!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 217-218

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి  శ్లోకములు 217- 218


శూన్యత్వము తప్ప ఇంకేమీ కనపడటల్లేదు అన్న శిష్యుడి ప్రశ్నకి సమాధానముగా గురువు, నువ్వు గుర్తించిన శూన్యత్వమే ఆత్మ అని 215-216 శ్లొకములలో చెప్పుతాడు.  తను చెప్పిన మాట నిర్ధారణ చెయ్యడము కోసము 217 వ శ్లోకములో ఒక సాధారణ న్యాయము లేక సూత్రము లేక మాట చెప్పి , తరువాత   218- 220 శ్లోకాలలో ఆ అత్మ గురించి ఇంకా విపులముగా చెపుతాడు. 


 ఇక శ్లోకము 217:


తత్సాక్షికం భవేత్ తత్ తద్ 

యత్ యత్ యేన అనుభూయతే |

కస్యాపి అననుభూతార్థే 

సాక్షిత్వం న ఉపపద్యతే ||


ముందు మొదటి రెండు పాదాలు విడమరిచి అర్థమ్య్ చూద్దాము.


1 యత్ యత్ యేన అనుభూయతే  - 

2 ఏదైతే తెలియబడుచున్నదో ;


తత్సాక్షికం భవేత్ తత్ తద్ -  

దానికి అంతయూ అదే సాక్షిగా గలది


మనకి ఎదైనా ఎప్పుడైనా చూచినపుడు , నేను చూశాను అన్న భావన వస్తుంది. అంటే దానికి సాక్షిగూడా అవుతున్నాము. అదే మాట పైన చెప్పబడినది.  ఏదైతే తెలియబడుచున్నదో, దానికి అంతయూ అదే సాక్షిగా గలది ; 


ఇది మామూలు మాటే.


మూడు నాలుగవ పాదముల అర్థము:


3 కస్యాపి అననుభూతార్థే - 

ఎవనికీ అనుభవము కానప్పుడు 


4 సాక్షిత్వం న ఉపపద్యతే  - 

సాక్షిత్వము  వుండదు.


ఎదైనా అనుభవము లో వచ్చినప్పుడు, అది అనుభవించబడినది అని అతడే ( అతని ఆత్మయే) సాక్షి గా వుండును. ’అననుభూతార్థే’ అనుభవించడము కానప్పుడు దానికి సాక్షిత్వము కుదరదు.

మనము చూడనిదానికి సాక్షి కాము కదా


ఇది సామాన్య న్యాయము. ఈ మాటలో కొత్తది ఏమీ లేదు. ఈ శ్లోకములో చెప్పినది మామూలు మాట.


ఇది శిష్యుడు చెప్పిన మాటలకి కలుపుదాము.


శిష్యుడు - సర్వ అభావం వినా కించిత్ నపశ్యామి - అంటాడు.

అంటే సర్వాభావము కన్నా నాకేమీ కనపడుటలేదు అని. అంటే సర్వాభావమే కనిపిస్తోంది అని.


అలా అన్నప్పుడు తనకి, సర్వాభావము చూచినట్లు అయినది,

అలా చూచుచున్న సర్వాభావమునకు సాక్షి  శిష్యుడి . ఆ సాక్షి ఆత్మ యే.


ఇలాచెప్పడములో గురువు, ఒక విషయము ఋజువు చేస్తున్నాడు. తన శిష్యుడు చెప్పిన మాట నిజమే అని. రెండవది, ఆ అభావము ( సర్వాభావము) అనుభవించబడినది కనుక , సామాన్య న్యాయము ప్రకారము అతడే సాక్షి అని ; ఇంకేమీ లేదు కనుక, ఇంకేమీ లేదు అని గ్రహించిన  ఆ సాక్షి ఆత్మయే అని శిష్యుడికి నిరూపిస్తున్నాడు. 


ముందు మూడు శ్లోకాలలో ( 218 శ్లోకము నుంచి)  ఆత్మ గురించి గురువు ఇంకా విపులముగా చెపుతాడు


ఒక చిన్నమాట


మనము గ్రహించినా గ్రహించకపోయినా, ఆత్మ అన్నది లోపలవున్నది. మన జాగ్రదావస్థలో మనము పడుతున్న సుఖదుఃఖాలను , పడుతున్నది మనమే అయినా - ఆ పడుతున్న సుఖాన్ని దుఃఖాన్ని చూస్తూ వున్నది మన ఆత్మ. 


మనకి పట్టినా పట్టకపోయినా, మన హృదయాంతరాళములలో, నేను కూడా వున్నాను, వున్నాను  అంటూ, మన తప్పులను మనకే గుర్తు చేసేది కూడా మన ఆత్మ.  


మన మనస్సు అనేక రకములైన అహంకారభావములతో నేనే కర్తను భోక్తనూ అంటూ విఱ్ఱవీగుతున్నప్పుడు, నామాటకి తిరుగులేదు అని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్నప్పుడు  సాక్షిగా వుండేది కూడా ఆ అత్మ యే. 


మనకి నిత్యానందస్వరూపముతో ఆనందములో ఓలలాడుతున్నాప్పుడు హృదయాంతరాళములలో , ప్రశాంతత కలిగించేది కూడా మన ఆత్మ .


మరి నిత్యానందస్వరూపముతో  అత్మ ఎప్పుడన్నా నిజముగా కనపడుతుందా,  లేక ఇది ఒక ఆధ్యాత్మిక కధానికా అని అనుమానం రావడము అసందర్భముకాదు. 


ఆత్మానుభూతికి కొన్ని conditions వున్నాయి.


