Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 17

Birth of Monkey chiefs through Devas !

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
పదునేడవసర్గము
( బ్రహ్మదేవుడు దేవతలను వారి అంశములతో వానరరూపముతో సృజించమని ఆదేశము)

పుత్త్రత్వం తు గతే విష్ణౌ రాజ్ఞస్తస్య మహాత్మనః |
ఉవాచ దేవతాః సర్వాః స్వయంభూర్భగవానిదమ్ ||

తా|| మహత్ముడైన ఆ (దశరథ) మహారాజునకు పుత్త్రుడుగా అవతరించుటకు విష్ణువు సంకల్పించిన పిమ్మట స్వయంభూవు అగు బ్రహ్మ దేవతలందఱితో చెప్పెను.

సత్యసంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణః |
విష్ణో: సహాయాన్ బలినః సృజధ్వం కామరూపిణః ||

తా|| 'ఓ దేవతలారా ! సత్యసంధుడు మహావీరుడు, మన అందఱికి హితాభిలాషిఅయిన విష్ణువు నకు కామరూపులు బలశాలురు అయిన సహాయకులను సృజింపుడు'.

మాయావిదశ్చ శూరాంశ్ఛ వాయువేగసమాన్ జనే
నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్ విష్ణుతుల్యపరాక్రమాన్ ||
అసంహార్యానుపాయజ్ఞాన్ దివ్యసంహననాన్వితాన్ |
సర్వాస్త్రగుణసంపన్నాన్ అమృతప్రాశనానివ ||
అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూష చ |
( యక్షపన్నగకన్యాసు ఋక్షవిద్యాధరీషుచ
కిన్నరీణాంచ గాత్రేషు వానరీణాం తనూషు చ)
సృజధ్వం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్ ||

తా|| 'మాయావిదులు శూరులు వాయువేగము కలవారు యుక్తిశాలురు బుద్ధి సంపన్నులు , విష్ణువుతో సమానమైన పరాక్రమము గలవారు, అవధ్యులు , ఉపాయములు ఎఱిగినవారు , సింహపరాక్రమము గలవారు, సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులు,అమృతము తాగిన వారివలె మరనములేనివారు, అగు పుత్త్రులను అప్సరసలు , నాగకన్యలు , ఋక్ష, విధ్యాధరయువతులు , కిన్నరమహిళలు వానరస్త్రీలు మున్నగువారియందు వానరరూపములతో సృజింపుడు'.

పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ ఋక్షపుంగవః |
జృంభమాణస్య సహసా మమ వక్త్రా దజాయత ||
తే తథోక్త భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనమ్ |
జనయామాసురేవంతే పుత్త్రాన్ వానరరూపిణః ||
ఋషయశ్చ మహాత్మనః సిద్ధవిద్యాధరోరగాః |
చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజుః వనచారిణః ||

తా|| పూర్వమే జాంబవంతుడను ఋక్షరాజును నేను సృష్ఠించియుంటిని. నేను ఒకసారి ఆవులించినపుడు నా నోటినుండి వెలువడెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలకగా ఆయన శాసనానుసారము దేవతలు వానరరూపములతో నున్న పుత్త్రులను పొందిరి.

వానరేంద్రం మహేంద్రాభమ్ ఇంద్రో వాలినమూర్జితమ్ |
సుగ్రీవం జనయామాస తపనః తపతాం వరః ||
బృహస్పతి స్త్వజనయత్ తారం నామ మహాహరిమ్ |
సర్వవానర ముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమమ్ ||

తా|| ఇంద్రుడు మహేంద్ర పర్వతమువలె ధృడముగా గల దేహము కలవాడు వానరులలో ఇంద్రుడంతటివాడగు వాలికి జన్మనిచ్చెను. తపింపచేయువారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవునకు జన్మనిచ్చెను. బృహస్పతి తారుడు అనబడు మహా వానరునికి జన్మనిచ్చెను. అతడు వానరముఖ్యులలో బుద్ధిమంతుడు ఉత్తముడు.

ధనదస్య సుతః శ్రీమాన్ వానరో గంధమాదనః |
విశ్వకర్మాత్మజనయత్ నళం నామ మహా హరిమ్||
పావకస్య సుతః శ్రీమాన్ నీలోsగ్ని సదృశప్రభః |
తేజసా యశసా వీర్యాత్ అత్యరిచ్యత వానరాన్ ||

తా|| ధనదుడగు కుబేరుడి కుమారుడు గంధమాదనుడు అనబడు వానరుడు. విశ్వకర్మ నలుడనబడు వానరునకు జన్మనిచ్చెను. పావకుడగు అగ్ని అగ్నితో సమానమైన నీలుడు అనబడు వానరునికి జన్మనిచ్చెను. అతడు మిక్కిలి తేజస్వి , కీర్తి గలవాడు , పరాక్రమశాలి.

