Bhagavadgita !
Chapter 6
Atma samyamana yoga !
శ్లోక తాత్పర్యాలు
|| om tat sat ||
శ్రీ భగవానువాచ:
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ||
తా|| "ఎవడు చేయవలసిన కర్మలను ఫలాపేక్షలేకుండా చేయునో అతడే సన్న్యాసియు యోగియు అగును. అగ్నిహోత్రము వదిలిన వాడు కాని కర్మలను విడిచిన వాడు గాని (సన్న్యాసియు యోగియు ) కాడు".
శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః
భగవద్గీత
ఆఱవ అధ్యాయము
అత్మసంయమన యోగము:
ఈ అధ్యాయము పేరు ఆత్మ సంయమన యోగము
ఆత్మ సంయమనము అంటే ఆత్మ నిగ్రహము.
అది అత్మకి సంబంధించిన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అన్నిటినీ నిగ్రహించడము అన్నమాట.
అది ఎలాగ అన్న మాటే ఈ అధ్యాయముయొక్క ముఖ్య విషయము.
ఈ అధ్యాయముకూడా కృష్ణ భగవానుని మాటతోనే మొదలగుతుంది
శ్లోకము 1
శ్రీ భగవానువాచ:
శ్లో|| అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ||6-01||
అంటే
స|| యః కర్మఫలం అనాశ్రితః కర్మ కార్యం కరోతి - సః సన్న్యాసీ | సః యోగీ చ|
న నిరగ్నిః సన్న్యాసీ చ | న అక్రియః సన్న్యాసీ చ||
యః కర్మఫలం అనాశ్రితః ఎవరు కర్మఫలమును అపేక్షించ కుండా
కార్యం కర్మ కరోతి - కర్మ చేయునో,
స సన్న్యాసీ చ - వాడు సన్న్యాసి,
సః యోగీ చ| - వాడే యోగి కూడా.
నిరగ్నిః న సన్న్యాసీ చ | -
అగ్నిహోత్రము వదిలిన వాడు సన్న్యాసి కాడు.
అక్రియః న సన్న్యాసీ చ -
కర్మములను వదిలిన మాత్రమున సన్న్యాసి కాడు.
తా|| ఎవరైతే ఫలాపేక్షలేకుండా చేయవలసిన కర్మ చేస్తాడో వాడే "సన్యాసి" లేక "యోగీ" అనబడును.
అగ్నిహోత్రమును కర్మలను విడిచినవాడు సన్యాసి అనబడడు.
ఐదవ అధ్యాయములో కర్మసన్యాసయోగము గురించి చెప్పడము అయింది. ఆ సందర్భములో కర్మ ఫలములు త్యాగము చేస్తేనే సన్యాసీ అని చెప్పినా, కర్మసన్యాసముతో సన్యాసి అవుతాడు అనే భావము కలగవచ్చు. అటువంటి భావన తొలగించడమే దీని అర్థము.
సన్యాసము అన్నది కర్మఫలములను త్యాగము చెయ్యడమే కాని కర్మత్యాగములు కాదు అన్న మాట.
ఇంకొక మాట.
మనకి సన్న్యాసి అనగానే శంకరాచార్యులవారు భజగోవిందంలో చెప్పిన ఒక రూపము కనిపిస్తుంది.
జటిలో ముండీ లుంచిత కేశః
కాషాయాంబర బహుకృత వేషః|
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో
ఉదరనిమిత్తం బహుకృత వేషః|| భజ||
అంటే చిక్కుబడిన జుట్టు, కాషాయ వస్త్రములు ధరించినవాడు,గుండు పిలకతో వున్నవాడు సన్న్యాసి అనుకుంటాము.
కొంచెము ఆలోచిస్తే సామాన్యము గాసన్న్యాసి అంటే అన్నీ త్యజించినవాడు. అన్నీ అంటే ఏమి త్యజించినవాడు?
- సమస్త కర్మలు
- సమస్త కర్మ సాధనములు
- సమస్త కర్మ ఫలములు
- కర్మఫలములమీద ఆలోచన.
ఇది మన సాధారణ వూహ.
ఇక్కడ కృష్ణుడు సన్న్యాసి అన్నమాటకి కొత్త అర్థముచెపుతున్నాడు. సన్న్యాసి అన్నా, సన్న్యాస మార్గము అన్నా
- కర్మఫలములను త్యజించడము
- కర్మఫలముల మీద ఆశ/ఆలోచన కూడా త్యజించడము.
ఇందులో కర్మ త్యజించడము లేదు. ఇది కర్మ త్యజించడము కాదు.
కర్మ యోగములో కూడా మనము చూచేది
- కర్మఫలములను త్యజించడము,
- కర్మఫలముల మీద ఆశ/ఆలోచన కూడా త్యజించడము.
అంటే కర్మయోగమార్గములో వేళ్ళేవాడికి, సన్న్యా సమార్గములో వేళ్ళేవాడి కి తార తమ్యము లేదు.
అదే కృష్ణుడు చెప్పినది
"స సన్న్యాసీ యోగీ చ
న నిరగ్నిర్ న చాక్రియః||6-01||
సన్యాసము అన్నా యోగము అన్నా ఒకటే అనిచెపుతూ కృష్ణుడు ఇంకోమాట చెపుతాడు.
"సంకల్పము" వదలని వాడు యోగి కాడు అని. ఇది 2 వ శ్లోకములో.
2వ శ్లోకము
శ్లో|| యం సన్న్యాసమితి ప్రాహుః
యోగం తం విద్ధి పాణ్డవ |
న హి అసన్న్యస్త సంకల్పో
యోగీ భవతి కశ్చన ||6.2||
స|| హే పాణ్డవ ! యం సన్న్యాసమ్ ఇతి ప్రాహుః తం యోగం ఇతి విద్ధి |
అసన్న్యస్త సంకల్పః యోగీ న భవతి కశ్చిదపి |
యం సన్న్యాసమ్ ఇతి ప్రాహుః - దేనిని సన్న్యాసము అని అంటారో
యోగం తం విద్ధి పాణ్డవ - అది యోగము అని తెలికొనుము.
అసన్న్యస్తసంకల్పో - సంకల్పము వదలిని వాడు
యోగీ న భవతి కశ్చన - ఎప్పుడు యోగి అవలేడు.
తా|| దేనిని సన్న్యాసము అని అంటారో అది యోగము అని తెలికొనుము.
సంకల్పము వదలిని వాడు ఎప్పుడు యోగి అవలేడు.
సన్న్యాసము యోగము ఎలా సమానము?
ఇక్కడ యోగము అంటే ఏమిటి?
అది జ్ఞాన యోగమా ? కర్మ యోగమా? ధ్యాన యోగమా? లేక భక్తియోగమా?
అది ఒక్క మాటు ఆలోచిద్దాము.
జ్ఞానయోగి ఆత్మ అనాత్మల విచక్షణతో అనాత్మ విషయములను త్యజించి - ఆత్మ యందు స్థిర చిత్తుడై వుండును.
ఇక్కడ అనాత్మవిషయాలను త్యజించడము సన్న్యాసము.
కర్మ యోగి కర్తృత్వము వదిలి, ఫలాపేక్ష త్యజించి , నేను నాది అనే సంకల్పము వీడి ఈశ్వరార్పణముతో కర్మలను ఆచరించును. ఇక్కడ సంకల్పము ఫలాపేక్ష త్యజించడము ముఖ్యము. అలా సంకల్పము ఫలాపేక్ష త్యజించడమే సన్న్యాసము.
ధ్యాన యోగి - బహిర్ముఖవృత్తులను త్యజించి అంతర్ముఖుడై పరమాత్మని ధ్యానించును. ఇక్కడ కూడా బహిర్ముఖవృత్తులను త్యజించడమే సన్న్యాసము.
భక్తి యోగి పరమాత్మ యందు తప్ప మిగిలిన విషయములపై అనాసక్తుడై, దైవ పరాయణుడై వుండును.
ఇక్కడ మిగిలిన చింతనలను త్యజించడము సన్న్యాసము
ఈ విధముగా ఆన్ని యోగములందు బాహ్యప్రాపంచిక విషయాల సన్న్యాసము వుంది కాబట్టి , "యోగం తం విద్ధి పాణ్డవ" అన్నమాట, యే యోగమైనా, ఏ మార్గమైన సరిపోతుంది.
3 వ శ్లోకము
శ్లో|| ఆరురుక్ష్మోర్మునేర్యోగం
కర్మకారణ ముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ
శమః కారణ ముచ్యతే ||3||
స|| యోగం ఆరురుక్షోః మునేః కర్మ కారణం (ఇతి) ఉచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణం (ఇతి) ఉచ్యతే ||
ఆరురుక్షోః అంటే ఎక్కదలిచిన/ సాధించ దలిచిన .
యోగం ఆరురుక్షోః మునేః యోగము సాధించదలిచిన ముని కి,
కర్మకారణ ముచ్యతే - కర్మ సాధనము అని చెప్పబడుచున్నది.
యోగారూఢస్య - యోగము సాధించినవానికి,
శమః కారణముచ్యతే -
అంటే కర్మ నివృత్తి లేక ప్రశాంతచిత్తము ఇంకాముందుపోవడానికి సాధనములు.
తా|| యోగమును ఎక్కదలిచిన /పొందగోరిన మునికి కర్మ సాధనము. దానిని ఎక్కినట్టి వానికి, అంటే ఆ యోగము పొందినవానికి, శమ అంటే కర్మ నివృత్తి సాధనమని చెప్పబడినది.