మనము ఈ సుఖదుఃఖాలు మనవి కాదు అనుకొన గలిగి, 

మనము అందరిలో వున్న ఆత్మ మనలో వున్నఆత్మ ఒకటే అని గ్రహించి, అందరితో సమభావముతో ( సమత్వముతో) వుండగలిగినప్పుడు,

 మన మనస్సు ఎంతో ప్రశాంతభావముతో చీకు చింతాలేకుండా వున్నప్పుడు , సాక్షిగా జరుగుతున్నవన్నీ చూస్తూ ఒక రకమైన ఆనందము తనంతట తానే వస్తుంది. చూచేవాళ్ళకి అది పిచ్చివాడి నవ్వులా వుండవచ్చు. ఆదే సచ్చిదానందము. అప్పుడే మనము నిజముగా ఆత్మానుభవము పొందుతున్నామన్నమాట. ఆ విధముగా ఇది అధ్యాత్మిక కథానిక కాదు. ఇది చేరతగిన గమ్య స్థానము.


మనము రోజూ, కాల పరిస్థులనుబట్టి సాత్విక రాజసిక తమోగుణాలతో  ( లేవగానే సాత్వికము, ఎవరికైనా గట్టిగా చెప్పినప్పుడు  రాజసికము, ఎమీ చెయ్యడానికి ఉత్సాహము లేనప్పుడు తామసికము) ఉన్నట్లే, రోజులో కొంతభాగము  ఆత్మ తో కలిసిన ఆ సంతృప్తితో నిశ్చింతగా వుంటాము. మరి ఆలోచనలు మారి ఇంకోసంగతి వచ్చినప్పుడు అహంకారముతో ఆత్మ సంగతి మరిచిపోతాము.  సర్వావస్థలలో  - అంటే అన్ని క్షణములలో, అత్మానుభూతి మననము చేసుకుంటూ, ఏపని చేసినా - ఆ అనుభూతి వదలకుండా ( అంతా ఒక్కటే అనుకుంటూ ) వుండ గలగినప్పుడే  నిజముగా ఆత్మను అనుభవించుచున్నవాళ్ళము అవుతాము.


ఇదే మాట  అనేక విధాలుగా ముందు శ్లోకాలలో వింటాము.


శ్లోకము 218:


అసౌ స్వసాక్షికోఽభావో

యతః స్వేనానుభూయతే |

అతః పరం స్వయం సాక్షాత్

 ప్రత్యగాత్మన చేతరః||218||


నాలుగు పాదాలు విడివిడిగా అర్థము చేసుకుందాము


1 అసౌ స్వసాక్షికోఽభావో  - 

అసౌ అభావో స్వ సాక్షికః 

- ఈ అభావములకు తానే సాక్షిగా గలది 


ఇక్కడ అభావము లు అంటే అహం మున్నగు వికారములు. అంటే ఇక్కడ చెప్పబడిన మాట -  "అహంకారము మున్నగు వికారములు అన్నిటికి సాక్షిగా గలది " - ఆ సాక్షి మన ఆత్మ. అది మనకి తెలిసిన మాటే.


2 యతః స్వేనానుభూయతే - 

యతః స్వేన అనుభూయతే -

ఎలాగ తనచే తెలిసికొనబడుతున్నదో 


ఎలాగ తనచే - అంటే పంచకోశములు నిషేధింపబడిన తరువాత మిగిలిన  "తనచే"  తానే తెలియబడుతున్నదో  - నిషేధింపగా మిగిలిన శూన్యత్వమును తెలిసికొనబడుతున్నదో అది ; 


ఇక్కడ శూన్యత్వమును  తెలిసికొనబడుతున్నది  అన్నమాట, ఎలాగ చెపుతున్నాడు అనే ప్రశ్న, అనుమానము  రావచ్చు - 


శిష్యుడు తన ప్రశ్నలో చెప్పినమాట ఒక మాటు మననము చేద్దాము -  పంచకోశములు నిషేధింపబడిన తరువాత, "ఇక్కడ నాకు శూన్యత్వము తప్ప ఏమీ కనపడుట లేదు" అని శిష్యుడు చెప్పాడు. శూన్యత్వము తప్ప ఏమీ కనపడుటలేదు అన్నమాటలో, శిష్యుడిలో సాక్షిగా వున్న ఆత్మ తన శూన్యత్వమును తానే గ్రహించినది అన్నమాట. అంటే ఆత్మ తనను తానే గ్రహించినది అన్నమాట. ఇక్కడ ఈ శ్లోకములో చెప్పినది అదే - ఎలాగ తనచే తానే తెలియబడినదో  అని   


3 అతః పరం స్వయం సాక్షాత్  ప్రత్యగాత్మనః - 

అందువలన  సాక్షాత్తు స్వయముగా పరమాత్మ జీవాత్మయే

అంటే ముందు పాదముతో కలుపుకొని, తనని తానే గ్రహించడము వలన , ఆ సాక్షాత్తు స్వయముగా లోపలనున్న ఆత్మయే  జీవాత్మ.


4 న చేతరః -  న చ ఇతరః

ఇంకోటి కాదు.


శ్లోకతాత్పర్యము:


"ఈ అభావములకు తానే సాక్షిగా గలది , ఏ కారణము వలన తనచే తానే తెలిసికొనబడుతున్నదో, అందువలన ఆ  స్వయముగా సాక్షాత్తు  లోపలనున్న పరమాత్మ జీవాత్మయే. ఇంకోటి కాదు"


ఇక్కడచెప్పినది జీవాత్మ యే పరమాత్మ అని.

ఈ ఆత్మ గురించి ఇంకా వింటాము 218 శ్లోకములో


||ఓమ్ తత్ సత్ ||



|




















































































 






 








వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218

Om tat sat !

 

 

 

    •