!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 219-220

||ఓమ్ తత్ సత్||


వివేక చూడామణి  శ్లోకములు 219- 2220


శూన్యత్వము తప్ప ఇంకేమీ కనపడటల్లేదు అన్న శిష్యుడి ప్రశ్నకి సమాధానముగా గురువు, నువ్వు గుర్తించిన శూన్యత్వమే, అదే  ఆత్మ అని చెప్పి,  217- 218 శ్లోకాలలో అలా చూడబడినది ఆత్మే అని ఋజువు చేస్తాడు. అలా ఋజువు చేసిన తరువాత, అత్మ స్వరూపము గురించి 219 - 220 శ్లోకాలలో చెపుతాడు.


219-220 శ్లోకాలముందు , ఆత్మ గురించి మనకు తెలిసినది,  ఒకసారు మననము చేద్దాము.


మనము గ్రహించినా గ్రహించకపోయినా, ఆత్మ అన్నది లోపలవున్నది. అది ఎల్లప్పుదు వుంటుంది. అది చేస్తున్నపని ఏమిటి? మన జాగ్రదావస్థలో మనము పడుతున్న సుఖదుఃఖాలను చూస్తూ వుంటుంది.  అదే ఆత్మ. మనకి పట్టినా పట్టకపోయినా, మన హృదయాంతరాళములలో నేను కూడా వున్నాను అంటూ మనకి అప్పుడప్పుడు గుర్తు చేసేది కూడా మన ఆత్మ. మన మనస్సు అనేక రకములైన అహంకారభావములతో నేనే కర్తను భోక్తనూ అంటూ విఱ్ఱవీగుతున్నప్పుడు సాక్షిగా వుండేది కూడా ఆ అత్మ యే. మనకి అతిసంతోషము వచ్చినప్పుడు, ఆనందస్వరూపముతో హృదయాంతరాళములలో వుండేది  మన ఆత్మ .


మనకి పూర్తిగా అవగాహన కానిది, నిత్యానంద స్వరూపమే ఆత్మ అంటారుగదా -  ఆ నిత్యానందస్వరూపముతో  అత్మ ఎప్పుడన్నా నిజముగా కనపడుతుందా అని ;   లేక ఆత్మ నిత్యానంద స్వరూపము అన్నది  ఒక ఆధ్యాత్మిక కధానికా అని అనుమానం రావడము అసందర్భముకాదు. 


మనము ఈ సుఖదుఃఖాలు మనవి కావు అనుకొన గలిగి ; అందరిలో వున్న ఆత్మ మనలో వున్నఆత్మ ఒకటే అని గ్రహించి అందరితో సమభావముతో ( సమత్వముతో) వుండగలిగినప్పుడు, మన మనస్సు ఎంతో ప్రశాంతభావముతో చీకు చింతాలేకుండా వుంటుంది.  అలా వున్నప్పుడు , అప్పుడు తన ముందర  జరుగుతున్నవన్నీ సాక్షిగా  చూస్తూ ఒక రకమైన ఆనందము తనంతట తానే వస్తుంది. అదే ఆనంద స్వరూపము.  అది చూచేవాళ్ళకి అది పిచ్చివాడి నవ్వులా వుండవచ్చు. కాని ఆదే సచ్చిదానందము. అప్పుడే మనము నిజముగా ఆత్మానుభవము పొందుతున్నామన్నమాట. ఆ విధముగా ఇది అధ్యాత్మిక కథానిక కాదు. ఇది చేరతగిన గమ్య స్థానము.


ఇదే మాట 219-220శ్లోకాలలో వింటాము.


శ్లోకము 219: 

ఇది ఆత్మస్వరూపముగురించి


జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యోఽసౌ సముజ్జృంభతే

ప్రత్యగ్ రూపతయా సదాహమహమ్ ఇత్యంతః స్ఫురన్నైకధా|

నానాకార వికార భాగిన ఇమాన్  పశ్యన్నహం  ధీముఖాన్

నిత్యానంద చిదాత్మనా స్ఫురతి తం విద్ధి స్వమేతం హృది||


నాలుగు పాదాల శ్లోకము,  ఆత్మ అంటే ఏమిటి అన్నది విశదీకరిస్తుంది. శ్లోకము భర్తృహరి సుభాషితాలలో - "ఆయుర్వర్షశతం నృణాం పరిమితంఅన్న శ్లోక రాగములో చదివితే సులభముగా వినిపిస్తుంది , కనిపిస్తుంది కూడా.


