Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 8

"King decides to perform Yaga for obtaining children"

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
ఎనిమిదవ సర్గ

తస్యత్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః
సుతార్థం తప్యమానస్య నాశీద్వంశకరః సుతః ||

తా|| ఆ ప్రభావశాలియు , ధర్మజ్ఞుడు , మహాత్ముడు అయిన దశరథమహారాజుకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేనిపోవుటచే సుతునికోసము తపనపడిపోవుచుండెను.

చింతయానస్య తస్యైవం బుద్ధిరాసీన్మహాత్మనః |
సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహమ్ ||
స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుద్ధిమాన్ |
మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః ||
తతో అబ్రవీత్ ఇదం రాజా సుమంత్రం మంత్రి సత్తమమ్ |
శిఘ్రమానయ మే సర్వాన్ గురూన్ స్తాన్ స పురోహితాన్ ||

తా|| ఆ విధముగా చింతించుచున్న ఆ మహరాజుకు " సుతునికొఱకై అశ్వమేధయాగమును ఎందుకు చేయకూడదు" అని అలోచన కలిగెను. అప్పుడు ధర్మాత్ముడైన ఆ మహరాజు మిక్కిలి బుద్ధిమంతులగు మంత్రులందరితోనూ సమాలోచనచేసి యాగము చేయుట తగును అను నిశ్చయమునకు వచ్చెను. పిమ్మట అ మహరాజు మంత్రిసత్తముడైన సుమంత్రునితో పురోహితులతో సహా గురువులందరినీ తీసుకురమ్మని ఆదేశించెను.

తతస్సుమంత్రస్త్వరితం గత్వా త్వరిత విక్రమః |
సమానయత్ స తాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్||
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ |
పురోహితం వశిష్ఠం చ యేచాన్యే ద్విజ సత్తమా ||
తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తథా |
ఇదం ధర్మార్థ సహితం శ్లక్షం వచనమబ్రవీత్ ||

తా|| అప్పుడు సుమంత్రుడు ఆ క్షణమే త్వరగా వెళ్ళి సమస్త వేదపారంగతులైన వారినందరినీ తీసుకువచ్చెను . వారు సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి , కాశ్యపుడు , పురోహితముఖ్యుడైన వశిష్ఠుడు తదితర బ్రాహ్మణోత్తములు. వారినందరినీ పూజించి ఆ దశరథమహారాజు ధర్మార్థములతో కూడిన ఈ మథుర వచనములను పలికెను.

మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్ |
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ ||
తదహం యష్టుమిచ్చామి శాస్త్ర దృష్టేన కర్మణా |
కథం ప్రాప్య మహం కామం బుద్ధిరత్ర విచార్యతామ్ ||

తా|| " పుత్రుని కొఱకై తపించుచున్న నా మనస్సువలన నాకు సుఖములేకున్నది. అందుకోసము అశ్వమేధ యాగము చేయవలెనని నా కోరిక . ఆ యాగమును శాస్త్రోక్తమగు కర్మలతో చేయుటకు కోరిక గలవాడను. ఈ కోరిక నాకు ఎట్లు ప్రాప్తము కాగలదో అని మీరు విచారించవలెను " అని దశరథమహారాజు పలికెను.

తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వశిష్ఠప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతామ్ ||
ఊచుశ్చ పరమప్రీతాః సర్వే దశరథం వచః |
సంభారాః సంభ్రియతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||
సర్వథా ప్రాప్యసే పుత్రాన్ అభిప్రేతాంశ్చ పార్థివ |
యస్య తే ధార్మికీ బుద్ధిః ఇయం పుత్రార్థ మాగతా ||

అప్పుడు వశిష్టుడు మొదలగు బ్రాహ్మణోత్తములు ఆ మహరాజు పలికిన వచనములకు "బాగు బాగు" అని చెప్పి సంతశించిరి. సంతశించి వారందరూ దశరథమహరాజుతో ఈ విధముగా పలికిరి. " ఓ రాజా ! యాగమునకు కావలసిన సామగ్రులను తెప్పించుడు . యజ్ఞాశ్వమును విడువుడు. సంతానప్రాప్తికై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది. కావున మీ అభిలాషానుసారము మీరు పుత్రులను పొందుదురు" అని.

