Sundarakanda Chapter 53

Sita prays for Hanuman's safety

Chapter 53:

Summary : Dissuaded by Vibhishana from killing Hanuman , Ravana orders that the bound Hanuman's tail be set on fire and taken round the city of Lanka. As the captive Hanuman was being taken around the Rakshasa women tell the unpleasant news to Sita. Sita very much disturbed then prays to the Lord of Fire that he should protect Hanuman. Hanuman could feel the effect immediately and was left wondering at the passiveness of the fire He ascribes it to Sita , Rama or the friendship of his father Vayu with Agni !

For telugu Home page

click here

సుందరకాండ
ఏబదిమూడవ సర్గము

తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః |
దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తర మబ్రవీత్ ||

తా|| మహాబలశాలి అయిన దశగ్రీవుడు దేశకాలానుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములు విని అతనితో ఇట్లు పలికెను.

సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హితా |
అవశ్యంతు వధాదన్యః క్రియతామస్య నిగ్రహః ||
కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణమ్|
తదప్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు ||

తా|| " నీవు చెప్పినది నిజము. దూతను వధించుట నిందనీయము. ఈ వానరుని మఱియొక విధముగా శిక్షింపవలెను. వానరులకు వారి వాలముపై ఎక్కువ మక్కువ. అదియే వారి అలంకారము. వెంటనే ఇతను వాలమునకు నిప్పు అంటింఛుడు. ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును.

ఆజ్ఞాపయద్రాక్షసేంద్రః పురం సర్వం సచత్వరమ్ |
లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిః పరిణీయతామ్ ||

తా|| "మండుచున్న వాలముతో ఈ వానరునిని పురమునందంతటనూ త్రిప్పుడు" అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించెను.

స భూయ స్సంగతైః క్రూరై రాక్షసైర్హరిసత్తమః |
నిబద్ధః కృతవాన్ వీరః తత్కాలసదృశీమ్ మతిమ్ ||
తతస్తే సంవృతాకారం సత్వవంతం మహాకపిమ్|
పరిగృహ్య యయుర్హృష్టా రాక్షసాః కపికుంజరమ్ ||

తా|| కౄరులైన రాక్షసులందరూ కలిసి ఆ వానరోత్తముని దృఢముగా బంధించిరి. ఆ బంధములనుండి బయటపడగల సామర్థ్యమున్ననూ ఆ వీరుడు సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ బంధముల లోనే యుండెను. ఆప్పుడు ఆ రాక్షసులు సంతోషించుచూ మహాబలశాలియూ తనమనోభావములను లోపలనే ఉంచుకున్న కపివరుని పట్టుకొని వెళ్ళిరి.

శంఖభేరీనినాదైస్తం ఘోషయంతః స్వకర్మభిః |
రాక్షసాః క్రూరకర్మాణః చారయంతిస్మ తాం పురీమ్ ||

తా|| కౄరకర్ములైన రాక్షసులు సంఖానాదములతో భేరీధ్వనులతో తమభుఅజములను తట్టుకొనుచూ సింహగర్జనలతో ఆ లంకానగరమంతటయూ ప్రతిద్వనింప చేయుచూ ఆ హనుమంతుని త్రిప్ప సాగిరి.

దీప్యమానే తతస్తస్య లాంగూలాగ్రే హనూమతః |
రాక్షస్య స్తా విరూపాక్ష్యః శంసుర్దేవ్యాస్తదప్రియమ్ ||
యస్త్వయా కృత సంవాదః సీతే తామ్రముఖః కపిః |
లాంగూలేన ప్రదీప్తేన స ఏష పరిణీయతే ||
శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోసమమ్ |
వైదేహీ శోకసంతప్తా హుతాశన ముపాగమత్ ||

తా|| ఆ హనుమంతుని వాలాగ్రము మండుచుండగా వికృతనేత్రములు గల రాక్షసవనితలు ఆ అప్రియమైన విషయమును సీతాదేవితో చెప్పిరి. " ఓ సీతా ఇంతకముందు నీతో మాట్లాడిన ఎర్రని ముఖముగల వానరుని వానరుని వాలమునకు నిప్పు అంటించి రాక్షసులు అతనిని నగరమంతయూ త్రిప్పుచున్నారు."
తన అపహరణమునకు సమమైన ఆ కౄరమైన వచనములను వినిన సీతాదేవి బాధకులొనై అగ్నిదేవుని ప్రార్థించెను.

మంగళాభిముఖితస్య సా తదాసీన్మహాకపేః |
ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనమ్ ||

తా|| విశాలాక్షియూ సాధ్వియూ అయిన సీతాదేవి హనుమంతుని క్షేమమును గోరుచూ అగ్నిదేవునకు ఇట్లు విన్నవించెను.

