!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 194-195

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి  శ్లోకములు 194-195


’అనాదికాలోఽయం అహం స్వభావో’ అంటూ , ఈ జీవుడికి మొదలు లేదు, ప్రపంచవ్యవహారాలలో వుంటాడు , ఎన్నో జన్మలు ఎత్తుతాడు , జాగ్రత్ స్వప్న షుషుప్తి అవస్థలలో వుండేవాడు, విజ్ఞానకోశములో దేహానికి సంబంధించిన అశ్రమాలు , ధర్మాలు , కర్మలు అన్నీ తనవే అని అభిమానముతో ప్రవర్తిస్తాడు. ఆత్మకి దగ్గరగా ఉండడము వలన  ప్రకాశం  కలవాడులావుంటాడు అని విన్నాము. అదే శిష్యుడు కూడా విన్నాడు. అంతా వింటూ అనాది లేనిదానికి అంతము కూడా వుండకపోవచ్చు కదా , మరి దేహాభిమానము కల ఆత్మకి అంతము లేకపోతే మోక్షము ఎలా ? అని శిష్యుడికి అనుమానం వచ్చి , శిష్యుడు గురువుని ఇక్కడ ఆపి, తన ప్రశ్న వేస్తాడు. 


శిష్య ఉవాచ:


భ్రమేణాప్యన్యథా వాస్తు జీవభావః పరాత్మనః|

తదుపాధేః అనాదిత్వాత్ అనాదేర్నాశయిష్యతే||194||


అతోఽస్యజీవభావోఽపి నిత్యోభవతి సంస్మృతిః|

ననివర్తేత  తన్మోక్షః కథం మే శ్రీగురో వద||195||


ఈరెండు శ్లోకాలలో , మొదటి శ్లోకములో తన సందేహము చెపుతాడు . రెండవ శ్లోకములో తన ప్రశ్న అడుగుతాడు.


ఇక  మొదటి శ్లోకము :


భ్రమేణాప్యన్యథా వాస్తు జీవభావః పరాత్మనః|

తదుపాధేః అనాదిత్వాత్ అనాదేర్నాశయిష్యతే||194||



భ్రమేణాప్యన్యథా వా - 

భ్రమవలనకాని లేక ఇంకో కారణమేదైనా గాని 


అస్తు జీవభావః పరాత్మనః - ఆత్మ జీవభావము కలిగియుండును ( తను జీవుడే అనుకొనును అన్నమాట)


ఎందుకు అలా అనుకుంటుంది?


తత్ ఉపాధేః అనాదిత్వాత్ - 

అది మొదలు అంటూ లేని జీవ భావము వలన


జీవుడు కూడా ఆది లేనివాడు అని ముందు విన్నాము కూడా ( 188 శ్లోకము  అనాది కాలోయం అహం స్వభావో అంటూ..)


 అనాదేః నాశః న ఇష్యతే - అనాదేః అంటే అది లేనిదానికి, అంతము కూడా వుండదు.


శిష్యుడు ఇక్కడ ప్రకటిస్తున్న అనుమానము -  "ఆత్మ, ఆది లేని జీవ భావముతో , భ్రమతో గాని ఇంకేమో కారణాలవల్లకాని,  తను జీవుడే అనుకోవచ్చు. అలా ఆదిలేనిదానికి అంతముకూడా ఉండదు కదా."


ఈ ప్రశ్న ఉదయించడానికి కారణము, జీవుడు కూడా పూర్వజన్మ వాసనలు కలిగినవాడు అని విన్నాము కనక . పూర్వజన్మలవాసనలతో అది లేనివాడు అని జీవుడు కూడా నిత్యము అనే భ్రమ కలుగుతుంది. అందుకనే ఈ ప్రశ్న.


ఇక రెండవ శ్లోకము( 195).


ఈ శ్లోకములో  ’మే శ్రీగురో వద’. అంటే  ’గురువర్యా నాకు చెప్పు ( వద) ’, అంటూ అడుగుతాడు.  


అతోఽస్యజీవభావోఽపి నిత్యోభవతి సంస్మృతిః|

ననివర్తేత  తన్మోక్షః కథం మే శ్రీగురో వద||195||


అతోఽస్యజీవభావోఽపి - అతః అస్య జీవభావః అపి

అందువలన ఈ జీవభావము కూడా


నిత్యోభవతి - నిత్యము అగుచున్నది ( నాశనము లేనిది అగుచున్నది


సంస్మృతిః న నివర్తేత  - సంసారము నివర్తింపదు( సంసారమును వదలలేము)


తన్మోక్షః  కథం  - అప్పుడు మోక్షము ఎట్లు వచ్చును?


మే శ్రీగురో వద - నాకు ఓ గురువర్యా చెప్పుము.


తాత్పర్యము. - జీవ భావము ఆదిలేనిది అగుట వలన , అంతముకూడా లేదు అనే భ్రమతో ఆత్మ తను జీవుడే అని అనుకోవచ్చు. విజ్ఞానకోశములో వున్న జీవుడు శాస్త్రములో చెప్పబడిన నిత్య కర్మలు చేస్తూ , అధ్యాత్మిక చింతనలో వుండి, భ్రమలో  తనే ఆత్మ అనుకోవచ్చు. 


విజ్ఞానకోశములో భ్రమలో వున్న జీవుడు , తనే ఆత్మ అనుకొని సంసారమును కూడా వదలడు కదా. అప్పుడు మరి జీవుడికి మోక్షము ఎలావస్తుంది అని శిష్యుని ప్రశ్న.


ఈ ప్రశ్నకి సమాధానము గురువు గారి ద్వారా వింటాము.


||ఓమ్ తత్ సత్||









 



om tat sat


 






వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

 

Om tat sat !

 

 

 

    •