అంటే సాధకుడు ( యోగము సాధింపదలిచిన వ్యక్తి ) ముందు నిష్కామకర్మద్వారా చిత్తశుద్ధి సంపాదించి, జ్ఞానయోగము ప్రవేశించు స్థానమునకు చేరును. నిష్కామ కర్మ ఆన్నది బాహ్య ప్రపంచానికి సంబంధించినది. చిత్తశుద్ధి లభించుటవలన అప్పుడు శ్రవణ మనన ధ్యానములద్వారా అంతరంగ ప్రయత్నములు మొదలు పెట్టవచ్చు. ఇవే జ్ఞానయోగానికి నాంది. జ్ఞానయోగమే ఆత్మ స్వరూపానుభవము. ఆత్మస్వరూపానుభవము ఆత్మకి సంబంధించిన ఇంద్రియములు మనస్సు బుద్ధి నిగ్రహించడము వలన కలుగు అనుభవము.
యోగారూఢస్య - అంటే యోగస్థితిని పొందినవాడు అని.
మరి యోగస్థితిని పొందినవాడు అని ఎలా తెలుస్తుంది?
4 వ శ్లోకము
శ్లో|| యదాహి నేన్ద్రియార్థేషు
న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్ప సన్న్యాసీ
యోగారూఢస్తదోచ్యతే || 4||
స|| యదా హి ఇన్ద్రియార్థేషు న అనుషజ్జతే , కర్మసు న ( అనుషజ్జతే) ,
(సః) సర్వ సంకల్ప సన్న్యాసీ ( భవతి) తదా (సః) యోగారూఢః (ఇతి)ఉచ్యతే ||
యదాహి నేన్ద్రియార్థేషు - ఎప్పుడు విషయములందు
న అనుషజ్జతే - ఆసక్తి వుంచడో,
కర్మసు న ( అనుషజ్జతే) - కర్మలలో ఆసక్తి వుంచడో,
సర్వ సంకల్ప సన్న్యాసీ - సమస్త సంకల్పములను సన్న్యశించునో (విడిచిపెట్టునో)
తదా (సః) యోగారూఢః (ఇతి)ఉచ్యతే -
అప్పుడు వాడు యోగారూఢుడు అని చెప్పబడును.
తా|| ఎవరు విషయములందు, కర్మ ల యందు ఆసక్తి వుంచడో, సమస్త సంకల్పములను విడిచిపెట్టునో,
ఆ మనుజుడు యోగారూఢుడు అని చెప్పబడును.
ఆ స్థితి ఎలా పొందుతారు?
5 వ శ్లోకము
శ్రీభగవానువాచ:
శ్లో|| ఉద్ధరేదాత్మానా ఆత్మానం
న ఆత్మాన మవసాదయేత్ |
అత్మైవ హ్యాత్మనో బన్ధుః
ఆత్మైవ రిపురాత్మనః ||6.5||
స|| ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్ | ఆత్మానం న అవసాదయేత్ |
ఆత్మనః అత్మ ఏవ బన్ధుః | ఆత్మనః ఆత్మ ఏవ రిపుః|
ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్
తనచేత తనను ఉద్దరించుకొనవలెను.
.
ఆత్మానం న అవసాదయేత్
తనను అధోగతిని పొందించుకొనకూడదు.
అంటే శాస్త్రములు మనకి మార్గముచూపించునేగాని చేయవలసినది మనమే.
కనుక మన కృషిద్వారా మనమే మనలను ఉద్ధరించుకోవాలి .
అదే కృష్ణుని మాట. అంతే కాదు.
.
అత్మైవ ఆత్మనో బన్ధుః -
మనకు మన మనస్సే బంధువు
ఆత్మైవ రిపుః ఆత్మనః -
మనకు మన మనస్సే శత్రువు.
తా|| మనము మన కృషిద్వారా మనమే మనలను ఉద్ధరించుకోవాలి
అలా తనను తానే ఉద్ధరించుకుంటే, తన ఆత్మే తన బంధువు అవుతుంది.
మన మనస్సులో మంచి చెడుకూ ఎప్పుడూ సంగ్రామము అవుతూ ఉంటుంది.
మంచి ఎప్పుడూ ధర్మానికి అనుగుణముగానూ, చెడు ఎప్పుడూ అధర్మానికి అనుగుణముగానూ పోతాయి.
తనను తాను ఉద్ధరించుకోడము అంటే మంచి కి విజయము అన్నమాట.
అంటే తన వివేకముచేత ఎవరు మనస్సుని జయించారో వాళ్ళకి, మనస్సు బంధువులాగా ప్రవర్తిస్తుంది.
ఎవరు మనస్సుని జయించకపోయారో వాళ్లకి వాళ్ళమనస్సు ఎప్పుడూ చెడుమార్గములలోకి దారితీస్తూ
తనకి తానే శత్రువులాగా అవుతుంది.
ఇంకోమాట
ఇక్కడ కర్మసన్యాసయోగములో, మనుష్యుని కర్మలకి పాపాలకి పుణ్యాలకి భగవంతునికి ఏమీ సంబంధము లేదు, అని విన్నాము. అంటే
న కర్తృ త్వం నకర్మాణి
లోకస్య సృజతి ప్రభుః||
భగవంతుడు మనుష్యులకు
కర్తృత్వము గాని కర్మలని గాని కర్మఫలములను గాలి కలిగించడు అని.
అదే మాటను మళ్ళీ ధృవపరుస్తూ చెప్పిన మాట ఇది.
మనము మనలనే మన కృషి ద్వారా ఉద్దరించుకొనవలెను.
మన మనస్సే మనమిత్రువు , మన శతృవు కూడా.
అలాగ ఎవరికి ఆత్మ బంధువు అన్నమాట ఆరవ శ్లోకములో వింటాము.
6 వ శ్లోకము
శ్లో|| బన్ధురాత్మాత్మనః తస్య
యేన ఆత్మైవ ఆత్మనా జితః|
అనాత్మనస్తు శతృత్వే
వర్తేతాత్మైవ శత్రువత్ ||6||
స|| ఏన ఆత్మనైవ ఆత్మా జితః తస్య ఆత్మా ఆత్మనః బన్ధుః |
అనాత్మనస్తు ఆత్మా శత్రువత్ శతృత్వే వర్తేత |
యేన ఆత్మైవ అత్మనా జితః - ఎవరు తనచేతనే మనస్సు జయించునో
బన్ధురాత్మాత్మనస్తస్య - తస్య ఆత్మా అత్మనస్య బన్ధుః - వానికి తన మనస్సు తన బంధువు.
అనాత్మనస్తు - మనస్సు జయించని వానికి
ఆత్మైవ శత్రువత్ శతృత్వే వర్తేత - వారి మనస్సే శత్రువు వలె ప్రవర్తించును
తా|| ఎవడు తనచేతనే మనస్సు జయింపబడినదో, వానికి మనస్సు బంధువు.
మనస్సు జయింపని వానికి తన మనస్సే శత్రువు వలే ప్రవర్తించును
7 వ శ్లోకము
శ్లో|| జితాత్మనః ప్రశాన్తస్య
పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు
తథా మానావమానయోః ||7||
స|| జితాత్మనః ప్రశాన్తస్య శీతోష్ణసుఖదుఃఖేషు
తథా మానావమానయోః సః పరమాత్మా సమాహితః ||
"జితాత్మనః" జయింపబడిన మనస్సు కలవాడు ,
"ప్రశాన్తస్య" పరమశాంతి కలవాడు;
శీతోష్ణసుఖదుఃఖేషు - శీతము ఉష్ణము సుఖ దుఃఖాది ద్వంద్వములందు
తథా మానావమానయోః - మాన అవమానములందు
సః పరమాత్మా సమాహితః - అతడు పరమాత్మానుభవములోనే వుండును
తా|| జయింపబడిన మనస్సు కలవాడు , పరమశాంతి కలవాడు, శీతము ఉష్ణము సుఖ దుఃఖాది ద్వంద్వములందు,
మాన అవమానములందు, అతడు పరమాత్మానుభవములోనే వుండును.
అంటే అట్టి వాళ్ళ మనస్సు చలించదు.
8 వ శ్లోకము
శ్లో|| జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా
కూటస్థో విజితేన్ద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ
సమలోష్టాశ్మ కాంచనః ||8||
స|| జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థః విజితేన్ద్రియః సమలోష్ఠాశ్మకాంచనః యోగీ యుక్తః ఇతిఉచ్యతే ||
జ్ఞానము అంటే శాస్త్ర జ్ఞానము.
అనుభవ జ్ఞానమే విజ్ఞానము .
జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా - జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందినవాడు
కూటస్థః - నిర్వికారుడు
విజితేన్ద్రియః- ఇన్ద్రియములను జయించినవాడు
సమలోష్టాశ్మ కాంచనః -
మట్టిగడ్డ, రాయి, బంగారము లను సమానముగా చూచువాడు
సః యోగీ - అట్టివాడు యోగి
యుక్త ఇత్యుచ్యతే - యోగారూఢుడు అనబడును.
తా|| జ్ఞాన విజ్ఞానములచే తృప్తి పొందిన మనస్సు కలవాడు,ఇంద్రియములను జయించిన వాడు, మట్టి గడ్డ, రాయి,బంగారమును మూడిటిని సమానము గా చూచువాడును, యోగి అనబడుచున్నాడు.
