||భగవద్గీత ||

||దశమోధ్యాధ్యాాయము||

||విభూతి యోగము- వచన వ్యాఖ్యానము ||


|| ఓమ్ తత్ సత్||
శ్రీభగవానువాచ:
భూయ ఏవ మహాబాహో శ్రుణుమే పరమం వచః|
యత్తేsహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా||1||

"ఓ అర్జునా! (నా మాటలచే) సంతసించుచున్న నీ హితము కోరి మరల ఏ ఉత్తమమైన వాక్యము ను చెప్పుచున్నానో అది వినుము."

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీమద్ భగవద్గీత
విభూతి యోగము
పదియవ అధ్యాయము

విభూతి అనగా ఐశ్వర్యము మహిమాతిశయము.

జగమే పరమాత్మమహిమ అయినప్పుడు పరమాత్మ మహిమ లేనిది ఏదీ అన్న ప్రశ్న ఉండవచ్చు అప్పుడు మహిమ గురించి చెప్పవలసిన అవసరముందా అని అనిపించవచ్చు. అయితే గీత ప్రపంచములో అందరికోసము. అందులో పరమాత్మ మహిమ తెలిసిన వారు అలాగే తెలియని వారు కూడా ఉండవచ్చు. అందుకనే ఈ అధ్యాయము.

భగవత్ మహిమ గురించి ఏడు ఏనిమిది తొమ్మిదవ సర్గలలో కొంచెము కృష్ణ భగవానుడు చెప్పాడు . తొమ్మిదవ అధ్యాయము చివరిలో " మన్మనాభవ మద్బక్తో మద్యాజీమాం నమస్కురు" అంటూ " నాయందే మనస్సుగలవాడవు అగుము . నాకు నమస్క్రరింపుము. నాయందే మనస్సునిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకొనినవాడై తుదకు నన్నే పొందగలవు" అని అంటాడు.

అయితే అలాంటి నిరంతరాత్మ దృష్టికొరకు భగవంతునియొక్క మహిమ గురించిన అంటే భగవద్విభూతి గురించిన విజ్ఞానము సహాయకారిగా నుండగలదు . అందుకని భగవంతుడు పరమప్రీతితో భగవంతుని మహిమగురించిన పరమార్ధ జ్ఞానము బోధించెను.
శ్రీభగవానువాచ:
భూయ ఏవ మహాబాహో శ్రుణుమే పరమం వచః|
యత్తేsహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా||1||

"ఓ అర్జునా! (నా మాటలచే) సంతసించుచున్న నీ హితము కోరి మరల ఏ ఉత్తమమైన వాక్యము ను చెప్పుచున్నానో అది వినుము"

కృష్ణుడు చెప్పే ఆ ఉత్తమ వాక్యము ఏమిటీ?
ఆ ఉత్తమ వాక్యమే భగవంతుని మహిమగురించి.

ఇది అందరికీ తెలిసిన విషయము కాదు>

"న మే విదుః సురగణాః ప్రభవం.. "
" నాయొక్క ప్రభావము సురగణాలకి తెలియదు". అంటే దేవతలకు మహర్షులకు కూడా తెలియదు.

ఏందుకు అంటే " అహం ఆదిః హి" "పరమాత్ముడే మొదటి వాడు కనుక ". అంటే కారణభూతుడు కనక.

ఇంకా కృష్ణుడు బోధించిన విషయము:
శ్రీభగవానువాచ:
బుద్ధిర్‍జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమశ్శమః|
సుఖం దుఃఖం భవోsభావో భయం చ అభయమేవ చ||4||
అహింసా సమతా తుష్టిః తపో దానం యశోsయశః|
భవన్తి భావా భూతానాం మత్తఏవ పృథగ్విధాః||5||

- బుద్ధి జ్ఞానము మోహరాహిత్యము ఓర్పు సత్యము ఇన్ద్రియ నిగ్రహము సుఖము దుఃఖము పుట్టుక నాశము భయము భయములేకుండుట అహింస సమత్వము సంతుష్టి తపస్సు జ్ఞానము నానావిధములైన గుణములు నా వలననే కలుగుచున్నవి."

