సుబ్బలక్ష్మిగారి కలం నుంచి
దైవాసుర సంపద్విభాగ యోగము-అన్వయమ
||ఓమ్ తత్ సత్ ||
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
దైవాసురసంపద్విభాగయోగము
షోడషోధ్యాయః
దైవీగుణములగు సద్గుణములయొక్క సంపత్తి (అనగా ఐశ్వర్యము ) , జీవుని భగవంతుని సమీపమునకు చేర్చును. ఆధ్యాత్మిక క్షేత్రమున అందరికీ ఉపయోగముగానుండుటకై భగవానుడు సద్గుణ దుర్గుణముల రెండిటిని విభగించి తెలిపిన అధ్యాయయమగుటచే ఆ అధ్యాయమునకు దైవాసురసంపద్విభాగయోగమని పేరు వచ్చినది.
భగవంతుడు చెప్పుచున్నాడు:
అభయం సత్వసంశుద్ధి ర్ జ్ఞానయోగవ్యవస్థితిః
దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్.||
అహింసా సత్యమక్రోధ స్త్యా గశ్శాన్తిరపై శునమ్
దయాభూతే ష్వ లోలత్వం మార్దవం హ్రీరచాపలమ్||
తేజస్సమా దృతిశ్శౌచమద్రోహోనాతిమానితా
భవంతిసంపదందైవిమభిజాతస్యభారత ||
భయములేకుండుట
అంత్ఃకరణశుద్ధి
జ్ఞానయోగమునండుట
దానము
బాహ్యేంద్రియనిగ్రహము
ఇతరులయందుదోషములనుచూడకుండుట
దయకలిగి యుండుట
విషయములయందుఆసక్తి లేకుండుట
మృదుత్వము
ధర్మవిరుద్ధమగుకార్యములుచేయకుండుట
చంచలస్వభావము లేకుండుట, జ్ఞానయజ్ఞము, శాస్త్రాదుల అధ్యయనము, తపస్సు,రుజుత్వము, ఏప్రాణికి బాధ జేయకుండుట, నిజము పలుకుట, కోపములేకుండుట, త్యాగబుద్ధికలిగియుండుట, శాంతిస్వభావము, ప్రతిభ బ్రహ్మతేజస్సు,ఓర్పు,ధైర్యము, బాహ్యాంతరశుచిత్వము, ఎవనికిని ద్రోహము చేయకుండుట, స్వాతిశయము లేకుండుట ఇవన్నియు సద్గుణములు. సాధకుడు ఈ ఇరువది ఆరు సద్గుణములను అలవరచుకొనవలెను.
భగవానుడు చెప్పుచున్నాడు అశ్వరమగు ప్రాపంచిక ధనముతో క్రీడించుచు వానిచే అమూల్యకాలమంతయు వినియోగించుచు దుఃఖ పరంపరయు జన్మపరంపరయు పొందకూడదు.
దైవధనము ముందు ప్రాపంచికసంపదలు ఏపాటి విలువకలవి? అందుకని దైవీ గుణములు పొంది, బ్రహ్మసాయుజ్యము పొందెదరుగాక అని భగవానుడు వచించెను.
అభయము ప్రముఖముగ బ్రహ్మ పదముగనె వర్ణించిరి . చిత్తము అత్యంత నిర్మలముగా యుండవలెను. జ్ఞానమందు ధ్రుఢ స్థితిని సంపాదించవలెను దానములలో విద్యాదానము జ్ఞానదానము ముఖ్యమైనవి
శమము అనగా అంతరింద్రయ నిగ్రహహము . దమము అనగా బాహ్యేంద్రియనిగ్రహహము కలిగియుండవలెను. ఆధ్యాత్మిక గ్రంధములను పఠించుటసారము మననము చేయుట స్వాధ్యాయము అని అందురు.
తపస్సు అనగా శారీరక మానసిక వాచిక తపస్సు. మహనీయులగు గురువులను పూజించుట శారీరక తపస్సు అనబడును. మనస్సును నిర్మలముగా నుంచుకొనుట మానసిక తపస్సు అనబడును. సత్యముగ ప్రియముగ మాట్లాడుట వాచకతపస్సు అనబడును.
ఆర్జవము అనగా శారీరము మనస్సు వాక్కు త్రికరణశుద్ధిగా ప్రవర్తించ వలెను.
అహింస అనగా శరీరముతో మనస్సుతో వాక్కుతో ఏ ప్రాణికి హింసచేయకుండ యుండుట.
సత్యమునే మాట్లాడవలెను.
క్రోధము చాలా చెడ్డది క్రోధము వచ్చినపుడు మనిషి రాక్షనుగా మారిపోవును .
త్యాగము అనగా విషయ వస్తువుయందు ఆసక్తి వదలి వేయుట త్యాగబుద్ధిని కలిగి యుండవలెను. మనస్సులో శాంతిగ నుండవలెను
అపైసునమ్ అనగా ఇతరులలో దోషములను లెక్కించకుండుట . తమ తమ హృదయమందున్న కోటానుకోట్ల దోషములను వదలివేయవలెను పరుల గుణములతో పనియేగాని దోషములతోకాదు.
భూతదయ యుండవలెను.
మాటలందు చేష్టల యందు మృదుత్వము యుండవలెను
పాప కార్యములు చేయుట యందు సిగ్గుకలిగి యుండవలెను. "నేను ఇంతవరకు ఆధ్యాత్మిక క్షేత్రమున ఏమి యున్నతిని పొందితిని" అని ప్రశ్నించుకొని సాధు మహాత్ముల భక్తిలను చూసి వారివలె యున్నతిని పొందుటకు పట్టుదలతో ప్రయత్నము చేయవలెను.