ఇక ఈ శ్లోకము యొక్క అర్థము.


శ్లోకము లో ఆఖరి మాట - ’తం విద్ధి స్వమేతం హృది’, అంటే  ’దానిని తన ఆత్మగా తెలిసి కొనుముఅని. అంటే శ్లోకము అంతా , "తం" అంటే "దానిని" గురించి. అది  ఆత్మ. ఆత్మ అంటే ఏది అన్నది ముందు మూడు పాదములలో చెప్పబడినది అన్నమాట


అందుకని శ్లోకము ఆఖరి పాదము తో మొదలెట్టి , తరువాత మొదటి మూడు పాదములు అర్థము చేసుకుందాము.


నాలుగొవ పాదము


నిత్యానంద చిదాత్మనా స్ఫురతి తం విద్ధి స్వమేతం హృది


నిత్యానంద చిదాత్మనా హృది స్ఫురతి -

నిత్యానంద స్వరూపముతో హృదయాంతరాళములో ఏది స్ఫురించుచున్నదో


తం విద్ధి స్వమేతం  - 

తం విద్ధి స్వం ఏతం -

అట్టి దానిని  స్వ ఆత్మనుగా తెలిసికొనుము


అంటే గురువు చెప్పిన మాట - "నిత్యానంద స్వరూపముతో హృదయాంతరాళములో ఏది స్ఫురించుచున్నదో, వెలుగుచున్నదో, అట్టి దానిని  స్వ ఆత్మనుగా తెలిసికొనుము."



అంటే అట్టి దానిని ( ఆత్మగురించి , మొదటి మూడు పాదములలో వింటాము


మొదటి పాదము


జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యోఽసౌ సముజ్జృంభతే


జాగ్రత్ స్వప్న సుషుప్తిషు  -  

జాగ్రత్ స్వప్న సుషిప్తి దశ ల లో. 


స్ఫుటతరం యోఽసౌ సముజ్జృంభతే - 

ఏది స్పష్టముగా విజ్జృంభించునో


జాగ్రత్ స్వప్న సుషిప్తి దశలలో ఏది స్పష్టముగా విజ్జృంభించునో అని పాదముయొక్క ముఖ్యార్థము. ఇక్కడ ఏది ఎలాగ విజ్జృంభిస్తోంది అని చిన్న అనుమానం వస్తుంది. ఐక్కడ ఏది ఎలాగ అన్నది , ఏది సాక్షిలాగ విజ్జృంభిస్తోందో  .. అది ఆత్మ అని తాత్పర్యము 


ఇంకొంచెము విడదీస్తేజాగ్రత్ స్వప్న సుషిప్తి దశలలో ఏది కర్తగా భోక్తగా కనిపిస్తుందో దానిని కర్తగా భోక్తగా చూడగలిగినది, అది ఆత్మ అని ఇక్కడ అర్థము. ప్రొద్దున్నలేచినదగ్గరనుంచి నిద్రపోయేదాకా దిన చర్యలో చాలా పనులు చేస్తాము. అవన్నీ తప్పకుండా సాక్శిలా చూస్తున్నది ఆత్మ అని. సాక్షి అన్నది ఆత్మ యొక్క ఒక స్వరూపము.


రెండవపాదము:

ప్రత్యగ్ రూపతయా సదా అహమహమ్ 

ఇత్యంతః స్ఫురన్ ఏకధా


ఏది ప్రత్యగాత్మ రూపములో ఎల్లప్పుడూ లోపల నేను నేను

 అంటూ ఒకే విధముగా ప్రకాశించునో..( అది ఆత్మ అని )


ఆత్మ మన లోపల , ’ఎల్లప్పుడు నేను నేనుఅంటూ ఒకే విధముగా  మనని పొడుస్తూ వుంటుంది. అదే మన ఆత్మ అని. 


