!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 221-223

||ఓమ్ తత్ సత్||



వివేక చూడామణి  శ్లోకములు 221- 222 - 223


ఘటము, జలము, జలములో సూర్యుడి ప్రతిబింబము అంటూ , మూర్ఖుడు ఆ ప్రతిబింబమే నిజము అని భ్రమ పడతాడు  అని  220 వ శ్లోకములో విన్నాము. 


ఆ మూర్ఖుడి భ్రమ, అలాగే అహముతో కూడిన మనస్సే ఆత్మ అని  భ్రమ పడిన మూర్ఖుడి భ్రమ , ఈ రెండు భ్రమలు ఒకటే . 


రెండిటిలో నిజము కానిది నిజము అనుకోవడము జరిగింది.


నిజము కానిది చూచి నిజము అనుకోవడము కన్నా, నిజమే చూస్తే అసలు భ్రమ ఉండదు కదా ! అందుకని నిజము కాని దానిని వదిలేసేయ్ - నిజమునే చూడు అనుకోవచ్చు గదా.  అది చాలా చిన్నమాట. అర్థము అయ్యే మాట కూడా.


అదే మాట 221వ, 222వ శ్లోకములలో వింటాము.


శ్లోకము 221


ఘటం జలమ్ తద్గతమ్ అర్కబింబమ్ 

విహాయ సర్వం దివి విక్ష్యతే అర్కః|

తటస్థితస్తత్రితయావభాసకః

స్వయం ప్రకాశోవిదుషో యథా తథా||


ఘటం జలమ్ తద్గతమ్ అర్కబింబమ్ -

ఘటము, జలము, దానిలో వున్న సూర్య ప్రతిబింబము


విహాయ సర్వం - అన్నిటినీ వదిలేసి  


తటస్థితః  తత్రితయావభాసకః 


తటస్థితః - తటస్థుడు - ఆ మూడింటికి తటస్థము గా వుండే వాడు - అంటే ఆ మూడు( జలము ఘటము దానిలో ప్రతిబింబము)  కన్నావేరు అయినవాడు అని, 


తత్రితయావభాసకః - అంటే ఆ మూడింటిని  ప్రకాశింపచేయువాడు,  


స్వయం ప్రకాశః స్వయముగా ప్రకాశించు వాడు అగు


దివి అర్కః   

ఆకాశములో సూర్యుడిని ్


యథా  విదుషః  వీక్ష్యతే 

యే విధముగా పండితుడు చూచుచున్నాడో 


తథా  ..అలాగే 


అంటే ఈ శ్లోకతాత్పర్యము:


ఘటము, జలము, దానిలో వున్న సూర్య ప్రతిబింబము అన్నిటినీ వదిలేసి,- ఆ మూడు( జలము ఘటము దానిలో ప్రతిబింబము)  కన్నావేరు అయినవాడు, 

ఆ మూడింటిని  ప్రకాశింపచేయువాడు,  స్వయముగా ప్రకాశించు వాడు అగు సూర్యుడిని

ఆకాశములో  ఎలా  ( బుద్ధి కలవాడు) చూచునో , అలాగే ..... అని !!


మొదటి భాగములో ఘటము జలము జలములో ప్రతిబింబము వదిలేసి , తిన్నగా వీటన్నిటినీ ప్రకాశింపచేసే సూర్యుడిని చూడు  అన్నది, ఏమాత్రము ఇంగిత జ్ఞానమున్నవాడికైనా సులభము గా అర్థము అవుతుంది.


కాని ఈ శ్లోకములో చివరి మాట -  అలాగే  అన్నది ఒక ప్రశ్నలా కనిపిస్తుంది.


మనము చదువుతున్నది ఆత్మగురించి. ముందుశ్లోకములో  మూఢుడు భ్రమలో జలములో ప్రతిబింబిస్తున్న సూర్యుడు నిజమనుకున్నట్లు, మూఢుడు దేహము దేహాభిమానము తోకూడిన ఆత్మయే నిజమైన ఆత్మ అను కొనినట్లు విన్నాము. ఇప్పుడు, పండితుడు ఘటము, జలము , జలములో ప్రతిబింబము వదిలేసి  నిజమైన సూర్యుని  ఆకాశములో ఎలాగ చూస్తాడో అలాగే .. అనడములో గురువు భావము,   ఆత్మవిషయములో  అలాగే ఆని,


అయితే ఆలాగే అంటే ఎలాగ?


