సుబ్బలక్ష్మి గారి కలములో ..
కృష్ణార్జున సంవాదంలో సందేశం !!!
||ఓమ్ తత్ సత్||
కృష్ణార్జున సంవాదంలో సందేశం:
జూమ్ లో ప్రతివారము జరుతున్న మా గీతా పఠనము అధ్యాత్మిక పరంగా చదివినది కాదు. పాండిత్యం సంపాదించడానికి చదివినది కానే కాదు. భక్తి అందరికీ వున్నా, మరీ లోతైన భక్తిభావముతో చేసిన పారాయణ కాదు. ఆ గీతా పఠనము, చిన్నప్పటి జ్ఞాపకాలతో, సంస్కృత శ్లోకాలు చదివే ఉత్సాహముతో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు జరిపించిన కార్యక్రమము. కాని, ఇన్ని రోజులనుంచి చేస్తున్నాము కనుక భగవద్గీత సంబంధమైన ఆలోచనలు భావాలు కొన్ని మనస్సులో చేరుకున్నాయి. ఇప్పుడు రాస్తున్నవి అవే.
మొట్టమొదటి కృష్ణార్జున సంవాదంలో సందేశం.
ఇది భగవద్గీత లో జరిగిన కృష్ణ అర్జునుల సంభాషణ గురించి.
ఇద్దరిలో సంభాషణ మూడు విధములుగా జరుగుతుంది.
ఒకటి మనవాడు అనే ప్రేమ ఆదర భావములతో, రెండవది పెద్దవారు అనే గౌరవ భావముతో మర్యాదతో జరిగేది. మూడవది నిర్లక్ష్య భావముతో జరిగే సంభాషణ. ఆ నిర్లక్ష్య భావములో నే అసూయ, కోపము తదితర రాక్షస భావములు ఇమిడి ఉంటాయి.
మనవాడు అన్నభావనలో ప్రేమ ఆదర భావాలు సంపూర్ణముగా వ్యక్తమౌతాయి.
ఇక్కడ కృష్ణార్జున సంవాదములో కృష్ణుని ద్వారా మనకి కనపడేది వినపడేది. ప్రేమా ఆదర భావాలే. గీతలో కనపడే ముఖ్యాంశము కృష్ణ భగవానునికి అర్జునినిపై వున్నప్రేమసాగరము.
వణుకుతూ గద్గద స్వరముతో యుద్ధము చేయను అంటూ గాండీవము వదిలేసి రథములో చతికిలబడిన అర్జునుని చూచి, వీడు పిరికివాడు, క్షత్రియుడుకాదు వీడికి బుద్ధి చెప్పాలి అని రాజరికముతో గాని, ఇలాంటివాడికి చెప్పేదేమున్నది అనే తామసిక నిర్లక్ష్య భావముతో కాకుండా, అతి దయతో, కరుణా హృదయముతో, తన సఖుడు అనే ప్రేమతో చెప్పవలసినది విపులముగా చెపుతాడు కృష్ణుడు.
కృష్ణుడు సాంఖ్యము నిష్కామ కర్మ స్థిత ప్రజ్ఞుల గురించి విశదముగా చెప్పిన తరువాత, విన్నఅర్జునిడిలో సంశయములు పోవు. మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేస్తాడు. మూడో అధ్యాయములోను, ఐదవ అధ్యాయములో అడిగిన ప్రశ్న దాదాపు ఒకటే. అయినా కృష్ణుడు, "అర్జునా, నేను చెప్పినది వింటున్నావా లేదా?" అని కోపముతో విరుచుకుపడలేదు. ఎంతో ఓర్పుతో శాంత హృదయముతో మళ్ళీ మళ్ళీ కృష్ణుడు తన ఉపదేశము సాగిస్తాడు.
ఏ విషయము గురించి అయినా, ఒకరు ఒకరికి అర్థతాత్పర్యాలు చెపుతూ, విశదీకరిస్తూ వున్నప్పుడు, ఆ విశదీకరణ ఎలా వుండాలి అంటే, ఇది కూడా తెలియదా అనే హేళన భావన లేకుండా, భయము పోయి సంశయములు తీర్చుకొని, ప్రశ్నలు వేయగల ధైర్యము కలిగించేటట్లు చెప్పాలి. అప్పుడే అ సంభాషణలో సత్సంగభావము కలుగుతుంది. భగవద్గీతలో కృష్ణుడి ఆరువందల శ్లోకాల ఉపదేశములో మనకి కనపడేది వినపడేది అదే.