చంచలత్వము లేకుండా మనస్సును ఆత్మయందులీనము చేయవలెను
ఓర్పుసహనము కలిగియుండవలెను
నాతిమానిత అనగా తానుపూజ్యుడననీ విర్ర వీగరాదు.
ఆంజనేయుని వలె వినయ విధేయతలను కలిగియుండవలెను.
ఇవి అన్నీ భగవానుడు వివరించిన సద్గుణములు.
ఇంక దుర్గుణములుగురించి. అవి 1 దంబము 2 గర్వము 3 అభిమానము 4 కోపము 5 కాఠిన్యము 6 అవివేకము.
పరమార్ధరంగమున కపటము మోసము పనికిరాదు
పరమాత్మ వారిహృదయ గుహ యందుదాగి వారిసంకల్పములను కనిపెట్టుచునె యున్నాడు. తనకు ఏదైన గొప్పవిద్య అధికారము లభించినచో గర్వ పడక అది అంతయు సర్వేశ్వరునిదయవలననే లభించినదని భావించి వినయముతోనుండవలెను.
దైవీ సంపద మోక్షమును, ఆసురీ సంపద బంధమును కలుగజేయును. ప్రపంచమున రెండేజాతులుకలవు 1 దైవీజాతి 2 ఆసురీజాతి.
ప్రతీవారు తాము ఏజాతికి చేందినవారము అని ప్రశ్నించుకొని తప్పులను సరిదిద్దుకొనవలెను. అసురస్వభావులు ధర్మప్రవృత్తిని గాని పాప నివృత్తినిగాని ఎరుగరు. శుచిత్వముగాని ఆచారముగాని సత్యముగాని వారియందుయుండదు . అసురస్వభావులు జగత్తు వేదాది ప్రమాణములులేనిదనియు, ధర్మాధర్మవ్యవస్థలు లేనిదనీ, ఈశ్వరుడు లేడని అందురు. ప్రపంచము కేవలము స్త్రీపురుషసంబంధమువలననే ఏర్పడినదనీ వారు నాస్తిక స్వభావము కలిగి అవివేకులుగ నుందురు. లోకకంటకులై క్రూర కర్మలు చేయుచుందురు అన్యాయమార్గము మోస పద్ధతులద్వారా అధికధనము వాంచించి సంపాదించుదురు.
ఆసురీసంపదకలవారు "ఈకొరిక ఇపుడుపొందితిని అధికధనము నాకు కలదు ఏంతయోధనము సంపాదించగలను. ఈ శత్రువులను చంపితిని. తక్కిన శత్రువులను కూడ చంపగలను. నేను ప్రభువుని. నేను బలవంతుడను. సుఖవంతుడను. గొప్ప కులమునందు జన్మించినవాడను. నాతో సమానుడు ఎవరు "అని గర్వముతో పలుకుచూ తమకు తామే గొప్ప పండితులుగ తలచు కొనుచు ఇతరులను ద్వేషించు చుందురు.
అట్టివారు తమదేహమందును ఇతరుల దేహమందున్నభగవంతుని తెలిసికొనలేక పరులను దూషించుచుందురు. పరులను దూషించుట అనగా సాక్షాత్తు భగవంతుని దూషించినవాడేయగును.
అసురీ స్వభావులు ఇతరులయందు అసూయకలిగి యుందురు. దుర్గుణములు ఎవరియందున్నవో వారు ఎంత విద్యావంతులైనప్పటికీ ధనికులైనాగాని అధికారవంతులైనా సౌందర్యవంతులైన రాక్షసులుగా జమకట్ట బడుదురు.
"ఆగమనార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసామ్", అనే శ్లోకము లో దేవతలారా రండు రాక్షసులారా పొండు అను వాక్యమును అనుసరించి ప్రతీవారు హృదయమును ఒక దేవతా నిలయముగ పరబ్రహ్మానుభూతిని పొందవలెను.
క్రూరులు అశుభకార్యములు చేయువారు క్రిమి కీటకాది రాక్షసాది అనేక జన్మలు పొందుదురు. కనుక దుర్గుణములు వదలి సద్గుణములను ఆశ్రయించవలెను.
కామము క్రోధము లోభము ఇవి మూడును నరకద్వారములు. కామ క్రోధ లోభములు త్యజించినవారు ఊర్ధగతిని పొందెదరు.
యశ్సాస్త్రవిధిముత్సృజ్యవర్తతేకామకారతః
నససిద్ధిమవాప్నోతినసుఖంనపరాంగతిమ్ || 23 ||
ఎవడు శాస్త్రోక్తవిధిని విడచి పెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్ధసిద్ధిని గాని సుఖమునుగాని ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందలేడు.
శాస్త్రవాక్యములు అనుభవజ్ఞులైన మహర్షుల నిర్ణయములు కనుక దానిని ఎవరు అతిక్రమించరాదు
దీనిని బట్టి సుఖము మోక్షము వాంచించువాడు శాస్త్రోక్త్వ విధి ప్రకారము నడచుకొనవలెను. "నీవు చేయతగినది చేయరానిది నిర్ణయించునపుడు శాస్త్రము ప్రమాణముగ తీసుకొనవలెను. దానిని అనుసరించి కర్మలు చేయవలెను.
ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయామ్ యోగశాస్త్రే
శ్రీ కృష్ణార్జునసంవాదే దైవాసురసంద్విభాగయోగోనామ షోడషోద్యాయః
||ఓం తత్ సత్||
||ఓం తత్ సత్ ||
.