Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 22

' Rama Lakshmana follow Viswamitra !'

With Sanskrit text in Devanagari, Telugu and Kannada

తథా వసిష్టే బ్రువతి రాజా దశరథస్సుతమ్ |
ప్రహృష్టవదనో రామమ్ అజుహావ సలక్ష్మణమ్ ||

'ఆవిధముగా వశిష్ఠుడు మట్లాడచుండగా వికసిత వదనముతో ఆ దశరథమహారాజు రామ లక్ష్మణులను ఇద్దరినీ పిలిపించెన'.

బాలకాండ
ఇరువది రెండవ సర్గము
( రామలక్ష్మణులు బల అతిబల అను విద్యలను గ్రహించుట)

ఆవిధముగా వశిష్ఠుడు మట్లాడచుండగా వికసిత వదనముతో ఆ దశరథమహారాజు రామ లక్ష్మణులను ఇద్దరినీ పిలిపించెను.

తల్లియూ తండ్రి దశరథుడునూ శ్రీరాముని ఆశీర్వదించిరి. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీస్సులు పలికెను. దశరథమహారాజు తన ప్రియమైన కుమారుడగు శ్రీరాముని మూర్ధమును ఆఘ్రాణించి ప్రసన్నమైన మనస్సుతో విశ్వామిత్రునకు అప్పగించెను.

అప్పుడు విశ్వామిత్రునితో పోవుచున్న శ్రీరాముని చూచి వాయువు వారికి సుఖస్పర్శ కలిగించుచూ ధూళి లేకుండా వీచెను. శ్రీరాముడు విశ్వామిత్రునితో వెళ్ళుచుండగా దేవతలు పుష్పవృష్ఠి కురుపించిరి. శంఖములు దేవదుందుభిలు మ్రోగెను.

విశ్వామిత్రుడుముందు పోవుచుండగా పిల్లల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించెను. లక్ష్మణుడునూ ధనస్సును చేపట్టి రాముని వెంట నడిచెను. ఆ రామలక్ష్మణులు అమ్ములపొదలను ధనస్సులను ధరించి తతమ శోభలను వెరజిల్లుచుండిరి. అటూ నిటూ తూణీరములను ధనస్సునూ దాల్చి వారు మూడూ తలల పన్నగములవలే కనపడుచుండిరి. చక్కని సౌందర్యముతో పరాక్రమముతో ఒప్పుచూ వారు అశ్వనీ దేవతలు బ్రహ్మని అనుసరించి నట్లు మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులు అనుసరించిరి. ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్దారులైయుండిరి.

వారు చర్మముతో నిర్మితమైన తొడుగులను చేతులకు ధరించియుండిరి. ఖడ్గదారులై అపూర్వశోభలతో విలసిల్లుచుండిరి. రాజకుమారులు , సోదరులు సద్గుణశోభితులగు రామ లక్ష్మణులు విశిష్ఠకాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖ వాజ్ఞ్మనస్సులకు అందని శివునివలె విశ్వామిత్రుని అనుసరించుఛూ ఆయనను శోభిల్లచేసిరి.

సరయూ నదియొక్క దక్షిణ తీరములో ఒకటిన్నర యోజనములు పోయిన పిమ్మట విశ్వామిత్రుడు 'రామా' అని మధురముగా సంబోధించి ఇట్లు పలికెను. ' వత్సా ! ఈ నీటిని గ్రహించి అలస్యములేకుండా ఆచమనము చేయుము. 'బల' 'అతిబల' అను మంత్రములను ఉపదేశించెదను స్వీకరింపుము. ఆ మంత్రమువలన నీకు అలసట కాని ఆకలిదప్పులు గాని ఉండవు. నీ రూప కాంతులు తగ్గవు. నీవు నిద్రలో నున్నా అప్రమత్తముగా నున్ననూ రాక్షలు ఏమీ చేయలేరు. ఈ మంత్రప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొనువారు ఈ పృథివీలో ఎక్కడా వుండరు. ఈ ముల్లోకములలో గూడా నీతో సమానమైన వారు ఉండరు.

ఓ అనఘా ! సౌభాగ్యములో కాని దాక్షిణ్యములో గాని జ్ఞానములో గాని కార్యనిర్వహణమునకు కావలసిన బుద్ధిలో గాని, ఉత్తరమిచ్చుటలోగాని నీతో సమానుడెవ్వడు లేడు. 'బల' 'అతిబల' అను మహామంత్రములు సమస్త జ్ఞానమునకును మాతృకలు. ఈ రెండు విద్యలు లభించినచో ఇకముందు నీతో సమానుడు లేడు. ఓ రాఘవా! మార్గమునందు 'బల' 'అతిబల' అను మంత్రములను జపించుచూ పయనించినచో నీకు ఆకలి దాహములుండవు. సమస్త లోక కల్యాణము కోసము ఈ విద్యలను స్వీకరింపుము. ఈ రెండూ విద్యలను అభ్యశించినచో నీకు సాటిలేని యశస్సు కలుగును. ఈ రెండు విధ్యలూ బ్రహ్మదేవుని నుండి వచ్చినవి. ఓ కకుత్స్థా ! ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడవు. పూర్వోక్తములైన ఉత్తమగుణములన్నియూ నీలో సమృద్ధిగా గలవు ఇందుక సందేహము లేదు . తపస్సుద్వారా లభించిన ఈ మంత్రములు నీకు ఉపదేశించుటవలన అవి లోకములో వివిధరూపములలో విస్తృతమగును'.

అంతట రాముడు ప్రసన్నవదనుడై ఆచమించి శుచిఅయి ధ్యానపరాయణుడై విశ్వామిత్రుని నుండి 'బల' 'అతిబల' అను విద్యలను గ్రహించెను.

ఆవిద్యలను పొంది అమితపరాక్రమశాలి అయిన శ్రీరాముడు శరత్కాలమందలి సహస్ర కిరణములున్న సూర్యభగవానుని వలే విరాజిల్లెను.

విశ్వామిత్రునకు చేయవలసిన గురుకార్యములు చేసిన పిమ్మట ఆ ముగ్గురూ సరయూ నది తీరమునందే ఆ రాత్రి గడిపిరి.

దశరథమహా రాజు కుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటులేని తృణశయ్యపై కలిసిపరుండిరి. ఇననూ విశ్వామిత్రుని లాలింపు భాషణలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను.

ఈ విధముగా బాలకాండలో ఇరువదిరెండవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్ ||

దశరథ నృపసూనుసత్తమాభ్యాం
తృణశయనే అనుచితే సహోషితాభ్యాం |
కుశికసుతవచోను లాలితాభ్యాం
సుఖమివ సా విబభౌ విభావరీ చ ||

తా|| దశరథమహా రాజు కుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటులేని తృణశయ్యపై కలిసిపరుండిరి. ఇననూ విశ్వామిత్రుని లాలింపు భాషణలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను.


|| om tat sat ||