Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 16

Dasaratha receives the 'Payasa' to be given to his Queens

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
పదునాఱవ సర్గము
( దశరథుని భార్యలు గర్భము దాల్చుట )

తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః |
జానన్నపి సురావేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

తా|| అప్పుడు ( బ్రహ్మాదిదేవతలు ఇట్లు ప్రార్థింపగా) దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో ఇట్టి వచనములతో పలికెను.

ఉపాయః కో వధ్యే తస్య రావణస్య దురాత్మనః |
యమహం తం సమాస్థాయ నిహన్యాం ఋషికంటకమ్ ||

తా|| 'ఓ దేవతలారా ! ఆ దురాత్ముడైన రావణుని వధించుటకు ఉపాయము తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంతకుని హతమార్చెదను'.

ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుః విష్ణుమవ్యయమ్ |
మానుషీం తను మాస్థాయ రావణం జహి సంయుగే ||
స హి తేపే తపస్తీవ్రం దీర్ఘకాలం అరిందమ |
యేన తుష్టోsభవద్బ్రహ్మా లోకకృల్లోకపూర్వజః||
సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః ీ
నానావిదేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ |
అవజ్ఞాతః పురా తేన వరదానే హి మానవాః ||

తా|| అవ్యయుడు అయిన శ్రీమహావిష్ణువు వచనములను విని ఆ దేవతలందరూ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. ' ఓ అరిందమా ! నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము. పూర్వము అతడు చాలాకాలము తీవ్రముగా తపమొనర్చెను. సృష్ఠికర్తయు దేవతలలో అగ్రజుడు అయిన బ్రహ్మవాని తపమునకు సంతుష్టుడాయెను. సంతుష్టుడైన బ్రహ్మ ఆ రాక్షసునకు వరమిచ్చెను. మానవులు తప్ప నానావిధములైన ప్రాణులవలన అతడికి ప్రాణభయము లేకుండునట్లు వరము పొందెను. మానవులఎడ చులకనభావమే ఇందుకు కారణము'.

ఏవం పితామహత్ తస్మాత్ వరం ప్రాప్య స దర్పితః ||
ఉత్పాదయతి లోకాన్ స్త్రీన్ స్త్రియశ్చాప్యపకర్షతి |
తస్మాత్ తస్య వధో దృష్టో మానుషేభ్యః పరంతప||

తా|| 'ఈ విధముగా పితామహుని వరమువలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు . స్త్రీలను గూడా అవమానము చేయుచున్నాడు. కావున ఓ అరిసూదనా అతడు మానవులవలనే మరణించుట సంభవము'.

ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్ |
పితరం రోచయామాస తదా దశరథం నృపమ్ ||
స చాప్యపుత్త్రో నృపతిః తస్మిన్ కాలే మహాద్యుతిః |
అయజత్ పుత్రియా మిష్టిం పుత్త్రేప్సురరిసూదనః||

తా|| సమస్తప్రాణులకును ఆధారభూతుడైన శ్రీమహావిష్ణువు దేవతలమాటలను ఆలకించి దశరథ మహారాజు కి పుత్త్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను.
అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రుసంహారకుడైన దశరథ మహారాజు పుత్త్రులులేక మథన పడుచుండెను. పుత్త్రప్రాప్తికై అతడు పుత్త్రకామేష్టి అను యాగమును ఆచరించెను.

స కృత్వా నిశ్చయం విష్ణుః అమంత్ర్యచ పితామహమ్ |
అంతర్థానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః ||

తా|| విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను.పిమ్మట దేవతల , మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్థానమయ్యెను.