9 వ శ్లోకము
శ్లో|| సుహృన్మిత్రార్యుదాసీన
మధ్యస్థ ద్వేష్య బన్దుషు|
సాధుష్వపి చ పాపేషు
సమబుద్ధిర్విశిష్యతే ||9||
స|| సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బన్ధుషు సాధుషు పాపేషు సమబుద్ధిః (సః) విశిష్యతే ||
సమబుద్ధిః (సః) విశిష్యతే - సమభావము కలవాడు శ్రేష్ఠుడు.
ఎవరియందు సమభావము ? అది వినండి.
సుహృన్మిత్రార్యుదాసీన - సుహృత్ మిత్ర అరి ఉదాసీన
సుహృత్ సహృదయము కలవాడు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు
మధ్యస్థ - తటస్థ స్వభావము కలవాడు
ద్వేష్య - ద్వేష భావము కలవాడుగాను
బన్ధుషు - బంధువుల యందు
సాధుషు - సాధుపురుషులయందు
తా|| ప్రత్యుపకారము కోరకయే మేలు చేయు వారియందు, ప్రత్యుపకారము ఆసించి మేలు చేయువారియందు, శత్రువులందు, తటస్థు లందు, మధ్యవర్తులందు, ద్వేషింపబడ తగిన వారి యందు, బంధువులు, సజ్జనులు, పాపులయందు సమ భావము కలిగియుండు వాడే శ్రేష్ఠుడు.
ఇక్కడ చెప్పబడిన వారు అనేకులు. అనేక మనస్త్వత్వాలతో వుండే వారు. అనేక భావాలలతో వుండే వారు .
వీరందరితో సమభావము కలిగి ఉండడమే సమత్వము.
వీరందరియందు సమత్వముగలవాడు శ్రేష్ఠుడు.
అందరియందు సమత్వము ఉంటే కలిగే శాంతి లాంటి శాంతి, ఇంకోటి ఉండదు.
అయితే ఈ సమత్వము ఎలా వస్తుంది?.
కర్మద్వారా ఒక స్థాయికి వచ్చి, అప్పుడు చిత్తశుద్ధి లభించినతరువాత
శ్రవణ మనన ధ్యాన కర్మలద్వారా రెండో మెట్టు ఎక్కాలి అని ఇంతకు ముందే చెప్పాడు.
ఆ మెట్టు ఎక్కిన తరువాత సమత్వము లభిస్తుంది.
ఇందులో ధ్యానము ఒక ముఖ్య భాగము
ధ్యానము అనగానే, ఎక్కడ ఎలాగ ఎందుకు చేస్తారు అన్న ప్రశ్నలు వస్తాయి?
10 వ శ్లోకము
శ్లో|| యోగీ యుఞీత సతతం
ఆత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా
నిరాశీరపరిగ్రహః || 10||
స|| యోగీ రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీః అపరిగ్రహః సతతమ్ ఆత్మానమ్ యుఞ్జీత ||
యోగీ రహసి స్థితః - యోగి ఏకాంత ప్రదేశములో కూర్చుని
ఏకాకీ - ఏకాకి గా
యతచిత్తాత్మా - మనస్సు స్వాధీనములో ఉన్నవాడై
నిరాశీః - ఆసక్తి లేని వాడై
అపరిగ్రహః - ఇతరులనుండి ఏమీ స్వీకరింపక
యుఞీత సతతం ఆత్మానం - ఆత్మయందు మనస్సుని నెలకొల్పవలెను
తా|| ధ్యానము చేయు యోగి, ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నున్నవాడై, మనస్సుని దేహేంద్రియములను స్వాధీన మొనర్చుకొని , ఆశలేనివాడై, ఇతరులనుండి ఏమీ స్వీకరింపక ఎల్లప్పుడు మనస్సును ఆత్మయందే నెలకొల్పవలెను.
ఆ ధ్యానము ఎక్కడ ఎలాచేయ్యాలి అన్నది కూడా కృష్ణుడు 11-12 శ్లోకాలలో చెపుతాడు
11 వ శ్లోకము
శ్లో|| శుచౌ దేశే ప్రతిష్ఠాప్య
స్థిరమాసనమాత్మనః |
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం
చేలాజిన కుశోత్తరమ్||6.11||
స|| శుచౌ దేశే ఆత్మనః స్థిరం ఆసనమ్ ప్రతిష్ఠాప్య (యోగమ్ కురు)
(తత్ ఆసనం) న అతి ఉచ్ఛ్రితం| న అతి నీచమ్ |చేలాజినకుశోత్తరమ్|
శుచౌ దేశే - పరిశుద్ధమైన ప్రదేశములో
ఆత్మనః స్థిరం ఆసనమ్ ప్రతిష్ఠాప్య - తనకి స్థిరమైన ఆసనము వేసికొని -
( ధ్యానము చేయవలెను)
ఆ ఆసనము ఎలావుండాలి?
న అతి ఉచ్ఛ్రితం| మిక్కిలి ఎత్తుగా కాకుండా
న అతి నీచమ్ | మరీ క్రిందగా కాకుండా
చేలాజినకుశోత్తరమ్ -
దర్భాసనము మీద / జింక లేక పులి చర్మము వేసి / దానిమీద వస్త్రము వేసి - దానిమీద కూర్చొనవలెను
12 వ శ్లోకము
శ్లో|| తత్రైకాగ్రం మనః కృత్వా
యతచిత్తేన్ద్రియక్రియః |
ఉపవిశ్యాసనే యుఞాత్
యోగమాత్మవిశుద్ధయే ||6.12||
స|| తత్ర ఆసనే ఉపవిశ్య, మనః ఏకాగ్రం కృత్వా..
యతచ్చిత్తేన్ద్రియ క్రియః ..ఆత్మ శుద్ధయే యోగం యుఞ్జ్యాత్ ||
తత్ర ఆసనే ఉపవిశ్య- ఆ ఆసనములో కూర్చొని
యతచ్చిత్తేన్ద్రియ క్రియః - మనస్సును స్వాధీనపరచుకొని
మనః ఏకాగ్రం కృత్వా - మనస్సును ఏకాగ్రముగా చేసి
ఆత్మ శుద్ధయే ఆత్మ శుద్ధికొరకు
యోగం యుఞ్జ్యాత్ ధ్యానము చేయవలెను.
తా|| పరిశుద్ధమైన ప్రదేశములో మిక్కిలి ఎత్తుగా కాకుండా , మరీ క్రిందగా కాకుండా దర్భాసనము మీద జింక లేక పులి చర్మము వేసి దానిమీద వస్త్రము వేసి - దానిమీద తనకి స్థిరమైన ఆసనము వేసికొని
ఆ ఆసనములో కూర్చుని, మనస్సును స్వాధీనపరచుకొని, మనస్సును ఏకాగ్రముగా చేసి , ఆత్మ శుద్ధికొరకు ధ్యానము చేయవలెను.
ఆలాగ ధ్యానము చేసేవాడి మనస్థితి ఎలావుండాలోకూడా కృష్ణుడు వర్ణిస్తాడు 13 14 శ్లోకాలలో:
13 వ శ్లోకము
శ్లో|| సమం కాయ శిరోగ్రీవం
ధారయన్నచలం స్థిరః|
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం
దిశశ్చానవలోకయన్ ||6-13||
స|| కాయ శిరోగ్రీవమ్ కంఠం సమమ్ , అచలమ్ ధారయన్ స్థిరః ,
దిశః చ న అవలోకయన్, స్వం నాశికాగ్రం సంప్రేక్ష్య ||
కాయ శిరోగ్రీవం - శరీరము శిరస్సు కంఠము
సమం ధారయన్ - సమముగా నిలుపుచూ
అచలం స్థిరః- కదలకుండా స్థిరముగా కూర్చుని
దిశః చ న అవలోకయన్ - అటూ ఇటూ దిశలు చూడకుండా
సంప్రేక్ష్య నాసికాగ్రం - దృష్ఠిని నాశికాగ్రముపై వుంచి
(ధ్యానము చేయవలెను).
అంటే -
తా|| శరీరము శిరస్సు కంఠము సమముగా నిలుపుచూ కదలకుండా స్థిరముగా కూర్చుని అటూ ఇటూ చూడకుండా దృష్ఠిని నాశికాగ్రముపై వుంచి (ధ్యానము చేయవలెను).
14 వ శ్లోకము
శ్లో|| ప్రశాన్తాత్మా విగతభీః
బ్రహ్మచారివ్రతే స్థితః|
మనస్సంయమ్య మచ్ఛిత్తో
యుక్త ఆసీత మత్పరః ||6-14||
స|| ప్రశాన్తాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః , మనః సంయమ్య, ..మత్ చిత్తః , ...మత్ పరః ,..యుక్తః ఆసీత ||
ఆ ధ్యానము చేసేవాడు
ప్రశాన్తాత్మా- ప్రశాంతచిత్తుడై
విగతభీః- భయమువదిలినవాడై
బ్రహ్మచారివ్రతేస్థితః - బ్రహ్మచర్యముపాటించువాడై
మనః సంయమ్య- మనస్సును అధినములో ఉంచుకున్నవాడై
అంటే ప్రశాంతచిత్తుడై , భయమువదిలినవాడై, బ్రహ్మచర్యముపాటించువాడై , మనస్సును అధినములో ఉంచుకున్నవాడై.
