!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 196-197
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 196-197
ముందు విన్న శ్లోకములో( 194-195), శిష్యుడు :
"భ్రమేణాప్యన్యథా వాస్తు జీవభావః పరాత్మనః"
భ్రమ వలనకాని , ఇంకా ఏమైనా గాని జీవుడికి ఆదిలేకపోవడము వలనగాని ., ఆత్మకి జీవభావము వుంది అనే మాటతో ముక్తి ఏలావస్తుంది అని ప్రశ్న.
ప్రశ్నలో నే వున్న "భ్రాన్తి వలన" అన్నమాటలో నే వుంది శిష్యుడి ప్రశ్నకి సమాధానము.
అదే గురువు శిష్యుడికి చూపిస్తాడు.
శ్రీగురు ఉవాచ:
సమ్యక్ పృష్ఠం త్వయా విద్వన్
సావధానేన తత్ శృణు|
ప్రామాణికీ న భవతి
భ్రాన్త్యా మోహిత కల్పితా||196||
భ్రాన్తిం వినా త్వసంగస్య
నిష్క్రియస్య నిరాకృతేః|
న ఘటేతార్థసంబన్ధో
నభసో నిలితాదివత్ ||197||
మొదటి శ్లోకములో గురువు శిష్యుడిని ప్రశ్న వేసినందుకు ప్రశంసిస్తాడు.
సమ్యక్ పృష్ఠం త్వయా విద్వన్
సావధానేన తత్ శృణు||
సమ్యక్ పృష్ఠం త్వయా విద్వన్
ఓ విద్వాంశుడా , నీ చేత బాగుగా ప్రశ్న వేయబడినది
సావధానేన తత్ శృణు|
సావధానముగా అది ( సమాధానము ) వినుము
భ్రాన్త్యా మోహిత కల్పితా
భ్రాన్తిలో మోహముతో కల్పింపబడిన విషయము
ప్రామాణికీ న భవతి
యదార్థము ( ప్రామాణికము) కాజాలదు
గురువు చెప్పిన మాట అంటే స్వప్నావస్థలో చూసిన విషయము నిజము కాజాలదు. భ్రాన్తిలో అంటే మత్తులో చూచిన విషయము నిజము కాజాలదు అని.
జీవభావము ఆదిలేనిది కనక అంతము వుండదు అన్నది భ్రాన్తి మాత్రమే. జీవభావము నిత్యము అన్నది యదార్థము కాదు.
Sloka 2
భ్రాన్తిం వినా త్వసంగస్య
నిష్క్రియస్య నిరాకృతేః|
న ఘటేతార్థసంబన్ధో
నభసో నిలితాదివత్ ||197||
భ్రాన్తిం వినా
భ్రాన్తి లేకుండా
అసంగస్య -
సంగరహితుడైన
నిష్క్రియస్య నిరాకృతేః త్వత్|
క్రియాశూన్యమైన నిరాకారమైన ఆ ఆత్మకి
న ఘటేతార్థసంబన్ధో
వస్తుప్రపంచముతో సంబంధము లేదు
అలాగ ఏమైన ఉదాహరణ వుందా అంటే ..
నభసో నిలితాదివత్ ||
(భ్రాంతిలేకుండా) ఆకాశమునకు నీలిరంగుతో ఎలాగ సంబంధము లేదో ..
అలాగ ఆత్మకు వస్తు ప్రపంచముతో సంబంధము లేదు
ఏ విధముగా ఆకాశానికి భ్రాన్తివలన కనిపించే నీలిరంగుకి సంబంధములేదో ..
అలాగే భ్రాన్తి లేకుండా
సంగరహితమైన, క్రియాశూన్యమైన, నిరాకారమైన ఆత్మకి వస్తుప్రపంచముతో భ్రాన్తి వలన మాత్రమే సంబంధము. భ్రాన్తిలేకపోతే ఆ సంబంధము వుండదు.
ఇదే మాట ముందు శ్లోకాలలో గురువు విశ్లేషిస్తాడు.
||ఓమ్ తత్ సత్||