||భగవద్గీత ||

||ద్వాదశోధ్యాయః||

|| భక్తి యోగము -వచన వ్యాఖ్యానము ||


||ఓమ్ తత్ సత్||


||ఓమ్ తత్ సత్||
అర్జున ఉవాచ
"ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే
యే చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః "||
'ఈవిధముగా ఎల్లప్పుడూ మీయందే మనస్సు గలవారై మిమ్ములను ఉపాశించు భక్తులు, ఇంద్రియగోచరముకాని అక్షరపరబ్రహ్మమును ఉపాశించే భక్తులు - వీరిద్దరిలోనూ ఎవరు యోగమును ఎక్కువతెలిసినవారు ఎవరు?'

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
భక్తియోగము
ద్వాదశోధ్యాయము

రెండవ అధ్యాయము అలాగే ఎనిమిదవ అధ్యాయములలో నిర్గుణ పరమాత్మ తత్వము ధ్యానముగురించి కృష్ణుడు చెప్పెను. పన్నెండవ అధ్యాయములో తన విశ్వరూపము చూపించి సగుణోపాసనము బలపరచెను. అప్పుడు వీనిలో ఏది శ్రేష్టము అనే ప్రశ్న వస్తుంది.

శంకరాచార్యులవారు కూడా భక్తి యోగము మీద, ముందు మాట లాగా తమ భాష్యములో ఇలా చెపుతారు. "రెండవ ఆధ్యాయము నుంచి విభూతి యోగము దాకా, అక్షర పరబ్రహ్మము యొక్క ఉపాసన మీద చెప్పడమైనది. అక్కడక్కడ భగవంతుని ఉపాసన కూడా చెప్పడమైనది. విశ్వరూప అధ్యాయములో , "విశ్వరూపం త్వదీయం దర్శితం ఉపాసనార్థమేవ త్వయా", అంటే " ఉపాసన చేయడానికి నీ చేత విశ్వరూపము చూపబడినది". ఆ విశ్వరూపము చూపించిన తరువాత చివరి శ్లోకములో, "మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంఙ్గవర్జితః", అంటే నాకొఱకై కర్మలు చేయు వాడు నన్నే పరమ గతిగా నమ్మినవాడు అట్టివాడు నన్నే పొందుతున్నాడు అని చెప్పబడినది. ఈ రెండు మార్గములలో ( అక్షరోపాసన అంటే నిర్గుణోబ్రహ్మోపాసన , సగుణ బ్రహ్మోపాసనలలో ) ఏది ఉత్తమమైనదో తెలిసికొనడము కోసము అర్జునుడి ప్రశ్నతో భక్తి యోగము మొదలవు తుంది" అని.

ఆ అర్జునుడి ప్రశ్న, - 'భగవానుని సాకారస్వరూపమును భక్తితో ఉపాసించిన వారు గొప్పా లేక ఇంద్రియ గోచరము కాని నిరాకార అక్షరపరమాత్మను ఉపాశించుట గొప్పా? ఈ రెండిటిలో ఏది శ్రేష్టము', అని.

దానికి సమాధానముగా కృష్ణుడు ఇలా చెపుతాడు:
శ్రీభగవానువాచ
మయ్యావేశ్య మనో యేమాం నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయాపరయోపేతా స్తేమే యుక్తతమా మతాః||2||

'నాయందు మనస్సుని నిలిపి తదేకనిష్టతో తదేకచింతాపరులై మిక్కిలి శ్రద్ధ కలవారు ఉత్తములు' అని భగవానుడు చెప్పెను. విశ్వరూప సందర్శన యోగములో ఆఖరి మాట కూడా ఇదే. ' మద్భక్తః .. స మామేతి'(11.55) అంటూ 'నన్నే పరమగతి అని తలచి నా భక్తుడైనవాడు నన్నే పొందుతాడు" అని చెపుతాడు. ఇక్కడ "నాయందు మనసు నిలిపి " అన్నప్పుడు, తను చూపించిన విశ్వరూపాత్మకమైన ఈశ్వరుని అన్నమాట.

అయితే మిగిలినవారు సంగతి, అంటే అక్షర పరబ్రహ్మము ఉపాశించు వారి సంగతి ఏమిటి అంటే, అది కూడా భగవానుడు ఇలా చెపుతాడు.

