||సుందరకాండ ||

||ముప్పది ఒకటవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకత్రింశస్సర్గః

ఆ మహాకపి ఇలాగ అనేక విధములుగా ఆలోచించి వైదేహికి మధురమైన మాటలు వినిపించుట్లు చెప్పసాగెను.

" దశరథుడు అను పేరుగల రాజు అనేకమైన రథములు ఏనుగులు కలవాడు. పుణ్యశీలుడు. మహాకీర్తిగలవాడు. ఇక్ష్వాకులలో మహత్తరమైన యశస్సు కలవాడు. రాజర్షి. శ్రేష్ఠ మైన గుణములు కలవాడు. తపస్సులో ఋషులతో సమానమైన వాడు. బలములోఇంద్రునితో సమానుడు. చక్రవర్తుల కులములో జన్మించినవాడు. ఆ మహారాజు ఆహింసలో అనురక్తి గలవాడు. ఉదారుడు, క్షుద్రుడు కాడు. దయకలవాడు. సత్యమనే ఆయుధముకల పరాక్రముడు. ఇక్ష్వాకువంశములోముఖ్యుడు. లక్ష్మికలవాడు. లక్ష్మిని పెంపొందింప కలవాడు. రాజలక్షణములు కలవాడు. ఇశ్వర్యము కలవాడు. రాజులలో రాజు. నాలుగు సముద్రములతో చుట్టబడిన భూమండలము లో పేరుగలవాడు. సుఖములను కలగించువాడు. తాను సుఖముగా నుండువాడు".

"ఆయన యొక్క ప్రియమైన జ్యేష్ఠపుత్రుడు రాముడను పేరుగలవాడు. అతడు చంద్రునిముఖమువంటి ముఖము కలవాడు. విశేషజ్ఞానము కలవాడు. ధనస్సు ధరించువారిలో శ్రేష్ఠుడు. శతృవులను తపించు వాడు. స్వధర్మమును పాటించువాడు. స్వజనములను రక్షించువాడు. జీవలోకమును ధర్మమును రక్షించువాడు. ఆ సత్యసంధుడు తన యొక్క వృద్ధుడగు తండ్రి మాటలను అనుసరించి భార్యతో తమ్మునితో కలిసి వనమునకు పోయెను".

" అక్కడ మహారణ్యములో మృగములను వేటాడుతూ అనేకమంది కామరూపులు శూరులు అగు రాక్షసులు అయన చేత సంహరింపబడిరి. అక్కడ జనస్థానములో జరిగిన రాక్షసుల వధ, ఖరదూషణుల మరణము విని, మాయా మృగరూపములో రాముని వంచించిన రావణుని చేత సీత అపహరింపబడెను".

"ఆ రాముడు దోషరహితమైన సీతను అన్వేషిస్తూ మార్గములో సుగ్రీవుడు అను పేరుగల వానరుని మిత్రుడుగా పొందెను. అప్పుడు శతృవుల నగరములను జయించగల మహాబలవంతుడగు రాముడు, వాలిని హతమార్చి, ఆ వానర రాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను. సుగ్రీవునిచే పంప బడిన వేలకొలదీ, కోరిన రూపము దాల్చగల వానరులు సీతను అన్వేషించుటకై అన్ని దిశలలోను పంపబడిరి".

" ఆ విశాలాక్షి కారణముగా సంపాతి వచనములపై నేను వందయోజనములు విస్తీర్ణమైన సాగరమును దాటితిని. నేను రాఘవునిచే చెప్పబడిన రూపము వర్ణము లక్షణములు వర్చస్సులను ఈమె లో చూచుచున్నాను".

ఆ వానరపుంగవుడు ఈ విధముగా చెప్పి విరమించెను.

ఆ మాటలను విని జానకికి అత్యంత ఆశ్చర్యము కలిగెను.

భయస్వభావము కల వక్రములైన కేశాంతములు గల కేశములచే కప్పబడిన తన ముఖమును పైకెత్తి శింశుపా వృక్షముపైకి చూచెను. సీత వానరుని మాటలను విని అన్ని దిశలలో చూచి రామునినే ధ్యానిస్తూ ఆనండ భరితురాలయ్యెను.

ఆమె పైకి క్రిందకీ అన్నివైపులా చూచి అచిన్త్య బుద్ధికల పింగాధిపతి మంత్రి ఉదయభానుని వలె నున్న హనుమంతుని చూచెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకత్రింశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది ఒకటవ సర్గ సమాప్తము.

||ఓం తత్ సత్||