Srimad Valmiki Ramayanam
Balakanda Chapter 11
Rishyasrumga arrives in Ayodhya .
With Sanskrit text in Devanagari , Telugu and Kannada
బాలకాండ
పదునొకొండవ సర్గ
భూయ ఏవహి రాజేంద్ర శృణుమే వచనం హితమ్ |
యథా స దేవప్రవరః కథాయాం ఏవమబ్రవీత్ ||
తా|| ఓ రాజేంద్రా ఇంకా హితకరమైన నా మాటలను వినుడు. ఆ సనత్కుమార మహర్షి తన కథా ప్రసంగమున ఇంకా ఇట్లు చెప్పెను.
ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః |
రాజా దశరథో నామ్నా శ్రీమాన్ సత్యప్రతిశ్రవః ||
అంగరాజ్యేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి |
కన్యాచాస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి ||
పుత్రస్తు సః అంగరాజస్య రోమపాద ఇతి శ్రుతః |
తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః ||
తా|| ఇక్ష్వాకు కులములో దశరథుడు అను పేరుగల రాజు ధార్మికుడు సత్యసంధుడుగా ప్రసిద్ధి వహించును. ఆ రాజుకు అంగరాజు తో సఖ్యమగును. ఆయనకు శాంతా అను పేరుగల కుమార్తె ఉండును . ఆ అంగ రాజునకు రోమపాదుదనబడు పుత్రుడు వుండును.ఆ రోమ పాదుని వద్దకు దశరథరాజు వెళ్ళును
అనపత్యోsస్మి ధర్మాత్మాన్ శాంతా భర్తా మమక్రతుమ్ |
అహరేత త్వయాsజ్ఞప్తః సంతానార్థం కులస్య చ ||
శ్రుత్వా రాజ్ఞోsథ తద్వాక్యం మనసా స విచింత్య చ |
ప్రదాస్యతే పుత్త్రవంతం శాంతాభర్తారమాత్మవాన్ ||
ప్రతిగృహ్య చ తం విప్రం స రాజా విగత జ్వరః |
అహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టే నాంతరాత్మనా ||
' ఓ ధర్మాత్మా నాకు సంతానములేదు. నీ కుమార్తే అయిన శాంత భర్త చేత నీ ఆజ్ఞతో పుత్రసంతానమునకు వంశాభివృద్ధికి యజ్ఞము ఆచరించ తగును.' అని. ఆ రాజు యొక్క వచనములను విని మనస్సులో ఆలోచించి ఇక్ష్వాకు వంశాభివృద్ధికి శాంతయొక్క భర్తను పంపును. మనస్తాపము తీరినవాడై ఆ దశరథమహారాజు ఆ విప్రుని తీసుకొని వచ్చి యజ్ఞమును ఆచరించును "
తం చ రాజా దశరథో యష్టుకామః కృతాంజలిః |
ఋష్యశృంగం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్ ||
యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః |
లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విశాం పతిః ||
పుత్త్రాశ్చాస్య భవిష్యంతి చత్వారో అమితవిక్రమాః |
వంశ ప్రతిష్ఠానకరాః సర్వలోకేషు విశ్రుతాః ||
తా|| యజ్ఞము చేయకోరికగలవాడు ఆగు దశరథ మహారాజు ధర్మముగా అంజలి ఘటించి ఆ బ్రాహ్మణోత్తముని యజ్ఞ నిర్వహణమునకూ తద్ద్వారా తనకు పుత్ర లాభము కలుగుటకు , స్వర్గ ప్రాప్తి కలుగుటకు కోరుకొనెను. ఆ విప్రోత్తముని సహాయముతో ఆ కోర్కెలను తీర్చుకొనును. ఆ దశరథ మహారాజుకు అమిత పరాక్రములు అగు నలుగురు కుమారులు కలుగుదురు. వారు వంశ ప్రతిష్ఠను పెంపొందించెదరు. ఆన్ని లోకములలో ప్రఖ్యాతి పొందెదరు "
ఏవం స దేవప్రవరః పూర్వం కథితవాన్ కథామ్ |
సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః ||
స త్వం పురుష శార్దూల తమానయ సుసత్కృతమ్ |
స్వయమేవ మహారాజ గత్వా స బలవాహనః ||
అనుమాన్య వశిష్ఠం చ సూతవాక్యం నిశమ్య చ |
( వసిష్ఠేనాభ్యనుజ్ఞాతో రాజా సంపూర్ణమానసః )
సాంతఃపుర స్సహామాత్యః ప్రయయౌ యత్ర స ద్విజః ||
తా|| "ఓ రాజా ఈ విధముగా పూర్వము దేవ యుగము లో భగవాన్ సనత్కుమారుడు చెప్పెను. ఓ మహారాజా స్వయముగా నీవే బలగములతో వెళ్ళి ఋష్యశృంగుని సత్కరించి తీసుకు రావలెను". సూతుడు చెప్పిన ఈ కథాంశమును విని వసిష్ఠుని అనుమతి గైకొని ఆ దశరథ మహారాజు అంతః పుర రాణులతో , అమాత్యులతో కలిసి ఆ ద్విజోత్తముడు వున్న ప్రదేశమునకు బయలు దేఱెను.
వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః శనైః |
అభిచక్రామ తం దేశం యత్రవై మునిపుంగవః ||
ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం రోమపాద సమీపగమ్ |
ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలమ్ ||
తతో రాజా యథా న్యాయం పూజాం చక్రే విశేషతః |
సఖిత్వాత్ తస్య వై రాజ్ఞః ప్రహృష్టేనాంతరాత్మనా ||
తా|| వనములను సరస్సులనూ మెల్లి మెల్లిగా దాటుచూ ఆ ముని పుంగవుడు ఉన్న దేశమునకు చేరెను. ఆ మహరాజు అగ్ని వలె తేజరిల్లుచున్న ఆ ద్విజ శ్రేష్ఠుని ఆ రోమాపాదుని సమీపములో చూచెను. అప్పుడు ఆ రోమపాదుడు దశరథమహారాజు తో గల తన మైత్రిని పురస్కరించుకొని ప్ప్రసన్న మనస్సుగలవాడై యథావిధిగా ఆ రాజుని విశేషముగా పూజించెను.
రోమపాదేన చాఖ్యాతమ్ ఋషిపుత్రాయ ధీమతే |
సఖ్యం సబంధకం చైవ తదా తం ప్రత్యపూజయత్ ||
ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః |
సప్తాష్టదివసాన్ రాజా రాజానమ్ ఇదమబ్రవీత్ ||
తా|| ఆ ఋషిపుత్రునకు ఆ రోమపాదుడు దశరథునితో గల తన మైత్రిని సంబంధమును గూర్చి తెలిపెను. అప్పుడు ఆ ముని దశరథ మహారాజుని పూజించెను. ఈ విధముగా సత్కారములను పొందిన దశరథ మహారాజు , రోమాపాదుని కడ ఏడు ఎనిమిది దినములు గడిపిన పిమ్మట ఆయనతో ఇట్లనెను.
శాంతా తవ సుతా రాజన్ సహ భర్త్రా విశాంపతే |
మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతమ్ ||
తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః |
ఉవాచ వచనం విప్రం గచ్చత్వం సహ భార్యయా ||
ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా |
స నృపేణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా ||
తా వన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చోరసా |
ననందతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్ ||
తా|| "ఓ మహారాజా ! నీ కుమార్తె అయిన శాంతను , ఆమె భర్త ను మా నగరమునకు పంపుము.అచట ఒక మహత్కార్యము జరుగ నున్నది". రోమపాదుడు ప్రతిభామూర్తి అయిన ఋష్యశృంగుని ప్రయాణమునకు తన ఆంగీకారము తెలిపెను. ఆ ఋషిపుత్త్రుడు కూడా అట్లే అని భార్యతో సహా బయలు దేరెను. తేజోపరాక్రమవంతులైన రోమపాదుడు దశరథ మహారాజు ఇద్దరూ పరస్పర స్నేహపూరిత ఆలింగనలతో నమస్కారములతో సంతోషపడిరి.
తత సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునందనః |
పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్ వై శీఘ్రగామినః ||
క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతమ్ |
ధూపితం సిక్తసమ్మృష్టం పతాకాభిరలంకృతమ్ ||
తతః ప్రహృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్ |
తథా ప్రచక్రుః తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం తదా ||
తా|| అనంతరము తన స్నేహితుని సెలవుగైకొని దశరథ మహారాజు బయలు దేఱెను. తన పురవాసులందరికీ శీఘ్రముగా పోవు దూతలద్వారా సందేశము పంపెను. ' నగరమునంతయూ అలంకరింపుడు. నగరమును ధూపములతోనూ అఱటి చెట్లతోను పతాకములతోను అలంకరించుడు.' పౌరులు రాజు ఆగమనవార్తను విని సంతోషముతో రాజ సందేశము ప్రకారము నగరమును అలంకరించిరి.
తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ హ |
శంఖ దుందుభినిర్ఘోషైః పురస్త్కృత్య ద్విజర్షభమ్||
తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరాద్విజమ్ |
ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణేంద్రకర్మణా ||
అంతః పురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః|
కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్ ||
తా|| పిమ్మట శంఖ దుందుభి ధ్వనుల మధ్య దశరథమహారాజు ద్విజోత్తముని ముందుంచుకొని అలంకరింపబడిన నగరమును ప్రవేశించెను. ఇంద్రునివలె పరాక్రమశాలి అయిన దశరథ మహారాజు ఆదర సత్కార్యములతో నగరమునకు తీసుకువచ్చుచున్న ద్విజోత్తముని చూచి నగరవాసులందరూ మిక్కిలి సంతోషపడిరి. దశరథ మహారాజు అంతఃపురమును ప్రవేశించి శాస్త్రోక్తముగా ఆ ద్విజోత్తముని పూజించి , ఆయనరాకతో తాను కృతకృత్యుడైనట్లు తలంచెను.
అంతఃపురస్త్రియః సర్వాః శాంతాం దృష్ట్వా తథాగతమ్ |
సహభర్తా విశాలాక్షీం ప్రీత్యాsనందం ఉపాగమన్ ||
పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః |
ఉపవాస తత్ర సుఖితా కంచిత్కాలం సహర్త్విజా ||
తా|| అంతః పురమునందలి స్త్రీలు భర్తకూడా వచ్చిన విశాలాక్షి అయిన శాంతను చూచి ఎంతగానో ఆనందపడిరి. అంతః పుర స్త్రీలు అదేవిధముగా దశరథమహారాజు ఆ శాంతాదేవిని బంధుమర్యాదలతో గౌరవించిరి. ఆమెయు భర్తతో కలిసి అచట కొంత కాలము గడిపెను.
|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకాదశ సర్గః ||
|| సమాప్తం ||
|| ఓమ్ తత్ సత్ ||
|| om tat sat ||