మచ్చిత్తః - నాయందు మనస్సు కలవాడై
మత్పరః - నన్నే నమ్మినవాడై
యుక్తః - సమాధిలో ధ్యానములో
ఆసీత- ఉండవలెను
తా|| ధ్యానము చేయువాడుశరీరము శిరస్సు కంఠము సమముగా నిలిపి, కదలక స్థిరముగా నున్నవాడై దిక్కులను చూడక దృష్ఠి నాశికాగ్రముపై వుంచి, ప్రశాంత హృదయుడై, నిర్భయమైన మనస్సు కలవాడై, బ్రహ్మ చర్య వ్రత నిష్ఠ కలిగి, మనస్సు స్వాధీనపరచుకొని, నాయందు మనస్సు కలవాడై , నన్నే పరమ గతి అని నమ్మి, ధ్యానయుక్తుడై వుండవలెను.
అలా చేసే ధ్యానము యొక్క ఫలితము 15 వ శ్లోకములో వింటాము.
15 వ శ్లోకము
శ్లో|| యుఞ్జన్నేవం సదాఽఽత్మానం
యోగీ నియతమానసః |
శాన్తిం నిర్వాణ పరమాం
మత్సంస్థామ్ అధిగఛ్ఛతి|| 6-15||
స|| యుఞ్జన్నేవం సదాఽఽత్మానం యోగీ నియతమానసః మత్సంస్థామ్ నిర్వాణ పరమాం శాన్తిం అధిగఛ్ఛతి||
యుఞ్జన్నేవం సదాఽఽత్మానం - సదా ఆత్మానం ఏవం యుఞ్జన్
ఎల్లప్పుడు మనస్సును పరమాత్మయందే నిలిపి
యోగీ నియతమానసః - మనో నిగ్రహము కల యోగి
మత్సంస్థామ్ - నాయందున్నట్టి .
నిర్వాణ పరమాం- మోక్షరూపమైన
శాన్తిం - శాంతిని
అధిగఛ్ఛతి - పొందుచున్నాడు.
తా|| ఎల్లప్పుడు మనస్సును పరమాత్మయందే నిలిపి మనో నిగ్రహము కల యోగి నాయందున్నట్టి మోక్షరూపమైన శాంతిని పొందుచున్నాడు.
ఆత్మ పరమాత్మ ఒకటే అన్న సందర్భములో "మచ్చిత్తః మత్పరాయణః" అంటే భగవంతుని మీదే మనస్సుగలవాడై భగవంతునే నమ్మి ధ్యానము చేయవలెను అని అనుకున్నా మనము చేరే గమ్యము ఓకటే.
అలాగ పొందే గమ్యము - "నిర్వాణ పరమాం శాన్తిం అధిగచ్ఛతి" - అంటే పరమోత్కృష్టమైన శాంతిని పొందుతాడు .
అదే మోక్షము.
ఇప్పుడు ఎవరికి ధ్యానము కలుగదో చెపుతూ, తద్ద్వారా మనకి ధ్యానము లో వుండడానికి నియమములు వినిపిస్తాడు కృష్ణుడు
16 వ శ్లోకము
శ్లో||నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాన్తమనశ్నతః |
న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జునా ||16||
స|| న అతి అశ్నతః తు యోగః అస్తి | న చ ఏకాన్తమ్ అనశ్నతః |న చాతి స్వప్నశీలస్య |జాగ్రతో చైవ ||
నాత్యశ్నతస్తు యోగోఽస్తి - న అతి అశ్నతః తు యోగః అస్తి -
అతిగా భుజించు వానికి యోగము లేదు
న చైకాన్తమనశ్నతః - న చ ఏకాన్తమ్ అనశ్నతః
బొత్తిగా భుజించని వానికి కూడా ( యోగము) లేదు.
న చాతి స్వప్నశీలస్య - న చ అతి స్వప్న శీలస్య
ఎక్కువగా స్వప్నములతో నిదురించేవాడికి, అంటే ఎక్కువగా నిదురించువానికి కూడా లేదు
జాగ్రతో చైవ - ఎప్పుడూ మెలుకువగా వుండే వాడికి కూడా లేదు.
తా|| ఓ అర్జునా , ఎక్కువ భుజించు వానికి, అసలు భుజించని వానికి, ఎక్కువ నిదురలో వుండు వానికి, అసలు నిద్రలేని వానికి,
ఈ ధ్యానయోగము కలుగనే కలుగదు.
నిష్కామకర్మ ఎవరికి కుదరదో ( వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః .. ) అని మూడో అధ్యాయములో చెప్పినట్లే, ఇక్కడ కూడా ధ్యానము ఎవరికి కుదరదు అన్నమాటని విశదీకరిస్తాడు కృష్ణుడు.
ధ్యానము ఎవరికి కుదరదు ? వాళ్ళేవరు అంటే ..
ఎక్కువగా తినేవారు , అసలు తినని వారు, ఎక్కువగా నిద్రపోయేవారు , అసలు నిద్రపోని వారు.
అంటే మిత ఆహారము , మిత విహారము, మిత కర్మ, మిత నిద్ర, మిత జాగరణ కలవారికి ధ్యానము సులభము అన్నమాట.
ఇదే మాట మళ్ళీ 17 వ శ్లోకములో వింటాము
17 వ శ్లోకము
శ్లో||యుక్తాహార విహారస్య యుక్తచేష్ఠస్య కర్మసు |
యుక్త స్వప్నావ భోధస్య యోగో భవతి దుఃఖహా||17||
స|| యుక్తాహార విహారస్య యుక్తచేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నావ భోధస్య యోగో భవతి దుఃఖహా ||
యుక్తాహార విహారస్య - యుక్త ఆహార విహారస్య
తగిన (మితమైన) ఆహారము , నడత కలిగినవానికి
యుక్తచేష్ఠస్య కర్మసు - కర్మలయందు తగిన చేష్టలు కలిగినవానికి
యుక్త స్వప్నావ భోధస్య - తగిన నిద్ర , తగిన మెలుకువగలవానికి
యోగో భవతి దుఃఖహా - యోగో దుఃఖహా భవతి|
యోగము దుఃఖములను పోగొట్టును.
తా|| మితమైన ఆహరము నడత కలిగిన వానికి, కర్మల యందు తగిన విధముగా ప్రవర్తించిఉ వానికి,
మితమైన నిద్ర మితమైనజాగరణము కలవానికి ధ్యాన యోగము దుఃఖములను పోగొట్టును.
18 వ శ్లోకము
యదా వినియతం చిత్తమ్ ఆత్మన్యేవావతిష్ఠతే |
నిస్పృహాస్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ||18||
స|| యదా వినియతం చిత్తమ్ అత్మన్యేవ అవతిష్టతి యదా నిస్పృహహ సర్వకామేభ్యో తదా యుక్తః ఇత్యుచ్చతే||
యదా వినియతం చిత్తమ్ -
(యదా) ఎప్పుడు చిత్తమ్/మనస్సు బాగుగా నిగ్రహింపబడియుండునో
అత్మన్యేవవతిష్టతి -( యదా) అత్మన్యేవ అవతిష్టతి
ఎప్పుడు మనస్సు ఆత్మయందే నిలచి వుండునో,
(యదా) నిస్పృహాస్సర్వకామేభ్యో - నిస్పృహహ సర్వకామేభ్యో
ఎప్పుడు సమస్త కర్మలయందు అభిలాషలేని వాడై యుండునో
యుక్త ఇత్యుచ్యతే తదా - యుక్త ఇతి ఉచ్యతే తదా
(తదా) అప్పుడు అట్టివాడు యోగసిద్ధిని పొందినవాడు అని అనబడును.
తా|| ఎప్పుడు మనస్సు బాగుగా నిగ్రహింపబడియుండునో
ఎప్పుడు మనస్సు ఆత్మయందే నిలచి వుండునో
ఎప్పుడు సమస్త కర్మలయందు అభిలాషలేని వాడై యుండునో
అప్పుడు అట్టివాడు యోగసిద్ధిని పొందినవాడు అని అనబడును.
అలా ధ్యానములో ఉన్నవాళ్ళ మనస్సు ఎలాఉంటుందో చాలా అద్భుతము గా వర్ణిస్తాడు 19 వ శ్లోకములో.
ఆ వర్ణన - గాలి లేని చోట దీపము ఎలా నిశ్చలముగా ఉంటుందో అలాగే
ధ్యానము చేస్తున్న యోగి మనస్సు కూడా నిశ్చలముగా ఉంటుంది అన్నమాట.
19 వ శ్లోకము
యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః ||19||
స|| నివాతస్థః దీపః యథా న ఇఙ్గత్ సా ఆత్మనః యోగం యుఞ్జతః యోగినః యతచిత్తస్య ఉపమా స్మృతా||
యథా దీపో నివాతస్థో - (యథా) ఏ విధముగా గాలితగలని చోట దీపము
నేఙ్గతే - న ఇఙ్గతే - కదలక ఉండునో
సోపమా స్మృతా - స ఉపమా స్మృతా
అది ఉపమానముగా చెప్పబడుచున్నది ( దేనికి ఉపమానము?)
యుఞ్జతో యోగమాత్మనః - తనలో యోగమును ( ధ్యానమును) అభ్యసించుచున్న
యోగినో యతచిత్తస్య - యత చిత్తస్య యోగినః
నియంత్రములో వుంచబడిన యోగిమనస్సుకి
తా|| ధ్యానయోగములో వున్నయోగి యొక్క, నియంత్రములో వున్న మనస్సు,
ఏవిధముగా గాలి తగలని చోట దీపము కదలక నిశ్చలముగా వుండునో,
ఆ విధముగా (ధ్యానములో వున్న యోగి మనస్సు) నిశ్చలముగా వుండును.
ఇక ధ్యానయోగము ఎలాంటిది? దాని మహిమ ఏమిటి అన్నది, ఇపుడు నాలుగు శ్లోకాలలో కృష్ణుడు చెపుతాడు.
