సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

!! రామాయణంలో బాలకాండ !!!

 

 

 

రామాయణంలో
బాలకాండ !

బాలకాండ గురించి విననివారు తెలియనివారు వుండరు . కాని బాలకాండ మహాత్మ్యము ఎక్కువగా తెలియకపోవడం అసహజము కాదు !

బాలకాండలో ముఖ్యమైన ఘట్టాలు చాలావున్నాయి.

ప్రథమ సర్గలో మొట్టమొదటి సంభాషణలో వాల్మీకి నారదుని అడిగిన ప్రశ్న ఈ ముల్లోకాలలో అత్యంత శ్రేష్ఠుడైన నరుడు ఎవడు అని . దానికి సమాధానంగా నారదుడు రాముని కథ వివరిస్తాడు. ప్రథమసర్గలో వంద శ్లోకాలలో మనం పూర్తి రామాయణ కథ సంక్షిప్తముగా వింటాము. అందుకని బాలకాండలో ప్రథమసర్గ సంక్షిప్త రామాయణముగా ప్రబలపడింది ! ప్రథమ సర్గ పారాయణ చాలా కుటుంబాలలో ఆనవాయితీ . (అమ్మ చాలాకాలం రామాయణ పారాయణ అంటే ప్రథమసర్గ పారాయణ చేసేది).

బాలకాండలో రెండవసర్గలో బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు . అంటే ప్రథమ సర్గలో దేవ ఋషి వస్తే రెండవసర్గలో దేవుడే ప్రత్యక్షంగా వస్తాడన్నమాట.

ఎందుకు ?

అది క్రౌంచపక్షుల జంటలో ఒక పక్షి నిషాదునిచేతిలో వధింపబడడం , ఆ కారణముగా జనించిన కారుణ్యముతో ఇంకా శోకముతో చెప్పిన శ్లోకముగురించి మథన పడుతున్న వాల్మీకి మహముని మనస్సు కుదుట పరచి రామాయణ రచనకి కావలసిన అనుభూతి ఇవ్వడం కోసము.

అప్పటి బ్రహ్మవాక్కు- "ఈ భూమిలో పర్వతాలూ నదులూ ఉన్నంతకాలము రామాయణ కథ కీర్తింపబడుతుంది "అని

బాలకాండలో శ్రీరాముని జననం శ్రీరాముని బాల్యావస్థలో జరిగిన ఘట్టాలు , అహల్యా విమోచనము , శివుని విల్లు భంగం చెయ్యడము , జానకీ పాణిగ్రహణము అన్నీ వస్తాయి.

బాలకాండ అంతిమ ఘట్టాలలో సీతారామ కల్యాణముతో పాటు లక్ష్మణ భరత శతృఘ్నుల కల్యాణము కూడా అవుతుంది.

చిట్ట చివరి ఘట్టము పరశురామావతార సమాప్తము - అదే రామావతారానికి నాంది !

చాలా కుటుంబాలలో సుందరాకాండ ఆత్మ అత్మీయుల సుఖశాంతులకోసము చదువుతారు. కాని పిల్లల పురోగతికోసము అందరూ బాలకాండ పారాయణ చేస్తారు !

ఇది సుబ్బలక్ష్మిగారి కలంలోంచి మామాట !!

!! ఓమ్ తత్ సత్ !!


ఓమ్ తత్ సత్