'ఇంద్రియములను నియమించి సర్వత్ర సమబుద్ధి కలిగి సర్వప్రాణులకు మేలు చేస్తూ అనిర్దేశ్యము, అవ్యక్తము. సర్వవ్యాపకము అచింత్యము కూటస్థము అచలము ధ్రువము అయిన అక్షరబ్రహ్మము ను ఉపాశించువారు,- "మాం తే ప్రాప్నువన్తి" అంటే వారు నన్నే పొందుదురు అని.

కృష్ణుడు అక్షరోపాసన చేసే జ్ఞానులగురించి, జ్ఞానవిజ్ఞానయోగములో ( 7 వ అధ్యాయములో) , "జ్ఞానీతు ఆత్మ ఏవ" అంటే జ్ఞానీ తను వేరు కాదని చెప్పాడు. అంటే జ్ఞాని , భగవంతుడు ఒకదే అన్నమాట. శంకరాచార్యులవారు తమ భాష్యములో జ్ఞానులగురించి ఇలా రాస్తారు."నహి భగవత్స్వరూపాణాం యుక్తతమత్వం అయుక్తతమత్వం వా వాచ్యమ్". అంటే,"భ్హగవత్స్వరూపము పోందిన వారిని, వారు ఉత్తమ యోగులా కాదా అన్న ప్రశ్నకి తావులేదు". ఎందుకు అంటే, వారు భగవత్స్వరూపము పొందినవారు కనక.

మొదటిలో అడిగిన ప్రశ్న "ఎవరు నాయందు మనస్సు నిలిపి నిరంతర దీక్షతో మిక్కిలి శ్రద్ధతో కూడికొనినవారై నన్ను ఉపాశించెదరో, అట్టి వారు ఉత్తమమైన దీక్షకలవారు అని నా అభిప్రాయము" అని సగుణోపాశకుల చెప్పి, నిర్గుణ బ్రహమును ఉపాశించువారు జ్ఞానులు అని, కైవల్య స్థితిలో జ్ఞాని తను వేరుకాదని చెప్పడముతో, అట్టి వారు భగవత్స్వరూపులు అని అర్థము అవుతుంది. శంకరాచార్యులు వారు చెప్పినట్లు భవత్స్వరూపులను , వారు ఉత్తమయోగులా కాదా అనే ప్రశ్నకి తావు లేదు అని మనకి విదితమౌతుంది. వాళ్ళు కూడా ఉత్తమయోగులే అని.

అయితే సగుణోపాసకుల నిర్గుణోపాసకులలో ఒక తారతమ్యము వుంది. అది వారు చేసే ఉపాసనలో.

"అవ్యక్త మైన నిర్గుణ పరబ్రహ్మము ఉపాశించుచూ, పరమాత్మను పొందు మార్గము ఇతరమార్గములకన్నా అధికతరముగా కష్టము. అంటే ఇక్కడ దేహాభిమానము కలవారికి నిర్గుణోపాసన, ఇంకా ఎక్కువ కష్టము అని. ఎందుకు? "దేహాభిమానపరిత్యాగ నిమిత్తః" - వాళ్ళు ముందు దేహాభిమానము త్యజించాలి కనుక. అది కష్ఠమైన పని

సగుణోపాసకుల మీద భగవంతునికి దయ వుంది. అదే కృష్ణుడు చెపుతాడు

"ఓ పార్థా, ఎవరైతే సమస్త కర్మలు నాకు సమర్పించి, నన్నే పరమగతిగా తలచినవారై ఇంకేమీ యోగము తలంపని ధ్యాసతో నన్నే ధ్యానించుచూ ఉపాసించుచున్నారో, నాయందు మనస్సుగల అట్టివారిని, నేను మృత్యురూపమైన సంసార సాగరమునుండిశీఘ్రముగా ఉద్ధరించినవాడను అగుదును."||6,7||

అంటే సర్వకర్మలు నా యందు సన్న్యసించి నన్నే పరమగతిగా భావించి మనస్సును నా యందు నిలబెట్టి అనన్య యోగముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసించేవారిని, మృత్యరూపమైన సంసారసాగరమునుంచి వెంటనే రక్షిస్తాను అని. అందుకని మనస్సు నాయందే నిలుపుము అని అర్థము. అదే కృష్ణుని సందేశము.

శ్రీభగవానువాచ:
మయ్యేవ మన అధత్స్వ మయిబుద్ధిం నివేశయ|
నివషిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః||8||
' మనస్సు నాయందే నిలుపుము నామీదనే బుద్ధిని ఉంచుము. అపై నా లోనే ఉంటావు. సందేహము లేదు'

'న సంశయః' అంటూ , ఎవరైతే ఉత్తములు అన్నాడో వారందరికి హామీ ఇస్తున్నాడు మృత్యుసంసారసాగరాన్నించి దాటించడానికి.