20 వ శ్లోకము
యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
యత్రచైవాత్మనా ఆత్మానం పశ్యన్నాత్మని తుష్యతి||20||
స|| యత్ర చిత్తం నిరుద్ధం యోగసేవయా ఉపరమతే, యత్ర చ ఏవ ఆత్మనా ఆత్మానం (పశ్యతి), (యత్ర)ఆత్మని తుష్యతి ( తదేవ యోగ సంజ్ఞితమ్) ;||
యత్రో పరమతే చిత్తం - ఎక్కడ చిత్తము/మనస్సు శాంతిని పొందునో
నిరుద్ధం యోగసేవయా - నిగ్రహింపబడిన యోగాభ్యాసము చేత
అంటే ఎక్కడ నిగ్రహింపబడిన యోగాభ్యాసము చేత మనస్సు శాంతి పొందునో ( అది యోగము అన్నమాట)
యత్రచైవాత్మనా ఆత్మానం - యత్ర చ ఏవ ఆత్మనా ఆత్మానం (పశ్యన్)
ఎక్కడ మనస్సులో తన ఆత్మను చూచుచున్నాడో (అది యోగము అన్నమాట)
ఆత్మని తుష్యతి - ఆత్మలో సంతృప్తి పొందుచున్నాడో (అది యోగము అన్నమాట)
తా|| ఎక్కడ నిగ్రహింపబడిన యోగాభ్యాసము చేత మనస్సు శాంతి పొందునో, ఎక్కడ మనస్సులో తన ఆత్మను చూచుచున్నాడో, ఎక్కడ ఆత్మలో సంతృప్తి పొందుచున్నాడో , ( అది యోగము అని తెలిసికొనుము)
21 వ శ్లోకము
సుఖమాత్యన్తికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః||21||
||స|| అత్యన్తికం యత్ (సుఖమ్ వేత్తి), బుద్ధి గ్రాహ్యం అతీన్ద్రియమ్ ( సుఖం వేత్తి), స్థితశ్చలతి తత్త్వతః ( వేత్తి తత్ యోగ సంజ్ఞితమ్}||
అత్యన్తికం యత్ - ఎప్పుడు అంతములేని (సుఖము తెలిసికుందువో)
బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్ -బుద్ధి గ్రాహ్యం అతీన్ద్రియమ్ ( సుఖం)
బుద్ధిచే గ్రహింపబడతగిన , ఇంద్రియములకు అగోచరమైన ( సుఖమును తెలిసికుందువో)
వేత్తి తత్ సుఖమ్ యత్ర- అట్టి సుఖమును ఎక్కడ తెలిసికొందువో
స్థితశ్చలతి తత్త్వతః- స్వానుభవము నుండి ఎక్కడ చలింపకుండునో
( అట్టి దానిని యోగము అను తెలిసికొనుము)
తా|| ఎక్కడ అంతములేని , బుద్ధిచే గ్రహింపబడతగిన, ఇంద్రియములకు అగోచరమైన సుఖము అనుభవించునో,
మరియు స్వానుభవమునుండి చలింప కుండునో ( అట్టి దానిని యోగము అను తెలిసికొనుము)
22 వ శ్లోకము
యం లభ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||22||
స||యం లభ్ధ్వా తతః చాపరం లాభం మన్యతే నాధికం యస్మిన్ స్థితో గురుణాపి దుఃఖేన న విచాల్యతే (వేత్తి తత్ యోగ సంజ్ఞితమ్)||
, -
యం లభ్ధ్వా - ఏది పొంది
తతః చాపరం లాభం - ఆ తరువాత ఇంకోక లాభము
మన్యతే నాధికం - ఇంతకన్న అధికము ( గొప్పది) కాదు అని తలంచడో
అంటే ఏది పొందిన తరువాత ఇంకొక లాభము దీనికన్న గొప్పది అని తలంచడో
( అది యోగము అని తెలిసికొనుము)
యస్మిన్ స్థితో - దేనియందు నిలబడి
దుఃఖేన గురుణాపి - గురుణాపి దుఃఖేన-
ఎంత గొప్ప దుఃఖములోనైనను
న విచాల్యతే- చలించడో
అంటే దేని యందు నిలబడి ఎంత గొప్ప దుఃఖములోనూ చలించడో (అది యోగము అని తెలిసికొనుము)
తా|| అంటే ఏది పొందిన తరువాత ఇంకొక లాభము దీనికన్న గొప్పది అని తలంచడో, దేని యందు నిలబడి ఎంత గొప్ప దుఃఖములోనూ చలించడో (అది యోగము అని తెలిసికొనుము)
23 వ శ్లోకము
తం విద్యాత్ దుఃఖ సంయోగవియోగం యోగసజ్ఞితమ్ |
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ||23||
దుఃఖ సంయోగవియోగం యోగసజ్ఞితమ్ విద్యాత్ | స యోగః అనిర్విణ్ణ చేతసా నిశ్చయేన యోక్తవ్యః||
తం - దానిని
దుఃఖ సంయోగవియోగం - దుఃఖముతో ఏమీ సంబంధము లేని
యోగసజ్ఞితమ్ విద్యాత్ - ( ధ్యాన) యోగము అని పేరుగలదానిని గా తెలిసికొనుము
అంటే ( ముందు మూడు శ్లోకములలో చెప్పబడిన) దానిని దుఃఖముతో ఏమీ సంబంధము లేని
( ధ్యాన) యోగము అని పేరుగల యోగముగా తెలిసికొనుము.
స యోగోఽనిర్విణ్ణ చేతసా- స యోగః అనిర్విణ్ణ చేతసా -
ఆ యోగము కలత చెందని ( విసుగులేని) మనస్సు తో
నిశ్చయేన యోక్తవ్యో - తప్పకుండా పొందతగినది.
అంటే ఆ ( ధ్యాన) యోగము కలత చెందని మనస్సు తో తప్పకుండా పొందతగినది.
తా|| ( ముందు మూడు శ్లోకములలో చెప్పబడిన) దానిని దుఃఖముతో ఏమీ సంబంధము లేని
ధ్యాన యోగము అని పేరుగల యోగముగా తెలిసికొనుము. ఆ ధ్యాన యోగము కలత చెందని మనస్సు తో తప్పకుండా పొందతగినది.
ముందు మూడు శ్లోకాలలో అలా నిశ్చలమైన మనస్సుతో ధ్యానమగ్నుడైన వానికి లభించే యోగస్థితి ఏమిటి అన్నది చెప్పబడినది. అదే ఆత్మసాక్షాత్కారము. అంటే అది ఏమిటి?
యోగాభ్యాసముచేత నిగ్రహింపబడిన మనస్సు శాంతిపొందడము
- పరిశుద్ధమైన మనస్సుతో తన స్వరూపము ను చూడగలిగి దానియందే సంతోషము పొందడము
- ఆత్మను గ్రహించి ఇంద్రియములకు కనపడని బుద్ధిచే గ్రహింపబడని ఆనందమును పోందడము
- ఇలాగ వచ్చిన ఆనందముకన్నా ఇంక ఏవిధమైన సుఖము గొప్పది కాదు అనగలగడము
- ఎంతో మహత్తరమైన దుఖముచే కూడా చలింప బడక పోవడము
- దుఃఖ సంబంధము లేకపోవడము
అటువంటి స్థితిని యోగము అంటారు
అదే ఆత్మసాక్షాత్కారము కూడా |
అలాంటి ధ్యానస్థితిని ఎలా పోందాలి అన్నది 24వ/25 వ శ్లోకాలలో వస్తుంది.
24 వ శ్లోకము
సంకల్ప ప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్య సమన్తతః ||24||
మనసైవ- మనస్సుతో
సంకల్ప ప్రభవాన్ కామాం - సంకల్పము వలన కలిగెడు కోరికలను
త్యక్త్వా సర్వాన్ అశేషతః- నిశ్శేషముగా సమస్తమును త్యజించి,
ఇన్ద్రియగ్రామం- ఇంద్రియ సమూహమును
వినియమ్య సమన్తతః- అన్ని పక్కలనుండి నిగ్రహించి
తా|| మనస్సుతో సంకల్పము వలన కలిగెడు కోరికలని సమస్తము నిశ్శేషముగా త్యజించి,ఇంద్రియసమూహములను అన్ని విషయములనుండి నిగ్రహించి,( ధ్యానము చేయుటకు సిద్దపడి),..
25 వ శ్లోకము
శనైః శనైరుపరమేద్భుధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చిన్తయేత్ ||25||
బుధ్యా ధృతిగృహీతయా -ధైర్యము అవలంబించిన బుద్ధితో
శనైః శనైః ఉపరమేత్ - మెల్లి మెల్లి గా ఉపరతిని( విశ్రాంతిని) పొందవలెను.
ఆత్మసంస్థం మనః కృత్వా - మనస్సును ఆత్మయందే యుంచి
న కించిదపి చిన్తయేత్ - ఇంకేమీ తలచకూడదు.
తా||( 24, 25 వశ్లోకాలు)
మనస్సుతో సంకల్పము వలన కలిగెడు కోరికలని సమస్తము నిశ్శేషముగా త్యజించి,ఇంద్రియసమూహములను అన్ని విషయములనుండి నిగ్రహించి, ధైర్యము అవలంబించిన బుద్ధితో మెల్లి మెల్లి గా ఉపరతిని( విశ్రాంతిని) పొందవలెను. మనస్సును ఆత్మయందే యుంచి ఇంకేమీ తలచకూడదు.
