ములను,
ఉపనిషత్తులను,
శబ్ద శాస్త్రంబులను అన్నిటిని
ఒక వ్యాసమునీంద్రునిలాగ
ఒక పతంజలిలాగ
శిష్య గణములకు జ్ఞాన బోధ చేయుచుండె.||2||

ఆ మహాత్ముని ఇల్లాలు శిష్యగణమును
ఆదరముగ పుత్రవాత్సల్యముతో గౌరవముగా చూచుకొనుచుండె.||3||

అచట కౌత్సుండను ముని బాలకుడు
అత్యంత విధేయతలతో
స్థిరమైన సత్యసంకల్పముతో
విధ్యాభ్యాసము చేయుచుండెను. ||4||

గురువు ఒక నాడు కౌత్సుని చేర పిలిచి,
నీవు ఆశ్రమప్రాంతము తప్ప అన్యమెరుగవు.
చదువేమో నీవేమో నీకు ఇతరధ్యాస లేదు.
అఖిల విద్యలయందు ఆరితేరినావు.
గురుకుల క్లేశములను సహించి గురుకుల వాసము చేసితివి,
ఎనిమిదేడుల నిండని వయసునందే గురుకుల వాసము చేరితివి.||5||

కౌత్య! వత్స! నిన్ను వీడుట మాకెంతో దిగులు కలిగెను.
గురు కుల వాసమును హృదయమున మరువకయ్య !
హరిహర అద్వైత విజ్ఞాన బీజాలు
శిష్యవర్గమందలి హృదయ క్షేత్రమందు వెదజల్లెడవు గాక.
నీ గృహస్థ జీవనమందు
చిత్తమందు కోపతాపాది దుర్గుణములను చేరనీకుము.
త్యాగంబుతో కూడిన భోగంబే శుభమగును",
అని భోదించె ఆ మహాముని. ||6||

అప్పుడు కౌత్సుడు గురువుతో
తాము ఇట్లు పల్కుటవలన నా జన్మము ధన్యమయినది.
ఒకటి కోరుకుందు గురువరేణ్య అని చెప్పె.
చదువు సంధ్యల సమయమున చేసిన దోషము క్షమించవలె.
మీకు గురు దక్షిణ ఇచ్చుట శిష్యుని ధర్మము అని చెప్పె.||7||

అప్పుడు గురువు
విద్యనార్జించు సమయమున
శ్రమపడువేళ నాకు శుశ్రూష యొనరించివి కదా.
అదే కడు మెచ్చుకొంటిని!
ఇక ఏమియును ఈయవలదని తన తృప్తిని యెరింగించెను.

అప్పుడు కౌత్సుడు గురుఋణము తీర్చక
గురువాసము వదులుట ధర్మము కాదు.
గురు భక్తి చిహ్నముగ
కోరిన దేనినైన తెచ్చిఇచ్చెదనెను.

కోరుటకేమియుండు?
ఈ వనమున పావనజీవిత భోగభాగ్యములకు లోటులేదు.
నీ హృదయంబెరిగితి.
తనివియుగల్గె.
నా దక్షిణవచ్చినది, అని గురువు అనెను.

శిష్యుడు గురువుని ఇష్టంబు తీర్పింపగ కోరుకొనమనె.
గురువుని ఋణవిముక్తి బడసి
ఇంటికి చేరుటే పరమధర్మమని శిష్యుడు తలచె. ||8||

విసుగు జనింపురీతి ఇట్లు గురుని వేధింపు పలుకుచుండ,
వినవేలా అని ఇటులెంత చెప్పిన వృధాయని,
తెమ్ము కట్నంబుగా పదునాలుగు కోట్ల ధనంబు
అని పల్కెను అత్యంత కోపముతో.

తను నేర్చిన పదునాలుగు ఘన విద్యలనెంచి
అడిగె కాంచనమని కౌత్సుడు తనలో తలచె.
గురుని చిత్తంబు కదిరించుకొంటినని తనలో నెంతో సంతోషించె.
గురుని కాఠిన్యతను గమనింపలేదు శిష్యుడు.
లేనిపోని కోపములేవదీసెనని గురుని మనస్సు కలుషితంబయ్యె.||9||

అంత కౌత్సుడు తన గురువు వరతంతు మహాముని
పలికినమాటకి తన జన్మధన్యమయినట్లు
ఏ చింతయులేక వారి పాదసేవల మునిగి
సమస్తపుణ్య రాసిని గడియించితినని సంతృప్తి చెందెను.

పదునాలుగు విద్యలకు పదునాలుగు కోట్లు ధనము
తేవలననిన ఆజ్ఞమేరకు ధనము తేవలయునని దలచె.
తాను ఇంతటివరకు విద్యార్థిగనుంటితినని
కార్యభారము పైపడినందుకు కొంత కలత చెందె. ||10||

గోప్యముగ తనకు, గురువుకు జరిగిన సంభాషణమును
సుకృతియను తోటి విద్యార్థికి తెలియ చెప్పె.||11||

సుకృతి
గురువు పరబ్రహ్మము.
గురువే బ్రహ్మ.
గురువే విష్ణువును మహేశ్వరుడు.
గురువుని మించిన దైవంబు వేరు లేరని
సద్గురు పూజ ఇహపరసాధనంబని చెప్పె.
గురువు శిష్యునిలోని అజ్ఞానము రూపు మాపి
వాత్సల్యముతో తన సంతానమునకువలె శిష్యసంతతికి బోధచేయు.
గురుదేవుని చిత్తమెరిగి విద్యలార్జించు శిష్యుడు వినయముగ కట్నమర్పింప,
వారికి విబుధజనులు రాజుల సహాయము ఎంతయోగలదు.
వారు వేద విద్యలందు తత్పరులు,
అర్థదానములందు ఉదారస్వభావులు అని చెప్పె సుకృతి.||12||