అంతే కాదు ఎక్కడైనా ఇరువురి సంభాషణలో ప్రేమా ఆదర భావలు లేక గౌరవభావములు వ్యక్తము అవనప్పుడు, ఆ సంభాషణలో ప్రతి ఒక్క మాట అసుర భావలకు సంబంధించిన అపార్థములకు గురి అయ్యే అవకాశము వుంటుంది. సంభాషణలో ప్రేమ ఆదరము వ్యక్తము కానప్పుడు వాటిని వ్యక్తము చేస్తే ఆ సంభాషణ లో అపార్థముల సమస్య సమసి పోతుంది. అలా జరగడానికి సంభాషణలో ఒకరు కృష్ణ తత్త్వాన్ని అనుసరిస్తే రెండవవారికి కూడా అదే భావన రావడానికి అవకాశము వుంటుంది. అప్పుడు ఆసంభాషణలో భేదములు వుండవచ్చు. కించ పరిచే మాటలు, అపార్థములు వుండవు.
గీతలో యాజమాన్యపు వర్గాలకి సంబంధించి తెలిసికోతగిన పాఠములు చాలా వున్నాయి.
అయితే కృష్ణుడు ప్రేమభావముతో గీతా సందేశము చెప్పిన విధానములో, చెప్పిన విధానమే ఒక ముఖ్యమైనా పాఠము. యాజమాన్యపు బృందాలలో వున్నవాళ్ళలో అవగాహన శక్తి అందరికి ఒకటిగావుండదు. అందరి అవగాహనాశక్తులలో ఎక్కువ తక్కువలు వుంటాయి. కొందరికి హెచ్చరిస్తూ, కొందరికి సవాలు చేస్తూ, కొందరికి ఆదరిస్తూ చెప్పవలసివుంటుంది. అధికారి తన బృందాన్ని కార్య సఫలతతో ముందుకు తీసుకుపోవడానికి వారి అవగాహనశక్తిని అనుసరించి విశదీకరిస్తూ, చెసినతప్పులు తెలిసికొని, వారి వారి ఆత్మవిశ్వాసము పెంపొందించేలా ముందుకు తీసుకు పోవాలి.
ఈ చెప్పిన విధానములో తల్లి తండ్రులకు కూడా ఒక పాఠము వుంది. మనలో వుండే ప్రేమభావము పూర్తిగా వ్యక్తము అయినప్పుడు, చెప్పిన మాట గాని, చెప్పిన పాఠముగాని, ఇంకో భావన లేకుండా పిల్లలకి కూడా అర్థము అవుతుంది.
కృష్ణుడు అర్జునిడికి చెప్పిన ఆరువందల శ్లోకాలలో ఎక్కడా, కించ పరిచే మాట కనపడదు. అదే ఒక ముఖ్యమైన సందేశము మనకి
కృష్ణుని ఉపదేశములో కనపడేది కృష్ణుని ప్రేమతో కూడిన సహనము.
అందులోనూ ముఖ్యము గా కనపడేది కృష్ణునికి అర్జునుడిపై గల అపార ప్రేమ
అది అధికారము వున్నా అధికారము ఉపయోగించని ప్రేమ.
అది ఆదరభావము వుట్టిపడేటట్లు కనిపించే ప్రేమ.
అది సంపూర్ణ జ్ఞాని, ఒక శిష్యుని స్థాయిలో దిగి చెప్పగలిగిన ప్రేమ.
అది భయము అనే అజ్ఞానమును ప్రేమ అనే ఖడ్గముతో నాశనము చేసిన ప్రేమ.
కృష్ణుని తత్త్వమే ప్రేమ.
ఆ భావన మనలోకి రాగలిగినప్పుడు భగవద్గీతా అంతా మనకి అవగతమైనట్లే.
ఇది కృష్ణార్జున సంవాదము మీద ఒక పాఠము.
ఆ సంవాదములో ఇంకా చాలా వున్నాయి.
అవి వేరే విషయాలు.
||ఓమ్ తత్ సత్||