Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 32

Story of Kusanabha's Hundred daughters !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ముప్పది రెండవ సర్గము
(కుశనాభుని నూరుగురు కుమార్తెల వృత్తాంతము)

బ్రహ్మయోనిర్మహానాసీత్ కుశో నామ మహాతపాః |
అక్లిష్టవ్రత ధర్మజ్ఞః సజ్జన ప్రతిపూజకః ||

తా|| కుశుడు అను మహాతపోవంతుడు బ్రహ్మయొక్క మానసపుత్రుడు. నియమనిష్ఠలతో వ్రతములాచరించెడివాడు. సత్పురుషులను నిత్యముపూజించువాడు.

సమహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్ |
వైదర్భ్యాం జనయామాస చతుర స్సదృశాన్ సుతాన్ ||
కుశాంబం కుశనాభం చ అధూర్త రజసం వసుమ్ |
దీప్తియుక్తాన్ మహోత్సాహాన్ క్షత్రధర్మచికీర్షయా||

తా || ఆ మహాత్ముడు ఉత్తమ వంశసంజాతురాలు సుగుణములు కలది భార్య వైదర్భి ద్వారా నలుగురు కుమారులను పుట్టించెను. కూశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అను పేరుగల పుత్రులు అన్నివిధముల యోగ్యులు తల్లిదండ్రులకు తగినవారు మరియు సద్గుణసంపన్నులు.

తానువాచ కుశః పుత్రాన్ ధర్మిష్టాన్ సత్యవాదినః |
క్రియతాం పాలనం పుత్త్రా ధర్మం ప్రాప్స్యత పుష్కలమ్ ||
కుశస్య వచనం శ్రుత్వా చత్వారో లోకసమ్మతాః |
నివేశం చక్రిరే సర్వే పురాణాం నృపరాస్తదా ||

తా|| ఆ ధర్మతత్పరులు, సత్యమును అనుసరించువారైన పుత్రులతో కుశుడు ఇట్లు చెప్పెను." ఓ పుత్రులారా పూర్తిగా ధర్మము అనుసరించి రాజ్య పాలన చేయుడు". పిమ్మట ఆ కుశుని వచనములను విని ఆ నరవరులు , ప్రజాభిమానము చూరగొన్నవారు అయిన ఆ నలుగురూ నాలుగు పురములను ఏర్పాటుచేసికొనిరి'.

కుశాంబస్తు మహాతేజాః కౌశాంబీమ్ అకరోత్ పురీమ్|
కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయమ్ ||
అధూర్త రజసో రామ ధర్మారణ్యం మహీపతిః |
చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజమ్ ||
ఏషావసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః |
ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతతః ||

తా|| 'మహాతపస్వి అయిఅన కుశాంబుడు "కౌశాంబీ" పురమును, ధర్మాత్ముడైన కుశనాభుడు "మహోదయము" అనబడు పురమును , అధూర్తరజసుడు "ధర్మారణ్యము" అనబడు నగరమును , వసువు "గిరివ్రజము" అనబడు పురమును నిర్మించిరి. ఓ రామా! ఇది మహత్ముడైన వసువు పరిపాలనలో నున్న ప్రదేశము' దీనిచుట్టునూ ఇదు పర్వతములు ప్రకాశించుచున్నవి'.

సుమాగధీ నదీ రమ్యా మగధాన్ విశ్రుతా యయౌ |
పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే ||
సైషా హి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః |
పుర్వాభిచరితా రామ సుక్షేత్రా సస్యమాలినీ ||

తా||"'సుమాగధీ' అనబడు నది పంచ పర్వతముల మధ్య మగధ చుట్టు ప్రవహించుతూ ఒక మాలవలె ఒప్పుచున్నది. ఈ మాగధియే మహాత్ముడైన వసువు యొక్క రాజ్యములో తూర్పునుంచి ప్రవహిస్తూ అన్ని క్షేత్రములను సస్యశ్యామలముగా చేయుచున్నది'

కుశనాభస్తు రాజర్షిః కన్యాశతమనుత్తమమ్ |
జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునందన ||

తా|| ఓ రఘునందనా! రాజర్షి అయిన కుశనాభుడు తన భార్య అయిన 'ఘృతాచి' ద్వారా వందమంది ఉత్తమమైన కుమార్తెలను పొందెను.

తాస్తుయౌవనశాలిన్యో రూపవత్యః స్వలంకృతాః |
ఉద్యానభూమి మాగమ్య ప్రావృషీవ శతహ్రదాః ||
గాయంత్యో నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వశః |
ఆమోదం పరమం జగ్ముః వరాభరణ భూషితాః ||
అథ తాశ్చారుసర్వాంగ్యో రూపేణా ప్రతిమాభువి |
ఉద్యానభూమి మాగమ్య తారా ఇవ ఘనాంతరే ||

తా|| 'వారు రూప యౌవ్వన సౌభాగ్యములతో తమను అలంకరించుకొని వర్షాకాలపు మెఱుపు తీగలవలె ఉద్యానభూమి కి వచ్చిరి. మంచి ఆభరణములతో అలంకరించుకున్న ఆ కన్యలు గానములతో నృత్యములతో వాద్యములతో అన్నివిధములగనూ పరమానంద భరితులైరి. సాటిలేని రూపసౌభాగ్యముఉ కల ఆ సర్వాంగ సుందరులు ఆ ఉద్యానమునకు వచ్చి మేఘముల మధ్య తారలవలె విరాజిల్లుచుండిరి'.