అటుల సుకృతి పలుకగా కౌత్సుడు
ధైర్య సంతోషములతో బయలుదేరె. ||13||

గురుపత్ని దర్శనమునకై వెళ్ళె.
గురుని భార్య ఇట్లు పలికె.
"రాజ్య సభలందు మంత్రులు,
పండితులు పలుకుబడి కలిగియుందురు.
వాద నైపుణ్యత కలిగియుండ వలె.
ఎందరో పాలకులు పాండిత్య తేజము తృటిలో తెలియగలిగనవారుందురు",
యని సౌమ్యవాక్యములతో ఆశీర్వచనము నిచ్చె.||14||

ఆ ఆశీర్వచనమును గైకొని
ఉత్సాహమున కౌత్సుడు అత్యంత భక్తితో ఆమె దగ్గర సెలవు తీసుకుని
బయలుదేరి ఆశ్రమద్వారము దాటె.

దారిలో నారాత్రియొక ముని ఆశ్రమమున ఆతిధ్యము పొంది విశ్రాంతి తీసుకొనెను.
ఆ మునికి తన కార్యవివరములను తెలిపెను
అంతయు ఆ ముని తన విద్యార్థి దశ మనసులో మెదలగ,
గురువు తన విద్యార్థికి కష్టమగు కార్యములనే వప్పగించునంతయే గాని
అతనిని వేదించుటకు కాదని తెల్పెను.

"మనపురపాలకుడు ప్రభువు రఘువు
మన కత్యంత గౌరవనీయులు.
ఆయన పాలనలో మనము శుభస్థితిలోనుంటిమి.
నీ కార్యభారము నిర్వహింప అతనిని కోరుకొనుము.
ఆ సూర్యవంశపు రాజులు
అయోధ్యను అత్యంత కీర్తి సంపదలతో నేలుచుందురు.
తమ ధనాగారము త్యాగంబు కొరకేనని అభిలాషించుచుందురు.
సత్యవ్రతులు.
మితభాషణులు.
తమ కీర్తిచే దిక్కులను జయించి,
విధివిధానమైన అగ్నికార్యములు చేయుచుందురు.
అఖిల విద్యలను అ గురోత్తముని దగ్గర శిశుప్రాయముననే అభ్యాసమొనర్తురు.
గృహస్థాశ్రమమున సకలభోగభాగ్యములను యౌవ్వనమును అనుభవించుదురు.
అంత్యవేళ తనువును ఇచ్చా రీతి త్యజింపగలరు.
భూమిపై ఎల్లవేళల ఇనకుల రాజులు
నలుదిక్కుల కీర్తి గడించి ప్రకాశించిరి,
అని చెప్పెను ||15||

"ఆ రాజేంద్రులలో రఘుమహారాజు మహా శక్తిశాలి.
విశాల హృదయుడు.
తండ్రి దిలీపుని దత్తమయిన రాజ్యభారమును
రఘువు సూర్యతేజ సమమయిన తేజస్సుతో వహించెను".||17||

తన సహపాఠి పలికిన పలుకులకి అత్యంత ధైర్యముతో
కౌత్సుడు రఘు మహారాజుని చూడ నిశ్చయించెను.
సాకేత పురమున రఘుమహారాజ దర్శనమున
గురుని కట్నంబు ధనమును పొందగలనని
ఇదియే నిజముగ ఇహపర సాధనంబని తలచెను.

దారిలో నారాత్రియొక ముని ఆశ్రమమున ఆతిధ్యము పొంది,
ఆ మునికి తన కార్యవివరములను తెలిపెను.
ఆ ముని తన విద్యార్థి దశ మనసులో మెదలగ,
గురువు తన విద్యార్థికి కష్టమగు కార్యములనే వప్పగించునంతయే గాని
అతనిని వేధించుటకు కాదని తెల్పెను. ||16||

రాత్రి అక్కడ విశ్రాంతి పొంది
ఉదయమేలేచి సంధ్యాకృత్యములను దీర్చి
మునిని వీడ్కోలు పొందెను.
హుటాహుటి నడకతో శ్రమ ఎరుగక ప్రకృతిలోకమున మునిగి
వనంబులు దాటి పల్లెలు దాటి రెన్నాళ్ళలో కోసలసీమకు జేరెను.||18||

కోసలదేశమందు పల్లెలలో
హృదయోత్సాహంబున వినయ సంపన్నులు,
స్వధర్మ నిరతులు,
విశ్వాశార్హులు,
మాన్యులగు జనులెందరినో చూచెను.
వ్యవసాయమున పండిన ధాన్యరాసులులను,
ఇతర వ్యాపార నిపుణులను,
దేశహిత సౌభాగ్యంబురాణించు కర్షకజనులను
మెచ్చుకొనుచు ముందుకు సాగెను. ||19||

వరుణుడు సకాలమున వర్షములు కురిపించి
భూమిని సశ్యశ్యామలము చేయుచుండెను.
తరగని సౌఖ్యంబుతో రఘు మహారాజు సుఖసంతోషములతో శాంతిగ నుండెను.
ధర్మస్వరూపుడగు రఘుమహారాజు సుస్థిర పాలన
ప్రజల హృదయరంజకముగ నుండెను.
ఆ రాజు ధన్యజీవి.
వాని రాజ్యవైభవమున ప్రజావళి
సుఖ భోగభాగ్యములతో తులతూగుచుండెను. ||20||