అయితే అలా చిత్తాన్ని అంటే మనస్సును స్థిరముగా భగవానునిపై ఉంచ లేకపోతే వారు ఏమి చెయ్యాలి.

వారు ఆభ్యాసము చేసి మనస్సును స్థిరపరచాలి(11.09).

'అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణచ గుహ్యతే' అని ఆరవ అధ్యాయములో ఈ వాక్యము ద్వారా అభ్యాసమును నొక్కి చెప్పెను. అభ్యాసము చేసినచో వైరాగ్యము వచ్చును అని.
.
అయితే అభ్యాసము చేయడానికి కూడా అసమర్థుడు అయితే ఏమి చెయ్యాలి?

'మత్కర్మపరమోభవ' - నా( భగవంతుని) సంబంధమగు కర్మలయందు ఆసక్తి కలవాడు ( అగుము).

అంటే దైవకార్యములు నిష్కామబుద్ధితో ఆచరించుము. తద్వారా చిత్తశుద్ధిని మోక్షమును పొందగలవు అని కూడా భగవంతుడు చెప్పెను(11.10).

అంటే భగవంతుని కొఱకు కర్మలు చేస్తూకూడా సిద్ధి పొందవచ్చు అన్నమాట.

అదికూడా చేయలేకపోతే చేస్తున్న కర్మలను భగవంతునియందు సన్న్యసించి సర్వకర్మఫలత్యాగము చేయుము అంటాడు.(11.11)

అంటే దాన ధర్మములు వ్రతపూజలు నిత్య నైమిత్తిక కర్మలు దైవభావముతో ఆచరించి ఈశ్వరార్పణ లేక కృష్ణార్పణ లేక రామార్పణ బుద్ధితో చేయవలెను. తాను నడచుచున్నచో ప్రదక్షిణమని భావించవలెను. తాను మాట్లాడుచున్నచో దైవసంకీర్తనమని, ఏపనిచేయుచున్ననూ భగవత్ స్మృతికలిగి "మామనుస్మరయుధ్యచ" అని భగవానుడు చెప్పినటుల తానాచరించు ఆయాకర్మలు ఈశ్వరార్పణముగావించి నచో చిత్తశుద్ధి కలుగ గలదు. జ్ఞానోదయము గలుగగలదు.

అంటే మళ్ళీ కృష్ణుడు చివరికి సర్వకర్మఫలత్యాగమే మోక్షమునకు ఒక సాధనముగా చెపుతాడు.

అ సర్వకర్మఫలత్యాగము ను స్తుతిస్తో భగవానుడు ఇలా చెపుతాడు:

శ్రీభగవానువాచ:
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానంవిశిష్యతే|
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్||12||

'అభ్యాసముకన్న జ్ఞానము, జ్ఞానముకన్న ధ్యానము, ధ్యానము కన్న కర్మఫలత్యాగము విశిష్ఠమైనవి. త్యాగము వలన వెంటనే శాంతి కలుగును'.

"త్యాగాత్ శాంతిః అనన్తరమ్' అన్నమాటలో మనకు అర్థము అయ్యేది కర్తృత్వత్యాగము వలన అహంకార త్యాగము వలన దోషత్యాగము వలన ప్రాపంచిక విషయ సుఖత్యాగము వలన శాంతి లభిస్తుంది

అంటే మనస్సులోని దోషాలు పోవడము తో శాంతి లభిస్తుంది అన్నమాట.

ఇక్కడ "జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే", అంటే జ్ఞానము కన్నా ధ్యానము విశిష్ఠము అని. ఇది గమనించ తగిన మాట. జ్ఞానము మీద జ్ఞానముతో కూడిన ధ్యానము విశిష్ఠము. పరబ్రహ్మము గురించిన జ్ఞానము ఒకసంగతి. ఆ పరబ్రహ్మము యొక్క జ్ఞానముతో చేసే ధ్యానము, జ్ఞానము కన్నా గొప్పది అని భావము. ధ్యానము అనేక రకములుగా వుండవచ్చు. కాని ప్రబ్రహ్మముయొక్క జ్ఞానముతో ప్రబ్రహ్మము మీద చేసే ధ్యానము అన్నింటి కన్నా విశిష్ఠము అని భావము.

