!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 226-227

||ఓమ్ తత్ సత్||


వివేక చూడామణి  శ్లోకములు 226- 227 


ఈ రెండు శ్లోకాలలో ఆధ్యాత్మిక విచారణ ఒక మలుపు తిరిగింది అని అనుకోవచ్చు. ఇప్పటిదాకా ఆత్మ అన్న మాటవింటూ , ఇప్పుడు బ్రహ్మము మీదకి పోతుంది మన విచారణ.


224 225 వ శ్లోకాలలో విన్న మాటలు మూడు.


1. ఆత్మ నిజస్వరూపము ఎరిగినవాడు, దుఃఖములేనివాడై, ఆనందమే మూర్తిగా గలవాడగును , తాను ఎవరివలనను భయపడడు.


2. మోక్షము కోరువానికి, తన ( ఆత్మ)  యొక్క నిజస్వరూపము తెలిసికోవడము కన్నా (భవబంధ ముక్తికి) ఇంకో మార్గము లేదు


3. మానవుడు తను బ్రహ్మము కన్నా భిన్నము కాను అనే జ్ఞానము చే అద్వితీయమైన ఆనందము పొందును. అదే బ్రహ్మత్వము కూడా. అదే సంసారసాగరమునుంచి మోక్షముకు కారణము కూడా.


గురువు ఆత్మగురించి విశదీకరించి, ఆత్మ పంచకోశాలకి  అతీతముగా, హృదయాంతరాళములలో వుంటుంది అని చెప్పి, ఆ పంచకోశాలు తీసివేయడమైన తరువాత మిగిలిన  శూన్యత్వములో వున్న,  ఆత్మ నిజస్వరూపము మనముందు బయటపెట్టాడు.  


ఆత్మజ్ఞానముతో , అంటే ఆత్మ నిజస్వరూపముతో , మనకి సంసార బంధ విముక్తి కూడా అని , ఇప్పటి దాకా విన్న వాక్యాలలో తెలుస్తుంది.


కాని 225వ శ్లోకములో, ’బ్రహ్మభిన్నత్వవిజ్ఞానం’,  అంటే ఆత్మ  బ్రహ్మము కన్నా వేరు కాదు అనే జ్ఞానము, సంసార బంధ విముక్తికి  కారణము అని చెపుతాడు.


ఈ రెండు మాటలు చదివితే మనకి తెలిసేది ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము రెండూ మోక్షానికి కారణము లు అని చెప్పవచ్చు. 


బ్రహ్మ భిన్నత్వజ్ఞానము అనే మాటతో , గురువు మన ఆధ్యాత్మిక విచారణని, ఇప్పటి దాకా విన్న  ఆత్మజ్ఞానము నుంచి బ్రహ్మ జ్ఞానముకి తరలిస్తున్నాడు.   


ఇక్కడ నుంచి శ్లోకాలలో గురువు, మనము పరమాత్మ అనుకునే ఆత్మ, సర్వాంతర్యామి అనుకునే బ్రహ్మము ఒకటే అనే మాటను విశదీకరిస్తున్నాడు. అంటే ఇక ముందు శ్లోకాలలో బ్రహ్మము గురించి వింటాము.


ఇక 226-227 శ్లోకాలు.



శ్లోకము 226


బ్రహ్మభూతస్తు సంస్మృత్యై

 విద్వాన్నావర్తతే పునః |

విజ్ఞాతవ్య మతః సమ్యగ్

 బ్రహ్మభిన్నత్వమాత్మనః||


బ్రహ్మభూతస్తు సంస్మృత్యై

 విద్వాన్నావర్తతే పునః |


బ్రహ్మభూతస్తు విద్వాన్ - 

బ్రహ్మగా అయిన విద్వాంసుడు


సంస్మృత్యై న పునః ఆవర్తతే|

సంసారముకొరకు మరల తిరిగిరాడు


2 విజ్ఞాతవ్యమ్ అతః సమ్యగ్

 బ్రహ్మాభిన్నత్వమాత్మనః||


విజ్ఞాతవ్యమ్ అతః సమ్యగ్ - 

అందువలన బాగుగా తెలిసికొనవలసినది - ఏమిటి?


బ్రహ్మాభిన్నత్వమాత్మనః-

బ్రహ్మ అభిన్నత్వం ఆత్మనః-

ఆత్మయొక్క బ్రహ్మకంటే అభిన్నత్వము

అంటే బ్రహ్మ ఆత్మ ఒకటే అని.


226వ శ్లోక తాత్పర్యము:


బ్రహ్మగా అయిన విద్వాంసుడు, సంసారముకొరకు మరల తిరిగిరాడు. అందువలన ఆత్మయొక్క బ్రహ్మకంటే అభిన్నత్వము బాగుగా తెలిసికొనవలసినది, అంటే ఆత్మ బ్రహ్మ ఒకటే అని తెలిసికొనవలసినది. 


