Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 12

Aswamedha Yaga .

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
పన్నెండవ సర్గము

తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్ సుమనోహరే |
వసంతే సమనుప్రాప్తే రాజ్ఞోయష్టుం మనోsభవత్ ||

తా|| పిమ్మట చాలాకాలము తరువాత మనోహరమైన వసంత ఋతుప్రారంభమున ఒకానొక శుభ తిథిన దశరథమహారాజు అశ్వమేధయాగము చేయుటకు సంకల్పించెను.

తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవ వర్ణినమ్ |
యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్యవై ||

తా|| పిమ్మట దివ్యతేజశ్శాలి అయిన ఆ ద్విజోత్తమునికి ప్రణమిల్లి ఆయన అనుగ్రహముపొంది పుత్త్ర సంతానప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కొఱకై చేయబడు యజ్ఞమునకు ఋత్విజునిగా వుండుటకు ఆయనను అభ్యర్థించెను.

తథేతి చ స రాజానమ్ ఉవాచ సుసత్కృతః |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||

తా|| అటులనే అని సమ్మతించి రాజుతో 'యజ్ఞద్రవ్యములను సిద్ధముచేయుడు. యజ్ఞాశ్వమును విడువుడు ' అని పలికెను.

తతో రాజాsబ్రవీత్ వాక్యం సుమంత్రం మంత్రిసత్తమమ్ |
సుమంత్రావాహాయ క్షిప్రం ఋత్విజో బ్రహ్మవాదినః ||
సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అథ కాశ్యపమ్ |
పురోహితం వసిష్ఠంచ యే చాన్యే ద్విజసత్తమాః ||

తా || అంతట మంత్రిసత్తముడైన సుమంత్రునితో ఇట్లు పలికెను." ఓ సుమంత్రా! వేదపండితులూ ఋత్విజులూ అయిన సుయజ్ఞుని , వామదేవుని, జాబాలినీ, కాశ్యపుని, పురోహితుడైన వసిష్ఠుని అట్లే తదితర బ్రాహ్మణోత్తములనూ శీఘ్రముగా తేసుకొని రమ్ము" అని.

తతః సుమంత్రః త్వరితం గత్వా త్వరితవిక్రమః |
సమానయత్ స తాన్ విప్రాన్ సమస్తాన్ వేదపారగాన్ ||
తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా |
ధర్మార్థ సహితం యుక్తం శ్లక్ష్ణం వచన మబ్రవీత్ ||

తా|| అప్పుడు త్వరగా పోగల సుమంత్రుడు త్వరగాపోయి వేదపండితులైన బ్రాహమణోత్తములందరినీ తీసుకు వచ్చెను. దశరథ మహారాజు వారిని అందరినీ సత్కరించి ధర్మముతో కూడిన వచనములతో ఇట్లు పలికెను.

మమ లాలప్యమానాస్య పుత్రార్థమ్ నాస్తి వై సుఖమ్|
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ ||
తదహం యష్టుమిచ్ఛామి శాస్త్ర దృష్టేన కర్మణా |
ఋషిపుత్ర ప్రభావేన కామాన్ ప్రాప్స్యామి చాప్యహమ్ ||

తా|| 'పుత్రులకొఱకై లాలసపడుచున్ననాకు సుఖములేకున్నది. అందుకై అశ్వమేధయజ్ఞము చేయటకు సంకల్పించితిని. ఆ యజ్ఞమును యథావిథముగా చేయ గోరుచున్నాను. ఈ ఋషిపుత్త్రుని ప్రభావమువలన నా కోరికలు సిద్దించును'

తతః సాద్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వసిష్ఠప్రముఖాస్సర్వే పార్థివస్య ముఖాత్యుతమ్ ||
ఋష్యశ్రుంగపురోగాశ్చ ప్రత్యూచుః నృపతిం తదా |
సంభారాః సంభ్రియతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||
సర్వథా ప్రాప్యసే పుత్త్రాంశ్చతురః అమితవిక్రమాన్ |
యస్య తే ధార్మికీ బుద్ధిః ఇయం పుత్రార్థమాగతా ||