వేదపఠణము లేని విప్రగృహము గాని,
అతిథి మర్యాద పాటించని యిండ్లుకాని
అందచందములెరగని మందిరములుగాని
కానరావు అయోధ్యాపురమందు. ||21||

పర ధనంబులకాశింపువారు కాని,
పరులకు ఉపకృతి పలుకనివారు కాని,
చారుశీలంబులను వదిలవారుగాని
కానరారు ఆ అగ్రహారమున. ||22||

ప్రభువు ధర్మాభిరక్తులయినచో
ప్రజలు విద్యుక్తధర్మము వదలబోరు.
జనుల మనస్సీమ ఆదర్శముగా నుండు
పరిపాలనమందే ప్రతిఫలించుచునుండెను.||23||

కౌసలేంద్రుని రాజ్యమున
పశువుల సౌభాగ్యము ఎంతయోకలదని
కౌత్సుడు మెచ్చుకొనుచూ ముందుకు సాగెను. ||24||

సరయూ నది శీతల సుగంధ వాయువులు
అతనికి స్వాతగము పలికెను.
క్రమముగా కాంచగలిగెను అయోధ్యా పురమును.
అచటికి చేరి ధన్యుడయ్యెను. ||25||

నేడు రఘుప్రభువును కనుట యెట్లోనని
ద్వారపాలకులు తనని రాజు దగ్గరకు చేర్చురో లేదో అని,
విధియెట్లున్నదోనని
సందేహముననుండెను. ||26||

అంతట మహోన్నత కీర్తిగల్గిన మహామహితాత్ముడు
కౌసలేంద్రుని రాజసౌధమునగాంచెను.
ద్వారమున ఆటంకపరచువారు లేకుండెను.
అవలీలగా సౌధంబునందు పోవుచు
రాజదర్శనభాగ్యము ఎంత సులువాయెనని యెంచుకొనుచుండెను.||27||

ఆ రాజసౌధము మధ్యమున
విశ్వజిత్ యాగమున
ధనాగారము సర్వస్వము ధారపోసిన
యశస్సంపన్నుడు పుణ్యాత్ముడగు దిలీపాత్మజుని దర్శనభాగ్యము గల్గెను.||28||

బ్రహ్మతేజంబుతో విప్రబాలుడు కౌత్సుడు
కోటలోపల ద్వారము అడుగుపెట్టుచుండగ
ఆ రఘుమహారాజు ఆశ్చర్యముతో చూచుచుండెను.||29||

బంగారు పాత్రలేనందున
మృణ్మయపాత్రతో ఆ వటువుని భక్తితో పూజింపవచ్చి
అర్ఘ్యమందించి అతిథి మర్యాదచేసి
ఉచిత పీఠంబుపై కూర్చుండబెట్టి
కౌత్సుడి సన్నిధిన క్షేమమడిగెను. ||30||

కౌత్సుడు హస్తపద్మంబులనెత్తుచూ
స్వస్తి జగత్ప్రశస్తునకు,
స్వస్తి సురేంద్రహితానువర్తికి,
స్వస్తి వదాన్యముఖ్యునకు,
స్వస్తి వశిష్ఠ శిష్యునకు,
స్వస్తి యదాత్రగుణానువర్తికి,
స్వస్తి దినేషవంశునకు,
స్వస్తి సదా రఘు చక్రవర్తికి,
అని రాజుని ఆశీర్వచనంబుచేయుచు కీర్తించెను.||31||

ఆ రఘు మహారాజు ఆనందముతో వటుని కీర్తించెను. ||32||

"నీ పదంబులు సోకగ నాదు నెలవు దివ్యతేజోమయంబుగ వెలసెను.
ఆ తేజస్సుకు తెలియగారాని ఆనందాశ్రువులు నానేత్రమున అలముకొనెను.
నీవు అతిథిగా వచ్చినావు కనుక దైవంబుతో సమానము". ||33||

"నీదు ముఖపద్మము సకల శాస్త్ర ప్రశస్థ విజ్ఞానకాంతితో మెరయుచున్నది.
వయస్సు చిన్నదైనను నీదు పవిత్రసుందరనేత్ర తీక్షణకాంతి
ఎంతయో విధ్యాధికుడవని తెలుయచేయుచున్నది". ||34||

"తమ గురుని ఆశ్రమనున్న కల్పవృక్షములు
అక్కడ తాపశాళికి ప్రశాంతత చేకూర్చి వర్ధిల్లుచుండెకదా.
స్నానసంధ్యాది అనుష్ఠానమునకు అనువుగా నదీజలములు నమృద్ధిగా నుండినవిగదా.
జాతివైరముమాని ఆశ్రమమృగాలు మైత్రితోనున్నవిగదా.
కోరిన సమిధులు అర్చనకు లభ్యమగుచున్నవి కదా.
అతిథి సంతృప్తికొరకు జీవయాత్రకు విరిధాన్యానీకములు పుష్కలముగా లభించుచున్నవి కదా!
గాయత్రిని జపించుచు వ్రతానుష్టానులైన మునిపుంగవులు
వేదములను పఠించుచు తీవ్రతపంబాచరించుచు సౌఖ్యముగానుండిరా?
సకలవిద్యల సారముబోధజేసి నిను తీర్చిదిద్దె గురువు".||35||

"ఆ రఘు మహారాజు కడుభక్తితో
ఆదరముగ పలికిన అమృతవాక్యములను
కౌత్సుడు మదిలోనెంత సంతోషించుచుండెను.||36||

