!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 208-209

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి  శ్లోకములు 208- 209


శ్లోకము 208


అతో నాయం పరాత్మ స్యాత్ విజ్ఞానమయ శబ్ధభాక్ |

వికారిత్వాత్ జడత్వాచ్చ  పరిచిన్నత్వహేతుతః|

దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్ అనిత్యో నిత్య ఇష్యతే || 208||


శ్లోకము 208-


అతో నాయం పరాత్మ స్యాత్

 విజ్ఞానమయ శబ్ధభాక్ |


అతః విజ్ఞానమయ శబ్ధభాక్  - 

అందువలన విజ్ఞానమయ కోశము అనబడు ( కోశము) 


న అయం పరాత్మ స్యాత్ -

ఇది పరమాత్మ కాజాలదు>


ఎందువలన?

వికారిత్వాత్  - వికారము పొందుటవలన 

జడత్వాచ్చ - జడత్వము చేత  

పరిచిన్నత్వహేతుతః - పరిచ్ఛిన్నమనెడి కారణము వలన


188 శ్లోకములో - దేహాది నిష్టాశ్రమ ధర్మ కర్మ అంటూ - దేహానికి సంబంధించిన అశ్రమములు , ధర్మములు, కర్మలు, తనవే అని ప్రవర్తిస్తాడు విజ్ఞానమయమైన జీవుడు అని విన్నాము. ఆత్మకి దగ్గరలో వుండడము వలన అతి ప్రకాశము కలది అని విన్నాము. అన్నిటితో సంబంధము కల జీవుడు తనే ఆత్మ ననే  అహంకారముతో  సంసారములో కర్తగా భోక్త గా మునిగి పొతాడు అని కూడా విన్నాము.


- అంటే ఇక్కడ ( విజ్ఞానమయ కోశములో) కూడా జనన మరణాలు సుఖదుఃఖాలు ఉంటాయి . అదే వికారము పొందుట అని . అలా జనన మరణములు కల విజ్ఞాన మయ కోశము ఆత్మ కాజాలదు.  


 - ఇంకా జ్ఞానమయకోశము, ఆత్మకి సమీపములో వుండుటవలన ప్రకాశించును అని విన్నాము. అంటే అది స్వయముగా ప్రకాశము కాదు. అదే జడత్వము. స్వయప్రకాశము కాదు కనక  అది ఆత్మ స్థానము కాజాలదు.


పరిచ్ఛిన్నమనెడి కారణము వలన - 

అంటే విజ్ఞానకోశములోని ఆత్మ సర్వ వ్యాప్తము కాక పోవడము వలన . ఇది ఆత్మస్థానము కాదు.


ఇంకా కారణాలు వున్నాయి:


దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్

అనిత్యో నిత్య ఇష్యతే ||


దృశ్యత్వాత్ - 

దృశ్య ప్రపంచములో మునిగి పోయి తనే కర్త భోక్త అనుకోవడము వలన అది ఆత్మ కాజాలదు


వ్యభిచారిత్వాత్  - 

నిలకడ లేకపోవడము వలన , తనే కర్త భోక్త అనుకోవడము వలన, ఇది ఆత్మ కాజాలదు.


అనిత్యో నిత్య న ఇష్యతే - 

అనిత్యము నిత్యముగా అంగీకరింపబడదు.


అంటే అనిత్యమైన విజ్ఞానమయ కోశము , నిత్య స్వరూపమైన ఆత్మ గా - అంగీకరింప బడదు . దాని తాత్పర్యము ఈ విజ్ఞానకోశము ఆత్మ స్థానము కాదు.


ఈ శ్లోక తాత్పర్యము - 


 విజ్ఞానమయ కోశము అనబడు ఈ  కోశము లో, జీవుడు కర్తగా భోక్తగా సంసారములో మునిగి వికారము పొందుటవలన, జడత్వము చేత, సర్వ వ్యాప్తము కాకపోవడము వలన , ఇది అత్మ స్థానము కాదు అని గురువు చెప్పుచున్నాడు.


విజ్ఞానమయ కోశము గురించి 189 వ శ్లోకములో గురువు విచారణ మొదలెట్టాడు. విజ్ఞానమయకోశములో జీవుడు , హృదయాంతరాళములలో వుండే ఆత్మకి అతి సమీపముగా వుండి , ప్రకాశిస్తూ, దేహమునకు సంబంధించిన ధర్మములు తనవే అని భ్రమలో తనే ఆత్మ అనుకుంటుంది అని విన్నాము. నిరాకార, నిశ్చలతత్వము గల, సచ్చిదానంద స్వరూపము గల ఆత్మ స్థానము విజ్ఞానకోశము కాదు.


ఈ ఆత్మ నాత్మల, పంచకోశముల విచారణ, అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనో మయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశముల  విచారణ, అరవై శ్లోకాలముందర,   155 వ శ్లోకములో మొదలు పెట్టడమైనది. అది ఒక్కమారు మననము చేద్దాము.