సప్త మహర్షులు సనకాదులు మనువులు పదునలుగురున్నూ అదిపురుషునివలనే వలననే పుట్టిరి. అంటే సమస్త ప్రజలున్నూ తాము అల్పజాతికి చెందిన వారనిదిగులుపడనవసరము లేదు ఏ జాతికి మతము నకు వర్ణమునకు చెందినవారైనను మహర్షులసంతానమని మహర్షుల రక్తము అందరియందు ప్రవహించు చున్నదనీ పరమశాంతిని పొందవలెను నాపూర్వీకులు మహర్షులు మనువులు సనకాదులని ఘంటాపధముగా చెప్పుకొనవలెను. తాను పవిత్రుడనీ శుద్ధుడనీ ప్రతిదినము తలచుకొనీ సంసార బంధ విముక్తికొరకు ప్రయత్నము చేయవలెను.

అట్టివారిలో భగవంతుని మహిమను శక్తిని యదార్థముగా ఎవరు తెలిసికొనుచున్నారో వారు చలించని యోగముతో భగవంతుని అరాధించుచున్నారు. ఆ మహిమ తెలిసికొనినవారికి అనేక లాభాలు ! అవే భగవంతుడు వివరిస్తాడు.
శ్రీభగవానువాచ
మచ్చ్త్తిత్తా మద్గతాప్రాణా బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ్ రమన్తి చ||9||

మచ్చిత్తాః - నాయందు మనస్సు గలవారు
మద్గతాప్రాణాః- నా పై ప్రాణములను అర్పించినవారు
పరస్పరమ్ బోధయన్తః - ( నాగురించి) పరస్పరముగా బోధించుకొనుచూ
కథయన్తః - ( నాగురించే) చెప్పుకొనుచూ
తుష్యన్తి చ రమన్తి చ- సంతృప్తి పొందుతున్నారు ఆనందించుచున్నారు !

భగవంతుని మహిమ తెలిసిన వారికి కలిగే అనుభూతి అది అన్నమాట. సంతృప్తి, ఆనందము !

అట్టివారికి భగవంతుడు -
"దదామి బుద్దియోగం తం"
"జ్ఞానయోగము ప్రసాదించుచున్నాను"(9.10)
ఎందుకు .
"వారియందు దయచేతనే వారి ఆత్మయందు ఉన్న నేను వెలిగే జ్ఞానదీపముతో అజ్ఞానమునుండి పుట్టిన చీకటిని నశింపచేస్తున్నాను"(9.11).

ఇప్పటి దాకా కర్మయోగము జ్ఞానయోగము, మోక్షసన్యాస యోగము విజ్ఞానయోగము రాజవిద్యా రాజగుహ్యయోగము గురించి వినిన అర్జునుడు కృష్ణుడే పరబ్రహ్మమూ , కృష్ణుడు చెప్పినది అంతా నమ్ముతున్నానని చెప్పి, నిరంతరాత్మ దృష్టికొరకు భగవంతునియొక్క మహిమ గురించిన అంటే భగవద్విభూతి గూర్చిన విజ్ఞానము సహాయకారిగా నుండగలదు అని తెలిసికొని ఆ మహిమ గురించి చెప్పమని భగవంతుని ప్రార్థిస్తాడు:

అర్జున ఉవాచ
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన|
భూయం కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేsమృతమ్||18||

"ఓ జనార్దనా! నీ యోగమహిమను నీ మహిమలను సవిస్తరముగా మళ్ళీ చెప్పుము . ఆ అమృతవాక్కును వినుచున్న నాకు సంతృప్తి కలుగుటలేదు"

అప్పుడు అర్జునునిలో ఆసక్తి రేకెత్తించిన కృష్ణుడు అంతము లేని - "నాస్త్యన్తో" - తన మహిమ గురించి అర్జునునికి చెప్పుతాడు. అంటే ముందుగానే కృష్ణుడు తన మహిమ అంతము లేనిది అని అలాంటి అంతములేని మహిమ అంతా చెప్పడమన్నది కష్టము కనుక ప్రాధన్యతను అనుసరించి చెపుతాను విను అని చెప్పి తన విభూతి గురించి విస్తరిస్తాడు.