వటువుకాలము వృధా చేసితినింతవరకునని
రాజు కౌత్సుడు ఏమి తలచి ఇక్కడికి వచ్చెనో ప్రశ్నించిన వెంటనే
దేవుని యాజ్జ ఏమియోనది నిర్వహించెదనని అడిగెను.
వటువులగువారికాలము వ్యర్ధమగుట ఎంతమాత్రము సహింపరానిది.
చదువు మీదనే దృష్టియుండెడి విద్యార్థికి
కాలమెప్పుడు ఎంతయో అమూల్యమైనది.
ఒక్కక్షణమయినా వ్యర్థము చేయడు.||37||

అవ్యయ జ్ఞానసముపార్జన దీక్షకలిగిన శిష్యుడు
నియమనిష్టలు విడువడు.
అమిత వాక్యుధ్ది కలిగిన విద్యార్ధియతడు.
ఎంత నవనీతహృదయుడో .

ఆ రాజు ఆతిధ్యమందుట అదృష్టము.
అనుకొనుచూ రాజు ప్రశ్నకు అమితానందముతో సార్వభౌముని సంభోదించి,
తాను కౌత్సుడునను శిష్యుడునని
వరతంతు మహాముని దగ్గర సమస్త విద్యలు నభ్యసించిననెను.||38||

మహానుభావా! రాజా! నీవు వంశోచితంబుగ
పూజ్యపురుషులనర్చించి విశ్వజిత్యాగమున
సర్వస్వము సత్పాత్ర దానమొసంగితివి.
రఘుకుల సార్వభౌముని కోరుటకు
ఇది సమయము కాదని
కౌత్సుడు రాజుకు శుభము తెలిపి
తాను తిగిరిపోవుటే మేలని తలచెను.||39||

పరమ పూజ్యుడును
అఖిల సద్గుణసంపన్నుడును
సూర్యవంశమహారాజు రఘుమహారాజు మాత్రము
ఆ మునిబాలకుని పోవనీయక అడ్డమునిలిచి
మునిబాలకుని మనస్సులోని మాట గ్రహించి
గురువు దక్షిణ ఎంత ఈయవలెనో తెలుపమని ప్రార్థించెను.||40||

వరతంతు మునివర్యులు అవ్యయ తపోధనులు.
శ్రేయోపేత్తులు. మాకు గురుస్థానీయులు పూజ్యులని తెలిపెను మహారాజు. ||41||

అనగ పదునాలుగు విద్యలభ్యసించితిని
గురుని పరదైవతంబనుచు కొలిచితిని.
విద్యకొక కోటిద్రవ్యమై వెలయు కట్నమీయ గావలెనని
ఆర్జించితెమ్మనె గురువు
అని చెప్పెను కౌత్సుడు.||42||

తన వంశ కీర్తిని తలుచుకొని రఘుమహారాజు పలికెను.
సకల కళాపరిపూర్ణుడగు విప్రకుమారుడొకడు
గురుని దక్షిణకోసము కోరవచ్చి
ధనంబు పొందక వెళ్ళెనను అపవాదము
తాను నెట్టులోర్చుకొనును అనుచు
రెండు మూడు రోజులుండమని
త్రేతాగ్నిశాలయందు నిలువమని కోరెను.||43||

ఆతడు త్రేతాగ్నిశాలయందు
చతుర్ధాగ్నివలె వెలుగుచుండెను.
నీకు గుర్వర్ధమేగాక
నాదు వంశగౌరవార్ధమునుగూడ కలిసివచ్చునంతలో
ధనమును సమకూర్చుకొనదలచెను.||44||

ఆమహారాజుకి ఇచ్చిన మాటపై
ఆ మునికుమారుడు అక్కడే త్రేతాగ్నిశాలయందు యుండెను.
అంత ఆ రాజు బాల పండితునికి ధనముసమకూర్చుటెట్లని
హృదయమునందు చింతించునుండెను. ||45||

రాజుని ఇల్లాలు కడు సాధ్వి.
ప్రభావతియనెడు కాంత.
పతిపాదంబులు సేవింపవచ్చినప్పుడు
రాజు సర్వంబు తెలిపి పలికెనిట్లు
సకల విద్యావేత్త సన్ముని వరతంతు గురువు
అంతేవాసి కౌత్సుడు త్రేత్రాగ్నిశాలయందు
యజ్ఞేశ్వరుడుగా వెలయువాని గురుదక్షిణార్థం కోరివచ్చినవాడు.
పదియునాలుగు కోట్లధనము కోరివచ్చినాడు.
గడువు మూన్నాళ్ళు.
పదునాలుగు గవ్వలయినను లేదు ఇంట,
ఎంత గాలించినను కోశాగారధనము సమకూర్చుమార్గంబు కానరానయ్యెను
వంశమర్యాద నిలుప నావశముకాదో,
దక్షిణార్థంబు తెచ్చినీయలేక
నేను దండధరుని (యముని) బాధలు
నరకాన నెట్లు నోర్చు నోనని చింతించుచుండెను. ||46||

(ఆ మహారాణి పలికెనుమహరాజుతో)

గోవునొక్కటి కాపాడ
తనదేహంబె ఇచ్చుటకు సిద్ధపడె
మీతండ్రిదిలీప మహారాజు .
అనెను అమ్మహితాత్మ రాజపత్ని.