(ఇదే ధ్యానము చేసే విధానము).
26 వ శ్లోకము
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ||26||
మనశ్చంచలమస్థిరం - మనః చంచలమ్ అస్థిరం-
చంచలమైన అస్థిరమైన మనస్సు,
యతో యతో నిశ్చరతి - ఎక్కడెక్కడికో సంచరించు చున్నదో,
తతః తతః - అక్కడక్కడ నుంచి
నియమ్యేతత్ - ఏతత్ నియమ్య
ఆ మనస్సుని లొంగదీసుకొని
ఆత్మన్యేవ వశం నయేత్ - ఆత్మయందే వశము చేసుకొనవలయును.
తా|| చంచలమైన అస్థిరమైన మనస్సు ఎక్కడెక్కడ సంచరించుచున్నదో, అక్కడనుంచి ఆ మనస్సును మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలెను.
27 వ శ్లోకము
శ్లో|| ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాన్తరజసం బ్రహ్మ భూత మకల్మషమ్ ||27||
ప్రశాన్త మనసం- ప్రశాన్తమైన మనస్సు గల,
శాన్త రజసం- రజో ఆది గుణములను శాంతింప చేసిన,
బ్రహ్మభూతం - బ్రహ్మ భావమును పొందిన,
అకల్మషం - కల్మషము లేని,
ఏనం యోగినం - ఈ యోగిని
ఉపైతి సుఖముత్తమమ్- ఉత్తమమైన సుఖము పొందును.
తా|| ప్రశాంతమైన మనస్సు గల, రజాది గుణములను శాంతింప చేయగలిగిన, బ్రహ్మ భావము పొందిన , కల్మషము లేని ఆ యోగి ఉత్తమమైన సుఖము పొందును.
28 వ శ్లోకము
శ్లో|| యుఞ్జన్నేవం సదా ఆత్మానం యోగీ విగత కల్మష:|
సుఖేన బ్రహ్మసంస్పర్శం అత్యన్తం సుఖమశ్నుతే ||28||
యుఞ్జన్నేవం సదా ఆత్మానం - ఏవం సదా ఆత్మానం యుఞ్జన్
ఈ విధముగా సదా మనస్సును ఆత్మయందు నిలుపుచు,
యోగీ విగత కల్మషః- కల్మషము లేని యోగి,
సుఖేన బ్రహ్మసంస్పర్శం - సుఖముగా బ్రహ్మానుభవ రూపమైనట్టి
అత్యన్తం సుఖం అశ్నుతే - అత్యంతమైన సుఖము ను పొందును.
తా|| ఈ విధముగా సదా మనస్సును ఆత్మయందు నిలుపుచు, కల్మషము లేని యోగి, సుఖముగా బ్రహ్మానుభవ రూపమైనట్టి
అత్యంతమైన సుఖము ను పొందును
అటువంటి యోగస్థితిలో సుఖము పొందినవాడు ఎలాంటివాడు?
అది 29 వ శ్లోకములో వింటాము
29 వ శ్లోకము
శ్లో|| సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ||29||
సర్వభూతస్థమాత్మానం - ఆత్మానం సర్వ భూతస్థం
సమస్త భూతములలో తనను,
సర్వభూతాని చ ఆత్మని- తనలో సర్వ భూతములను
యోగయుక్తాత్మ - యోగముతో కూడిన మనస్సు గల వాడు
సర్వత్ర సమదర్శనః- సమస్త ప్రాణులయందు సమత్వగలవాడు
ఈక్షతే - చూచుచున్నాడు.
తా|| యోగముతో కూడిన మనస్సు కలవాడు, సమస్త ప్రాణులయందు సమత్వగలవాడు,
సమస్త భూతములలో తనను, తనలో సర్వ భూతములను చూచుచున్నాడు్
30 వ శ్లోకము
శ్లో|| యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణస్యామి స చ మే నప్రణస్యతి ||30||
యో మాం పశ్యతి సర్వత్ర -ఎవరు నన్ను సమస్త భూతములలో చూచుచున్నాడో
సర్వం చ మయి పశ్యతి - సమస్త భూతములను నా యందు చూచుచున్నాడో
తస్యాహం న ప్రణస్యామి- అతనికి నేను కనపడకపోను.
స చ మే నప్రణస్యతి - అట్టివాడు నాకు కనపడకపోడు.
తా|| ఎవరు నన్ను సమస్త భూతములలో చూచుచున్నాడో
సమస్త భూతములను నా యందు చూచుచున్నాడో
అతనికి నేను కనపడకపోను. అట్టివాడు నాకు కనపడకపోడు.
31 వ శ్లోకము
సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః|
సర్వథా వర్తమానో అపి స యోగీ మయి వర్తతే ||31||
సర్వభూత స్థితం యో మాం - సమస్త భూతములయందున్న నన్ను ఎవరు
భజత్యేకత్వమాస్థితః - భజతి ఏకత్వం ఆస్థితః
ఏకత్వము పొంది అంటే సర్వత్ర ఒకే పరమాత్మ అను భావన పొంది సేవించుచున్నాడో,
సర్వథా వర్తమానో అపి - ఏవిధముగా ప్రవర్తించుచున్నవాడైననూ
స యోగీ మయి వర్తతే - ఆ యోగి నాయందే ఉండును.
తా|| సమస్తభూతములయందున్న నన్ను అదే అభేద భావముతో సేవించుచున్నాడో,
అట్టి యోగి ఏవిధముగా ప్రవర్తించుచున్ననూ నా యందే ఉండు వాడగును.
సమస్త భూతములయందు ఒకడే పరమాత్మ వున్నాడు అన్న భావన కలిగిన వాడు , అదే భావన తో అదే సమత్వముతో ప్రవర్తిస్తాడు. అతడు ధ్యానములో వున్నా, లేక ప్రపంచ వ్యవహారములలో మునిగియున్నా కాని అదే భావనలో వుండడము వలన,
భగవంతునిలోనే వున్నాడన్నమాట.
32 వ శ్లోకము
అత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున|
సుఖం వా యది వాదుఃఖం సయోగీ పరమో మతః ||32|
అత్మౌపన్యేన - తనతోనే పోల్చుకుంటూ
సర్వత్ర సమం పశ్యతి - సమస్త ప్రాణులను సమముగా చూచుచున్నాడో
సుఖం వా యది వాదుఃఖం - సుఖములోనూ దుఃఖములోనూ కూడా
సయోగీ పరమో మతః - ఆ యోగి శ్రేష్ఠుడని తలంప బడుచున్నాడు.
తా|| సుఖములోనూ దుఃఖములోనూ కూడా ఎవడు సమస్త ప్రాణులను తనతో సమముగా చూచుచున్నాడో ,
ఆ యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు.
|
33 వ శ్లోకము
అర్జున ఉవాచ:
యోఽయం యోగస్త్వయా ప్రోక్తస్సామ్యేన మధుసూధన |
ఏతస్యాహం న పశ్యామి చఞ్చలత్వాత్థ్సితిం స్థిరామ్ ||33||
అర్జునుడు ఇట్లు అడిగెను.
యోఽయం యోగస్త్వయా ప్రోక్తః - యో అయం యోగః త్వయా ప్రోక్తః
ఏ ఈ యోగము నీ చేత చెప్ప బడినదో,
సామ్యేన - సమత్వముతో సంపాదించదగినదో
( అట్టి ఈ యోగమును)
చఞ్చలత్వాత్థ్సితిం స్థిరామ్ - చఞ్చలత్వాత్ స్థితిం స్థిరామ్
మనశ్చాంచల్యము వలన స్థిరమైన స్థితి కలదానిగా
ఏతస్యాహం న పశ్యామి - దీనిని చూడ జాలకున్నాను.
తా|| నీచేత సమత్వముతో కూడిన యే యోగము చెప్పబడినదో, దానియొక్క స్థిరమైన స్థితిని
నా మనశ్చాంచల్యము వలన తెలిసి కొనలేకున్నాను.
34 వ శ్లోకము
చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ||34||
చఞ్చలం హి మనః కృష్ణ - ఓ కృష్ణా, మనస్సు చంచలమైనది.
ప్రమాథి బలవత్ ధృఢం- క్షోభ్హపెట్టునది, బలవత్తరమైనది, ధృఢమైనది కూడా.
తస్యాహం నిగ్రహం మన్యే - తస్య అహం నిగ్రహం మన్యే,
దానిని నేను నిగ్రహించ జాలకున్నాను.
వాయోరివ సుదుష్కరమ్ - అది వాయువులాగ (పట్టుకొనుటకు) చాలా కష్ఠము.
తా|| ఓ కృష్ణా, మనస్సు చంచలమైనది. క్షోభపెట్టునది. బలవత్తరమైనది. విషయ ప్రవర్తనన్లో ధృఢమైనది.
దానిని నిగ్రహించుట వాయువును పట్టుకొనడము లాగా మిగుల కష్ఠము.
35 వ శ్లోకము
శ్రీభగవానువాచ :
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||35||
శ్రీభవానుడు చెప్పెను.
అసంశయం మహాబాహో - ఓ అర్జునా అందులో సందేహము లేదు.
మనో దుర్నిగ్రహం చలమ్ - మనస్సు నిగ్రహించుటకు సాధ్యము కానిది, చంచలమైనది .
అభ్యాసేన తు కౌన్తేయ - ఓ అర్జునా అభ్యాసము చేతనూ
వైరాగ్యేణ చ గృహ్యతే - వైరాగ్యము చేతనూ నిగ్రహింప బడుచున్నది.