శ్రీ భగవానువాచ||
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ||20||

"ఓ అర్జునా సమస్త ప్రాణులయొక్క హృదయమందున్న ఆత్మను నేనే. ప్రాణులయొక్క అది మద్య అంతములు కూడా నేనే"
అంటే ఉపనిషత్తులద్వారా జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న విషయము కృష్ణుడు ఒక్కమాటలో చెప్పాడన్నమాట. పరమాత్మ అంటే ఇంకెక్కడో వెదకనక్కరలేదు అది మనలో ఉన్న ఆత్మయే పరమాత్మ స్వరూపము. ఇది ప్రాధాన్యతప్రకారము మొదటి మాట. ఇది చెప్పినతరువాత మిగలిన విషయాలు అనవసరమేమో అనిపించవచ్చు. నిజానికి మిగిలినవన్నీ ఈ మాటని అనుసరించే ఉంటాయి.

శ్రీకృష్ణుడు ఇక తన మహిమ ఇశ్వర్యము గురించి ఇలాగ చెపుతాడూ తను అంటే పరమాత్మ -

"అదిత్యులలో విష్ణువు,
మరుత్తులలో మరీచి,
నక్షత్రములలో చంద్రుడు,
వేదములలో సామవేదము,
దేవతలలో ఇంద్రుడు,
ఇంద్రియములలో మనస్సు,
ప్రాణులలో చైతన్యము,
రుద్రులలో శంకరుడు,
యక్షులు రాక్షసులలో కుబేరుడు,
వసువులలో అగ్ని,
పర్వతములలో మేరుపర్వతము,
పురోహితులలో బృహస్పతి,
సేనానులలో కుమారస్వామి,
సరస్సులలో సముద్రమును,
మహర్షులలో భృగుమహర్షి,
వాక్కులలో ఒక అక్షరమగు ప్రణవమును,
యజ్ఞములలో జపయజ్ఞమును,
స్థావరములలో హిమాలయపర్వతము,
వృక్షములలో రావి చెట్టు,
దేవ ఋషులలో నారదుడను,
గంధర్వులలో చిత్రరధుడను,
సిద్ధులలో కపిల మునిని అయి ఉన్నాను,
అశ్వములలో అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవమను అశ్వమును,
గజములలో ఐరావతమును,
మనుష్యులలో రాజుగను (నన్ను తెలిసికొనుము)
ఆయుధములలో వజ్రాయుధము,
ధేనువులలో కామధేనువు,
ప్రజలఉత్పత్తికి కారణమగు మన్మధుడను నేనే,
సర్పములలో వాసుకి అయి ఉన్నాను.
నాగులలో అనంతుడు,
జలదేవతలలో వరుణుడు,
పితృదేవతలలో ఆర్యముడు,
శిక్షించువారిలో యముడును నేనే.
అసురులలో ప్రహ్లాదుడను,
లెక్కపెట్టువారిలో కాలము,
మృగములలో మృగేంద్రుడగు సింహము,
పక్షులలో గరుత్మంతుడు,
వేగము కలిగించువారిలో వాయువును,
ఆయుధములను ధరించువారిలో శ్రీరామచంద్రుడను,
చేపలలో మొసలిని,
నదులలో గంగానది నేనే.
ఆది మధ్య అంతము లన్ని నేనే,
విద్యలలో ఆధ్యాత్మిక విద్య,
వాదించువారిలో రాగద్వేషరహిత వాదము,
అక్షరములలో అకారమును,
సమాసములలో ద్వంద్వ సమాసము,
నాశనములేని కాలమును నేనే
విరాటస్వరూపమును నేనే
సామవేదగానములలో బృహత్సామము
చందస్సులలో గాయత్రీ
మాసములలో మార్గశీర్షము
ఋతువులలో కుసుమాకరము
వంచకవ్యాపారములలో జూదము,
తేజోవంతులలో తేజము
జయము నేనే
ప్రయత్నము నేనే
సత్వగుణము నేనే
యాదవులలో వాసుదేవుడను నేనే
పాండవులలో అర్జునుని నేనే
మునులలో వేదవ్యాసుడను
కవులలో శుక్రాచార్యుడను
జ్ఞానవంతులలో జ్ఞానము
సమస్త భూతములకు ఏది మూలకారణమో అది కూడా నేనే"