తాః సర్వగుణసంపన్నా రూపయౌవ్వన సంయుతాః |
దృష్ట్వా సర్వాత్మకో వాయుః ఇదం వచనమబ్రవీత్ ||
అహం వయః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ |
చలం హి యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ |
మానుషస్త్వజతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ ||
చలం హి యౌవనం నిత్యం మానుషేశు విశేషతః |
అక్షయ్యం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ ||

తా|| 'రూపయౌవ్వనములతో సర్వగుణ సంపన్నులగు వారిని చూచివాయువు ఇట్లనెను." నేను మిమ్మ్ములను కోరుచున్నాను.మీరందరూ నాభార్యలు కండు. యౌవనము చంచలమైనది. మీరు అమరత్వము పొందుడు. మానుషత్వము వదలుడు. దీర్ఘాయువును పొందురు.చంచలమైన యౌవ్వనము విశేషముగా మనుష్యులలో ఖాయము. అక్షయమైన యౌవనము సంపాదించి అమరులు అగుదురుగాక".

తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్ట కర్మణః |
అపహాస్య తతో వాక్యం కన్యా శతమథాsబ్రవీత్ ||
అంతశ్చరతి భూతానాం సర్వేషామ్ త్వం సురోత్తమ |
ప్రభావజ్ఞః స్మ తే సర్వాః కిమస్మానవమన్యసే ||
కుశనాభసుతాః సర్వాః సమర్థాస్త్వాం సురోత్తమ |
స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామస్తు తపోవయమ్ ||

తా|| 'క్లిష్టమైన పనులు చేయగల వాయువు యొక్క మాటలువిని ఆ మాటలను హాస్యము చేయుచూ ఆ నూరుగురు కన్యలు ఈ విధముగా చెప్పిరి. "ఓ సురశ్రేష్ఠా ! నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించుచుందువు, నీ ప్రభావము ఎఱుగుదుము. మమ్ములను ఎందుకు అవమానము చేయుచున్నావు . మేము అందరమూ కుశనాభుని కుమార్తెలము. ఓ సురోత్తమా ! నిన్ను నీ స్థానమునుండి తొలగింపగల సామర్థ్యము మాకు కలదు. కాని మా తపశ్శక్తిని కాపాడుకొనుటకై ఆ విధముగా చేయము".

మాభూత్ స కాలో దుర్మేథః పితరం సత్యవాదినమ్ |
నావమన్యస్వ ధర్మేణ స్వయంవరముపాస్మహే ||
పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి నః |
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||

తా|| "ఓ దుర్బుద్ధీ ! మా తండ్రి సత్య వాది. నీవు ఆయనను అవమానింపరాదు. ఆయనవలన్ నీవు మృత్యు ముఖమున పడరాదు. మాతండ్రియే మాకు ప్రభువు, పరమ దైవము కూడా . మా తండ్రి ఎవరికి మమ్ములను ఇచ్చునో వారే మా భర్త అగును".

తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః|
ప్రవిశ్య సర్వగాత్రాణి బభంజ భగవాన్ ప్రభుః ||

తా|| వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడాయెను. అప్పుడు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారినిగా చేసెను.

తాః కన్యా వాయునా భగ్నా వివిశుః నృపతేర్గృహమ్ |
ప్రాపతన్ భువి సంభ్రాంతాః స లజ్జాః సాశ్రులోచనాః ||
స చ తా దయితా దీనాః కన్యాః పరమశోభనాః |
దృష్ట్వా భగ్నా స్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్ ||

తా|| ఆ కన్యలు వాయువు చేత భంగపడి వివశులై రాజభవనమునకు చేరిరి . సిగ్గుతో నీళ్ళు గల కన్నులతో విలపిస్తూ సంభ్రమముతో నేల పై బడిరి. ఆ సౌందర్యవంతులైన తన బిడ్డలు దీనవదనులై గూనివారై యుండుట చూచి ఆశ్చర్యపోయి ఆ రాజు ఇటుల పలికెను.

కిమిదం కథ్యతాం పుత్ర్యః కో ధర్మ మవమన్యతే |
కుబ్జాః కేన కృతాః సర్వాః వేష్ట్యంతో నాభిభాషథ |
ఏవం రాజా వినిశ్వస్య సమాధిం సందధే తతః ||

తా|| "కుమార్తెలారా ఇది ఏమి ? ధర్మమును అవమానించినది ఎవరు? మిమ్ములను కుబ్జులుగా గావించినది ఎవరు ? మాట్లాడకుండా ఎల నేలపై దొర్లుచున్నారు?" ఈ విధముగా ఆ రాజు పలికి నిట్టూర్చుచూ సావధానుడైయుండెను.

ఇత్యార్షే శ్రీమద్రామయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే ద్వాత్రింశ స్సర్గః ||
సమాప్తం ||

|| ఈ విధముగా బాలకాండలోని ముప్పది రెండవ సర్గ సమాప్తము||
|| ఓమ్ తత్ సత్||

|| Om tat sat ||