శ్రీమద్భగవద్గీత !

శ్రీమద్భగవద్గీత విశిష్ఠత !

 

 

భగవద్గీత విశిష్ఠత !

శంకరాచార్యులవారు భగవద్గీత మీద వ్యాఖ్యానము రాస్తూ ముందరే ఇలా చెపుతారు.

"తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహమ్"

అంటే "ఈ గీతాశాస్త్రము వేదాంతసారములన్నిటికీ సంగ్రహము" అని. అంటే అన్ని వేదాల సారము ఇందులో వున్నదన్నమాట.

వేదాల సారము ఉపనిషత్తులు.అంటే ఆ ఉపనిషత్తుల సారము శంకారాచర్యులవారు చెప్పినట్లు భగవద్గీతలో వున్నదన్న మాట

అదే ధోరణిలో ఒక శ్లోకము కూడా వుంది.

సర్వోపనిషదో గావో
దోగ్ధా గోపాలనన్దనః|
పార్థో వత్సః సుధీర్భోక్తా
దుగ్ధమ్ గీతామృతం మహత్ ||

ఉపనిషదులనే గోవులను గోపాలనందనుడు అర్జునుడను దూడను నిమిత్తముగా చేసికొని గీతామృతమను పాలని పితికెను అని. ఆ గీతామృతమే అందరికీ ఉచితముగా లభిస్తోంది.

ఇవన్నీ మనకు చెప్పేది గీతా ప్రాధాన్యము గురించి.

వేదాలసారము ఉపనిషత్తులని విన్నదే. ఆ ఉపనిషత్తులు తెలిసికొని జీవితము సార్థక్యము చేసికోవాలని అందరికీ వుంటుంది. ఉపనిషత్తులు గురు శిష్య సంభాషణలు. గురువులు ముందుగా శిష్యుడు తగునా అని పరిశీలించి అప్పుడే జ్ఞానోపదేశము మొదలెడతారు. అందుకని ఉపనిషత్తులు నేర్చుకోవడము అన్నది అందరికి అందుబాటలో ఉన్న విషయము కాదు. ఉపనిషత్తుల భాషా భావము సామాన్యులకు సులభముగా అవగాహనలో ఉండదు. ఈ విధముగా కష్ఠతరమైన ఉపనిషత్తుల సారము భగవద్గీత రూపములో సామాన్యులకి అందుబాటలో ఉండేటట్లు వ్యాసమహర్షి కృష్ణుని ద్వారా మనకి ప్రసాదించాడు.

భగవద్గీతలో యజ్ఞము తపస్సు అన్నటువంటి క్లిష్టమైన కష్టమైన కర్మలను భగవంతుడు సామాన్యుల సాధనకు అనువు గా నిష్కామ కర్మని , నిష్కామకర్మ ద్వారా మోక్షమును ప్రతిపాదించాడు. నిష్కామకర్మ చేయడానికి ఆడ మొగ తేడా లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర భేదము లేదు. రాజాధి రాజులకు రాజ భటులకు తేడా లేదు. మన వైదీక కర్మలో వున్న "విథి" లు అన్నీ తొలగించి ఆధ్యాత్మ చింతన , మోక్షము అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా భగవద్గీత మనకు చెపుతుంది.

భగవద్గీతలో ఒక చోట - వేద వాదరతాః - అన్నపదము వాడి , కృష్ణుడు అటువంటి వాళ్ళకి దైవ చింతనలో ఏకాగ్రతరాదు అని కుండ బద్దలుకొట్టినట్లు చెపుతాడు. ఏందుకు అంటే వాళ్ళు వేదము అంటే కర్మకాండే అను భావములో ఉండుట వలన, ఇంకా వైదీక కర్మకాండలో ఫలస్వరూప కర్మలతో కట్టబడి యుండుటవలన.

ఏమతమైనా తత్వచింతనలో శిథిలమగుతున్న ఆలోచనలను ప్రక్కన పెట్టి కొత్త ఆలోచనలను భగవంతుని ద్వారా ప్రతిపాదించి అ తత్వ చింతనకి నూతన శక్తి కలిగించగలగి నప్పుడు అ మతము అద్వితీయము.

భవద్గీత శిథిలమగు కర్మకాండలను ప్రక్కనబెట్టి నూతన శక్తి కలిగించు నిష్కామకర్మతో కూడిన ఆధ్యాత్మిక చింతనలను ప్రతిపాదించి అది అందరికీ అందించినది.

కృష్ణుడు ఒకచోట నిష్కామ కర్మగురించి " యే మే ఇదం మతం" ఇది నా మతము" అంటాడు.

భగవద్గీత కూడా - ఇదం మే మతమ్ - అని మనము అనుకోవచ్చు.

ఈ భగవద్గీత మీద వ్యాఖ్యలు చాలావున్నాయి. కాని భగవద్గీత చదివినప్పుడు మనకి మన ఆలోచనలకు తగునట్టి అర్థాలు వస్తాయి. అవి ఈ రూపముగా చిత్రీకరిస్తున్నాము

మాకు భగవద్గీతకు సంబంధము గీతారహస్యము లో రాశాము

ఇది సామాన్యుల కథనం.
ప్రతి నెల ఒక అధ్యాయము తీసుకురావాలని మా కోరిక.
అదే మాయజ్ఞము !

||ఓమ్ తత్ సత్|