తతో వై యజమానస్య పావకాదతుల ప్రభమ్ |
ప్రాదుర్భూతమ్ మహద్భూతం మహావీర్యం మహాబలమ్ ||
కృష్ణం రక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనమ్ |
స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రుప్రవర మూర్ధజమ్ ||
శుభలక్షణ సంపన్నం దివ్యాభరణ భూషితమ్ |
శైలశృంగసముత్సేధం దృప్త శార్దూలవిక్రమమ్ ||
దివాకరసమాకారం దీప్తానలశిఖోపమమ్ |
తప్తజాంబూనదమయీం రాజతాంతపరిచ్ఛదామ్ ||
దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియామ్ |
ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ ||

తా|| అప్పుడు ఆ యజమాని ( దశరథుని) యొక్క యజ్ఞకుండమునుండి మహా అద్భుతమైన తేజస్సుగల మహాబల సంపన్నుడైన ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమాయెను. అతడు కృష్ణవర్ణముతో ఎఱ్ఱని వస్త్రములు ధరించి దుంధుభి వంటి కంఠస్వరము కలిగి యుండెను. అతని రోమములు మీసములు కేశములు సింహపు జూలువలె మృదువుగా ఉండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు. దివ్యాభరణములను ధరించి యున్నవాడు. కొండ శిఖరమువలె ఉన్నతమైనవాడు.మదించిన పెద్దపులివలె భయంకరుడు. సూర్యునితో సమానముగా ప్రకాశించుచు ప్రజ్వలించుచున్న అగ్ని వలే వెలుగొందుచున్నవాడు. అతడు ఒక దివ్యమైన పాయసముతో నిండి యున్న బంగారుపాత్రను స్వయముగా ప్రియపత్నివలె రెండు చేతులతో పట్టుకొని యుండెను.

సమవేక్ష్యాబ్రవీద్వాక్యం ఇదం దశరథం నృపమ్ |
ప్రాజాపత్యమ్ వరం విద్ధి మామిహాభ్యాగతం నృప ||
తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలిః |
భగవాన్ స్వాగతం తేsస్తు కిమహం కరవాణి తే ||

తా|| ఆతడు దశరథమహారాజుని చూచుచూ ఈ వాక్యములను పలికెను. ' ఓ రాజా నన్ను ప్రజాపతి పంపగా ఇచటికి వచ్చితిని'. అప్పుడు ఆ రాజు అంజలిఘటించి ' ఓమహాత్మా స్వాగతము. నేను చేయవలసిన కర్తవ్యము చెప్పుము' అని.

అథో పునరిదం వాక్యం ప్రాజపత్యో నరోsబ్రవీత్ |
రాజన్నర్చయితా దేవాన్ అద్య ప్రాప్తమ్ ఇదం త్వయా ||
ఇదం తు నృపశార్దూల పాయసం దేవనిర్మితమ్|
ప్రజాకరం గృహాణ త్వం ధన్యం ఆరోగ్యవర్ధనమ్ ||
భార్యాణాం అనురూపాణాం అశ్నీతేతి ప్రయచ్ఛ వై |
తాసు త్వం ప్రాప్యసే పుత్త్రాన్ యదర్థం యజసే న్పప ||

తా|| పిమ్మట ప్రజాపతిచే పంపబడిన అతడు మరల పలికెను. 'ఓ రాజా ! దేవతలను అర్చయించి వారి అనుగ్రహముతో దీనిని పొందితివి. ఓ రాజా! ఈ పాయసము దేవతలచే చేయబడినది. ఇది సంతానము ప్రసాదించును. సంపత్కరము అరోగ్యము ప్రసాదించునదియునూ కూడా. దీనిని స్వీకరించుము. ఈ పాయసమును నీ అనురూపులగు భార్యలకు ఇచ్చి భుజింపవలసినదిగా వచింపుము. దీనిని భుజించుటవలన యజ్ఞఫలముగా నీభార్యలకు సంతానము కలుగును.'

తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగుహ్యతామ్ |
పాత్రీమ్ దేవాన్నసంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీమ్ ||
అభివాద్య చ తద్భూతం అద్భుతం ప్రియదర్శనమ్ |
ముదా పరమయా యుక్తః చకారాభి ప్రదక్షిణమ్ ||
తతో దశరథః ప్రాప్య పాయసం దేవనిర్మితమ్ |
బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః ||

తా|| అప్పుడు రాజు "ఆటులనే" అని పలికి ప్రీతితో వినమ్రుడై హిరణ్మయి అయిన దేవతలచే ఇవ్వబడిన పాయసముతో నిండియున్నపాత్రను గ్రహించెను. అద్భుతముగా దర్శనీయుడైయున్న ఆ దివ్యపురుషునకు (దశరథ మహారాజు) పరమానందముతో ప్రదక్షిణ నమస్కారములనొనెర్చెను. దశరథమహారాజు ఆ దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది ధనములేనివాడు ధనముపొందినట్లు మహదానంద భరితుడాయెను.

తతస్తదద్భుతప్రఖ్యం భూతం పరమభాస్వరమ్ |
సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత ||

తా|| ఆ ( పాయస ప్రదాన) కార్యక్రమమును ముగించికొని అద్భుతాకారముతో దివ్యతేజస్సుతో విరజిల్లుచుండిన ఆ మహాపురుషుడు వెంటనే అంతర్థానమయ్యెను.

హర్షరస్మిభిరుద్ద్యోతం తస్యాంతఃపురమాబభౌ |
శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంసుభిః ||
సః అంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యాం ఇదమబ్రవీత్ |
పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రీయం త్విదమాత్మనః ||

తా|| సంతోషకిరణములతో భాసించుచున్నఆ రాజు యొక్క సంతోషకిరణములతో ఆ అంతఃపురము లోని స్త్రీలందరూ శరత్కాలమందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాసించు ఆకాసమువలే ప్రకాసించుచుండిరి.

కౌసల్యాయై నరపతిః పాయసార్థం దదౌ తదా |
అర్థాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః ||
కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్త్రార్థకారణాత్ |
ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమమ్ ||
అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః |
ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్ ||
తాస్త్యేతత్ పాయసం ప్రాప్య నరేంద్రస్యొత్తమాః స్త్రియః |
సమ్మానం మేనిరే సర్వాః ప్రహర్షోదిత చేతసః ||

తా|| ఆ రాజు కౌసల్యాదేవికి ఆ పాయసములో అర్థభాగమిచ్చెను. మిగిలిన సగములో సగము భాగము సుమిత్రాదేవికిచ్చెను. మిగిలిన పావు భాగములో సగము కైకేయికి మిగిలిన పావులో సగము భాగము మరల సుమిత్రకిచ్చెను. ఈ విధముగా పుత్త్రసంతానప్రాప్తికై ఆ పాయసము ముగ్గురు రాణులకు పంచిబెట్టెను. ఆ ముగ్గురు రాణులు ఆ నరేంద్రుని నుంచి ఆ పాయసము గైకొని అది తమకు జరిగిన సమ్మానమని భావించి పొంగిపోయిరి.

తతస్తు తాః ప్రాశ్య తదుత్తమస్త్రియో
మహీపతేః ఉత్తమపాయసం పృథక్ |
హుతాశనాదిత్యసమాన తేజసోs
చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా ||

తా|| అప్పుడు ఆ రాజుయొక్క పత్నులు ముగ్గురు అ పాయసమును తమతమ భాగములను భుజించి అగ్నివలే సూర్యునివలె తేజస్సుతో విరాజిల్లిరి. అచిరకాలములోనే వారు గర్భవతులైరి.

తతస్తు రాజా ప్రసమీక్ష్య తాః స్త్రియః
ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః |
బభూవహృష్ట స్త్రిదివే యథా హరిః
సురేంద్ర సిద్దర్షి గణాభిపూజితః ||

తా|| తదనంతరము (దశరథ)మహారాజు గర్భవతులైన తన భార్య్లను చూచి స్వస్థ చిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణములచే పూజింపబడిన విష్ణువువలె సంతోషపడెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే షోడశస్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||