ఇక్కడ "నాయందు మనస్సుని నిలిపి తదేకనిష్టతో తదేకచింతాపరులై మిక్కిలి శ్రద్ధ కలవారు ఉత్తములు" అని మొదలుపెట్టి చివరికి మనస్సులోని దోషాలు పోవడముతో శాంతి లభిస్తుంది అన్నమాటవరకు వచ్చిన సందర్బాన్ని మళ్ళీ ఒకమాటు పూర్తిగా చూద్దాము.

విశ్వరూప సందర్శనమయిన తరువాత అర్జునిడికి వచ్చిన సందేహము - 'భగవానుని సాకారస్వరూపమును భక్తితో ఉపాసించిన వారు గొప్పా లేక ఇంద్రియ గోచరము కాని నిరాకార అక్షరపరమాత్మను ఉపాశించుట గొప్పా? ఈ రెండిటిలో ఏది శ్రేష్టము', అని . దానికి సమాధానముగా కృష్ణుడు "నాయందు మనస్సుని నిలిపి తదేకనిష్టతో తదేకచింతాపరులై మిక్కిలి శ్రద్ధ కలవారు ఉత్తములు" అని చెప్పెను. మరి భగవంతుని పై మనస్సు నిలిపి తదేకనిష్టతో తదేక చింతాపరులై మిక్కిలిశ్రద్ధకలవారు ఉత్తములే , వారికి భగవంతుడు ఏమి చేస్తాడు అన్న ప్రశ్న ఉదయించింది.
వారికి - "అంటే సర్వకర్మలు నా యందు సన్న్యసించి నన్నే పరమగతిగా భావించి మనస్సును నా యందు నిలబెట్టి అనన్య యోగముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసించేవారికి మృత్యరూపమైన సంసారసాగరమునుంచి వెంటనే రక్షించువాడను" అని. ఇందులో "న సంశయః" అంటూ , ఎవరైతే ఉత్తములు అన్నాడో వారందరికి హామీ ఇస్తున్నాడు మృత్యుసంసారసాగరాన్నించి దాటించ డానికి.

అయితే అలా చిత్తాన్ని అంటే మనస్సును స్థిరముగా భగవానునిపై అందరూ వుంచలేరుగదా , అలాఉంచ లేకపోతే వారు ఏమి చెయ్యాలి. దానికి సమాధానము వారు ఆభ్యాసము చేసి మనస్సును స్థిరపరచాలి. అయితే అభ్యాసము చేయడానికి కూడా అసమర్థుడు అయితే ఏమి చెయ్యాలి? భగవంతుని సంబంధమగు కర్మలయందు ఆసక్తి కలవాడు అవ్వాలి. అంటే దైవకార్యములు నిష్కామబుద్ధితో ఆచరించడము . తద్వారా చిత్తశుద్ధిని మోక్షమును పొందడము. అంటే భగవంతుని కొఱకు కర్మలు చేస్తూకూడా సిద్ధి పొందవచ్చు అన్నమాట.

అదికూడా చేయలేకపోతే చేస్తున్న కర్మలను భగవంతునియందు సన్న్యసించి సర్వకర్మఫలత్యాగము చేయుము అంటాడు. అంటే దాన ధర్మములు వ్రతపూజలు నిత్య నైమిత్తిక కర్మలు దైవభావముతో ఆచరించి ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను, ఏపనిచేయుచున్ననూ భగవత్ స్మృతికలిగి "మామనుస్మరయుధ్యచ" అని భగవానుడు చెప్పినటుల తానాచరించు ఆయాకర్మలు ఈశ్వరార్పణముగావించి నచో చిత్తశుద్ధి కలుగ గలదు. జ్ఞానోదయము గలుగగలదు.

అంటే మళ్ళీ కృష్ణుడు చివరికి సర్వకర్మఫలత్యాగమే మోక్షమునకు ఒక సాధనముగా చెపుతాడు.అ సర్వకర్మఫలత్యాగము ను స్తుతిస్తో భగవానుడు ఇలా చెపుతాడు: 'అభ్యాసముకన్న జ్ఞానము, జ్ఞానముకన్న ధ్యానము, ధ్యానము కన్న కర్మఫలత్యాగము విశిష్ఠమైనవి. త్యాగము వలన వెంటనే శాంతి కలుగును".

ఇక్కడ మనకు అర్థము అయ్యేది కర్తృత్వత్యాగము వలన అహంకార త్యాగము వలన దోషత్యాగము వలన ప్రాపంచిక విషయ సుఖత్యాగము వలన శాంతి లభిస్తుంది . అంటే మనస్సులోని దోషాలు పోవడము తో శాంతి లభిస్తుంది అన్నమాట.