ఆత్మస్వరూపము తెలిసికొనిన వాడు, మోక్షముపొందుతాడు అది తెలిసినదే.  ఆత్మ స్వరూపము తెలిసికొనినవాడు , ఆత్మ బ్రహ్మముల అభిన్నత్వము అంటే భిన్నము కాదు అని  తెలిసికొని  బ్రహ్మత్వము పొందిన వాడి లాగా మోక్షముతో మళ్ళీ పునర్జన్మ లేని వాడు అవుతాడు. 


శ్లోకము 227:


సత్యం జ్ఞానం అనన్తం బ్రహ్మ

విశుద్ధమ్ పరమ్ స్వతః సిద్ధమ్|

నిత్యానన్దైకరసమ్ ప్రత్యగ్

అభిన్నమ్ నిరన్తరమ్ జయతి||


బ్రహ్మ నిరంతరం జయతి - అన్నది ఈ శ్లోకానికి మూలపాఠము. బ్రహ్మ నిరంతరం జయతి అంటే బ్రహ్మము ఎల్లప్పుడు జయించును.  


ఎల్లప్పుడు జయించు ఆ బ్రహ్మము  ఎలాంటిది?


ఆత్మము బ్రహ్మము ఒకటే అయినప్పుడు వాటి రూపము ఒకటే వుండాలి. అందుకని ఈ బ్రహ్మము వర్ణనలో ఆత్మ రూపము మళ్ళీ చూస్తాము.


227వ శ్లోకములో .. బ్రహ్మము గురించి-


సత్యం జ్ఞానం అనన్తం - 

సత్యము, జ్ఞానరూపమైనది, అనన్తమైనది


విశుద్ధమ్ పరమ్ స్వతః సిద్ధమ్ -

నిర్మలము, స్వయంజాత్యము


నిత్యానన్దైకరసమ్ ప్రత్యగ్ అభిన్నమ్ -

నిత్యానందైక రసము, ప్రత్యగాత్మకు భిన్నము కానిది


 బ్రహ్మము- సత్యము, జ్ఞానరూపమైనది, అనన్తమైనది, నిర్మలము, స్వయంజాత్యము, నిత్యానందైక రసము, ప్రత్యగాత్మకు భిన్నము కానిది - అదే ఆత్మ కూడా. ఈ మాటతో శ్లోక తాత్పర్యము ఇలా చెప్పవచ్చు.


227 వ శ్లోక తాత్పర్యము:


సత్యము, జ్ఞానరూపమైనది, అనన్తమైనది, నిర్మలము, స్వయంజాత్యము, నిత్యానందైక రసము, ప్రత్యగాత్మకు భిన్నము కానిది అగు బ్రహ్మము ఎల్లప్పుడు జయించును 


ఇవన్నీ విన్నమాటలే అయినా , ఆధ్యాత్మిక విచారణలో ఈ మాటలయొక్క ముఖ్య అర్థము మనకి తెలియాలి. అందుకు ఆ మాటలని ఇంకోమారు పరిశీలిద్దాము.


సత్యం - ఇది సత్ అన్నమాటతో కలిసినది. సత్ అంటే అన్ని కాలములలో మారని పదార్థము. సత్యము అంటే అదే . అన్ని కాలములలో మారని నిజము.


జ్ఞానం - దేని వలన అన్నిటినీ తెలుసుకొనగలమో అది జ్ఞానము. అన్ని జ్ఞానాలకి అదే మూలం. ఆ జ్ఞానము అన్నింటినీ వెలిగించి చూపేది . జ్ఞానము స్వయం ప్రకాశమైనది అంటే, దాని అర్థము జ్ఞానము తెలుసుకోడానికి ఇంకో దాని ( దీపము) సహాయము అక్కరలేదు. అది స్వయం  ప్రకాశము. అది ఎప్పుడూ వుంటుంది. అంటే నిత్యము అన్నమాట.


అనన్తం -  అంతము లేనిది. తుది మొదలు లేనిది ( ఆత్మ). సత్యము ఎలా అన్ని కాలములలో నిలబడుతుందో అది అనంతము.  


సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ - ఉపనిషదులలో బ్రహ్మము అన్నది ఈ మూడు మాటలతో  కలిసినది.


విశుద్ధమ్ - నిర్మలమైనది. అసూయ ముఉనగు రజో తామస గుణములచే మలినము కానిది


పరమ్- అన్నిటికి అతీతమైనది, మాయాతీతమైనది


స్వతః సిద్ధమ్  -  స్వయంజాత్యము, స్వయముగా సిద్ధించినది. ఇతర ప్రమేయము లేనిది.


నిత్యానన్దైకరసమ్ - దుఃఖ స్పర్శలేని నిత్య సుఖ స్వరూపము. ఇది స్వతః సిద్ధమైన ఆనంద స్వరూపము. ఇది ఇంకో విషయసంబంధము వలన కలిగే ఆనంద ము కాదు. 


ఈ మాటలు పదే పదే వస్తూ వుంటాయి కనుక వాటి అర్థాలు మళ్ళీ విన్నాము.


||ఓమ్ తత్ సత్||



































































































 






 








వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227

Om tat sat !

 

 

 

    •