Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 33

Brahmadatta marries Kusanabha's Hundred daughters !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ముప్పది మూడవ సర్గము.

తస్త తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః |
శిరోభి శ్చరణౌ స్పృష్ట్యా కన్యా శతమభాషత ||

తా|| ఆ ధీమంతుడైన కుశనాభుని ఆ వాక్యములను విని , శిరములతో పాదాభి వందనము చేసి ఆ నూఱుమంది కన్యలు ఇటుల పలికిరి.

వాయుసర్వాత్మకో రాజన్ ప్రధర్షయితుమిచ్ఛతి |
అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే ||
పితృమత్యః స్మ భద్రం తే స్వచ్ఛందే న వయం స్థితాః |
పితరం నో వృణీష్వ త్వం యది నో దాస్యతే తవ ||

తా||"ఓ రాజా ! సర్వాత్మలలో ప్రవేశించు వాయుదేవుడు అశుభమైన మార్గమును అనుసరించి మమ్ములను బలాత్కరించ తలచెను. ' మేము తండ్రి చాటు బిడ్డలము, మేము స్వతంత్రులము కాము. మా తండ్రినే అడుగుడు మీకు మమ్ములను ఇచ్చునా' అని చెప్పితిమి'

తేన పాపానుబంధేన వచనం న ప్రతీచ్ఛతా |
ఏవం బ్రువంత్య స్సర్వాః స్మ వాయునా నిహతా భృశమ్||

తా|| మేమందరమూ ఇట్లు పలుకు చుండగా మా మాటలు వినకుండా ఆ పాపాత్ముడు మా అందరినీ తీవ్రముగా గాయపరచెను

తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమ ధార్మికః |
ప్రత్యువాచ మహాతేజః కన్యా శతమనుత్తమమ్ ||

తా|| తేజస్వి యూ పరమ ధార్మికుడైన ఆ రాజు ఆ ఉత్తమమైన నూరుమంది కన్యలకు ఇట్లు సమాధానమిచ్చెను.

క్షాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతం|
ఇకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ ||
అలంకారో హి నారీణాం క్షమా తు పురుషస్య వా|
దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః |
యాదృశీ వః క్షమా పుత్ర్యః సర్వాసామవిశేషతః ||

తా|| ఓ పుత్రికలారా ! క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చేసితిరి. ఇకమత్యముతో మెలిగి మన వంశ ప్రతిష్ఠలు నిలబెట్టితిరి. పురుషులకైనా స్త్రీలకైనా క్షమాధర్మమే అలంకారము. క్షమాధర్మము కలిగియుండుట అరుదైన విషయము. మీరు ప్రదర్శించిన క్షమాధర్మము దేవతలకు కూడా దుష్కరమైనది

క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హిపుత్రికా |
క్షమా యశః క్షమా ధర్మః క్షమయా నిష్ఠితం జగత్ ||

తా || ఓ పుత్రికలారా ! క్షమయే దానము, క్షమయే యజ్ఞము, క్షమయే సత్యము, క్షమయే యశస్సు, క్షమయే ధర్మము, క్షమతో నే ఈ జగత్తు అంతయూ నిలబడిఉన్నది'.

విశ్రుజ్య కన్యాః కాకుత్ స్థ రాజా త్రిదశవిక్రమః |
మంత్రజ్ఞో మంత్రయామాస ప్రదానం సహ మంత్రిభిః |
దేశకాలౌ ప్రదానస్య సదృశే ప్రతిపాదనమ్ ||

తా|| అప్పుడు ఆ కకుస్థుడైన ఆ రాజు ఆ కన్యలను విడచి, తన మంత్రులతో దేశకాలములకు అనుగుణముగా ఆ కన్యల కన్యాదాన విషయమై బాగుగా అలోచించెను.

ఏతస్మిన్నేవ కాలేతు చూళీ నామ మహామునిః |
ఊర్థ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్ ||
తప్యంతం తం ఋషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే |
సోమదా నామ భద్రం తే ఊర్మిళా తనయా తదా ||

తా|| అదే కాలములో చూళీ అను పేరుగల గల మహాముని యుండెను. అతడు ఇంద్రియ నిగ్రహము కలవాడు. సదాచారసంపన్నుడు. బ్రహ్మము గురించి తపమొనర్చుచుండును. ఆ విధముగా తపమొనర్చుచున్న ఆ ఋషికి ఊర్మిళ కూతురైన 'సోమద' అను గాంధర్వి సేవలు చేయు చుండెను. ఓ రామా ! నీకు భద్రమగుగాక.

సాచ తం ప్రణతా భూత్వా శుశ్రూషణ పరాయణా |
ఉవాస కాలే ధర్మిష్టా తస్యాస్తుష్టోsభవద్గురుః ||

తా|| ఆ సోమద శుశ్రూషపరాయణురాలై ఆయనకు నమస్కరించుచూ సేవలొనర్చుచుండెను. కొంతకాలము పిమ్మట ధర్మదృష్ఠిగల ఆమె సేవలకు ఆ మహాముని సంతుష్ఠుడాయెను.

స చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునందన |
పరితుష్టోస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియమ్ ||

తా|| ఓ రఘునందనా ! కాలయోగము చేత ఆ ముని , ' నీ సేవలతో సంతుష్టుడనైతిని. నీకు శుభమగుగాక. నీకు ఏమి కావలెనో కోరుకొనుము' అని పలికెను.

పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వరా |
ఉవాచ పరమప్రీతా వాక్యజ్ఞా వాక్యకోవిదమ్ ||
లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్య బ్రహ్మభూతో మహాతపాః |
బ్రాహ్మేణతపసా యుక్తం పుత్త్రమిచ్ఛామి ధార్మిక ||

తా || ఆ ముని సంతుష్టుడైన విషయము గ్రహించి వాక్చాతుర్యము గల ఆమె మధుర స్వరముతో సంతోషముగా వాక్యముల అంతరార్థము తెలిసిన ఆ ఋషితో ఇట్లు పలికెను.' ఓ మహామునీ నీవు తపమునొనరించి బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందుచూ బ్రహ్మతుల్యుడవైతివి. ఓ ధర్మబుద్ధీ బ్రహ్మజ్ఞానముకల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుము ' అని.

అపతిశ్చాస్మి భద్రం తే భార్యా చాస్మి న కస్యచిత్ |
బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతమ్ ||

తా|| 'నేను పతి లేని దానను. నేను ముందు కూడా ఏవరికి భార్యను కాబోను.నీకు శుభమగుగాక. నీ బ్రహ్మ తేజస్సు ప్రభావమున నాకు పుత్రుని అనుగ్రహింపుము'.

తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిః దదౌ పుత్త్రమనుత్తమమ్ |
బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళినస్సుతమ్ ||

తా|| అప్పుడు ప్రసన్నుడైన ఆ మహర్షి ఒక ఉత్తమమైన కుమారుని ప్రసాదించెను. అతడు 'ఛూళీ" మానసపుత్రుడుగ బ్రహ్మదత్తుదను పేరుతో ప్రఖ్యాతి పొందెను.

స రాజా సౌమదేయస్తు పురీమధ్యావసత్ తదా |
కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివం ||
స బుద్ధిం కృతవాన్ రాజా కుశనాభస్సుధార్మికః |
బ్రహ్మదత్తాయ కాకుత్ స్థ దాతుం కన్యాశతం తదా ||
త మాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతిః |
దదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాంతరాత్మనా ||

తా|| అప్పుడు ఆ సోమద కుమారుడు అగు బ్రహ్మదత్తుడు , అమరావతిని ఇంద్రుడు పరిపాలించిన రీతిగా, కాంపిల్య నగరమును పరిపాలించుచుండెను. ఓ రామా ! గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన నూరుగురు కన్యలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించెను. అప్పుడు ఆ మహీపతి మహాతేజోవంతుడైన ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతోషముతో ఆ నూరుగు కన్యలనిచ్చి వివాహమొనర్చెను.

యథాక్రమం తతః పాణిన్ జగ్రాహ రఘునందన |
బ్రహ్మదత్తో మహీపాలః తాసాం దేవపతిర్యథా ||
స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః |
యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా ||

తా || ఓ రఘునందనా ! ఆ బ్రహ్మదత్తుడు ఇంద్రవైభవముతో విలసిల్లుచూ యథాక్రమముగా అ వధువుల హస్తములను గ్రహించెను. అప్పుడు స్పర్సమాత్రముననే ఆ కన్యల కుబ్జత్వము పోయెను,వారి మనోవ్యథలు పోయెను. వారు నిరుపమాన సౌందర్యముతో విలసిల్లిరి.

స దృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః |
బభూవ పరమప్రీతో హర్షం లేభే పునః పునః ||

తా|| వాయుపీడనుంచి ముక్తులైన వారిని చూచి ఆ మహీపతి ఎంతయూ సంతసించెను.మరల మరల హర్షాతిరేకము పొందెను.

కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః |
సదారం ప్రేషయామస సోపాధ్యాయగణం తదా ||

తా|| ఆ మహీపతి బ్రహ్మదత్తుని కి ఇచ్చి వివాహము చేసిన పిమ్మట, అయనను పత్నులతో సహా , పురోహితులతో కలిపి పంపివేసెను

సోమదాsపి సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియామ్ |
యథాన్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత |
స్పృష్ట్వా స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ ||

తా|| తల్లి అయిన సోమద కూడా పుత్రుని వివాహము జరిగినందుకూ, వారికి సద్రుశముగా అయిన కర్యమునకు మిగుల సంతోషపడెను. ఆ గాంధర్వి తన కోడళ్లతో మిగుల సంతోషపడి కుశనాభుని ప్రశంసించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే త్రయత్రింశస్సర్గః ||
సమాప్తం ||

||ఈ విధముగా వాల్మీకి రామాయనములోని బాలకాండలో ముప్పది మూడవసర్గ సమాప్తము ||

||ఓ తత్ సత్ ||


|| Om tat sat ||