భక్తవత్శలుడు ధర్మరక్షకావతారము దాల్చు అచ్యుతుడు.
అండగా నిల్వడె ఇట్టి సమయంబున,
మానసంబున చితించుటమానుమని కోరెను.
బాలసూర్యునివలెనున్న ముని కుమారునికి
ధనమొసంగి తృప్తినొందెదరనెను.||47||

రఘువంశజులనర్థించి వ్యర్ధుడయినవానిగాంచుట
ఎరుగనిదాననని రాజపత్ని తెల్పెగా,
ఇనకుల పాలురకు
దైవంబు ఇచ్చును సకలసంపదలు అనుచు
తన పూజాగృహమున ఇష్టదైవంబును ప్రార్ధించుటకు వెడలెను.

ఆయుధములతో రధము సహాయముతో
కుబేర పట్టణము ముట్టడింతునని,
కౌత్సుకోరిక దీర్చి సూర్యవంశకీర్తిని నిలిపెదనని ప్రతిజ్ఞ చేసెను రాజు.||48||

తన బాహుశక్తిబలముతో
ఆ విద్యార్థికి ధనమును సమకూర్చగల దీక్షతో
ఆ రాజు చిత్తమున శుత్పిపాసులు మానెను. ||49||

భానుకులజులు తమ కోరిక సాపల్య సిద్ధి పొందువరకు
స్వకీయ సౌఖ్యంబులను దరికి చేరనీయరు.

ధ్యానమున ఇష్టదైవంబైన అచ్యుతుని
వాంచితార్థప్రదాతకు అర్చన చేసెను, ఆ రాజపత్ని. ||50||

నిన్నే నమ్మియుంటి నీరజపత్రేక్షణ
దీనమానవులకు దిక్కు నీవని
భక్త బృందంబులకు పారిజాతంబవై వరములొసగు నీవు
పరమపురుషా అని ప్రార్థించెను.||51||

దానశౌరియగు మహారాజు మాట తిరుగులేని మానధనుడు
ఆపదయందు ఆరాటపడుచునుండినని దైవంబువేడుకొనెను.
తన పతికి సమయభంగంబు కాకుండ
కరుణతో దేవదేవుని రక్షింపమని వేడుకొనెను.
తనకు ప్రతిభయుండెనేని
పతియుధర్మంబు కాపాడుప్రభువేని
రాజకార్యసిద్ది కలుగవలెనని
అచ్యుతును పాదాబ్జంబుల భక్తితో
మానసమున ధ్యానముచేయుచుండెను. ||52||

సూర్యవంశ రాజులు హరిభక్త పరాయణులు
ధర్మమును పాలించు సత్యవ్రతులు
అట్టివారికి దైవంబు సదా కాపాడుచుండును.
ఉన్నట్లుండి,
చూడచూడగ చుక్కలుగ
సువర్ణనాణెములు రాసులు రాసులుగ
ధనకోశగృహంబంతయు నిండుచుండెను.
ఒక నిముషంబున కోశాగారాధిపుని లేఖను
అంతరంగ సేవకుడు తెచ్చి రాజుకి ఇచ్చెను.
అంతమహారాజు పులకిత శరీరుడై
ఆ లేఖ తన భార్య చేతికి ఇచ్చెను.||53||

మీ శక్తి ప్రతాపము చూచి
దిక్పతి కుబేరుడు ఇట్లు కనకవర్షంబు కురిపించెను,
అనెను ఆ రాజపత్ని.||54||

రాజు తన శక్తి ప్రతాపములుకన్న
రాజపత్ని భక్తికి మెచ్చి
హరి కరుణామృతంబుగ వృష్టిగ
కాంచనాకృతి గురిపించెననెను.||55||

అని ఇరువురు సంతసంబొంది
కౌత్సుని ఇష్టసిద్ధి కలుగు ఘనత దక్కెనని
అర్థరాత్రి అధికభక్తితో హరికి సాష్టాంగనమస్కృతులు అర్పించి
అర్ఘ్యప్రదానముగావించిరి. ||56||

అతిథి దైవంబగు కౌత్సునికి పసిడి వర్షంబు కురిసిన వార్త తెలిపెను.
అంత రఘుమహారాజు విద్యార్థిని పిలిచి
అచ్చట ధనంబంతయు సర్వము నీదియని
గురుని సన్ముఖమునకు కట్నంబుగ తీసుకు వెళ్ళమని కోరెను.||57||

ఆవిప్రసుతుడు కౌత్సుడు వినయము తో
అమిత ఆశ్చర్యముతో కోశాగారములోనున్న బంగారుకాసుల రాశిని చూచెను.||58||

అపారవిద్యలను గురుని దగ్గర బుద్ధి కుశలతలతో నేర్చినావు,
నీగురుని కట్నమిచ్చుటకు కోరినంత ద్రవ్యము వెంటనే వొసంగలేక నిన్ను ఒక రాత్రి ఆపితిని,
ఇది దోషముగనెంచకుము,
ఓయీ విద్యార్థీ ఇచ్చటనున్న ధనము సర్వము నీది.
నీవు గురుని సన్నిధికి కట్నంబుగ తీసుకుని వెళ్ళి
నన్ను కృతార్ధుని చేయుమయ్య అని ప్రార్థించెను రాజు.||59||

ఓసూర్యకులభూషణ మహారాజా
గురువర్యులెంత ధనము కట్నముగ తెమ్మని ఆజ్ఞ ఇచ్చెనో
అంత ధనము గ్రహించువాడను.
అదియే ధర్మము
ధనాగారములో ధనమునంతటి ధనదానము చేత
తనకేమి పనిలేదని తేల్చెను కౌత్సుడు. ||60||

తన గురువు పదునాల్గు కోట్లు ధనమును మాత్రమే ఆజ్ఞ ఇచ్చెనని
హద్దుమీరి ధనమును గొని పోవుట తగదని పల్కెను. ||61||

