||సుందరకాండ ||

|| ఇరువది ఒకటవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః|
అర్తా దీనస్వరా దీనం ప్రత్యువాచ శనైర్వచః||1||
స|| తస్య రౌద్రస్య రక్షసః వచనం శృత్వా ఆర్తా దీనం దీనస్వరా సీతా శనైః ప్రత్యువాచ||
తా|| అలా రౌద్రుడైన రాక్షసుని యొక్క వచనములను విని దీనముగా విలపించుచూ దీనస్వరముతో మెల్లగా సీత ప్రతుత్తరము ఇచ్చెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకవింశస్సర్గః


అలా రౌద్రుడైన రాక్షసుని యొక్క వచనములను విని దీనముగా విలపించుచూ దీనస్వరముతో మెల్లగా సీత ప్రతుత్తరము ఇచ్చెను.

పతివ్రత, తపస్విని, భర్తనుగురించే అలోచనలో ఉన్న, దుఃఖములలో మునిగి విలపిస్తున్న సీత కోపముతో వణికి పోతూ ఒక గడ్డిపోచను మధ్యలోపెట్టి ప్రత్యుత్తరమిచ్చెను.

" ఓ రావణా ! నా నుంచి మనస్సును నివర్తించుకో. నీ మనస్సును నీ పరివారముపై ఉంచుకో. నువ్వు నన్ను కోరడము పాపాత్ముడు సుసిద్ధిని కోరడమే ! మహత్తరమైన కులములో జన్మించి మహత్తరమైన కులమును పొందిన పతివ్రతను. నిందనీయమైన అకృత్యమైన కార్యము నాకు చేయబడని కార్యము".

యశస్వినీ అగు వైదేహి ఆ రావణుని ఈ విధముగా చెప్పి తిరుగుముఖముతో మరల ఇట్లు పలికెను.

"నేను పరభార్యను. పతివ్రతను. నేను నీకు తగిన భార్యను కాను. నీ ధర్మమును పాటించుము. సాధువుల వ్రతము ఆచరింపుము. ఓ నిశాచర ! ఎలాగా నీ భార్యలు రక్షింపతగుదురో అలాగే ఇతరులభార్యలు కూడా రక్షింపతగుదురు. నిన్నే ఉదాహరణగా తీసుకొని నీ భార్యలతో రమింపుము. తన భార్యలతో అసంతుష్టుడైన చపలమైన ఇంద్రియములు కలవాడు ఇతరులభార్యలు ద్వారా పరాభవింపబడతాడు".

"ఇక్కడ సద్బుద్ధి కలవారు లేరా ?. సత్పురుషులున్నా వారిని నీవు అనుసరించవేమో. అందువలనే నీ బుద్ధి శిష్టాచారములను వదిలి విపరీతముగా వ్యవహరిస్తున్నది. మిధ్యాప్రవచనములకొదిగిన నీకు రాక్షసుల వినాశముకొఱకు విచక్షణాపూర్వకమైన మాటలు నచ్చుటలేదు. చేయకూడని పనులపై ఆసక్తికల రాజుల పరిపాలనలో సమృద్ధమైన రాష్ట్రములు నగరములు కూడా నశించిపోతాయి. అలాగే రత్న సంకులములతో వున్నఈ లంక నీ ఒక అపరాధము వలన త్వరలో నే నశించిపోవును. ఈ విధముగా పాపకర్మలు చేసిన నీవు నశించినప్పుడు, నీ వలన కష్టపడినవారందరూ 'ఈ రౌద్రుడి వినాశము కలిగినది' అని సంతోషిస్తారు".

" నేను ఇశ్వర్యముతో కాని ధనముతో కాని లోభములో పడను. సూర్యునికాంతి సూర్యునినుంచి వేరుకాని రీతిలో నేను రాఘవును నుండి వేరుకాను. లోకనాథుడైన ఆయన యొక్క సత్కర్మలు ఒనరించిన భుజమును ఆశ్రయించిన నేను ఇంకొకరి భుజమును ఏట్లు ఆశ్రయించగలను? వ్రతస్నాతములు చేసిన ఆత్మనెరిగిన విప్రుని విద్యా సంపదవలే నేను ఆ వసుధాధిపతికి మాత్రమే తగిన భార్యను. ఓ రావణా! వనములో నున్న దారికోల్పొయిన ఆడ ఏనుగును గజాధిపుని తో కలిపినరీతిగా దుఃఖములో నున్న నన్ను రామునితో కలుపుట సాధు కార్యము. ఘోరమైన వధను తప్పించుకొన గోరితే పురుషోత్తముడగు రామునితో మిత్రత్వమే నీకు యుక్తము. ధర్మజ్ఞుడగు రాముడు శరణాగతులపై వాత్సల్యము కలవాడు. జీవించకోరిక ఉంటే అట్టి రామునితో మైత్రి చేయుము. శరణాగత వత్సలుడైన రాముని ప్రసన్నుడిగా చేసికొనుము. నియతమైన కర్మలను చేస్తూ నన్ను ఆయనకు అప్పగించుము".