(1) ముందు అన్నమయకోశము :   స్థూలశరీర స్వరూపమైన అన్నమయకోశము ఆత్మకాదు అని 156  -166 శ్లోకములలో విన్నాము. అన్నమయ కోశము మాంసము ఎముకల గూడు. ఈ ఎముకల గూడుకి ఆది ( మొదలు) వుంది, అంతము వుంది. ఆత్మకి ఆది అంతములు లేవు. అందువలన అన్నమయ కోశము ఆత్మ స్థానము కాదు . అది తెలిసినదే.


(2) కర్మేన్ద్రియములతో కూడిన ప్రాణమయ కోశము ఆత్మకాదు అని  167-168 శ్లోకములలో విన్నాము. ప్రాణము వాయువుతో కూడినది. వాయువు బయట వుంటే గాలి. లోపల వుంటే ప్రాణము. అది జీవశక్తి. అది లేకపోతే శరీరము పనిచేయదు. అంటే దీనికి కూడా అంతము వున్నది. ఆది వున్నది కనుక ఇది ఆత్మస్థానము కాదు. ఇది ఆత్మకాదు.


(3) జ్ఞానేన్ద్రియములతో, మనస్సుతో కూడిన మనోమయ కోశము ఆత్మ కాదు అని 169-85 వ శ్లోకములలో విన్నాము. త్వక్ చక్షు,శ్రోత్ర  జిహ్వ, ఘ్రాణములు, మనస్సుతో కలిసి మనోమయ కోశము అంటారు. మనస్సే మన సుఖదుఃఖాలకి కారణము. సుఖదుఃఖాలతో బంధము కలిగిస్తుంది. సుఖదుఃఖాలకి అతీతమైన ఆత్మ, మనోమయకోశము కాదు.


(4) బుద్ధితో కూడిన సూక్ష్మ శరీరము కూడా ఆత్మకాదు అని186 - 208 శ్లోకములలో విన్నాము . అంతః కరణలోని నిశ్చయాత్మకమైన బుద్ది, జ్ఞానేంద్రియాలు కలిసి విజ్ఞానమయ కోశము ఏర్పడుతుంది. 208 వ శ్లోకములో ఇది కూడా ఆత్మ స్థానము కాదు అని విన్నాము.


ఇక పంచకోశాలలో మిగిలినది ఆనందమయ కోశము 


గురువు పంచకోశాలలో ఐదవ కోశము , ఆనందమయ కోశము, గురించి 209 వ శ్లోకములో మొదలు పెడతాడు. 209-212 శ్లోకాలలో ఆనందమయకోశము కూడా ఆత్మకాదు అని గురువు నిరూపిస్తాడు. 


ఆ తరువాత ఆత్మగురించి విశదీకరిస్తాడు గురువు.


శ్లోకము 209:


ఆనన్దప్రతిబిమ్బచుమ్బితతనుః వృత్తిః తమోజృమ్భితా

స్యాత్ ఆనన్దమయః ప్రియాది గుణకః స్వేష్టార్థలాభోదయః|

పుణ్యస్యానుభవే విభాతి మానన్దరూపః స్వయం

భూత్వా నన్దతి యత్ర సాధుతనుభృన్మాత్రః ప్రయత్నం వినా|| 


ఈ నాలుగు పాదాల శ్లోకము ఒకొక్కపాదము అర్థము చేసుకుందాము


1 ఆనన్దప్రతిబిమ్బచుమ్బిత

తనుః వృత్తిః తమోజృమ్భితా


ఆనన్దప్రతిబిమ్బ - 

ఆనందముయొక్క ప్రతిబింబము చే

అంటే పరమాత్మస్వరూపమైన ఆనందముయొక్క ప్రతిబింబము చే


చుమ్బితతనుః  - 

స్పృశించబడిన శరీరము కల; 


తమోజృమ్భితా వృత్తిః -

 అవిద్యాపరిణామ రూపము గలది



 2 స్యాత్ ఆనన్దమయః   - 

ఆనందమయకోశము అనబడును


అంటే పరమాత్మస్వరూపమైన ఆనందముయొక్క ప్రతిబింబము చే స్పృశించబడిన శరీరము కలది,  అవిద్యాపరిణామ రూపము గలది, ఆనందమయకోశము అనబడును


ప్రియాది గుణకః - 

ప్రియము మొదలగు గుణములు కలది

ప్రియము మోదము ప్రమోదము అను గుణములు కలది;

ప్రియము - ఇష్ట వస్తు సందర్శనముతో కలిగే ఆనందము; మోదము -  అతి ప్రియము - ఇష్ట వస్తు ప్రాప్తిచే కలిగే ఆనందము;

 ప్రమోదము  -  అత్యంత ప్రియము - ఇష్టవస్తుప్రాప్యానంతరము అనుభవించుటచే కలిగే ఆనందము ;

 ఈ గుణాలు ఎప్పుడు కనిపిస్తాయి? 



స్వ ఇష్టార్థలాభోదయః - 

తనకు ఇష్టమైన లాభము ఉదయించినప్పుడు  లభించునది.


