Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 27

Viswamitra gives Celestial weapons to Rama !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ఇరువది ఏడవ సర్గము
( విశ్వామిత్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములు ఉపదేశించుట )

అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః |
ప్రహస్య రాఘవం వాక్యం ఉవాచ మధురాక్షరమ్ ||

తా|| మహాయశస్విఅయిన విశ్వామిత్రుడు వారితో ఆ రాత్రిని అచటనే గడిపెను. పిమ్మట సంతోషముతో మందాహాసమొనర్చి శ్రీరామునితో మధురముగా ఇట్లు పలికెను.

పరితుష్టోsస్మి భద్రం తే రాజపుత్త్ర మహాయశః |
ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః ||
దేవాసురగణాన్ వాపి సగంధర్వోరగానపి |
యై రమిత్రాన్ ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి ||

తా|| 'లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రామా ! నేను మిక్కిలి సంతుష్ఠుడనైతిని. నీకు భద్రమగుగాక. వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో ఇచ్చెదను. వాటితో దేవతలూ సురగణములు అయిననూ గంధర్వులు నాగులు అయిననూ వారిని అందరినీ వశముచేసి కొని జయింపగలవు.

తాని దివ్యాని భద్రం తే దదామ్యస్త్రాణి సర్వశః |
దండచక్రం మహద్దివ్యం తవదాస్యామి రాఘవ ||
ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ |
విష్ణుచక్రం తథాత్యుగ్రం ఇంద్రమస్త్రం తథైవ చ ||
వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా |
అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఇషీకమపి రాఘవ ||
దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమమ్ |
గదే ద్వే చైవ కాకుత్ స్థ మోదకీ శిఖరీ ఉభే ||

తా|| 'ఓ రాఘవా ! మహా దివ్యమైన దండకాస్త్రమును ఇంకా అలాంతి దివ్యాస్త్రములన్నియూ నీకు ఇచ్చుచున్నాను. ఓ రఘువీరా ! దివ్యమైన ధర్మ చక్రమును , కాలచక్రమును , ఉగ్రమైన విష్ణు చక్రమును అదే విథముగా ఇంద్రాస్త్రమును ఇచ్చెదను. ఓ నరశ్రేష్ఠా ! వజ్రాస్త్రమును, శివుని మహాశూలమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును , ఇషికాస్త్రమునూ , అదే విథముగా ఓ మహాబాహో ! ఉత్తమమైన బ్రహ్మాస్త్రమునూ , మీ ఇద్దరికీ మోదకీ శిఖరి అను దివ్యమైన గదలను అందింతును'.

ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ |
ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ ||
పాశం వరుణ మస్త్రం చ దదమ్యహమనుత్తమమ్ |
అశనీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన ||
దదామి చాస్త్రం పైనాకం అస్త్రం నారాయణం తథా |
ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః ||
వాయవ్యం ప్రథనమ్ నామ దదామి చ తవానఘ |
అస్త్రం హయశిరోనామ క్రౌంచ మస్త్రం తథైవ చ ||
శక్తిద్వయం చ కాకుత్ స్థ దదామి తవ రాఘవ ||

తా|| ఓ రామా! ధర్మపాశమునూ, కాలపాశమునూ , వరుణపాసమునూ, శక్తి సంపన్నమైన వారుణాస్త్రమునూ ఇచ్చెదను. శుష్కాశని ఆర్ద్రశని అను రెండు దివ్యాస్త్రములను, పినాకాస్త్రమునూ, నారాయణాస్త్రమునూ, శిఖరం అని పేరుగల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను. ఓ రాఘవా ! ప్రధనము అను పేరుగల వాయవ్యాస్త్రమును , హయశిరస్సు అను పేరుగల అస్త్రమును , క్రౌంచాస్త్రమునూ , శక్తి ద్వయమునూ నీ కొసంగెదను'.

కంకాళం ముసలం ఘోరం కాపాలమథ కంకణమ్ |
ధారయంత్యసురా యాని దదామ్యేతాని సర్వశః ||
వైధ్యాధరం మహాస్త్రం చ నందనమ్ నామ నామతః |
అసి రత్నం మహాబాహో దదామి చ నృపాత్మజ ||
గాంధర్వ మస్త్రం దయితం మానవం నామ నామతః |
ప్రస్వాపనప్రశమనే దద్మి సౌరం చ రాఘవ ||

తా|| 'అసురులు ధరించునట్టి భయంకరమైన కంకాళమునూ, ముసలము, కాపాలము , కంకణము అను అస్త్రములను అన్నిటినీ ఇచ్చెదను . విధ్యాధరులు ప్రయోగించునట్టి నందనము అను మహాస్త్రమునూ , ఖడ్గ రత్నమునూ ఇచ్చెదను. ఓ రాఘవా ! గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగించునట్టి , నిద్రను పోగట్టునట్టి అయిన అస్త్రములను, సౌరాస్త్రమును ఇచ్చెదన".