తా|| ఓ అర్జునా మనస్సు నిగ్రహించుటకు కష్ఠమే. అది చంచలమైనది. సంశయము లేదు.
అయినను కౌన్తేయా , అభ్యాసము చేతనూ వైరాగ్యము చేతనూ అది నిగ్రహింపబడగలదు.
36 వ శ్లోకము
అసంశయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః |
వశ్యాత్మనా తు యతతా శక్యో అవాప్తుముపాయతః ||36||
అసంశయతాత్మనా- నిగ్రహింపబడని మనస్సు గలవానికి
యోగో దుష్ప్రాప ఇతి మే మతిః -
యోగము పొందశక్యముకాదు అని నా అభిప్రాయము.
వశ్యాత్మనా తు- వశము లో ఉన్న మనస్సు గల వాడు,
యతతా - ప్రయత్నము చేసినచో
శక్యో ఆవాప్తుం ఉపాయతః- ఉపాయముతో పొందుటకు సాధ్యమైనది.
తా|| నిగ్రహింపబడని మనస్సు కలవానికి ధ్యాన యోగము పొందుటకు శక్యము కాదు.
నిగ్రహించబడిన మనస్సుకలవాడు ప్రయత్నించినచో ఉపాయముతో ధ్యాన యోగము పొంద శక్యమైనది.
అంటే ధ్యాన యోగము నకు ముఖ్యము మనస్సు ను నిగ్రహించుట.
37 వ శ్లోకము
అర్జున ఉవాచ :
అయతిశ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ||37||
శ్రద్ధయోపేతో - శ్రద్ధయా ఉపేతః - శ్రద్ధతో కూడినవాడు,
అయతిః- మనో నిగ్రహము లేనివాడు
యోగాచ్చలిత మానసః - యోగాత్ చలిత మానసః-
యోగము నుంచి చలించిన మనస్సు కలవాడు
అప్రాప్య యోగసంసిద్ధిం - యోగ సంసిద్ధిం అప్రాప్య -
యోగ ము తో కూడిన సిద్ధిని పొందక,
కాం గతిం కృష్ణ గచ్ఛతి - కృష్ణ ఏ గతిని పొందుచున్నాడు?
తా|| అర్జునుడు అడుగుచున్నాడు. "కృష్ణా! శ్రద్ధతో కూడియున్నవాడు మనో నిగ్రహము లేని వాడు, ( మనో నిగ్రహము లేక) యోగము నుండి జారి యోగ సిద్ధి ( ఆత్మ సాక్షాత్ కారము)పొందక, ఏ స్థితిని పొందుచున్నాడు".
అంటే శ్రద్ధవుండవచ్చు శ్రద్ధవున్నంత మాత్రాన యోగము సంపాదించకపోవచ్చు. మరి యోగస్థితి పొందనిచో శ్రద్ధగాచేసిన పని నిష్ఫలము అవుతుందా? అట్టివానికి ఏమిటి గతి ?. అట్టివాడు "ఉభయవిభ్రష్టః" రెండిటికి చెడినవాడు అవుతాడా ? అని అర్జునుని భావము.
యోగస్థితి పొందితే మోక్షము వస్తుంది.
యోగస్థితి కి పొందకపోతే ఏమిటి అని అర్జునిని సందేహము .
38 వ శ్లోకము
కచ్చిన్నోభయవిభ్రష్టశ్చిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ||38||
విమూఢో- మూఢుడు,
బ్రహ్మణః పథిః - బ్రహ్మ పథమున ( మోక్షమార్గమున)
అప్రతిష్ఠః - స్థిరత్వము లేని వాడు
ఉభయవిభ్రష్టః -రెండిటికి చెడినవాడై
ఛిన్నాభ్రం ఇవ - చెదిరిన మేఘమువలె
నశ్యతి కశ్చిత్- నశించిపోవునా ఏమి?
తా|| గొప్ప బాహువులుకల కృష్ణా, బ్రహ్మ మార్గమున స్థిరత్వము లేని వాడు, మూఢుడు రెండికి చెడినవాడై చెదిరిన మేఘము వలె నశించిపోడా ఏమి?
ఇక్కడ రెండిటి అంటే - ఇహపరసుఖములు పోగొట్టుకున్నవాడై అని,
లేక కర్మ మార్గము నూండి యోగ మార్గము రెండింటిని సాధించనివాడు అని కూడా అనవచ్చు.
39 వ శ్లోకము
ఏతం మే సంశయం కృష్ణ చ్ఛేత్తు మర్హస్య శేషతః |
త్వదన్యః సంశయస్యాస్య చ్చేతా నహ్యుపపద్యతే ||39||
ఏతం మే సంశయం కృష్ణ -
ఓ కృష్ణ నా ఈ సంశయమును
చ్ఛేత్తుమర్హస్యశేషతః - ఛేత్తుం అర్హసి అశేషతః-
శెషము లేకుండా పోగొట్టుటకు నీవే అర్హుడవు.
సంశయాస్య ఛేత్తుం- అస్య సంశయః ఛేత్తుమ్
ఈ సంశయమును పోగొట్టుటకు
త్వదన్యః - త్వత్ అన్యః - నీకన్న మరియొకడు
నహ్యుపపద్యతే - న హి ఉపపద్యతే_
లభింపడు కదా|
తా|| కృష్ణా ఈ నా సందేహమును పోగొట్టుటకు నీవే అర్హుడవు.
నీ కంటే ఇంకొకరు ఈ సందేహమును తొలగింపజాలరు.
40 వ శ్లోకము
శ్రీభగవానువాచ:
పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి ||40||
పార్థనైవేహ నాముత్ర - పార్థ న ఇహ న అముత్ర
పార్థ ఈ లోకమందు పరలోకమందు,
వినాశస్తస్య (న) విద్యతే - అట్టివానికి నాశనము లేదు.
కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం - కల్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం
మంచిపని చేయువాడు ఎవడును దుర్గతిని
న గచ్ఛతి హి- పొందడు కదా .
తా|| వానికి ( అంటే శ్రద్దవుండికూడా మనస్సుని జయింపలేక యోగము పొందనివాడికి)
ఈ లోకమందు గాని పరలోకమందు గాని వినాశము కలుగదు.
నాయనా ! మంచి కార్యములు చేయువాడు ఎవడునూ దుర్గతిని పొందడు.
41 వ శ్లోకము
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః|
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ఠోఽభిజాయతే ||41||
యోగ భ్రష్ఠః- యోగమును పొందని వాడు
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్- పుణ్యము చేసిన వారి లోకములను పొంది,
ఉషిత్వా శాశ్వతీః సమాః- అనేకములైన సంవత్సరములు ( అచట) నివశించి,
శుచీనాం శ్రీమతాం గేహే - సదాచారవ్రతులైన శ్రీమంతులయొక్క గృహములో,
అభిజాయతే - పుట్టుచున్నాడు.
తా|| యోగమును పొందని వాడు పుణ్యము చేసిన వారి లోకములను పొంది, అనేకములైన సంవత్సరములు ( అచట) నివశించి,
సదాచారవ్రతులైన శ్రీమంతులయొక్క గృహములో పుట్టుచున్నాడు.
42 వ శ్లోకము
అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||42||
అథవా - లేక
ధీమతామ్- ధీమంతులగు
యోగినామేవ కులే భవతి - యోగుల వంశము నందే పుట్టు చున్నాడు.
ఈదృశమ్ జన్మ- ఇట్టి జన్మ
ఏతద్ధి లోకే దుర్లభతరమ్ - ఏది కలదో అది ఈ లోకములో దుర్లభము>
తా|| లేక ( శ్రద్ధ వుండి యోగము పొందని వాడు) ధీమంతులగు ( జ్ఞానవంతులగు) యోగుల వంశములో పుట్టుచున్నాడు.
ఈ ప్రకారమైన జన్మ లోకములో దుర్లభమైనది.
43 వ శ్లోకము
తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దైహికమ్ |
యతతే చ తతో భూయసంసిద్ధౌ కురునన్దన ||43|
తత్ర- అచట
పౌర్వ దైహికమ్ - పూర్వ దేహ సంబంధమైన,
తం బుద్ధి సంయోగం లభతే - ఆ బుద్ధితో సంపర్కమును పొందుచున్నాడు.
తతో భూయసంసిద్ధౌ - అప్పుడు మరల యోగ సిద్ధి కొఱకు,
యతతే చ- ప్రయత్నించుచున్నాడు కూడా.
తా|| అచట ( ఆ యోగి వంశమునందు) పూర్వదేహ సంబంధమైన బుద్ధితో ( అంటే పూర్వజన్మ సంస్కారము వలన) మరల యోగ సిద్ధికై ప్రయత్నించుచున్నాడు కూడా.
44 వ శ్లోకము
పూర్వాభ్యాసేన తైనేవ హ్రియతే హ్యవశోఽపి సః |
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ||44||
హ్యవశోఽపి సః - అవశో అపి సః
(యోగాభ్యాసమునకు) వశుడు కానప్పటికీ, అతడు
పూర్వాభ్యాసేన తైనేవ హ్రియతే -
పూర్వాభ్యాసము వలన దాని వేపు ( అంటే యోగము వేపు) లాగబడుచున్నాడు.
జిజ్ఞాసురపి యోగస్య - యోగముయొక్క తత్త్వము తెలిసికొనకోరినవాడు
శబ్దబ్రహ్మాతివర్తతే- వేదములో చెప్పబడిన కర్మానుష్ఠానుమును అతిక్రమించుచున్నాడు.
