||సుందరకాండ||

|| అంతరార్థము - తత్త్వగీత ||

||శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపిక అనుసరించి ||

సుందరకాండ
తత్త్వదీపిక

సుందరకాండ తత్త్వగీత మీద చిన్న ఉపోద్ఘాతము:

ఈ కాసరబాద సంచికలలో ముందు సంక్షిప్త సుందరకాండ రాశాము.

తరువాత సుందరకాండ పారాయణ కోసము అన్ని శ్లోకాలు రాశాము.

అంతటితో ఆగక సుందరకాండలో శ్లోకాలకి తాత్పర్యాలు, ఆ తాత్పర్యాల ద్వారా సుందరకాండ వచనరూపములో కూడా తీసుకు వచ్చాము.

అయినా గాని ఇంకా ఏదో మిగిలి పోయినట్లనిపించింది.

దానికి కారణము ఇంకేదో కాదు మా గురువుగారి మాటలే.

మేము సంక్షిప్త సుందరకాండ పుస్తకరూపములో ముద్రించుచున్నపుడు, మాకు కాలేజిలో సంస్కృతము చెప్పిన గురువుగారు దగ్గరకు వారి ఆశీర్వాదముల కోసము వెళ్ళి , వున్న చనువుతో వారిని ఒక చిన్న ముక్క చెప్పమని, వీలైతే ఒక ముక్క రాయమని అడిగడము అయినది. ముప్పై ఏళ్ళక్రితము మాకు కాలేజిలో అభిజ్ఞాన శాకుంతలములో దుష్యంతుడు వేటాడుతుంటే, దుష్యంతుడి రథము పరిగెడుతూ వుంటే లేచిన రజోధూళికి ఆయన చెప్పిన అంతరార్థము ఎప్పుడూ మరచిపోలేదు. ఆ అంతరార్థము వలననే పరిక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన మాట నిజము. కాలేజిలో అందరి కన్నా అంటే తెలుగు అంగ్లభాషలు చదివిన విద్యార్థులకన్న మాకు (సంస్కృత విద్యార్థులకు) మంచి మార్కులు వచ్చాయి అని ఆయన గర్వపడిన కాలము అది. అప్పటినుంచీ గురుశిష్య బంధుత్వము ఉంచుకో గలిగాము.

మేము అలా అశీర్వాదములు అడగడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆయన ఉదయపు పూజముగించుకొని ముందుగదిలో మంచములాంటి దివాను మీద కూర్చుని ఉన్నారు. నేను దాని పక్కనే చిన్నకుర్చీమీద కూర్చుని ఉన్నాను. అలా అడిగితే ఆయన నేను అంతరార్థము చెపుతాను నువ్వు రాసుకోవయ్యా అని వారు స్వయముగా ఒక గంట సేపు నాకు ధారాళముగా అంతరార్థము చెప్పారు. అది అంతా చేతి రాతతో ఒక నోటు బుక్కులో ఇరికించాను. అది ఇప్పటికీ పదిలముగా నా దగ్గరే ఉంది. వారు చెప్పిన మాటలే , మా కాలేజిలో సంస్కృతము గురువుగారు శ్రీభాష్యము అప్పలాచార్యులుగారు చెప్పిన "అంతరార్థము" అని మా సంక్షిప్త సుందరకాండ ( ఆంగ్లభాషా) పుస్తకములో ప్రచురించుకున్నాము. వారు తెలుగులో చెప్పిన అంతరార్థము ఆంగ్లభాషలోకి పద్మశ్రీ పండిట్ విజయరాఘవరావు గారిచేత అనువదింపబడినది.

ఇప్పుడు సుందరకాండలో ప్రతిపదార్థము, తాత్పర్యము, వచనము రాయడములో మునిగి ఆయన చెప్పిన అంతారార్థము అర్థవంతముగా తీసుకురావడానికి వీలు పడలేదు. అది కూడా తీసుకురావాలి అని, భాష్యము అప్పలాచార్యులవారి తత్త్వదీపికని అనుసరిస్తూ ఇప్పుడు తత్త్వదీపిక పేరుతోనే ఇది తీసుకు రావడమైనది. నాలుగైదు సంవత్సరాలక్రితము తత్త్వదీపికలోని అంతరార్థము కాసరబాద సంచికలలో తీసుకురావాలి అని అలోచనవచ్చినప్పుడు శ్రీభాష్యంఅప్పలాచార్యులవారి కుమారునితో కలిసి వారి అంగీకారము కూడా తీసుకొనబడడమైనది.

ఇంకోమాట.

దీంట్లో సుందరకాండలో ప్రతిశ్లోకముయొక్క అర్థము తాత్పర్యము లేదు. అంతరార్థముకు తగిన మాటలనే తీసుకురావడమైనది. ఇది అప్పలాచార్యులవారి తత్త్వగీత అధారముగా రాయబడినా, ఇక్కడ రాయబడినది ఆ తత్త్వగీతలో మాకు అర్థమైనంతవరకూ మాత్రమే. దీనికి తత్త్వగీతలో చెప్పినదానికి అర్థములో మార్పులు కనపడితే అది మాకు అర్థమైనట్లు అర్థమైనంతవరకు రాశాము అనుకోవచ్చు.

ఇలా మొదలు పెట్టినప్పుడే ఇంకో పుస్తకము కూడా దొరికింది. అది గోవిందరాజులవారిచే రచింపబడిన "రామాయణ తిలక". అది సంస్కృతములో రాయబడిన గ్రంథము. దాని ప్రాధాన్యత ఏమిటి అంటే ప్రతిశ్లోకములో ముఖ్యమైన పదాలకి ఉత్పత్తి రాసి ఆ శ్లోకము మీద విశ్లేషణ చేయబడినది. దానిలో అప్పలాచార్యులవారి అంతరార్థము కు అనుగుణముగా వున్న మాటలను ఈ తత్వార్థములో కొంచెము ఇమిడ్చాము. ఈ పుస్తకము మాకు ఇంటర్నెట్ లో పుసకాన్వేషణలో దొరికిన పుస్తకము.

ఇక ఆ సుందరకాండ అంతరార్థము

ఈ తత్త్వదీపిక కూడా ప్రతివారము ఒక సర్గ చొప్పున కాసరబాద సంచికలలో ప్రచురించబడడము అయింది. అంటే ఇది అరవై ఎనిమిది వారాల యజ్ఞము అన్నమాట. ఈ యజ్ఞము పట్టాభిషేక సర్గతో విజయదశమినాడు తో సంపూర్తి అవడము మా అదృష్టము.

ఈ శీర్షిక లో పక్కన అరవైఎనిమిది సర్గలకు లింకు ఉంది. అంటే ఏ సర్గ చదవవలెనంటే తిన్నగా అదే సర్గకి వెళ్ళవచ్చు అన్నమాట

ఇది మా ఆనందముకోసము రాయబడిన కథనము.
ఇది చదివేవారికి ఆనందము కలిగిస్తే అది ఆశించని మా అదృష్టము.
వారందరినీ అప్పలాచార్యులవారి సంపూర్ణ తత్త్వదీపిక చదవమని మాకోరిక.

అన్నీ పరమేశ్వరార్పణమస్తు అనడం ఒక ఆనవాయితీ.

అలాగే ఇది కూడా పరమేశ్వరార్పణమస్తు

||ఓమ్ తత్ సత్||