ఎటువంటి భక్తుడు తనకు ప్రీతిపాత్రుడు అన్న మాట విశదీకరించకోసడము
కృష్ణుడు భక్తునియొక్క లక్షణములు చెప్పుచున్నాడు.

ఆ లక్షణములు ఇవి.

ఏ ప్రాణినీ ద్వేషించకుండుట, మైత్రి, కరుణ కలిగి యుండుట, మమత్వము లేకుండుట, అహంకారము లేకుండుట, సుఖదుఃఖములయందు సమత్వము, ఓర్పు, నిత్య సంతుష్టి , మనోనిగ్రహము, ధృఢనిశ్చయము, మనోబు ద్ధులను భగవంతునికి సమర్పించుట, లోకమువలన తనకి గానీ తన వలన లోకమునకు గానీ భయము లేకుండుట, హర్షము క్రోధము భయము లేకుండుట, దేనియందును ఆపేక్ష లేకుండుట, శుచిత్వము కలిగియుండుట, కార్యసామర్ధ్యము, తటస్థత్వము, మనోవ్యాకులత్వము లేకుండుట, సర్వకర్మఫలత్యాగము, కోరిక లేకుండుట,ద్వేషములేకుండుట, శోకములేకుండుట, శుభాశుభ పరిత్యాగము, శతృమితృలందు సమత్వము, సంగవివర్జితుడు, నిందా స్తుతులయందు సమముగానుండు వాడు, మౌనముకలిగియుండుట, దొరికినదాని తో సంతుష్టికలవాడు నివాసమునందు అభిమానము లేనివాడు స్థిరబుద్ధి భక్తి కలిగిన వాడు. ఈ సుగుణములు కలవాడు భగవంతునికి ప్రీతిపాత్రుడు. (12.13-19)

భక్తి యోగము ముగిస్తూ కృష్ణుడు మళ్ళీ ఇలా చెపుతాడు:

శ్రీభగవానువాచ
యేతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే|
శ్రద్ధధానా మత్పరమా భక్తాః తేఽతీవ మే ప్రియాః|| 20||

'ఎవరైతే శ్రద్ధతో నన్నే పరమగతిగా నమ్మి ఈ అమృతరూపమగు ధర్మమును చెప్పబడిన ప్రకారముగా అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు పరమ ప్రియులు.'

అంటే పైన చెప్పబడిన అమృత రూపమగు ధర్మమును శ్రద్ధాభక్తులతో అనుష్టించువారు భగవంతునికి మిక్కిలి ప్రీతిపాత్రమైనవారు.

ఈ అధ్యాయము లో చెప్పిన భక్తుల లక్షణాలు అన్నీ జ్ఞానియొక్కలక్షణములు కూడా . భక్తి కలవాడు మొదట భగవంతుని ఫలపుష్పాదులతో పూజించును చిత్తము వికాసము నొందుతూరాగా క్రముముగా మనః పుష్పాదులతో పూజించును.

శంకరాచార్యులవారు 'ఓ పరమేశ్వరా చిత్తమను కమల పుష్పము నీకు అర్పించి సుఖముగా ఉండుటను జనులు తెలికొన లేకున్నారే' అని శివానందలహరి లో చెప్పినట్లు, భక్తుడు చివరి దశలో తన మనః కుసుమములచే భగవానుని ఆరాధించును.

శ్లో || అహింసా ప్రధమంపుష్పంపుష్పమింద్రియనిగ్రహః|
సర్వభూతదయాపుష్పం క్షమాపుష్పం విశేషతః||
శాంతి పుష్పం, తపఃపుష్పం, ధ్యానపుష్పం తధైవ చ|
సత్యమష్టవిధంపుష్పం విష్ణోఃప్రీతికరం భవేత్||

అహింస ఇంద్రియనిగ్రహము సర్వభూతదయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యము అను ఎనిమిది పుష్పములు విష్ణుప్రీతికరమైనవి. ఈ సద్గుణములను ముముక్షువు అభ్యసించి బాహ్యపుష్పములతో పాటు ఈ అంతరంగిక పుషములతో పూజిస్తూ భగవంతునికి ప్రీతిపాత్రుడు కావలెను.

||ఓం తత సత్||
శ్రీభగవానువాచ
యేతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే|
శ్రద్ధధానా మత్పరమా భక్తాః తేఽతీవ మే ప్రియాః|| 20||