" ఈ విధముగా రఘోత్తమునికి నన్ను అప్పగిస్తే నీకు శుభము కలుగును. అలాగ ప్రవర్తించక పోతే నీవు మరణము తప్పక పొందెదవు. ఎత్తిన వజ్రాయుధమును తప్పించుకొనగలవేమో , యముడు నిన్ను చరకాలము విడువవచ్చునేమో, కాని లోకనాధుడైన క్రుద్ధుడైన రాఘవుడు మాత్రము నిన్ను వదలడు. శతక్రతువులు చేసిన దేవేంద్రునిచే ప్రయోగించిన వజ్రాయుధము యొక్క శబ్దములాగా రాముని ధనస్సు యొక్క మహాధ్వనిని త్వరలోనే వినగలవు. మంటలు కక్కుతున్న మహాసర్పములవలెఉన్న రామలక్ష్మణుల బాణములు ఇక్కడ పడగలవు. గ్రద్ద రెక్కలు కలిగిన బాణములు ఈ నగరము మీద అంతా పడుచూ రాక్షసులను చంపి నగరమును ధ్వంసము చేయును. మహాత్ముడైన రాముడనే గరుత్మంతుడు రాక్షసులనే మహాసర్పములను వైనతేయుడు సర్పములను హరించిన విధముగా హరించును. విష్ణువు మూడడుగులు వేసి వెలుగుతున్న లక్ష్మిని అసురలనుంచి తీసుకుపోయినట్లు త్వరలో శత్రువినాశకుడైన నా భర్త నన్ను నీ దగ్గరనుంచి తీసుకుపోగలడు".

" రాక్షసుల బలము జనస్థానములో హతమార్చబడగా అసక్తుడవై నీవు ఈ అసాధు కర్మకి పాలుపడ్డావు. ఓ అధముడా! నరసింహులగు ఆ అన్నదమ్ములు లేనపుడు శూన్యముగా వున్న ఆశ్రమములో ప్రవేశించిన నీ చేత అపహరింపబడినాను. కుక్క పెద్దపులుల కథలాగ రామలక్ష్మణుల వాసనలు గ్రహించి వారి ముందరనిలబడడానికి శక్తి లేని వాడవు. ఒకే బాహువుకల వృత్తాసురుడు ఇంద్రుని బాహువులకు పోరులో ఎదురాడలేకపోయినట్లు, వారిద్దరి ముందూ నువ్వు నిలబడలేవు. సూర్యుడు చిన్న తటాకములోని నీరు హరించినట్లు నా నాధుడు ఆగు శ్రీరాముడు సౌమిత్రి తో సహా నీ శక్తిని హరించివేయును".

"కాలహతుడవై కుబేరుని ఆలయమునకు పోయినా వరుణుని సభలో దాగినా, కైలాస పర్వతము పోయినా పిడుగు పడిన మహావృక్షము వలె రాముని బాణములనుండి తప్పించుకొనలేవు".

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది ఒకటవ సర్గ సమాప్తము.

 

||ఓమ్ తత్ సత్||
శ్లో|| గిరిం కుబేరస్య గతోఽపధాయ వా
సభాం గతో వా వరుణస్య రాజ్ఞః |
అసంశయం దాశరథేర్నమోక్ష్యసే
మహాద్రుమః కాలహతోఽశనేరివ||34||
స|| కాలహతః కుబేరస్య గిరిం వా ఆలయం గతః రాజ్ఞః వరుణస్య సభామ్ గతః మహాద్రుమః అశనైరివ దాశరథేః న మోక్ష్యసే||
తా|| "కాలహతుడవై కుబేరుని ఆలయమునకు పోయినా వరుణుని సభలో దాగినా, కైలాస పర్వతము పోయినా పిడుగు పడిన మహావృక్షము వలె రాముని బాణములనుండి తప్పించుకొనలేవు".
||ఓమ్ తత్ సత్||