రూపద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూపసమ్మతౌ |
మైందం చ ద్వివిదం చైవ జనయామాసతుః స్వయమ్ ||
వరుణో జనయామాస సుషేణం వానరర్షభమ్ |
శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలమ్ ||

తా|| ప్రసస్తమైన రూపములుగల మైందుడు ద్వివిదుడు సౌందర్యసం పన్నులైన అశ్వినీదేవతల మానసపుత్త్రులు. వరుణుడు సుషేణూడను వానరునిని, పర్జన్యుడు మహాబలశాలిఅయిన శరభునకు జన్మలనిచ్చిరి.

మారుతస్యాత్మజః శ్రీమాన్ హనుమాన్నమ వీర్యవాన్ |
వజ్రసంహననోపేతో వైనతేయసమో జవే ||
సర్వవానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి ||

తా|| వాయు దేవునియొక్క ఆత్మజుడు హనుమంతుడు అనబడు మహావీరుడు అతడు సర్వలక్షణ సంపన్నుడు. అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము గలవాడు. గరుత్మంతునివలె వేగము కలవాడు. వానర ముఖ్యులలో బుద్ధిమంతుడు , మహాబలవంతుడు.

తే సృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాః |
అప్రమేయ బలావీరాః విక్రాంతాః కామరూపిణః |
మేరుమందర సంకాశా వపుష్మంతో మహాబలాః ||
ఋక్షవానర గోపుచ్ఛాః క్షిప్రమేవాభిజజ్ఞిరే ||

తా|| ఆ విధముగా దేవతలు వేలకొలది వానరులను రావణ వధకోసము సృష్ఠించిరి. వారు అప్రమేయులు , బలవంతులు , విక్రాంతులు , కామరూపులు , మేరుమందర పర్వతము వలే దృఢమైన శరీరములు కలవారు. వారు భల్లూక జాతివారు, గోపుచ్చజాతి వారు.

యస్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమః |
అజాయత సమస్తేన తస్య తస్య సుతః పృథక్ ||
గోలాంగూలీషు చోత్పనాః కేచిత సమ్మతవిక్రమాః |
ఋక్షీషు చ తథా జాతా వానరాః కిన్నరీషు చ ||

తా|| ఆ వానరులందరూ తమకు జన్మలనిచ్చిన దేవతలయొక్క రూపములను , వేషములను పరాక్రమములను కలిగియుండిరి. గోపుచ్చ జాతియందు . భల్లూక జాతియందు , కిన్నెర జాతి యందు జన్మించిన వానరప్రముఖులు ప్రసిద్ధమైనవారు.

దేవామహర్షి గంధర్వాః తార్ క్ష్యా యక్షా యశస్వినః |
నాగాః కింపురుషాశ్చైవ సిద్ధవిధ్యాధరోరగాః ||
బహవో జనయామాసుః హృష్టాస్తత్ర సహస్రసః |
వానరాన్ సుమహాకాయాన్ సర్వాన్ వై వనచారిణః ||
అప్సరస్సు చ ముఖ్యాసు తథా విధ్యాధరీషు చ |
నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ ||

తా|| యశోవంతులైన దేవతలు, మహర్షులు , గంధర్వులు , గరుడజాతివారు , యక్షులు , నాగులు, కింపురుషులు , సిద్ధులు, విధ్యాధరులు సంతోషముతో వేలకొలది మహాకాయులు , వనచరులు అయిన వానరులను సృజించిరి. వారు ప్రసిద్ధమైన అప్సరసల, విధ్యాధరస్త్రీల, నాగకన్యల , గాంధర్వస్త్రీల యొక్క తనువులవారా సృజింపబడిరి.

కామరూపబలోపేతా యథాకామం విచారిణః |
సింహశార్దూల సదృశా దర్పేణ చ బలేన చ ||
శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః |
నఖదంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్రకోవిదాః ||
విచాలయేయుః శైలేంద్రాన్ భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్ |
క్షోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిమ్ ||
ధారయేయుః క్షితిం పద్భ్యాం అప్లవేయుర్మహార్ణవమ్ |
నభః స్థలం విశేయుశ్చ గృహ్ణీయురపి తోయదాన్ ||
గృహ్ణీయురపి మాతంగాన్ మత్తాన్ ప్రవ్రజతో వనే |
నర్దమానాశ్చ నాదేన పాతయేయు ర్విహంగమాన్ ||

