సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

గుణత్రయ విభాగయోగమ


||ఓమ్ తత్ సత్ ||


శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
గుణత్రయవిభాగయోగము
పదునాలుగవ అధ్యాయము

భగవానుడు పదమూడవ అధ్యాయములో క్షేత్రక్షేత్రజ్ఞుల గురించి ప్రకృతి పురుషులగురించి ప్రకృతి సంబంధమగుత్రిగుణములగురించి ప్రస్తావించెను .

ప్రకృతిజన్యమగు సత్వరజస్తమోగుణములే జీవుని ఉచ్చనీచ జన్మములకు కారణమని చెప్పబడెను

శ్రీభగవానుడు ఇట్లు చెప్పెను - "దేనిని తెలుసుకొనీ మునులందరూ
ఈ సంసారబంధమునుండి విడివడి మోక్షసిద్ధిని బడసిరో అట్టి పరమాత్మైకవిషయకమైనది ఉత్తమమైనది జ్ఞానమును
చెప్పుచున్నాను" అని.

ఈ జ్ఞానమును తెలిసికొనినవారు సాక్షాత్తు భగవంతునితో ఐక్యము నొందగలరు భగవత్సాయుజ్యము నొందగలరు. జన్మమునుంచి నాశమునుంచి విముక్తినొందగలరు. ప్రకృతివలన కలిగిన సత్వరజస్తమోగుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమునందు బంధించి వేయుచున్నవి. ఆత్మ నిర్గుణుడు . జీవుడు బంధమునుండి విముక్తుడు కావలెనన్న త్రిగుణములు దాటి ఆవలనున్న పరమాత్మను చేరుటయే !

సత్వము నిర్మలమైనది ప్రకాసింపచేయునది ఉపద్రవములేనిది. ఇది సుఖాసక్తి చేత జ్ఞానాశక్తి చేత బంధించుచున్నది

జీవుడు ప్రయత్నపూర్వకముగా సత్వగుణమును దాటి ఆత్మస్థితికి చేరవలయును

రజోగుణము కోరికలును ఆశక్తియును కలుగజేయును అనేక బాహ్యాడంబరమైన కర్మలచేతఖ్యాతినార్జించవలెనని దృశ్యసంబంధమైన వివిధ కార్యకలాపముల చేత జీవుని బంధించును.

తమోగుణము అజ్ఞానమును అవివేకమును సోమరితనము నిద్ర కలుగజేయును.

శ్లో: "సత్వంసుఖే సజ్ఞయతి రజఃకర్మణి భారత
జ్ఞానమావృత్యతుతమఃప్రమాదే సంజ్ఞయ త్యుత "

తా||ఓఅర్జునా సత్వ గుణము సుఖమునందునురజోగుణము కర్మమునందును తమోగుణము జ్ఞానమును [వివేకమును] కప్పివేసి ప్రమాదమునందు[పొరపాటు], జీవునిచేర్చుచున్నది. ఎంత ఆశ్చర్యము ?
ఈ త్రిగుణము లకు నిత్య నిర్మలుడైన జీవుడు వశుడై యుండుట ఆశ్చర్యము. ఇవి జ్ఞానదీపమును ఆత్మదీపమును ఏదోవిధముగ కప్పునవే అయి వుండును.

ఒక్కొక్క గుణము అధికముగానున్నపుడు ఒనర్చు కర్మము దానికి అనుగుణముగనె యుండును

సత్వగుణముఅ భివృద్ధిపొందినపుడు జీవును సమస్త చర్యలు సాత్వికముగ ప్రకాశయుతముగ జ్ఞానవంతముగ నుండును ప్రశాంతముగ మాట్లాడుట సాత్వికాహారము తినుట ఉత్తమగ్రంధములను చదువుట .. మొదలగునవి చేయును. సత్వగుణమునకు విభీషణుడిని ఉదాహరణముగ తీసికొనవచ్చును.

రజోగుణము ప్రభావమువలన జీవుడు లేనిపోనికర్మలను వ్యవహారములను పైనవేసుకొనుచూ నిత్యము శాంతి లేకుండా అశాంతిపరుడై యుండును. దీనికి రావణాసురుడుని ఉదాహరణగా తీసికొన వచ్చును.

తమోగుణమువలన బుద్ధి మాంద్యము సోమరితనము మూఢత్వము వచ్చును. తమోగుణమునకు కుంభకర్ణుడు ప్రతీక.