ముందు  శ్లోకములో ఘటము , జలము, జలములో  ప్రతిబింబము వదిలేసి సూర్యుని న చూడు అన్నాడు. అలాగే మరి స్వయం ప్రకాశమైన ఆత్మను చూడాలి అంటే ఏమి వదిలేయాలి ? దానికి సమాధానము మనకి తెలిసినదే మనము విన్నమాటలే.

 

అంటే అలాగే పండితుడు ఈ స్థూల శరీరాన్ని , అహంకారముతో కూడిన దేహాభిమానాన్ని వదిలి , స్వయం ప్రకాశమైన ఆత్మని చూడాలి అన్నమాట.  


అదే మాట గురువు 222 వ శ్లోకములో చెపుతాడు


శ్లోకము 222


దేహం ధియం చిత్ ప్రతిబిమ్బమేతం 

విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయామ్|

ద్రష్టారమాత్మానం అఖండబోధమ్

సర్వప్రకాశం సదసద్విలక్షణమ్||


దేహం ధియం చిత్ ప్రతిబిమ్బమేతం -

దేహమును , బుద్ది చిత్ప్రతిబింబము ( దేహాభిమానము కలిగిన బుద్దిని) వీటన్నిటినీ


విసృజ్య - వదిలేసి


బుద్ధౌ నిహితం గుహాయామ్ - 

బుద్ధి గుహలలో ఉంచబడిన


ద్రష్టారమాత్మానం - సాక్షి వలె వున్న ఆత్మను ( చూడుము)


ఆ ఆత్మ ఎలాంటిది?


అఖండబోధమ్ సర్వప్రకాశం - 

అఖండమైన పరిపూర్ణమైన  జ్ఞానముఅయినది ; అంతటినీ ప్రకాశింపచేయునది; 


సదసద్విలక్షణమ్ - ప్రత్యక్షము అప్రత్యక్షము అయిన వాటి కన్న వేరే అయినది  - అంటే చూడగల స్థూల శరీరముకన్నా చూడబడలేని సూక్ష్మ శరీరము కన్నా భిన్నమైనది - అదే ఆత్మ


222వ శ్లోకము తాత్పర్యము:


దేహమును , బుద్ది చిత్ప్రతిబింబము ( దేహాభిమానము కలిగిన బుద్దిని) వీటన్నిటినీ వదిలేసి, బుద్ధి గుహలలో ఉంచబడిన

సాక్షి వలె వున్న, పరిపూర్ణమైన  జ్ఞానము అయిన, అంతటినీ ప్రకాశింపచేయు, ప్రత్యక్షము అప్రత్యక్షము అయిన వాటి కన్న వేరే అయిన  - అంటే చూడగల స్థూల శరీరముకన్నా చూడబడలేని సూక్ష్మ శరీరము కన్నా భిన్నమైన  ఆత్మను ( చూడుము).


అంటే గురువు చెప్పినది దేహాభిమానము వదిలేసి, స్థూల సూక్ష్మ శరీరములకన్న భిన్నమైన, సాక్షి రూపములో వున్న ఆత్మ ని చూడుము. 


అలా ఆత్మ చూడడము వలన కలిగే ప్రయోజనము  ఏమిటి ?  భ్హగవద్గీతలో కర్మయోగము గురించి చెపుతూ, కర్మయోగ ము మీద మొదటి శ్లోకములో  కృష్ణుడు- 


నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో నవిద్యతే | స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్||


అంటూ కర్మయోగముయొక్క లాభాలు చెపుతాడు.


అలాగే ఇక్కడ 223వ శ్లోకములో  ఆత్మ నిజస్వరూపము తెలిసికొంటే కలిగే ప్రయోజనము చెపుతాడు గురువు.


శ్లోకము 223


నిత్యం విభుం సర్వగతమ్ సుసూక్ష్మమ్

అన్తర్బహిః  శూన్యం అనన్యమాత్మనః|

విజ్ఞాయ సమ్యక్  నిజరూపమేతత్ 

పుమాన్ విపాప్మా విరజా విమృత్యుః||


ఈ శ్లోకములో ముఖ్యమైన మాట  తాత్పర్యము మూడు నాలుగొవ పాదాలలో వింటాము,


విజ్ఞాయ సమ్యక్  నిజరూపమేతత్ 

పుమాన్ విపాప్మా విరజా విమృత్యుః||


విజ్ఞాయ సమ్యక్  నిజరూపమేతత్ -

దాని ( ఆత్మ)  నిజరూపమును తెలిసికొని 


పుమాన్ విపాప్మా విరజా విమృత్యుః-

మనుష్యుడు పాపరహితుడై, రజో గుణము లేని వాడై, మృత్యువు లేని వాడై ( వుండును)  


పాపరహితుడు, రజో గుణము లేని వాడు, మృత్యువు లేని వాడు మూడూ మంచి మాటలే . అది ఎలాసంభవమో  అన్నది అర్థము చేసుకోవచ్చు.