అంత ఆ రాజు కౌత్సునితో ఇట్లు పలికెను.
నిను దర్శించు వేళ ధనసూన్యమయినది కోశమందిరము,
నిను తృప్తిపరచుటకు ప్రయత్నించగా నీకై ధనము సర్వము సిద్ధమాయనుకదా!
ఆ దైవంబుతోడ్పాటు చేసె కనుక ఆ ధనమంతయు నీదేగాని,
నాకు అందు భాగము సంప్రాప్తమగుట కల్ల.
అన్య ధనమును ఆశించుట కల్ల అనెను రఘు మహారాజు.||62||

గురునికై ధనమెంత కోరితినో
అంత మాత్రము కొనిపోవచ్చితిని.
అంతకెక్కువ గవ్వ అయిన అంటబోనని
కౌత్సుడు నిష్కర్షగ రాజుతో పలికెను.||63||

అంత ఆ రాజు గురువిధేయుడయిన కౌత్సునితో
పదునాలుగుకోట్లపైన వద్దను నిషేధము గురుడు పెట్టలేదు అనెను.
గురువు పదునాలుగు కోట్లు అనిన
దానిపైన గ్రహింపరాదనే భావము అని కౌత్సుడు తెలిపెను. ||64||

పది మారు గాయత్రి జప ఇంపుమనిన సంఖ్యమించరాదని యనురు,
అటుల పదునాలుగు కోట్లు అన్న అధికముగా తెల్పుటే పరిపాటిగా తెలియవలెను.
అంతకేమాత్రము తక్కువైన తగదనియెడు భావము దానిలో అమరియుండును||65||.

విద్యకొక కోటి ధనము విలువ గట్టి
అదియె తగుదని యందుమా
చూడగా పదునాలుగుకోట్లు ధనమాయిన ఒక విద్యకు సరియౌనే వూహించగా?
ధనము సర్వము తరలించుకు పొమ్ము
సందేహము తగదు నీకు
దాతహృదయమెరిగి సర్వమును గ్రహించవలెనని రాజు హెచ్చరించెను. ||66||

ప్రభూ! ఎందుకీవాదముతోడనేమిపని
గురువు సర్వమును తీసుకున్న సరే నేను సంతోషింతును.
అంతకు మించి తిరస్కారము చేసిన నీవది కొనిపోవలె ననెను.
ఇట్టి నియమంబు అంగీకరింతువేని
ధనము పట్టించుకొనిరమ్ము -
దాన వీర రఘు మహారాజా అనెను.
ఆ కౌత్సుని మాటలు విని సరియెననెను సంతోషముతో రాజు.||67||

కనులుకుట్టుచునున్న కనకంబురాశికై
ఆశింపక ఉందురే అనెడి వారు,
అడిగినదానిపై అధికంబుగనీయగా,
అదియు వద్దనెడివారు, వారిని చూచుట అరుదు.
ధనమునందు వైరాగ్యము కలిగిన ధర్మాత్ములగు రాజులపాలన
దేశమునకు సౌభాగ్యము అని ప్రజలు మెచ్చుకొనుచుండిరి.||68||

ఆ అయోధ్యాపురమున మహారాజులు
ధర్మమార్గ తత్పరులు జ్ఞానులు విశాలహృదుయులు.
విజ్ఞాన సముపార్జమున పేరుగల శిష్య సంతతి గల రాజ్యముగాంచి
జన్మము ధన్యమయినదిప్రజలందరికి .||69||

తృప్తియొక్కటె సౌఖ్యంబు తీర్చిదిద్దు
సత్ప్రవర్తనంబు ఈశ్వరార్చనంబు
త్యాగగుణమే జీవితాదర్శమనుచు ఉన్నవారు
అర్థమును ఆశించబోరు ,అనుచు తలంచిరి ప్రజలందరును ||70||.

రాజు సంతృప్తి చెంది ధనమునంతయు
కోశాగారము నుండి తీసుకుని బయటకువచ్చెను||71||
.
ఆ కౌత్సుడు లేని గృహము చిన్నబోయెను కదా అని గురుని భార్య తలచి భర్తతో పలికెను.
కౌత్సుడు శిష్యగణములో ఉత్తముడు శాంతచిత్తుడు. ||72||

ఎంతో విశ్వాసముతో వినయవిధేయతలతో విద్యలు నేర్చుచు
తీరికవేళలందు గురుపత్నికి,
చెప్పిన చెప్పకున్న సాయము చేయుచు
మృదువుగ పల్కుచునుండెడి కౌత్సుని తలుచుకుని దిగులుచెందెను. ||73||

కోపగించి కొండంత ధన రాసినెట్లు తేగలడని,
పిచుకపైన బ్రహ్మాస్త్రము విడుచుట న్యాయమా అని గురుని ప్రశ్నించెను. ||74||

పర్ణశాల మనది, పసిడితో పనియేమి?
ఎచటదాచుటకెంచినారు ధార్మికాగ్రగణ్యులు,
మనకి ధనమెంత శత్రువో తెలియరైరి. ||75||

అదియు తెచ్చి ఇచ్చుటకు గడువు ఎంత,
అయిదునాళ్ళు అనుట న్యాయమగునా?
అని ఆమె దిగులుతో ప్రశ్నించెను. ||76||

శాస్త్ర జ్ఞానపరులకు కోపగించుట తగునా?
శిష్యుడు అజ్ఞానమున ఏమన్నాచెల్లునుగాని
శాస్త్రకోవిదిలగు గురువుకి తెలియకపోవుదెట్లు?
అని కంట తడి పెట్టిన భార్యతో గురువు వరతంతు మహాముని చెప్పెను.||77||