తతః ప్రీతో అభవద్రాజా శ్రుత్వా తద్ద్విజభాషితమ్ |
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్ష పర్యాకులేక్షణః ||

తా|| అప్పుడు ఆ మహరాజు ఆ ద్విజోత్తములవాక్యములను విని మిక్కిలి సంతోషపడి అనందాశ్రువులను రాల్చుచూ మంత్రివర్యులతో ఇట్లనెను.

సంభారాస్సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ |
సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్ ||
సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతామ్ |
శాంతయాశ్చాభివర్థంతాం యథాకల్పం యథావిథి ||
శక్యః ప్రాప్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా |
నాపరాథో భవేత్ కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే ||

తా|| "మా గురువులు ఆదేశించిన విధముగా యాగమునకు కావలసిన వస్తువులను సమకూర్చుడు. యాగముచేయు ఋషులు వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడువుడు. సరయూ నదికి ఉత్తరభాగమున యాగభూమిని సిద్ధపరచుడు. విఘ్ననివారకుములైన శాంతి కర్మలను యథావిథిగా జరిపింపుడు. ఈ యజ్ఞమును ఆచరించుటలో అపచారములుగాని కష్టములుగాని లేకున్నచో రాజులందరునూ ఈ యాగము చేసెడివారే".

చిద్రం హి మృగయంతే అత్ర విద్వాంసో బ్రహ్మ రాక్షసః |
నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తా వినస్యతి ||
తద్యథా విథిపూర్వం మే క్రతురేష సమాప్యతే |
తథా విథానం క్రిఅయతాం సమర్థాః కరణే ష్విహ ||

తా|| విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యాగకర్మలో దోషములు వెదుకుదురు. వారు యాగము భంగపఱచుటకు ప్రయత్నించుచుందురు. యాగము భంగపడినచో యాగకర్త వెంటనే నశించును. మీరు కార్యనిర్వహణలో నిపుణులు. అందువలన నేను సంకల్పించిన ఆ అశ్వమేధయాగము లోపములు లేకుండా యధావిథిగా పరిసమాప్తమగునటుల చూడుడు.

తథేతి చాబ్రువన్ సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ |
పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్యతే ||
తథా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్థయంతో నృపోత్తమమ్ |
అనుజ్ఞాతాస్తత స్సర్వే పునర్జగ్ముః యథాగతమ్ ||

తా|| ఆ మంత్రులందరూ మహరాజుయొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుచూ ప్రభువుల ఆదేశప్రకారము చేయుదము అని పలికిరి. ధర్మజ్ఞులైన ఆ ద్విజోత్తములందరూ దశరథమహారాజును ఆశీర్వదించి ఆయన ఆజ్ఞనుగైకొని తమతమ నివాసములకు పోయిరి.

విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివానిదమబ్రవీత్ |
ఋత్విగ్భిః ఉపదిష్టోsయం యథావత్ క్రతురాప్యతామ్ ||
ఇత్యుక్త్వా నృపశార్దూలః సచివాన్ సముపస్థితాన్ |
విశర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః ||

తా|| ఆ బ్రహ్మణోత్తములకు వీడ్కోలు పలికి పిమ్మట మహరాజు అమాత్యులకు ఋత్విజుల ఆదేశప్రకారముగా యాగద్రవ్యములను సిద్ధపఱచమని చెప్పెను. ఆ మహారాజు ఆవిథముగా పలికి అచట నున్న అమాత్యులను పంపి వేచి తన మందిరమును ప్రవేశించెను.

తతః స గత్వా తాః పత్నీః నరేంద్రోః హృదయప్రియాః |
ఉవాచ దీక్షాం విశత యక్ష్యేs హం సుతకారణాత్ ||

తా|| పిమ్మట ఆ మహారాజు తనప్రియపత్నులకడకేగి ," పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదలచితిని మీరునూ దీక్షతీసుకొనుడని పలికెను.

తాసాం తేనాతి కాంతేన వచనే సువర్చసామ్|
ముఖపద్మాన్యశోభంత పద్మానివ హిమాత్యయే ||

తా|| మిక్కిలి సంతోషకరమైన ఆ మాటలకు అ రాణుల ముఖపద్మములు మంచుతొలగినపిమ్మట వికశించు కమలములవలె శోభిల్లెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టమః సర్గః || సమాప్తమ్ ||

|| ఓమ్ తత్ సత్ ||


|| om tat sat ||