అంటే ఈ ఆనందమయ కోశము , ప్రియము మోదము ప్రమోదము అను గుణములు కలది. తనకు ఇష్టమైన లాభము ఉదయించినప్పుడు  లభించునది; ( ఆ లాభము ఎవరికి ఎందుకు లభిస్తుంది అన్నమాటకి, అది పూర్వజన్మ కృత పుణ్యము వలన అని ముందు పాదములో వస్తుంది) 


3 పుణ్యస్యానుభవే  కృతీనాం

మానన్దరూపః స్వయం విభాతి


పుణ్యస్యానుభవే  కృతీనాం-  

ధీమంతులయొక్క  పూర్వజన్మ కృత పుణ్యము అనుభవించునపుడు (ప్రకాశించును) 


మానన్దరూపః స్వయం విభాతి

స్వయముగా ఆనంద రూపముతో ప్రకాశించును


ధీమంతులయొక్క  పూర్వజన్మ కృత పుణ్యము అనుభవించునపుడు (ప్రకాశించును) స్వయముగా ఆనంద రూపముతో ప్రకాశించును ( అది యే ఆనంద కోశము)


4 యత్ర తనుభృన్మాత్రః ప్రయత్నం వినా 

సర్వో నన్దతి  సాధు  


యత్ర తనుభృన్మాత్రః ప్రయత్నం వినా -

ఎక్కడ ప్రాణులు ప్రయత్నము లేకుండా 


సర్వో నన్దతి  సాధు  -  

అందరూ బాగుగా ఆనందించెదరో 

( అదియే  ఆనందకోశము)


అంటే ఎక్కడ ప్రాణులు ప్రయత్నము లేకుండా  అందరూ బాగుగా ఆనందించెదరో ( అదియే  ఆనందకోశము)


ఈ శ్లోకములో  ఆనందమయకోశము అంటే ఏమిటి అని, అది ఎలాగ అనుభవము అవుతుంది అని , ఎవరికి ఆ అనుభవము అవుతుంది అని,  అన్న మూడు ప్రశ్నలకి సమాధానము వివరింపబడింది.


శ్లోకతాత్పర్యము (209):

 

 పరమాత్మస్వరూపమైన ఆనందముయొక్క ప్రతిబింబము చే

పులకరింపబడిన శరీరము కలది, అవిద్యాపరిణామ ( తమోగుణ) రూపము గలది, ఆనందమయకోశము అనబడును.


సుషుప్తిలో ( గాఢ నిద్రలో ) ఆనందముయొక్క ప్రతిబింబము చే పులకరింపబడిన శరీరము కలదియే ఆనందమయకోశము. అది మొదటి ప్రశ్న(అయితే గాఢనిద్రలో పూర్తిగా ఆవరించినా మనకి తెలియదు. అదే ఆనందము జాగ్రదావస్థలో కూడా స్వల్పముగా రావచ్చు)


ఆ ఆనందమయ కోశము ప్రియము మోదము ప్రమోదము అను గుణములు కలది; ఆ ఆనందము, అప్పుడప్పుడు, ’స్వేష్టార్థ లాభోదయః అంటే  తనకు ఇష్టమైన లాభము ఉదయించినప్పుడు  లభించునది.


ధీమంతులయొక్క  పూర్వజన్మ కృత పుణ్యము అనుభవించునపుడు (ప్రకాశించును) స్వయముగా ఆనంద రూపముతో ప్రకాశించును ( అది యే ఆనంద కోశము). జాగ్రత్ స్వప్నావస్థలో , పూర్వ పుణ్యము వలన కలుగు సుఖాకారమైన ఆనందము ( తామస వృత్తి) ఆనందమయ కోశము అని చెప్పబడెను.


ఆత్మ సచ్చిదానంద స్వరూపము అంటాము గదా, మరి ఇక్కడ చెప్పబడిన ఆనందము , సచ్చిదానంద స్వరూపములో కలిగే ఆనందము లలో భేదము ఏమన్న వుందా అని అనుమానమూ రావచ్చు.


ఇక్కడ చెప్పబడిన పూర్వ జన్మపుణ్యము అన్న మాట, పూర్వజన్మలో కామ్య కర్మలవలన కలిగిన పుణ్యము. ( యజ్ఞము దానము నిష్కామ కర్మ ఇత్యాదులవలన కలిగిన పుణ్యము).  ఆ పుణ్యము వలన కలిగిన ఫలము తో వచ్చిన ఆనందము  ఆనందమయ కోశము తో సంబంధించిన ఆనందము.  


అయితే సచ్చిదానందస్వరూపమనబడే స్వరూపము ద్వారా వచ్చే ఆనందము ఏమిటి? 


యోగులు జ్ఞానమార్గము ద్వారా , ఆత్మానుభవమును సాధించి, ఆ ఆత్మానుభవముతో  పొందే ఆనందము, సచ్చిదానంద స్వరూపమును దర్శించిన కారణముగా వచ్చిన ఆనందము - అది ఎదో తనకిష్టమైన వస్తువు చూచినప్పుడు కలిగే ఆనందము ( ఆనందకోశములో పొందే ఆనందము) కన్న చాలా  భిన్నమైన ఆనందము.  


ఈ భేదము మనకు తెలియాలి.



||ఓమ్ తత్ సత్||






















 






 







వివేక చూడామణి

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209

Om tat sat !

 

 

 

    •