ముందు చెప్పినమాటే ఒక చివరి మాటలాగ కృష్ణుడు మళ్ళీ ఇలా చెపుతాడూ;
శ్రీభగవానువాచ:
నాన్తోsస్తి మమ దివ్యానాం విభూతినాం పరన్తప|40||
"ఓ అర్జునా! నాయొక్క విభూతులకు అంతము లేదు".

అందుకని భగవంతుని విభూతి గురించి ఒక చిన్న సూత్రము చెపుతాడు.
"యత్ యత్" "తత్ తత్" అంటే "ఏది ఏది" "అది అంతా "

అంటే ఏది " విభూతిమత్ " - ఇశ్వర్యముతో కూడినది
"శ్రీమత్" - "శ్రీ" తో కూడినది అంటే శుభముతో కూడినది
"ఊర్జితం ఏవ వా" - ఉత్సాహముతో కూడినది
"తత్ తత్"- అది అంతా
మమ తేజోంశ సంభవమ్ - "నా తేజస్సు తో కూడినదే"
అదే భగవంతుని విభూతి.(10.41).

మళ్ళీ కృష్ణుడి మాట :
"(ఇదం) త్వం అవగచ్ఛ"
- "అర్జునా అదే నువ్వు తెలుసుకో!
అదే మమమందరము తెలిసి కోవలసిన మాట

అంటే సమస్త చరాచర వస్తువులలో ఉత్తమమైనవాటిలోని అంశ పరబ్రహ్మమే అన్నమాట. అంటే జగత్తులో ఇశ్వ్రర్యముకలది కాంతిగలది ఉత్సాహము తో కూడినది ఏది వుందో ఆ భూతము ( ప్రాణి లేక వస్తువు) అది పరమాత్మ యొక్క శక్తి యొక్క అంశము అన్నమాట.

శ్రీభగవానువాచ:
విష్టభ్యాహమిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్||42||
"ఈ సమస్తమైన జగత్తును ఒక అంశముచే వ్యాపించియున్నాను"

అంటే సమస్త ప్రాణికోట్ల లో వ్యాపించిన ప్రత్యగాత్మను నేనే అనగా జీవాత్మయే పరమాత్మ అను అఖండ మహావాక్యము మరల చెప్పబడినది.

అనగా భక్తులు పంచకోశములనుండి తనను వేరుచేసుకొని దేహేంద్రియమనోబుద్ధులకు సాక్షిగానున్న ప్రత్యగాత్మను సాక్షాత్కరించుకొనవలెను. తాను అల్పుడకాననీ పర బ్రహ్మస్వరూపుడననీ విశ్వాసము డృఢపరచుకొనీ పరప్రాణిసేవ మాధవ సేవయే యని భావించవలెను.

పరమాత్మ భక్తుని నిర్మలభక్తి చే అతని బుద్ధి లో జ్ఞానబీజము నాటును మన భావనలు ఎంతోనిర్మలముగా యుండవలెను. ప్రతి చెడు ఆలోచనలకీ చెడు వ్యవహారములకు ఎన్నియో సమస్యలూ ఆపదలూ కర్మఫలముగా అనుభవించవలసివచ్చును. భగవన్నిర్ణయమును ఎవ్వరూ మార్చలేరు. ధర్మముననుసరించి ఫలితములు నొసగున్యాయస్థానము భగవంతుడే. అది మనముతెలుసుకొనీ ధర్మముననుసరించీ చిత్తశుద్ధికై తపింపవలెను

||ఓం తత్ సత్ ||
శ్రీభగవానువాచ
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున|
విష్టభ్యాహమిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్||42||
"ఓ అర్జునా బహువిథములైన విభూతిజ్ఞానము అనవసరము. నేను జగత్తునంతయూ ఒక అంశముగా వ్యాపించియున్నాను "
|| ఓమ్ తత్ సత్||

 

 

 

 

|| om tat sat||