!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 210-211
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 210- 211
ఈ రెండు శ్లోకాలలో గురువు ఆనందకోశము కూడా ఆత్మ స్థానము కాదు అని విశదీకరిస్తాడు. ఇక్కడ సులభముగా మనకు అర్థమయ్యే మాట . ఇక్కడ వచ్చే ఆనందము పూర్వజన్మ కర్మ ఫలితము , అది బాహ్య ఇష్టవస్తు సందర్శనము వలన అని. అత్మానుభవములో వచ్చే ఆనందము బాహ్యప్రపంచముతో సంబంధము లేనిది. అందుకని ఆనందమయ కోశము ఆత్మ స్థానము కాదు.
శ్లోకము 210
ఆనందమయ కోశస్య
సుషుప్తౌ స్ఫూర్తిరుత్కటా|
స్వప్నజాగరయోరీషద్
ఇష్టసందర్శనాదినా||210||
ఆనందమయ కోశస్య -
ఆనందమ య కోశము యొక్క
సుషుప్తౌ స్ఫూర్తిరుత్కటా -
సుషుప్తౌ స్ఫూర్తిః ఉత్కటా -
సుషుప్తిలో స్ఫూర్తి ఎక్కువగా వుండును.
సుషుప్తిలో ఆనందమయ కోశము యొక్క ప్రభావము ఎక్కువగా ఉండును; సుషుప్తిలో మిగిలిన వ్యాపారాలన్నీ అంటే మనస్సు బుద్ధి జ్ఞానేన్ద్రియములు అన్ని అణిగిపోతాయి. సుషుప్తి ( నిద్ర) తమోగుణ ప్రధానము. అందుకని ఆనందమయకోశము యొక్క ప్రభావము తామస గుణములో పూర్తిగా ప్రభవిస్తుంది
స్వప్న జాగ్రదావస్థలలో అనందమయకోశము ఎలా వస్తుంది అన్న ప్రశ్నకి సమాధానము శ్లోకము రెండవ పాదములో చెపుతాడు గురువు:
స్వప్నజాగరయోః ఈషద్
ఇష్టసందర్శనాదినా|
స్వప్నజాగరయోః ఈషద్ -
స్వప్న జాగ్రదావస్థలలో కొంచెము
అంటే ఆనందమయ కోశము యొక్క ప్రభావము స్వప్న జాగ్రదావస్థలలో కొంచెము కనిపిస్తుంది.
మరి ఎప్పుడు కనిపిస్తుంది?
ఇష్టసందర్శనాదినా|
ఇష్టమైన విషయముల సందర్శనముతో కొంచెము స్ఫురణములో వుండును.
జాగ్రదావస్థలో కోంచెము మాత్రమే ఎందుకు అంటున్నాడు ? జాగ్రదావస్థలలో మిగిలిన వ్యాపారములు ( మనస్సు లాంటివి) దీని ప్రభావమును నశింపచేస్తాయి.
ఇక్కడ తాత్పర్యము:
ఆనందమయ కోశము యొక్క ప్రభావము గాఢసుషుప్తిలో అధికముగా, స్వప్న జాగ్రదావస్థలలో అల్పముగా కనిపించును. స్వ్ప్నజాగ్రదావస్థలలో ఇష్టవస్తు సందర్శనము వలన ఆనందము తద్వారా అన్ందకోశము లభిస్తాయి.
అంటే జీవుడు నిద్రలో ఆనందమయ కోశములో వుంటాడు. స్వప్న జాగ్రదావస్థలలో ఆనందమయకోశము వుంటుంది, కాని ప్రభావము అప్పుడప్పుడు మాత్రమే ( పూర్వపుణ్యఫల ప్రాప్తి తో ఇష్టవస్తు సందర్శనముతో లభిస్తుంది)
ఇది కూడా అనాత్మయే అని ముందు శ్లోకములో వింటాము.
శ్లోకము 211:
నైవాయమ్ ఆనన్దమయః పరాత్మా
సోపాధికృత్వాత్ ప్రకృతేర్వికారాత్ |
కార్యత్వ హేతోః సుకృత క్రియాయా
వికారసంఘాత సమాహితత్వాత్||211||
నైవ అయమ్ ఆనన్దమయః పరాత్మా
అయమ్ ఆనన్దమయః పరాత్మా న ఏవ
ఈ అనన్దమయ కోశము కూడా ఆత్మ కాజాలదు
ఎందుకు? కారణాలు ఏమిటి?
సోపాధికృత్వాత్ - కారణము కలది కాబట్టి
ఆనందమయ కోశము లో ఆనందము కారణ రూపము , దానికి కారణము పూర్వపుణ్యఫలముచే కలిగిన ఇష్ఠవస్తు సందర్శనముతో కలిగే అవస్థ. ఆత్మ స్వరూపమే ఆనందము. ఆ ఆత్మ స్వరూపమైన ఆనందము కారణరూపమైనది కాదు. ఆనందమయకోశము అందువలన ఆత్మ కాదు.
ప్రకృతేర్వికారాత్ - ప్రకృతియొక్క వికారము కాబట్టి;
ఇది తమోగుణ ప్రధానమైన సుషుప్తిలో కలిగే అవస్థ. తమోగుణముకూడా ప్రకృతి సంబంధించినదే. ఆత్మ ప్రకృతియొక్క వికారము కాదు. ఆనందకోశము ప్రకృతియొక్క వికారము
కార్యత్వ హేతోః సుకృత క్రియాయా-
పుణ్యము యొక్క కార్యమగుటవలన ; అనందమయకోశము గురించి చెప్పినప్పుడే( శ్లోకము109), ఇది పూర్వపుణ్యఫలసంబంధముతో , ఇష్ట వస్తు సందర్శనముతో అని చెప్పడమైనది. ఇవి ఏవీ నిత్యము కావు. అనిత్యమైనవి ఆత్మ కాజాలవు.
వికారసంఘాత సమాహితత్వాత్-
అవయవముల అన్ని కోశముల సముదాయముతో కూడిన దగుటవలన ; ఈ ఆనందము భౌతికము ( అన్నమయ కోశము) , మానసికము ( మనో మయ కోసము) లతో కూడినది. అన్నమయ కోశము మనో మయ కోశము ఆత్మ కాదు అని నిర్ధారించుకున్నాము కనుక ఆ కోశములతో కలిసిన ఆనందమయ కోశము కూడా ఆత్మ కాదు అని అర్థము
పైన చెప్పిన కారణాలతో ఆనందమయ కోశము ఆత్మ స్థానము కాజాలదు.
అంటే చివరికి , ఆత్మ ఈ ఐదు కోశములలో లేదు అని నిశ్చయమైనది.
||ఓమ్ తత్ సత్||