తా|| ఆ వానరులందరూ కామరూపులు, బలవంతులు, యధేచ్చగా విహరించువారు , దర్పము బలములలో సింహశార్దూల సదృశులు. వారు రాళ్ళను విసరివేయగలవారు. వృక్షములను పెకలించి ప్రయోగింపగలవారు. వారికి నఖములు దంష్ట్రములు ఆయుధములు. వారు అన్ని శస్త్రములలో కోవిదులు. మహాపర్వతములను చలింపచేయువారు. స్థిరమైన వృక్షములను పెకలింపగలవారు. నదులకు భర్తఅయిన సాగరమును కూడా కల్లోల పఱచగలరు. పాద ఘట్టనలతో భూమిని బద్దలు కావింపగలవారు. మహాసముద్రములను లంఘింపగలవారు. ఆకాశమునకు ఎగురగలరు. మేఘములను పట్టగలరు. వనములో వేగముగా పోవు మదపుటేనుగులను పట్టుకొనగలరు.ఆకాశమున విహరించు పక్షులనుసైతము తమ గర్జనలతో పడగొట్టగలరు.

ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణాం |
శతం శతసహస్రాణి యూధపానాం మహాత్మనాం ||
తే ప్రధానేషు యూధేషు హరీణాం హరియూధపాః |
బభూవుర్యూధపశ్రేష్ఠా వీరాంశ్చాజనయన్ హరీన్ ||
అన్యే ఋక్షవతః ప్రస్థాన్ ఉపతస్థుః సహశ్రసః |
అన్యే నానావిధాన్ శైలాన్ భేజిరే కాననాని చ ||

తా|| ఈ విధముగా కామరూపులూ మాహాత్ములును , సేనానాయకులును అయినట్టి వానరులసంఖ్య కోట్లకు చేరెను. ఆ వానరులలో ప్రముఖులైనవారు వానర సేనలకు నాయక శ్రేష్ఠులైరి. వారునూ వానరులను సృజించిరి. వేలకొలది వానరులు ఋక్షవంతము అనబడు పర్వతము యందు నివసింపసాగిరి. కొందరు నావిథములగు కొండలను అడవులను ఆశ్రయించిరి.

సూర్యపుత్రం చ సుగ్రీవం శకపుత్రం చ వాలినం |
భ్రాతరావుపతస్థుస్తే సర్వ ఏవ హరీశ్వరాః ||
నళం నీలం హనూమంతమ్ అన్యాంశ్చ హరియూధపాన్ |
తే తార్ క్ష్యబలసంపన్నాః సర్వే యుద్ధవిశారదాః |
విచరంతోsర్దయన్ దర్పాత్ సింహవ్యాఘ్ర మహోరగాన్ ||

తా|| సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఇంద్రుని పుత్త్రుడైన వాలి ఈ ఇరువురునూ సోదరులు . ఈ ఇరువురు సోదరులను నలుడు , నీలుడు, హనుమంతుడు తదితర వానరవీరులు ఆశ్రయించివుండిరి. వారందరూ గరుత్మంతునితో సమానమైన బలము గలవారు , యుద్ధవిశారదులు. వారు వనములలో విహరించుచూ సింహము పులులని కూడా పీడింపగల సమర్థులు.

తాంశ్చ సర్వాన్ మహాబాహుః వాలీ విపులవిక్రమః |
జుగోపభుజవీర్యేణ ఋక్షగోపుచ్ఛవానరాన్ ||

తా|| వారందరినీ మహాబాహువైన అమిత పరాక్రమవంతుడైన వాలి తన భుజబలముచే భల్లూక జాతి, గోపుచ్చజాతి వానరులకు ప్రభువై వారందరినీ పాలించుచుండెను.

తైరియం పృథివీ శూరైః సపర్వతవనార్ణవా |
కీర్ణా వివిధ సంస్థానైః నానావ్యంజనలక్షణైః ||

తా|| వారు వివిధాకారములు గలవారు, పలువిధములైన లక్షణములు గలవారు అట్టి వానరవీరులు పర్వతములతో అడవులతో సముద్రములతో గూడిన ఈ భూమండలమంతయూ వ్యాపించివున్నారు.

తై ర్మేఘబృందాచలకూటకల్పైః
మహాబలైః వానరయూధపాలైః |
బభూవ భూ ర్భీమశరీరరూపైః
సమావృతా రామశాయ హేతోః ||

తా|| మేఘసమూహములవలెను, పర్వతశిఖరములవలెను , మిక్కిలి ఉన్నతులైన వారునూ , మిక్కిలి బలశాలురు , భయంకరరూపములు గలవారు అయిన వానరులు శ్రీరామునకు సహాయపడుటకై ఈ భూమండలమంతయూ వ్యాపించియుండిరి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే సపత దశస్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||