!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 228-229
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 228- 229
226-27 శ్లోకాలలో ఆధ్యాత్మిక విచారణ ఒక మలుపు తిరిగింది అని అనుకున్నాము. 228- 229 శ్లోకాలలో ఆ విచారణ బ్రహ్మము మీదనే.
ఇక 228-229 శ్లోకాలు
సదిదం పరమాద్వైతమ్
స్వ స్మాత్ అన్యస్య వస్తునో అభావాత్|
న హ్యన్యదస్తి కించిత్ సమ్యక్
పరతత్త్వ బోధ సుదశాయామ్ ||228||
యదిదం సకలం విశ్వమ్
నానారూపం ప్రతీతం అజ్ఞానాత్|
తత్ సర్వం బ్రహ్మైవ
ప్రత్యస్తాశేషభావనా దోషమ్ ||229||
శ్లోకము 228:
సదిదం పరమాద్వైతమ్
స్వ స్మాత్ అన్యస్య వస్తునో అభావాత్|
న హ్యన్యదస్తి కించిత్ సమ్యక్
పరతత్త్వ బోధ సుదశాయామ్ ||228||
సదిదం పరమాద్వైతమ్ -
సత్ ఇదం పరమాద్వైతమ్-
ఈ బ్రహ్మము సదా వుండునది , పరమ అద్వితీయము.
అంటే ఈ బ్రహ్మము నిత్యము. ఇది కాక ఇంకోటి వున్నది అన్నమాట లేదు. అది అద్వితీయము
స్వ స్మాత్ అన్యస్య వస్తునో అభావాత్ -
తనకన్నా భిన్నమైన వస్తువు లేనందు వలన - అది అద్వితీయము ;
సమ్యక్ పరతత్త్వబోధ సుదశాయామ్ -
మంచి పరతత్త్వజ్ఞానము కలిగిన దశలో
న హ్యన్యదస్తి కించిత్ సమ్యక్-
న హి అన్యత్ అస్తి కించిత్ సమ్యక్ -
ఇంకొకటి ఏమీ లేదు కదా.
పరతత్వజ్ఞానము కలిగిన దశ అంటే ఏమిటి?
శిష్యుడు ప్రతికోశములోనూ ఇది ఆత్మ స్థానము కాదు అని వదిలేసిన తరువాత మిగిలిన దశ. ఆ దశ లో శిష్యుడు చూసినది ఏమిటి? శూన్యత్వము. ఆ శూన్యత్వము చూడగలిగిన దశ, పరతత్త్వజ్ఞానము కలిగిన దశ.
ఆ దశలో ఇంకొకటి ఏమీ లేదు కదా.
అదేమాటతో మనకి తెలిసేది ఆ బ్ర హము కూడా అద్వితీయము అని.
తాత్పర్యము.
ఈ బ్రహ్మము సదా వుండునది , పరమ అద్వితీయము ; తనకన్నా భిన్నమైన వస్తువు లేనందు వలన - అది అద్వితీయము ; మంచి పరతత్త్వజ్ఞానము కలిగిన దశలో ఇంకొకటి ఏమీ లేదు కదా.
ఇక్కడ తన కన్నా భిన్నమైన ది అనడములో, ఆత్మకన్నా భిన్నమైనది అని. అంటే తను అనడములో తన దేహము ఇత్యాది అనాత్మ వస్తువులు కాదు తన ఆత్మే అని.
ఆత్మ కన్నా భిన్నమైన వస్తువు లేకపోవడము వలన అన్నప్పుడు, ఆత్మ బ్రహ్మము ఒకటే విన్నాము కాబట్టి, బ్రహ్మము అద్వితీయము , అంటే రెండవది లేనిది అని భావము.
శ్లోకము 229:
యదిదం సకలం విశ్వమ్
నానారూపం ప్రతీతం అజ్ఞానాత్|
తత్ సర్వం బ్రహ్మైవ
ప్రత్యస్తాశేషభావనా దోషమ్ ||229||
యదిదం సకలం విశ్వమ్ -
ఈ సమస్త ప్రపంచము
నానారూపం ప్రతీతం -
అనేకరూపములు గలదిగా కనిపించును
ఎందుకు ఈ సమస్త ప్రపంచము అనేక రూపములు గలది అని కనిపించును ?
అజ్ఞానాత్ - అజ్ఞానము వలన.
మనము అజ్ఞానము వలన ఈ ప్రపంచమంతయూ అనేక రూపములు కలది గా భావిస్తాము. కాని అదంతా బ్రహ్మమే.
తత్ సర్వం బ్రహ్మైవ
అది అంతయూ బ్రహ్మమే
ప్రత్యస్తాశేషభావనా దోషమ్
ప్రత్యస్త అశేష భావనాదోషమ్
భావనాదోషములనుంచి సంబంధములేని ( బ్రహ్మమే అని)
229 శ్లోక తాత్పర్యము :
ఈ సమస్త ప్రపంచము అజ్ఞానము వలన అనేకరూపములు గలది అని కనిపించును. అది అంతయూ భావనాదోషములనుంచి సంబంధములేని బ్రహ్మమే
సమస్త ప్రపంచము బ్రహ్మరూపమే అనడములో - వేదాంత పండితులు ఒక ఉదాహరణ ఇస్తారు. అది మట్టి కుండ , బొమ్మలు. మట్టితో నీళ్లకుండ , తెనె కుండ, వెన్న కుండ అలాగ అనేక రకముల కుండలు బొమ్మలు వేరు వేరు పేర్లతో చూస్తాము , అవన్నీ మట్టిలోచి వచ్చినవే మట్టిలో కలిసి పోయేవే.
అలాగే ప్రపంచములో అనేక రూపాలతో అనేక వస్తువులు కనపడతాయి. అవన్నీ బ్రహ్మములో నుంచి వచ్చి బ్రహ్మములో కలిసిపోయేవే. చూసేవన్నిటికి ప్రత్యేకరూపాల నామములు మన భావనలద్వారా వచ్చినవే. భావనా దోషము లేనిది బ్రహ్మమొక్కటే. అది దీని తాత్పర్యము.
||ఓమ్ తత్ సత్||