Srimad Valmiki Ramayanam

Balakanda

Chapter 7 ...Ministers of the King Dasaratha !!

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
ఏడవ సర్గ

తస్య అమాత్యా గుణైరాసన్ ఇక్ష్వకోsస్తు మహాత్మనః |
మంత్రజ్ఞాశ్చ ఇంగితజ్ఞాశ్చ నిత్య ప్రియహితే రతః ||

తా|| ఆ మహాత్ముడైన ఇక్ష్వాకు మహారాజుయొక్క మంత్రులు కార్య విచారణలో దక్షులు , ఇంగితజ్ఞానమున్నవారు , గుణవంతులు , నిత్యము ప్రియముగూర్చువారు.

అష్టౌ బభూవు ర్వీరస్య తస్యమాత్యా యశస్వినః |
శుచయశ్చ అనురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః ||

తా|| ఆ యశోవంతుడైన రాజుకి ఎనిమిది మంత్రులుగలరు. వారు వీరులు , సద్గుణవంతులు , రాజుపై అనురక్తి గలవారు . ఎల్లప్పుడు రాజకృత్యములలో ఎట్టి తప్పులు రానివ్వనివారు .

ధృష్టిర్జయంతో విజయ స్సిద్ధార్థో హ్యర్థసాధకః |
అశోకో మంత్రపాలశ్చ సుమంత్రాశ్చ అష్టమో అభవత్ ||

తా|| ధృష్టి , జయంతుడు , విజయుడు, సిదార్థుడు, అర్థసాథకుడు అశోకుడు, మంత్రపాలుడు సుమంత్రుడు అను వారు ఆ ఎనిమిది మంత్రులు .

ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తామ్ ఋషిసత్తమో |
వశిష్టౌ వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే ||

తా|| వశిష్టుడు వామదేవుడు అను మహర్షులు ఇద్దరూ ఆభిమానింఫబడిన ఋషులు. ఇంకనూ పురోహితులు మంత్రులూ ఉండిరి .

విద్యావినీతా హ్రీమంతః కుశలానియతేంద్రియాః |
శ్రీమంతశ్చ మహాత్మనః శాస్త్రజ్ఞా ధృఢవిక్రమాః ||
కీర్తిమంతః ప్రణహితా యథావచనకారిణః |
తేజః క్షమాయశః ప్రాప్తాః స్మితాపూర్వాభిభాషణః ||
క్రోధాత్ కామార్థ హేతోర్వాన బ్రూయురనృతం వచః |
తేషామవిదితం కించిత్ స్వేషు నాస్తి పరేషు వా ||
క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితమ్ |||

తా|| వారు విద్యావంతులు , క్షమాగుణము గలవారు , కుశలులు , ఇంద్రియములను అదుపులోనుంచుకున్నవారు, శ్రీమంతులు , మహాత్ములు , శాస్త్రజ్ఞులు , అత్యంత పరాక్రమము గలవారు, కీర్తిపొందిన వారు , మాటతప్పనివారు, తేజస్సుకలవారు , ముందుచిఱునవ్వుతో మాట్లాడు వారు, కోపముతో గాని కోరికతోగాని అసత్యము పలుకని వారు , వారికి స్వరాజ్యములో గాని పరరాజ్యములో గాని తెలియనిది ఏమీ లేదు, జరిగిన జరుగబోవుచున్న విషయములు వారికి చారులద్వారా విదితమే.

కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః |
ప్రాప్తకాలం తు తే దండం ధారయేయుః సుతేష్వపి ||
కోశ సంగ్రహేణే యుక్తా బలస్య చ పరిగ్రహే |
అహితం చాపి పురుషం న విహింస్యుః అదూషకమ్ ||
వీరాశ్చ నియతోత్సాహో రాజశాస్త్రం అనుష్టితాః |
శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినః ||

తా|| వారు సమస్త వ్యవహారములందు కుశలులు , తమ మిత్రులయెడప్రవర్తనకి సంబంధించిన పరీక్షలో నెగ్గినవారు , తమ సుతులైననూ దండము ప్రాప్తించినపుడు నిష్పక్షపాతముగా వ్యవహిరించువారు. వారు కోశాగారమును నింపుటలోనూ , చతురంగబలములను సమకూర్చుటలోనూ సమర్థులు . శతృవు అయిననూ నిరపరాధి అయినచో దండించెడివారు కాదు. వారు వీరులు , అత్యంత ఉత్సాహము కలవారు, రాజశాస్త్రమును అనుసరించువారు . సాధువులను అన్ని పరిస్థుతులలోనూ రక్షించువారు.

బ్రహ్మక్షత్రం అహీంసంతః తే కోశం సమపూరయన్ |
సుతీక్ష్ణ దండాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలమ్ ||

తా|| బ్రాహ్మణులనూ క్షత్రియులనూ బాధించకుండా ధనాగారమును నింపెడివారు. అపరాధుల యొక్క అపరాధము యొక్క తారతమ్యముల బట్టి దండ విధించెడివారు.

శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతామ్ |
నాసీత్ పురేవా రాష్ట్రేవా మృషావాది నరః క్వచిత్ |
కచ్చిన్న దుష్టస్తత్రాసీత్ పరదారరతో నరః ||
ప్రశాంతం సర్వమేవాసీత్ రాష్ట్రం పురవరం చ తత్ |
సువాసస స్సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః ||
హితార్థం చ నరేంద్రస్య జాగ్రతో నయచక్షుషా |
గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే ||

తా|| మంత్రులందరూ ఏకగ్రీవముగా త్రికరణశుద్ధిగా వ్యవహారములను నడుపుటవలన ఆ పురమునందు గాని ఆ రాష్ట్రమునందుగాని అసత్యము పలుకువాడు లేడు. అచట దుష్టులుగాని పరులభార్యలపై మోహముగలవాడు లేడు.ఆ పురము అదేవిధముగా ఆ రాష్ట్రము అంతటనూ ప్రశాంత వాతవరణము వ్యాపించియుండెను. ఆ మంత్రులందరూ మంచి వస్త్రములను , సముచితమైన వేషములనూ ధరించియుండిరి. వారందరూ మంచి శీలముగలవారు. వారు రాజహితమునందే దృష్టిని నిలిపి జాగ్రతతో పనిచేసెడివారు, వారు పెద్దవారగు గురువులలోని మంచి గుణములను స్వీకరించెడివారు. వారు పరాక్రమములో ప్రసిద్ధులు.

విదేశేష్వపి విజ్ఞాతః సర్వతో బుద్ధినిశ్చయాత్ |
సంధి విగ్రహ తత్వజ్ఞాః ప్రకృత్యా సంపదాన్వితాః ||

తా|| వారు తమ బుద్ధిబలముచే విజ్ఞానము కలవారని విదేసములలోకూడా విఖ్యాతిపొందినవారు. ఏప్పుడు సంధి చేయవలెను ఎప్పుడు యుద్ధము చేయవలెను అన్న తత్వజ్ఞానము తెలిసినవారు . ప్రకృతిసిద్ధముగా కలిగిన సంపదతో తృప్తిపడువారు

మంత్ర సంవరణే శక్తాః శ్లక్ష్ణాః సూక్ష్మాసు బుద్ధిషు |
నీతిశాస్త్ర విశేషజ్ఞాః సతతం ప్రియవాదినః ||
ఈదృశై సై రమాత్యైస్తు రాజాదశరథోsనఘః |
ఉఅపన్నో గుణోపేతైః అన్వశాసద్వసుంధరామ్ ||

తా|| మంత్రాలోచనలను రహస్యముగా నుంచుటలోసమర్థులు సున్నితమైన విషయములను సూక్ష్మబుద్ధితో అలోచన చేయగలవారు. నీతి శాస్త్రమును బాగుగా తెలిసినవారు. ఎల్లప్పుడు మంచి చెప్పేడివారు. ఇట్టి సద్గుణసంపన్నులైన అమాత్యులతో గూడి ఎట్టి వ్యసనములులేని ఆ దశరథమహారాజు భూమిని పరిపాలించెను.

అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రంజయన్ |
ప్రజానాం పాలనం కుర్వన్ అధర్మం ప్రివర్జయన్ ||
విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః |
స తత్ర పురుషవ్యాఘ్రః శశాస పృథివీమిమామ్ ||

తా|| గూఢచారులద్వారా తనదేశములోనూ పరదేశములోనూగూడా అధర్మమునకు స్థానములేకుండా ధర్మము అనుసరించి ప్రజలను సంతోష పెట్టుచూ దేశమును పరిపాలించుచుండెను. మహాదాతగా సత్యసంధుడుగా మూడులోకములందు ప్రశిద్ధికెక్కినవాడై ఆ రాజు ఈ భూలోకమును పరిపాలించుచుండెను.

నాధ్యగచ్చద్విశిష్టం వా తుల్యం వా శత్రు మాత్మనః |
మిత్రవాన్ న తసామంతః ప్రతాపహత కంటకః ||
స శశాస జగద్రాజా దివం దేవపతిర్యథా |||

తా|| ఆయనతో సమానులుగాని అయనను అధిగమించగలిగిన శతృవులులేరు. సామంతరాజులు అయనకు లొంగి వుండిరి. చాలామంది మిత్రులుగా వుండిరి. ఆయన తన ప్రతాపముచే శతృవులను రూపుమాపెను. ఆ విధముగా ఇంద్రుడు దేవలోకమును పరిపాలించినటుల ఆ రాజు ఈ భూలోకమును పరిపాలించెను.

తై ర్మంత్రభిః మంత్రహితే నియుక్తైః
వృతోsనురక్తైః కుశలైః సమర్థైః |
స పార్థివో దీప్తి మవాస యుక్తః
తేజోమయైః గోభిరివోదితోsర్కః ||

తా|| రాజుకి హితముగూర్చుటకు తగినవిథముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడినవారును , సమర్థులు . కుశలురు ప్రభుభక్తి పరాయణులు అగు మంత్రులతో గూడిన ఆ మహారాజు తేజోమయమైన ఉదయకాలపు సూర్యచంద్రునివలె ప్రకాశించుచుండెను.

||ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సప్తమసర్గః ||
|| సమాప్తం ||

|| om tat sat ||