ప్రతీవారును తమతమ హృదయములను శోధించుకొనీ తమ యందు ఏ గుణముల లక్షణములున్నవో చూచుకొని సాధనచేత ఊర్ధ్వస్థితిని పొందుటకు ప్రయత్నము చేయవలయును.

జీవుడు సత్వగుణముఅభివృద్ధినొందినవానినిగా మరణించినచో అతడు ఉత్తమ లోకములనే పొందును సత్వగుణసంస్కారము కలుగుటకు ఎంతయో సాధన సంస్కారము అవసరము జీవితమంతా పుణ్యకార్యములు చెయుచూ పరోపకార భావన యుండవలయును.

రజోగుణము అభివృద్ధి నొందగా మరణించినచో కర్మాసక్తుల ఇంట జన్మించుచున్నాడు.

అట్లే తమోగుణము కలవాడు పశుపక్ష్యాదులందు జన్మించుచున్నాడు.

సాత్వికర్మలచే నిర్మల సుఖము రజోగుణములచే దుఃఖము తమో గుణముచే అజ్ఞానము కలుగుచున్నది. తాను చేయు సమస్త కర్మలకును తాను అకర్త సర్వసాక్షి నిర్గుణుడననీ వాస్తవముగా తెలిసికొనునో తత్ క్షణమే భగవత్స్వరూపమును పొందుచున్నడు.

అప్పుడు అర్జునుడు గుణాతీతుని లక్షణములు అతని ప్రవర్తన ఎట్టిది అని కృష్ణుని అడిగెను.

అపుడు కృష్ణుడు వివరించెను:

ఎవడుతనకు ప్రాప్తించినసత్వగుణమగు ప్రకాశము, రజోగుణమగు కార్యప్రవృత్తిని గాని తమోగుణసంబంధ మోహమును గాని ద్వేషింపడో అవి తొలగిపోయినచో అపేక్షింపడో , ఎవనికి సుఖదుఃఖములు సమానమో ఇష్టా నిష్టములందు నిందాస్తుతులందు మానావమానములందు శతృ మి తృలందు సమభావముండునో, సమస్త కార్యములందు కర్తృత్వము వదలి వేయునో, సమస్త కార్యములు వదలి బ్రహ్మమందుండునో, అట్టివాడు గుణాతీతుడని చెప్పబడెను .

శ్లో:మానావమానయోఃస్తుల్యమిత్రారిపక్షయోః|
సర్వారంభపరిత్యాగీ గుణాతీతస్సయోచ్యతే ||

శ్రీకృష్ణుడు సాక్షాత్తు తాను పరమాత్మయే యని చెప్పుచున్నాడు . నాశరహితమైనదీ శాశ్వతధర్మస్వరూపమైనది ఆనందరూపమైనది పరమాత్మ సత్ చిత్ ఆనందము తానే అని నిరూపించెను.

అమృతము మరణరహితమైనది పదములద్వారా బ్రహ్మము యొక్క సత్ అంశ నిరూపించబడినది

శాశ్వత ధర్మస్వరూపము పదము ద్వారా చిత్ అంశ నిరూపించబడినది

నిరతిశయానందరూపము ద్వార ఆనందము అనె అంశ నిరూపించబడినది. ద్వైత విషిష్టాద్వైత అద్వైతముల లక్ష్యము ఒకటే అయి యున్నది .

శ్రీకృష్ణుని రూపమూ శ్రీరాముని రూపమూ ఒకటే. వాస్తవముగ వారిరువురూ పరబ్రహ్మ స్వరూపులే. అర్చారూపమూ నిర్గుణ రూపమూ ఒకటే యగుచున్నది. ఏలయన ద్వైత విషిష్టాద్వైతులు ఏరూపము కొలుస్తున్నరో వాస్తవముగా అది సచ్చితానందమే అయి యున్నది.

ఇచట భక్తి యోగము జ్ఞానయోగము కలిసి పోయినది ఆయా సాంప్రదాయములవారు విమర్శించుకొనక అందరూ వారివారి సంస్కారమును బట్టి ఉపాసనాపద్ధతిని ఏర్పాటు చేసుకొని కట్టకడకు ఆ పరబ్రహ్మమునే చేరవచ్చును

|| ఓంతత్సత్||




||ఓం తత్ సత్ ||

 

 


.