ఓ మానినీ! కౌత్సుడు నీకెంతో నాకటులే ప్రీతిపాత్రుడును,
సందేహము మానుము,
కౌత్సుడు తిరిగి వచ్చునని ఉత్సాహముతో నుండుమనెను. ||78||

గురువర్యుడిటుల సాధ్వికి హృదయ సంకోచము మాన్పింప
ఆ సమయమున కౌత్సుడు ఉత్సాహంబుతో వచ్చి
తద్గురు పాదంబులచెంత చేరి నమస్కరింప గురుడు ఆనందించెను.||79||

స్వీయగురువు వశిష్టుడు చెంతనుండ
రఘు మహారాజు
ఆశ్రమంబున అడుగు పెట్టె.
బంగారు సంచులతో వాహనంబులతో వచ్చి చేరెను.||80||

అంత వరతంతు మహాముని అది కాంచి లేచి
అమితానందముతో స్వాగతము పలికెను
భక్తితో వచ్చెడి రాజునకును వశిష్ట మహామునికిని
ఆతిధ్యసత్కారములతో ఘన స్వాగతము బల్కెను.||81||

అమిత భక్తితో కౌత్సుడు గురునితో
భవదీయ యాజ్ఞ శిరసావహించి
జనా వాసంబులు పల్లెలు దాటి పోయి పోయి
ఆదిత్య వంశోద్భవుడగు రఘుమహారాజుని ప్రార్థించి
ధనంబు దక్షిణార్థము కోరగా
హద్దుమీరి ధనంబును దానంబిచ్చెను. ||82||

నన్ను మీశిష్యుని శాస్త్రవాదములోగాని
వేదార్ధ సంజనిత జ్ఞానమందుగాని
ఏదియును పరీక్షింపకయే
అనుకూలించి ప్రార్థనమేరకు ధనమునిచ్చుటకు
సిధ్ధపడిన రాజు రఘుమహారాజు,
ఇదియంతయు మీసేవా భాగ్యమే.
పదునాలుగు కోట్ల ధనమును నేను అర్థించినాడను
పైన ఎంతలేశమయినను గ్రహింపనంటిని.
నా నిశ్చయంబు మేరకు ఈ ధనమునంత తరలించి
మిమ్ములనర్థింప ఇచ్చటకేతెంచెను,||83||

అంత ఆ మహారాజును మునిబాలుని మాట సత్యంబని చెప్పెను.
గురుదక్షిణ కొరకు ధనమును కోరి కౌత్సుడు
అచటికి వచ్చు సమయమున ధనాగారమునందు చిల్లుగవ్వ లేకయుండినది.
ధనదానమునకు సత్పాత్రుండని ఎంచి ఆపితి నొక రాత్రి ­­యాగశాలయందు.
కార్యసిధ్ధికై కుబేరునిపై దండింప సంసిధ్ధుడనైతిని.
పతిభక్తిశీల నా సతి వేడగ హరి కుబేరుని ప్రేరేపింప ధనవర్షము కురిసెను,
విద్యార్థి కొరకు సిధ్ధమైన సర్వధనము కొనిపోవుమని ప్రార్థింప,
కోరిన ధనముపై ధనమును స్వీకరింపుమనిన గురువు కోపింతురేమోనని కౌత్సుడు తలచెను.
కనక ధనమెల్ల తరలించుకొనుచు మీ పాదసన్నిధి చేరినాము.
ఇది గురుని వరకట్నమే యేర్పడగ స్వీకరింపగ ప్రార్థింతుననెను||84||.

శిష్యునియందు వాత్సల్యముతో
ఎల్ల ధనమును స్వీకరింపమని రాజువేడుకొనెను.
తన వంశము దానముతో ధన్యమగునని వేడుకొనెను.
విశ్వజిన్మహా యజ్ఞముతో నొనర్చువేళ
గురుని బిల్వంగ లేఖ పంపితినని వారు ఆ సమయమున రాక పోతిరని తెల్పెను||85||.

ఆ సమయంబున గురుని పాదంబుల కాంతికే జన్మము ధన్యమాయెనని రాజు చెప్పగా,
వరతంతు మునీశ్వరులు ఆ రాజు వాక్కులకెంతో సంతోషించి పల్కెను రాజుతో,
వలదని ఎన్నిసార్లు చెప్పినవాక్కులు వినక
గురుదక్షిణ ఎలాగయిన ఈయదలచెను కౌత్సుడు.
అతను వేధించగా కోపముతో పదునాలుగు కోట్ల నాణెముల తేవలెయునని పలికితిని.
అది ఆతడు సత్యంబుగా పలికి నీదు దర్శనము చేయగా వచ్చెను.
అతడు ఎరుగుడు ధనమెట్టిదో||86||.