తా|| అతడు (శ్రద్ధవుండి యోగ సిద్ధిని పొందని వాడు ఇంకొక జన్మ లో)
యోగాభ్యాసమునకు తనకు తానుగా వశుడు కానప్పటికీ పూర్వాభ్యాసమువలన ఆ యోగము వేపు లాగబడుచున్నాడు.
యోగముయొక్క తత్త్వము తెలిసికొనకోరినవాడు వేదములో చెప్పబడిన కర్మానుష్ఠానుమును అతిక్రమించుచున్నాడు.
45 వ శ్లోకము
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః |
అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్||45||
ప్రయత్నాద్యతమానస్తు - ప్రయత్నాత్ యతమానః ( యోగీ) తు
పట్టుదలతో యత్నించుచున్న యోగి అయినచో
సంశుద్ధకిల్బిషః- పాపములనుండి విడువబడినవాడై,
అనేక జన్మ సంసిద్ధః - అనేక జన్మలయందు చేయబడిన అభ్యాసముతో
తతో యాతి పరాం గతిం- అప్పుడు సర్వోత్తమమైన గతిని పొందుచున్నాడు.
తా|| పట్టుదలతో ప్రయత్నించు యోగి పాపరహితుడై, అనేక జన్మలలో చేయబడిన అభ్యాసముతో
యోగ సంసిద్ధిని పొందినవాడై, సర్వోత్తమమైన గతిని ( మోక్షమును) పొందుచున్నాడు.
ఇక్కడిదాక శ్రద్ధవున్నాగాని ఒక జన్మలో సిద్ధి సంపాదించని వాడి గతి ఏమిటి అన్న అర్జునిని ప్రశ్నకి సమాధానముగా, కృష్ణుడు చేసిన మంచిపనుల వలన లాభమే గాని నష్టము వుండదు అని, శ్రద్ధతో చేసిన కర్మల వలన మరో జన్మలో ముందు జన్మలలో చేసిన అభ్యాసముతో ముందుకే పోగలడు అని, చివరికి మోక్షము కూడా పొందుతాడు అని చెపుతాడు. అలా యోగసిద్ధిని పొందడమే సర్వోత్తమమైన గతి అని. 46 వ శ్లోకములో యోగి యే అందరిలోకి సర్వోత్తముడు అని వింటాము.
46 వ శ్లోకము
తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః |
కర్మిభ్యాశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||46||
తపస్విభ్యోధికో యోగీ - తపస్విభ్యః అధికః యోగీ-
తపస్వీకులకన్న అధికుడు యోగి.
జ్ఞానిభ్యోఽపి మతోఽధికః - జ్ఞానిభ్యః అపి అధికః మతః
జ్ఞానము కలవారికంటెను కూడా అధికుడని తలంపబడుచున్నాడు.
కర్మిభ్యాశ్చాధికో యోగీ - కర్మిభ్యః అపి అధికః యోగి
కర్మలు చేయువారి కన్నను కూడా అధికుడు యోగి.
తస్మాద్యోగీ భవార్జున - అందువలన ఓ అర్జునా యోగివి కమ్ము.
తా|| ఓ అర్జునా యోగి తపస్సులు చేయు వారి కన్ననూ, శాస్త్ర జ్ఞానము కలవరి కన్నను, అగ్నిహోత్రాది కర్మలు చేయువారికన్ననూ అధికుడుఅని తలంప బడుచున్నాడు. అందువలన ఓ అర్జునా యోగి వి కమ్ము
47 వ శ్లోకము
యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా |
శ్రద్ధవాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ||47||
యోగినామపి సర్వేషాం - సర్వేషాం యోగినామ్ అపి
యోగులందరిలోను కూడా
మద్గతేనాన్తరాత్మనా- మద్గతే అన్తరాత్మనా
మనస్సుతో నాయందు నిలబడిన వాడు,
శ్రద్ధవాన్ భజతే యో మాం - యో మాం శ్రద్ధవాన్ భజతే
నన్ను ఎవడు శ్రద్ధతో సేవించుచున్నాడో,
స మే యుక్తతమో మతః -
అట్టివాడు మిక్కిలి శ్రేష్ఠుడని నా అభిప్రాయము.
తా|| యోగులందరిలోను ఎవడు నాయందు మనస్సు నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించు చున్నాడో అతడుసర్వ శ్రేష్ఠుడని నా అభిప్రాయము.
ఈ శ్లోకాలలో కృష్ణుడు ధ్యానము ఎలా మనుష్యుని మోక్షమార్గమునకు తీసుకు పోగలదు అన్నది విశదీకరించాడు.
ఓమ్
ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే ఆత్మసంయమయోగో నామ
షష్ఠోధ్యాయః ||
అన్వయము:
ప్రతి మనుజుడు ఆధ్యాత్మ మార్గమున తన ఉన్నతిని తానే చూచుకొనవలెను. ఏలయనిన రోగముచే బాధపడు రోగి ఔషధమును తానే తీసుకొనవలెను, కానీ ఇతరులు ఔషధము సేవించిన ఈ రోగికి రోగము తగ్గదుకదా!
ధ్యానమునకు కూర్చుండుటకు ముందే సాధకుడు ధృడమైన సంకల్పమును తీసికొనవలెను. ధ్యానములో కూర్చున్ననూ మనస్సు పరుగులు తీయవచ్చు . అప్పుడు దానిని అదుపులోకి తీసుకువచ్చి మరల ధ్యానములో నిమగ్నము అవ వలెను. దీనిని గురించి అర్జునుడు అడిగెను కూడా. కృష్ణుడు చెప్పిన మాట మన అందరికి వర్తిస్తుంది. మనస్సు అదుపు లో ఉంచుకొని ధ్యానము చేయడానికి అభ్యాసము అవసరము . అభ్యాసమే కాకుండా వైరాగ్యము కూడా అవసరమని కృష్ణుడు చెప్పిన మాట కూడా మనకి వర్తిస్తుంది. వైరాగ్యముతో కొన్ని సుఖదుఃఖాలని అదుపులో పెట్టవచ్చు.
ధ్యానములో స్థిరత్వము పొందవలెనన్న మన దిన చర్య సక్రమముగా, ప్రశాంతముగ, లౌకిక విషయములకు దూరముగ నుండవలెను. ఈ విషయమున చాల శ్రద్ధగా నుండవలెను. లేనుచో మనసు అశాంతిగ యుండి ధ్యానము కుదరదు.
ఇక్కడ మనము తెలిసికొనవలిసిన ముఖ్యవిషయము ధ్యానము అనగా, ఒక స్థలమునందు నిటారుగా కూర్చుని, మౌనముగా యుండుట, ఆలోచనల నరికట్టుటకు ప్రయత్నించుట అని మాత్రమే కాదు. ధ్యానములో సత్వర ఫలితములను పొందవలెననిన, సాధకుడు యమ నియమములను పాటించవలయును . అప్పుడే మౌనముగా ఉండి, ఆలోచనలను అరికట్టగల స్థితికి చేరుకొనగలడు. ఇది అంతయు ధ్యానమునకు పూర్వము నుండి అనుసరించవలసిల విధి. వీటిని అనుసరించుటచే ధ్యానము చేయుటకు యోగ్యము కలుగును.
కొంతమంది సంవత్సరముల తరబడి, రోజుకు 1గం, 2 గంటలు ధ్యానము చేయుచున్నామనియు, ఫలితమేమీ పొందలేకున్నామనియు చెప్పుట గమనించు చున్నాము. దానికి కారణము శుధ్ధి కాని మనస్సు సిధ్ధిని పొందలేదు. కనుక సాధకుడు ప్రథమ దశలోనే యమ నియమములను అనుసరించుట ఆవశ్యకమై యున్నది.
ఉదాహరణకు, ఒక విద్యార్థి పై చదువులు చదవవలెనన్న, యోగ్యత పరీక్ష యందు ఉత్తీర్ణుడు కావలసి యుండును. అట్లు కానిచో పై చదువులకై విశ్వవిద్యాలయములలో చేరవలెనన్న అర్హత పరీక్షయందుత్తీర్ణుడు కానందున ప్రవేశము లభించదు కదా! అట్లే చిత్తశుధ్ధి లేని మనసు ధ్యానము నందు ఏకాగ్రతను పొందుటకు యోగ్యత లేనిదే యగును. కాబట్టి యమ, నియమముల ద్వారానే చిత్తశుధ్ధి సాధ్యమని తెలిసికొని, వాటిని ఆచరించుచు, ధ్యానము నందు ప్రవేశము పొందవచ్చును. బాహ్యము నందు ఆసక్తి గల మనసు ధ్యానమునందు స్థిరపడుట సాధ్యము కాదు. పరమ పవిత్రమైన జ్ఞానమును పొందుటకు పవిత్రమైన మనసు మాత్రమే అంతరంగిక ప్రయాణమునకు సహకరించును. ఈ విషయము నవగాహన చేసికొని పెద్దవారు తమ పిల్లలకు, ఇతరులకు, శాంతితో కూడిన జీవితమును గడుపుటకు మార్గదర్శకులు కావలెను.
సాధకుడు ప్రాథమిక స్థాయి నుండి యమ, నియమములను పాటించుట చాల అవసరము.
యమం: అనగా అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహంలు
నియమం: అనగా శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, భగవదారధన అను విధులు .
ఈ యమ నియమములను పాటిస్తే ధ్యానమార్గమున యోగస్థితి పొందవచ్చు.
||ఓమ్ తత్ సత్||
||ఓమతత్ సత్||