తా||పిమ్మట వసిష్ఠుడు మొదలగు ప్రముఖ బ్రాహ్మణోత్తములందరు "బాగు బాగు" అని అభినందించిరి. ఋష్యశృంగుడు మొదలగు విప్రులు ఆ రాజుతో, ' యాగమునకు కావలసిన వస్తువులను తెప్పించుడు , యజ్ఞాశ్వమును విడువుడు . పుత్త్రప్రాప్తికై అశ్వమేధయజ్ఞము చేయవలనని కలిగిన సత్సంకల్పము వలన అమిత పరాక్రమశాలురైన నలుగురు కుమారులను పొందెదవు '

తతః ప్రీతోsభవత్ రాజా శ్రుత్వా తద్ద్విజభాషితమ్ |
అమాత్యం శ్చాబ్రవీద్రాజా హర్షేణేదం శుభాక్షరమ్ ||
గురూణాం వచనాత్ శీఘ్రం సంభారాః సంభ్రియంతు మే |
సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్ ||

తా|| ఆ బ్రాహ్మణోత్తముల చెప్పిన మాటలతో సంతోషపడి ఆనందముతో అమాత్యులతో ఈ శుభవచనములను పలికెను. ' గురువుల ఆదేశము ప్రకారము శీఘ్రముగా కావలసిన సస్తువులను తెప్పించుడు. ఋత్విజులు ముందు పోవుచుండగా సమర్థులైన యోధులతో యజ్ఞాశ్వమును విడువుడు.'

సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతామ్ |
శాంతయశ్చాభివర్దంతాం యథా కల్పం యథావిథి ||
శక్యః ప్రాప్తుమ్ అయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా |
నాపరాథో భవేత్ కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే ||
ఛిద్రం హి మృగయంతే అత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః |
నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తా వినస్యతి ||
తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే |
తథా విథానం క్రియతాం సమర్థాః కరణేష్విహ ||

తా || 'సరయూనది ఉత్తరభాగమున యజ్ఞభూమిని సిద్ధపరచుడు. క్రమము తప్పకుండా శాస్త్రోక్తముగా విఘ్న నివారకములైన శాంతి కర్మలను జరిపించుడు. కష్టములు అపచారములు లేనిచో మహీపతులందరూ ఈ యజ్ఞము ను అచరించెడివారే. విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యజ్ఞకార్యములోని దోషములు వెదుకుచూ యజ్ఞము భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞములో దోషములున్నచో యజ్ఞకర్త నశింఛును. అందువలన ఈ యజ్ఞము యథావిధిగా సమాప్తమగునట్లు చూడుడు. కార్యనిర్వహణలో మీరు మిక్కిలి సమర్థులు'.

తథేతి చ తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ |
పార్థివేంద్రస్య తద్వాక్యం యథా జ్ఞప్తమ్ అకుర్వత ||
తతో ద్విజాస్తే ధర్మజ్ఞమ్ అస్తువన్ పార్థివర్షభమ్ |
అనుజ్ఞాస్తతః సర్వే పునర్జగ్ముః యథాగతమ్ ||

తా|| అటులనే అని ఆ మంత్రులందరూ రాజాజ్ఞలను సక్రమముగా నిర్వర్తించిరి. పిమ్మట ఆ బ్రాహ్మణోత్తములందరూ రాజును కొనియాడి ఆ రాజుయొక్క అనుజ్ఞ తీసుకొని తమ తమ నివాసములకేగిరి .

గతేష్వథ ద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్ నరాధిపః |
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః ||

తా|| అ విప్రులందరూ వెళ్ళిన పిమ్మట ఆ రాజు మంత్రులనందరిని పంపివేచి తాను తన ప్రాసాదమునకు ఏగెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలాకాండే ద్వాదశ స్సర్గః ||
సమాప్తం ||

|| om tat sat ||