ఆత్మని అర్థము చేసికొనిన వాడు పాపరహితుడే. పాపము అన్నది ఆశ అసూయ మున్నగు గుణములతో కూడిన దుష్కర్మల తో సంబంధము  కలది. ఆత్మని అర్థము చేసికొని సమత్వముతో కూడినవానికి, అట్టి  దుష్కర్మలతో సంబంధము లేదు. అట్టివాడికి  పాపముల ప్రశ్నలేనే లేదు.  అందుకే విపాప్మా - పాపములు లేనివాడు అని.


అలాగే రజోగుణము లేనివాడై అంటే అసూయ ద్వేషము , కామ క్రోధములు లేనివాడై అని. అందరిలోనూ అదే ఆత్మని చూడగలిగిన వానికి, శత్రువు వుండడు. అంటే అసూయ ద్వేషము కామ క్రోధములు మున్నగు రజో గుణములు వుండవు. 


మృత్యువు లేనివాడు అంటే మృత్యుభయములేనివాడు అని. బంధాలకి అతీతుడైనవాడికి, మరణాంతరము వెళ్ళేది స్వర్గమా ? నరకమా? అన్న ప్రశ్న, అలాగే తను పోయిన తరువాత   పిల్లలు ఎలావుంటారో, వాళ్ళు సుఖంగా వుంటారా లేదా?  వాళ్ళలో వాళ్ళకి ఏమైనా గొడవలు వస్తాయా? అలాంటి ప్రశ్నలు వుదయించవు. అప్పుడు మృత్యువు , మృత్యువు తరువాత అన్న భయము పోతుంది. ఉండేది భగవధ్యాసయే. అదే మృత్యువు లేనివాడు  అనడములో భావము.


అంటే ఈ శ్లోకములో  ముఖ్యమైన తాత్పర్యము:


ఆత్మ  నిజరూపమును తెలిసికొని మనుష్యుడు పాపరహితుడై, రజో గుణము లేని వాడై, మృత్యువు లేని వాడై  వుండును అని.


ఆ ఆత్మ నిజరూపము గురించి చాలావిన్నాము. అదే మొదటి రెండుపాదములలో వస్తుంది:


నిత్యం విభుం సర్వగతమ్ సుసూక్ష్మమ్

అన్తర్బహిః  శూన్యం అనన్యమాత్మనః|


నిత్యం విభుం సర్వగతమ్- నాశనము లేనిది, అంతటా వున్నది, అన్నిటిలో వున్నది 


సుసూక్ష్మమ్ - అతి సూక్ష్మమైనది


అన్తర్బహిః  శూన్యం - లోపల బయట అన్నప్రశక్తి లేదు


అనన్యమాత్మనః -  అద్వితీయమైనది , మనలో వున్నది అగు ఆత్మ 


మొదటి రెండు వాక్యాలలో ఆత్మ గురించి చెప్పబడినది - దాని తాత్పర్యము :


ఆత్మ నాశనము లేనిది, అంతటా వున్నది, అన్నిటిలో వున్నది , అతి సూక్ష్మమైనది, ఆత్మ లోపల బయట అన్నప్రశక్తి లేదు , అద్వితీయమైనది , మనలో వున్నది అగు ఆత్మ అని.


ఇవి రెండు కలిపి 


223 వ శ్లోకతాత్పర్యము : 


ఆత్మ నాశనము లేనిది, అంతటా వున్నది, అన్నిటిలో వున్నది , అతి సూక్ష్మమైనది, ఆత్మ లోపల బయట అన్నప్రశక్తి లేదు , అద్వితీయమైనది , మనలో వున్న  ఆత్మ  నిజరూపమును తెలిసికొని మనుష్యుడు పాపరహితుడై, రజో గుణము లేని వాడై, మృత్యువు లేని వాడై  వుండును అని.


||ఓమ్ తత్ సత్||

























































































 






 








వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220


వివేక చూడామణి శ్లోకములు 221-223

Om tat sat !

 

 

 

    •