మూడవ పాదము:

నానాకార వికార భాజినః ఇమాన్  పశ్యన్ అహం  ధీముఖాన్


నానాకార వికార భాజినః   - అనేక విధములగు ఆకార వికారములు 

అహం  ధీముఖాన్ - అహంకారము బుద్ధి 

ఇమాన్ పశ్యన్ -  వీటిని చూచుచూ 


(ఏది) అనేక విధములగు ఆకార వికారములు అహంకారము బుద్ధి వీటిని (  సాక్షి వలె) చూచుచూ వుండునో (అది ఆత్మ)


ముందు మూడు పాదములలో వర్ణింపబడిన దానిని కలిపి శ్లోకా తాత్పర్యము విందాము -


"ఏది జాగ్రత్ స్వప్న సుషిప్తి దశలలో, సాక్షి వలె స్పష్టముగా విజ్జృంభించునో , ఏది ప్రత్యగాత్మ రూపములో ఎల్లప్పుడూ నేను నేను

అంటూ ఒకే విధముగా ప్రకాశించునో, ఏది అనేక విధములగు ఆకార వికారములు అహంకారము బుద్ధి వీటిని సాక్షి వలె చూచుచూ వున్నదో , ఏది నిత్యానంద స్వరూపముతో హృదయాంతరాళములో స్ఫురించుచున్నదో , అది తన ఆత్మగా తెలిసికొనుము" . అని 


ఇక్కడ వర్ణించినది , మనలో వున్నాఅత్మ ఏ ఏ రూపములలో , ఏ ఏ కాలములలో వుంటుందో చెప్పాడు గురువు. 


బంధములతో మునిగి వున్నప్పుడు ( స్వార్థమైన నిస్వార్థమైనా గాని ఆశలు కోరికలతో వున్నప్పుడు) ఆత్మ సాక్షి రూపములో వుంటుంది. బంధాల నుంచి విడివడినప్పుడు, ఆత్మ చీకు చింతాలేకుండా , చుట్టూ కష్టాలు సుఖాలు చెలరేగుతునా , ఆనందస్వరూపముతో వెలుగుతూవుంటుంది. 


ఈ ఆత్మగురించి ఇంకో విధముగా 220 శ్లోకములో;


శ్లోకము 220:


ఘటోదకే బిమ్బితం అర్కబిమ్బమ్

ఆలోక్య మూఢోః రవిమేవ మన్యతే|

తదాచిదాభాస ముపాధి సంస్థమ్

భ్రాన్త్యాహం ఇత్యేవ జడోఽభిమన్యతే||


మొదటి పాదము:


ఘటోదకే బిమ్బితం అర్కబిమ్బమ్


ఘటముయొక్క  ఉదకములో ప్రతిబింబించుచున్న, అర్కబింబము , అంటే సూర్యబింబమును;


రెండవ పాదము


ఆలోక్య మూఢోః రవిమేవ మన్యతే


ఆలోక్య - చూచి , మూఢుడు , రవి మేవ మన్యతే - అదే సూర్యుడు అనుకుంటాడో 


రెండు పాదములతాత్పర్యము - ఎలాగైతే  కుండలోని నీళ్ళలో సూర్యుని ప్రతిబింబము చూచి, భ్రమతో మూర్ఖుడు అదే సూర్యుడు అనుకుంటాడో అని , ఇక ముందువచ్చేమాట అలాగే మూర్ఖుడు కూడా ఆత్మగురించి భ్రమపడతాడు అని.


మూడవ నాలుగొవ పాదములు:

తదా చిదాభాస ముపాధి సంస్థమ్ 

భ్రాన్త్యాహం ఇత్యేవ జడోఽభిమన్యతే


అలాగే, ముపాధి సంస్థమ్,  బుద్ధి మున్నగు ఉపాధులలో కనపడుచున్న, చిదాభాసమ్ చిత్ ప్రతిబిమ్బమును;  భ్రాన్త్యా అహం ఇత్యేవ  - భ్రాన్తిలో  నేనే అనిఅనుకుంటాడు.  ఏవరు అలాఅనుకుంటాడు ? జడః - అవివేకుడు.


పూర్తి శ్లోకతాత్పర్యము - 


ఎలాగైతే కుండలోని నీరులో కనపడిన సూర్యుని ప్రతిబింబమును , మూఢుడు అదే సూర్యుడు అని అనుకుంటాడో, అలాగే వివేకము లేనివాడు, బుద్ధి ఉపాధులలో ఘనతసాధించిన తనే  ( తన అహమే) ఆత్మ అని భ్రాన్తిపడుతున్నాడు.


 

|| ఓమ్ తత్ సత్||

























































































 






 








వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220


Om tat sat !

 

 

 

    •