ఇన వంశోత్తమ చంద్రుడవు నిన్నేమందును,
ఓ రాజా! ఈ ధనరాశి గ్రుమ్మరించి చనువేళ
తద్రణక్షకై ఎప్పుడు కనులను మూయుట సాధ్యమా?
కనులను మూసి పరాత్పరుని తెలుసికొను యోగము ఎంత దుస్సాధ్యమో!
స్వచ్చమయిన జలము వరద రాక వలన కొట్టుకొనుచు పోవునట్టి రీతి
నీ ధనుపు వాగు నిలచి పారినయెని మాతపోధనము మాయమగును అనెను.
మీరు మాకు అండయై యుండ ధనముతోడ పనియేమి లేదు.
తమ జీవయాత్రకు వనము సర్వమునిచ్చును వన్యంబులు చాలునని తెల్పెను. ||87||

కావున, ఓ ప్రభూ! ధనము కల్గెనేని
ఈ ఆశ్రమంబు శోభాయ మగుట కల్ల,
పాప పంకిలము తధ్యము.
నీవు ఒకింత ఊహ చేసి,
ఈ ధనమును పట్టణమందు నిల్పుట మేలగును.
అయిననొకమాట.
ఈ కౌత్సుడుకి అరసి కొంత ధనమొసగుము
రాజా ! దాని వలన అతడు సద్గ్రుహ వ్రతమున సత్కర్మ నిరతుడగుచు, ఖ్యాతినొందును.||88||

తమది ధనమనియెంచి జనులు
తగువులాడుటకు దిగుచుందురు ధనము కొరకు,
ఇలను మీవంటి సత్యవ్రతులు ఎందు గలరు?
ధనమే వలదని వాదమొనరించిరి.
ఇట్టి వాదము మీకే తగును.
సత్యధర్మానురాగ ప్రశస్థమతులగుదురు, అనెను బ్రహ్మర్షి.||89||

బ్రహ్మచారికి చెందవలసినదీ ధనమని ధరణీషుడు వాదించెను.
శిష్యునకై సంపాదించిన ధనము అతనికే చెందునని గురుడు,
గుర్వుర్థము కదా! కోరితి ధనంబు ద్రవ్యంబు గురువునకే చెందునని శిష్యుడును,
ఇట్టి భావములతో మీరలు ధనము గ్రహింపనైతిరి. ||90||

తరచి చూచిన ఈ ధనముతోడ
సంబంధము ముగ్గురకు కానరాదు.
కాన వివరింప ఒక రీతి వినుడు.
విడిపోవు తగవులు తధ్యముగా.
సర్వార్థమును రాజు దగ్గిర నిల్వగా నుంచగా
సర్వమునకు శ్రేయస్సు గలుగును.
కనుక సర్వ ధనము పరులవేనని
రాజునకు శిష్యునకు గురువునకు తరియూచు మార్గము తెలిపిన,
ఆనందము సద్భక్తితో స్థిరచిత్తంబుతో ముని చరణాబ్జములకు మ్రొక్కిరి.
బ్రహ్మర్షి ఆజ్ఞను పాలించి గురువు ఋణము తీరెనని
కొండంత భారము శిరమునుండి జారి శాంత చిత్తులయిరి.||91||

అమిత బాహుబలోన్నతుడైన పతికి,
సతికి కలిగిన హరిభక్తి సాయపడగ,
భువిమీద లభ్యము కానిదేమియుండును?||91||

గురుధనము సమకూర్చెనని తనలోన సంతృప్తి కలిగి
రఘుమహారాజు కౌసలేంద్రుని దీవించె కౌత్సుడు.
తగిన రాజ్య సంపదను యశమును అనేక సంపదులు
సర్వేశు కృప కలిగి సద్గుణాన్వితుడగు వంశదీపకుని
ధార్మికుడగు సుతుని పొందుమని కౌత్సుడు దీవించెను.

వరతంతు మహామునీంద్రుడును,
వశిష్ట గురోత్తంబుడును, తదాస్థు, తదాస్థు, అని వెంటనే దీవించిరి||92||.

తాను మెచ్చినట్లు ఒక లేడి వచ్చి ఆ రాజచంద్రుని కలయజూచి
ఆయన కరస్పర్శతో చెంగు చెంగున దాటుచు కదలి పోయెను. ||93||

వరతంతు మహాముని రాజుతో,
ఓ ఇనకుల సార్వభౌమ!
భవదీయ వంశము నేటి నుండి
సూర్యచంద్ర తారకలు వెలెయునంతటి దాక
నీదు వంశము "రఘు వంశము" పేరుట
సర్వజనమాన్యత బొందుగాక. ||94||

తనను దీవించు వరతంతు మహాముని వీడుకోలు తీసుకుని
రఘుమహారాజు బంగారు సంచులను బండ్లపై నెక్కించి
తన పురంబుచేరుటకు బయలుదేరె.||95||

కౌత్సుని వెంట తీసుకొని అయోధ్య పట్టణము చేరె.
పురమునంజేరి వశిష్టు మహామునినానతిన
పూర్ణాను మోదంబుగా నరనాధుండు కొలువు దీర్చి
ధనము న్యాయార్హమౌ శాశనంబున నిధిగా నిల్పుటకై ఏర్పాటు చేసె.
ఈ సత్కార్యము పొందె పురప్రజల మెప్పు.

అంత తాపసాంగనలు ఆ బ్రహ్మర్షి వశిష్ట మహాముని,
కోసలమహారాజుల సమాగమము చూచిరి కన్నుల పండువుగా. ||96||

పిమ్మట కోసలమహారాజు
వరకన్యను తెచ్చి కౌత్సునికి వివాహంబు గావించి
తన ఆస్థానవిద్వాంసునిగ చేసి,
సరయూనది తీరమున కళాశాలాధిపునిగ చేసె.||97||

సద్గుణోపేయులగు శిష్యులుండిన
గురుని కీర్తి యశస్సులు దశదిశలు వ్యాపించు.

ఇలను పాలించు నృపవరేణ్యులు
అమిత దాన వీరుల సత్కీర్తి ఋజవర్తనము
జనుల హృదయాంతరాళముల సౌమ్యరసము నింపు
ధర్మమార్గమె చివరకు విజయమొందు.||98||

సమాప్తం ||99||

||ఓమ్ తత్ సత్||