వర్షణం శోషణం చైవ సంతాపనవిలాపనే |
మదనం చైవ దుర్దర్షం కందర్పదయితం తథా ||
పైశాచమస్త్రం దయితం మోహనం నామ నామతః |
ప్రతీచ్ఛ నరశార్దూల రాజపుత్త్ర మహయశః ||

తా|| 'సుప్రసిద్ధ రాజకుమారుడవైన ఓ నరోత్తమా ! వర్షణము, శోషణము, సంతాపనము , విలాపనము, అను అస్త్రములను మరియు మన్మథునకు ప్రీతికరమైనదియూ, ఎవరికినీ ఎదిరింప శక్యముగానిదియూ అగు మదనము అను అస్త్రమును. అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన అను పేరుగల అస్త్రమునూ తీసుకొనుము'.

తామసం నరశార్దూల సౌమనం చ మహాబల |
సంవర్తం చైవ దుర్దర్షం మౌసలం చ నృపాత్మజ ||
సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరమ్ |
సౌరం తేజః ప్రభం నామ పరతేజోsపకర్షణమ్ ||

తా|| ఓ నరశార్దూలా ! తామసము, సౌమనము, సంవర్తము , దుర్దర్షమైన మౌసలము అను అస్త్రములను తీసుకొనుము. ఓ మాహాబాహో ! నృపాత్మజా ! సత్యాస్త్రమును , శ్రేష్ఠమైన మాధరమును, శత్రు పరాక్రమమును నిర్వీర్యమొనర్చు సూర్యుని తేజః ప్రభ అను పేరుగల అస్త్రమును తీసుకొనుము.

సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వష్టురస్త్రం సుదామనమ్ |
దారుణం చ భగస్యాపి శీతేషు మథమానవమ్ ||
ఏతాన్ రామ మహాబాహోకామరూపాన్ మహాబలాన్ |
గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ ||

తా|| ఓ రామా మహాబాహో ! శిశిరము అను పేరుగల సౌమ్యాస్త్రమును , విశ్వకర్మ యొక్క సుదారుణాస్త్రమును , భగఆస్త్రమగు దారుణాస్త్రము , మనువు యొక్క శీతేషు అను అస్త్రమును ఇచ్చెదను. ఈ అస్త్రములన్నియూ కామరూపశక్తి గలవి, మహాబలముకలవి, మిక్కిలి శ్రేష్ఠమైనవి వీటిని నానుండి వెంటనే గ్రహింపుము.

స్థితస్తు ప్రాజ్ఞ్ముఖోభూత్వా శుచిర్మునివరస్తదా |
దదౌ రామాయ సుప్రీతో మంత్రగ్రామం అనుత్తమమ్ ||
సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభమ్ |
తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్ ||

తా|| అంతట విశ్వామిత్రమహర్షి శుచి అయి పూర్వాభిముఖుడై అయాస్త్రములను వాటికి సంభంధించిన అధిష్ఠాన దేవతా పూర్వకముగా శ్రీరామునకు ఒసగెను. ఈ అస్త్రములను పొందుట దేవతలకు కూడా అసాధ్యము. అట్టి మహాస్త్రములను ఆ మహాముని శ్రీరామునకు ఒసగెను.

జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః |
ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవమ్ ||
ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాంజలయస్తదా |
ఇమే స్మ పరమోదారాః కింకరాస్తవ రాఘవ ||

తా|| ధీమంతుడైన విశ్వామిత్ర మహర్షి అస్త్రమంత్రములను శ్రీరామునకు ఉపదేశించి వాటి అధిష్ఠానదేవతలు ఆయన ఆజ్ఞలను అనుసరించునట్లు చేయుటకై వారిని స్మరించుచూ జపించుచుండెను. అంతట ఆ మహా అస్త్రములన్నియూ శ్రీరామునకు చేరెను. పిమ్మట ఆ మంత్రాధిష్ఠాన దేవతలందరూ సంతోషముతో శ్రీరామునకు అంజలిఘటించి ఇట్లనిరి. " ఒ రాఘవా! నిన్ను చేరిన మేమందరమూ త్రికరణశుద్ధిగా మీ సేవకులమై ఉందుము"అని .

ప్రతిగృహ్య చ కాకుత్ స్థః సమాలభ్య చ పాణినా |
మానసా మే భవిష్యధ్వమ్ ఇతి తానభ్యచోదయత్ ||

తా|| శ్రీరాముడు తన కర స్పర్శతో వారిని స్వీకరించి , "స్మరించినంత మాత్రమే మీరు నన్ను చేరుడు" అని ఆదేశించి వారిని పంపివేచెను.

తతః ప్రీతిమనా రామో విశ్వామిత్రం మహామునిమ్ |
అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే ||

తా|| మిక్కిలి తేజశ్వి అయిన శ్రీరాముడు ప్రసన్న మనస్సు గలవాడై లక్ష్మణునితో గూడి విశ్వామిత్రునకు నమస్కరించి ఆ మహర్షితో ప్రయాణమయ్యెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే సప్తవింశ స్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||