!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 224-225
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 224- 225
223 శ్లోకములో, గురువు - "విజ్ఞాయ సమ్యక్ నిజరూపమేతత్ పుమాన్ విపాప్మా విరజో విమృత్యుః", అంటే ఆత్మ నిజస్వరూపము తెలిసికొని పురుషుడు పాపరహితుడై, రజో గుణములేనివాడై, మృత్యువు జయించినవాడు అవుతాడు అని,ఆత్మ నిజస్వరూపము తెలిసికోవడము వలన వచ్చే ప్రయోజనములను చెపుతాడు.
ఆ ప్రయోజనముల గురించి ఇంకా వింటాము 224 225 వ శ్లోకాలలో. ఇక..
శ్లోకము 224
విశోక ఆనంద ఘనో విపశ్చిత్
స్వయం కుతశ్చిన్నబిభేతి కశ్చిత్|
నాన్యోస్తి పంథా భవబంధముక్తేః
వినా స్వతత్త్వావగమం ముముక్షో||
విశోక ఆనంద ఘనో విపశ్చిత్ -
పండితుడు ( ఆత్మ నిజస్వరూపము ఎరిగినవాడు) దుఃఖములేనివాడై ఆనందమే మూర్తిగా గలవాడగును.
నిజస్వరూపము తెలిసినవాడికి పాపముల ప్రశక్తి లేదు, అసూయమున్నగు గుణములు వుండవు అని విన్నాము. అలాంతి కష్టాలన్నీ పోతే మిగిలే సుఖము ఆనందమే
స్వయం కుతశ్చిన్ నబిభేతి కశ్చిత్ -
తాను ఎవరివలనను భయపడడు.
నిష్కామ కర్మ చేసేవాడికి భయము అన్నమాటపోతుంది అని గీతలో విన్నాము. ఇక్కడ బంధాలకి అతీతమైన వాడికి , బంధాలు తెంచుకున్నవాడికి కూడా భయము అన్న మాట పోతుంది.
నాన్యోస్తి పంథా భవబంధముక్తేః
భవబంధ ముక్తికి ఇంకో మార్గము లేదు .
ముక్తి మోక్షము , అంటే అన్ని బంధాలనుంచి బయట పడడమే. నిజస్వరూపము తెలిసినవాడు బంధ విముక్తుడౌతాడు అని విన్నాము. అంటే బంధవిముక్తికి నిజస్వరూపము తెలుసుకోవాలి అని కూడా. అంటే బంధవిమిక్తికి నిజస్వరూపము తెలిసి కోవడమే మార్గము
వినా స్వతత్త్వావగమం ముముక్షో
ముముక్షువు కు తన యొక్క నిజస్వరూపము తెలిసికోవడము కన్నా ( ...ఇంకో మార్గము లేదు ..అని)
224వ శ్లోక తాత్పర్యము:
పండితుడు ( ఆత్మ నిజస్వరూపము ఎరిగినవాడు) దుఃఖములేనివాడై ఆనందమే మూర్తిగా గలవాడగును , తాను ఎవరివలనను భయపడడు.
మోక్షము కోరువానికి, తన ( ఆత్మ) యొక్క నిజస్వరూపము తెలిసికోవడము కన్నా భవబంధ ముక్తికి ఇంకో మార్గము లేదు
శ్లోకము 225
బ్రహ్మా భిన్నత్వవిజ్ఞానం
భవమోక్షస్య కారణమ్ |
యేనాద్వితీయమానందమ్
బ్రహ్మ సంపద్యతే బుధైః||
బ్రహ్మా భిన్నత్వవిజ్ఞానం-
బ్రహ్మము కన్నా భిన్నము కాను అనే జ్ఞానము
భవమోక్షస్య కారణమ్
సంసారసాగరమునుంచి మోక్షముకు కారణము
ఆ బ్రహ్మము కన్నా భిన్నము కాను అనే జ్ఞానము ఎలాంటిది?
యేన అద్వితీయమానందమ్
ఏ జ్ఞానముచే అద్వితీయమైన ఆనందము ( పొందబడునో)
ఆ బ్రహ్మము కన్నా భిన్నము కాను అనే జ్ఞానము చే అద్వితీయమైన ఆనందము పొందబడును
ఆ జ్ఞానముతో ఇంకా ఏమి వస్తుంది?
బ్రహ్మ సంపద్యతే బుధైః
పండితులచే బ్రహ్మత్వము పొందబడును
ఆ బ్రహ్మము కన్నా భిన్నము కాను అనే జ్ఞానము చే బ్రహ్మత్వము పొందబడును ,
అంతాకలిపి 225 వ శ్లోక తాత్పర్యము:
ఆ బ్రహ్మము కన్నా భిన్నము కాను అనే జ్ఞానము చే అద్వితీయమైన ఆనందము పొందబడును, పండితులచే బ్రహ్మత్వము పొందబడును. అదే సంసారసాగరమునుంచి మోక్షముకు కారణము.
అహం బ్రహ్మాస్మి అన్న మాటే, తను బ్రహ్మము కన్నా భిన్నము కాదు అని. అది ఆత్మ నిజస్వరూపము తెలిసికొనివాడు చెప్పగల మాట. అంటే అహం బ్రహ్మాస్మి అనడానికి మనకి ఆత్మ నిజస్వరూపము తెలియాలి. అప్పుడే ఆ మాట అనగలుగుతాము
||ఓమ్ తత్ సత్||