యద్యతి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యదిచాస్తేకపత్నీత్వం శీతో భవ హనూమతః ||
యదికించిదనుక్రోశః తస్యమయ్యస్తి ధీమతః |
యది వా భాగ్య శేషోమే శీతో భవ హనూమతః ||
యదిమాం వృత్తసంపన్నాం తత్సమాగమలాలసామ్ |
స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః ||
యదిమాం తారయేదార్యః సుగ్రీవసత్యసంగరః|
అస్మాదుఃఖాంబుసంరోధాత శీతోభవహనూమతః ||

తా|| "నేను పతిసేవాపరాయణనే ఆయినచో తపమాచరించియున్నచో నేను నిష్కలంక పతివ్రత అయినచో ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము. ఓ దేవా నేను ఏమాత్రమైననూ ధీమంతుడైన ఆ శ్రీరామ ప్రభువు యొక్క దయకు నోచుకునియున్నచో నాపుణ్యఫలముఏకొంచమైననూ మిగిలినచో మారుతిని చల్లగాచూడుము. ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీలసంపన్నగా భావించినచో , తనసమాగమమునకు నేను వేయికళ్ళతో ఎదురుచూచున్నట్లు ఎఱిగినచో ఓ హవ్యవాహనా వాయుసూనుని చల్లగా చూడుము. పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసముద్రమునుండి గట్టేక్కింపగలడేని ఓ వైశ్వానరా హనుమంతుని చల్లగాచూడుము."

తతస్తీక్షార్చిరవ్యగ్రః ప్రదక్షిణశిఖోనలః |
జజ్వాల మృగశాబాక్ష్యాః శంసన్నివ శివం కపేః ||
దహ్యమానే చ లాంగూలే చింతయామాస వానరః |
ప్రదీప్తోగ్నరయం కస్మాత్ న మాం దహతి పర్వతః |
దృశ్యతే చ మహాజ్వాలః కరోతి న చ మే రుజమ్ ||
సీతాయాశ్చానృశంస్యేన తేజసా రాఘవస్య చ |
పితుశ్చ మమ సఖ్యేన న మాం దహతి పావకః ||

తా|| సీతాదేవియొక్క ప్రభావమున హనుమంతునికి క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అనునటుల తీక్ష్ణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిన పూర్వకుముగా ప్రజ్వలింపసాగెను. వాలము దహింపబడుచుండగా వానరోత్తముడు ఇట్లు ఆలోచించసాగెను." ప్రజ్వలించుచున్న ఈ అగ్ని నన్ను ఏల కాల్చుట లేదు. మహాజ్వాలలతో కనపడుచున్న ఈ అగ్ని నన్నేమాత్రము బాధించుట లేదు. సీతాదేవి కనికరమువలను లేక శ్రీరాముని తేజోప్రభావమువలన లేక నాతండ్రిఅయిన వాయుదేవునకు మిత్రుడగుటవలన అగ్ని నన్ను దహింపకయుండవచ్చును."

కథమస్మద్విధస్యేహ బంధనం రాక్షసాధమైః |
ప్రతిక్రియాస్య యుక్తాస్యాత్ సతి మహ్యం పరాక్రమే ||

తా|| ఈ రాక్షసాధములు రాముని బంటు అయిన నన్ను బంధింపగల్గిరి. నేను పరాక్రమవంతుడనైనచో దీనికి ప్రతీకారము చేయవలెను"

తతశ్చిత్యా చ తాన్ పాశాన్ వేగవాన్ వై మహాకపిః|
ఉత్పపాథ వేగేన ననాద చ మహాకపిః||
విముక్తశ్చాభవత్ శ్రీమాన్ పునః పర్వతసన్నిభః |
వీక్షమాణశ్చ దదృశే పరిఘం తోరణాశ్రితమ్ ||
సతం గృహ్య మహాబాహుః కాలాయసపరిష్కృతమ్ |
రక్షిణస్తాన్ పునస్సర్వాన్ సూదయామాస మారుతిః||

తా|| అంతట మహాబలశాలిఅయిన హనుమంతుడు ఆ బంధనములను చేదించుకొని వేగముగా ఆకసమునకు ఎగిరి పెద్దగా గర్జించెను.ధీశాలిఅయిన హనుమంతుడు బంధవిముక్తుడైన పిమ్మట మఱల పర్వత సదృశుడై అటినిటు పరికించిచూడగా ఆయన దృష్టి తోరణద్వారముపైనున్న ఇనుపగుదియపై బడెను. మాహాబాహువైన హనుమంతుడు ఆ ఇనుప గుదియతో ఆ ద్వారరక్షకులనందరిని సంహరించెను

స తాన్నిహత్వా రణచండ విక్రమః
సమీక్షమాణః పునరేవ లంకాం|
ప్రదీప్తలాంగూలకృతార్చిమాలీ
ప్రకాశతాదిత్యైవార్చిమాలీ ||

తా|| యుద్ధమున వీరహార మొనర్చి రాక్షసులను పరిమార్చిన హనుమంతుడు మఱల లంకను పరికించిచూడసాగెను. అప్పుడు అతడు మండుచున్న వాలాగ్నిజ్వాలలతో ఒప్పుచూ ఆకాసములో ప్రకాశించుచున్న సూర్యునివలె తేజరిల్లెను.

సుందరకాండ
ఏబదిమూడవ సర్గము
సమాప్తము