!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 230-231
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 230- 231
ముందు శ్లోకాలలో ( 228,229 లో) ఆధ్యాత్మిక విచారణ ఆత్మ నుంచి బ్రహ్మము మీదకి మళ్ళింది.
మనము విన్నది -
1 ఈ బ్రహ్మము సదా వుండునది , పరమ అద్వితీయము ; తనకన్నా భిన్నమైన వస్తువు లేనందు వలన - అది అద్వితీయము ; మంచి పరతత్త్వజ్ఞానము కలిగిన దశలో ఇంకొకటి ఏమీ లేదు. బ్రహ్మము సర్వత్ర వ్యాపించి వుంది, అంటే అనేక రూపములు కలది గా కనిపించే ప్రపంచమంతా బ్రహ్మ స్వరూపమే అని.
2 సమస్త ప్రపంచము అజ్ఞానము వలన అనేకరూపములు గలది అని కనిపించును. ప్రపంచము అంతయూ భావనా దోషములనుంచి సంబంధములేని బ్రహ్మమే. అనేకరూపములుగా కనిపించే ఈ ప్రపంచము భావనాదోషములవలన వేరు వేరుగా కనిపించుచునది అనికూడా విన్నాము.
మరి ఆ మాటకి, అంటే భావనాదోషములవలన ఒకటే వేరు వేరుగా కనిపించుచునది అన్న మాటకి ఉదాహరణ ఎమన్నా వుందా ? అంటే గురువుగారి సమాధానము - ’వుంది’ అని. ఆ ఉదాహరణ 230 231వ శ్లోకాలలో వింటాము.
ఈ రెండు శ్లోకాలలో , ప్రపంచమంతా బ్రహ్మమే అన్న మాటని , మట్టి కుండల ఉదాహరణతో గురువు విశదీకరిస్తాడు.
శ్లోకము 230-231
మృత్కార్యభూతోఽపి మృదో న భిన్నః
కుమ్భోఽస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్|
న కుమ్భరూపం పృథగస్తి కుమ్భః
కుతో మృషాకల్పిత నామమాత్రః||230||
కేనాపి మృద్భిన్నతయా స్వరూపమ్
ఘటస్య సందర్శయితుమ్ న శక్యతే|
అతో ఘటః కల్పిత ఏవ మోహాత్
మృదేవ సత్యం పరమార్థ భూతమ్||231||
శ్లోక వివరణ:
శ్లోకము 230
మృత్కార్యభూతోఽపి మృదో న భిన్నః
కుమ్భోఽస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్|
న కుమ్భరూపం పృథగస్తి కుమ్భః
కుతో మృషాకల్పిత నామమాత్రః||230||
మొదటి పాదము:
మృత్కార్యభూతోఽపి మృదో న భిన్నః-
మృత్కార్యభూతః మృదో న భిన్నః అపి -
మట్టితో చేయబడినది మట్టికన్నా వేరైనది కాదు కూడా
కుమ్భోఽస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్ -
కుమ్భః సర్వత్ర తు మృత్స్వరూపాత్ అస్తి-
కుండ అంతటా మట్టిరూపము గలది కదా
న కుమ్భరూపం పృథగ్ అస్తి -
కుమ్భరూపం పృథగ్ న అస్తి -
కుండకు మట్టికన్నరూపము వేరే లేదు
కుమ్భః కుతః- కుండ ఎక్కడ
కుండ అన్నమాట ఎలావచ్చింది?
మృషాకల్పిత నామమాత్రః
అది కల్పించబడిన పేరే గదా!
శ్లోక తాత్పర్యము:
మట్టితో చేయబడినది మట్టికన్నా వేరైనది కాదు. కుండ అంతటా మట్టిరూపము గలది కదా. కుండకు మట్టికన్నరూపము వేరే లేదు. మరి కుండ ఎక్కడ ? అది కేవలము కల్పించబడిన పేరే గదా!
అంటే ఇక్కడ ఒకే పదార్థము( మట్టిని) వేరు వేరు రూపాలలో ( కుండల రూపాలలో) వున్న సంగతి మన గురువు గారు ముందు పెట్టాడు. అదే లాగా బ్రహ్మము అనేకరూపాలలో కనిపించే ప్రపంచము అని తరువాత గురువు చెపుతాడు
231 వ శ్లోకము కూడా మట్టి కుండ గురించే.
శ్లోకము 231:
కేనాపి మృద్భిన్నతయా స్వరూపమ్
ఘటస్య సందర్శయితుమ్ న శక్యతే|
అతో ఘటః కల్పిత ఏవ మోహాత్
మృదేవ సత్యం పరమార్థ రూపమ్||231||
ఇక 231 వ శ్లోకము అర్థము చూద్దాము:
కేనాపి - ఎవరి చేతనైనా గాని ( బ్రహ్మ కూడా!)
ఘటస్య మృద్భిన్నతయా స్వరూపమ్
కుండయొక్క స్వరూపము మట్టికన్నా వేరుగా
సందర్శయితుమ్ న శక్యతే
చూపుటకు శక్యము కాదు.
అతో ఘటః కల్పిత ఏవ మోహాత్
అందువలన కుండ అజ్ఞానముతో నామ మాత్రముగా కల్పించబడినది మాత్రమే
మృదేవ సత్యం పరమార్థ రూపమ్|
మట్టియే సత్యము. కుండయొక్క ముఖ్యరూపము.
232 వ శ్లోక తాత్పర్యము:
ఎవరి చేతనైనా గాని ( బ్రహ్మ కూడా!) కుండయొక్క స్వరూపము మట్టికన్నా వేరుగా చూపుటకు శక్యము కాదు.
అందువలన కుండ అన్న పేరు అజ్ఞానముతో కల్పించబడినది మాత్రమే. మట్టియే సత్యము. కుండయొక్క ముఖ్యరూపము.( మట్టియే అని).
ఈ రెండు శ్లోకాల తాత్పర్యము:
మట్టితో చేయబడినది మట్టికన్నావేరైనది కాదు. కుండ అంతటా మట్టిరూపము గలది. కుండకు మట్టి కన్నా వేరే రూపము లేదు. కుండ అన్నది కల్పించబడిన నామము మాత్రమే. ఎవరి చేతనైనా గాని ( బ్రహ్మ కూడా!) కుండయొక్క స్వరూపము మట్టికన్నా వేరుగా చూపుటకు శక్యము కాదు. మట్టియే సత్యము.
మట్టితో చేయబడిన కుండ ఎలాగ మట్టి రూపము కలదో అలాగే, బ్రహ్మము చే చేయబడిన ఈ ప్రపంచము అంతా బ్రహ్మ రూపమే. భావనాదోషములవలన మనము అన్ని వస్తువులను వేరు వేరుగా చూచుచున్నాము. వేరు వేరు గా కనిపించే ప్రతి వస్తువు లోనూ ( ప్రాణులతో కూడా కలిపి) , బ్రహ్మము వున్నది. అదే ఈ ప్రపంచము అంతా బ్రహ్మ రూపమే అనడము లో అర్థము.
ఈ మాట ముందు శ్లోకములో వస్తుంది.
||ఓమ్ తత్ సత్ ||