||భగవద్గీత ||

||ఆఱవ అధ్యాయము ||

||ఆత్మసంయమన- వచన వ్యాఖ్యానము ||

||ఓమ్ తత్ సత్ ||

|| ఓమ్ తత్ సత్ ||
శ్రీ భగవానువాచ:
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ||1||
’ఎవడు చేయవలసిన కర్మలను ఫలాపేక్షలేకుండా చేయునో అతడే సన్న్యాసియు యోగియు అగును. అగ్నిహోత్రము వదిలిన వాడు కాని కర్మలను విడిచిన వాడు గాని (సన్న్యాసియు యోగియు ) కాడు”.

శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః
భగవద్గీత
ఆఱవ అధ్యాయము
అత్మసంయమన యోగము:

ఆత్మ సంయమనము అంటే ఆత్మ నిగ్రహము. అది అత్మకి సంబంధించిన ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటన్నిటినీ నిగ్రహించడము అన్నమాట. అది ఏలాగ అన్నదే ఈ అధ్యాయముయొక్క ముఖ్య విషయము. ఆత్మ సంయమనానికి సాధనము ధ్యానము. ఈ అధ్యాయములో ధ్యానము గురించి చెప్పడము వలన ఈ అధ్యాయానిని కొందరు ధ్యానయోగము అని కూడా అంటారు.

ఈ అధ్యాయముకూడా మళ్ళీ కృష్ణ భగవానుని మాటతోనే మొదలగుతుంది

శ్రీ భగవానువాచ:
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ||1||

అంటే : ’ఎవరైతే ఫలాపేక్షలేకుండా చేయవలసిన కర్మ చేస్తాడో వాడే "సన్యాసీ" లేక "యోగీ" అనబడును.
అగ్నిహోత్రమును కర్మలను విడిచినవాడు కాడు’.

అంటే ఫలాపేక్షలు వదలకుండా అగ్నిహోత్రమును కర్మలను మాత్రము విడిచినవాడు సన్యాసి అనబడడు అని.

ఇదవ అధ్యాయములో కర్మసన్యాసయోగము గురించి చెప్పడము అయింది.

ఆ సందర్భములో కర్మ ఫలములు త్యాగము చేస్తే సన్యాసి అని చెప్పినా , కొంతమందికి కర్మలనే సన్యాసము చేస్తే సన్యాసి అవుతాడు అనే భావము కలగవచ్చు. అటువంటి భావన తొలగించడము కోసమే ఈ మాట.

సంన్యాసము అంటే సంన్యసించ వలసినవి ఏమిటి అన్న ప్రశ్నరావచ్చు.
నిజమైన సంన్యాసికి సంన్యసించ వలసినవి ఇవి:
- అన్ని కర్మసాధనములు
- ఆ సాధనములతో చేయదగిన కర్మలు
- ఆ కర్మఫలము గురించిన ఆలోచనలు
- ఆ ఆలోచనలవలన ఫలముపై కలిగే కోరిక
ఆదే మాటని,- ’సన్యాసము అన్నది కర్మఫలములను త్యాగము చెయ్యడమే కాని కర్మల త్యాగము కాదు’ అని కృష్ణభగవానుడు చెపుతాడు.

అలాగే కర్మయోగములో కూడా కర్మయోగి కర్మలు చేస్తు ఉన్నప్పటికీ , కర్మఫలమును , ఫలవిషయక సంకల్పాని సంన్యసిస్తాడు అంటే వదిలేస్తాడు అన్నమాట.

అంటే కర్మయోగములో సంన్యాసయోగములో ఈ రెండిటిలోనూ ఆ కర్మఫలమును సంకల్పముతో సహా సంన్యసిస్తారు.

కనుక రెండూ అంటే సన్యాసము అన్నా యోగము అన్నా ఒకటే అనిచెపుతూ "సంకల్పము" వదలని వాడు యోగి కాడు అనికూడా కృష్ణ భగవానుడు చెపుతాడు.

యోగీ అవడానికి కర్మ అవసరము అనిచెపుతూ
"ఆరురుక్షోః మునేః యోగం కర్మకారణముచ్యతే"(6.04)
యోగమును సాధింపదలిచిన మునికి కర్మ సాధనము అని చెప్పబడుచున్నది.

ఆరురుక్షోః - అంటే ఆరురుక్షువు అంటే ఆరోహించ తలచిన వాడు . దేనిని ఆరోహించతలచినవాడు అంటే సమాధానము యోగము లేక యోగస్థితి. అట్టివాడికి కర్మ యే ( నిష్కామ కర్మయే) సాధనము.

అయితే " యోగారూఢునికి" అంటే యోగము సాధించిన వ్యక్తి కి ఇంకాముందుపోవడానికి సాధనము ఏమిటి?
ఇంకాముందుపోవడానికి "శమః కారణముచ్యతే " అంటే కర్మ నివృత్తి లేక ప్రశాంత చిత్తము సాధనములు అన్నమాట.

అంటే సాధకునికి ( యోగము సాధింపదలిచిన వ్యక్తికి ) నిష్కామకర్మ ముఖ్య సాధనము. ఆ నిష్కామకర్మద్వారా చిత్తశుద్ధి సంపాదించి జ్ఞానయోగము ప్రవేశించు స్థానమునకు చేరుతాడు. నిష్కామ కర్మ ఆన్నది బాహ్య ప్రపంచానికి సంబంధించినది. చిత్తశుద్ధి లభించుటవలన అప్పుడు శ్రవణ మనన ధ్యానములద్వారా అంతరంగ ప్రయత్నములు మొదలు పెట్టవచ్చు. ఇవే జ్ఞానయోగానికి నాంది.

జ్ఞానయోగమే ఆత్మ స్వరూపానుభవము.

ఆత్మస్వరూపానుభవము ఆత్మకి సంబంధించిన ఇంద్రియములు మనస్సు బుద్ధి నిగ్రహించడము వలన కలుగు అనుభవము.

ఎప్పుడు శబ్దాది విషయము లందును, కర్మలయందును ఆసక్తి లేక, సంకల్పములను విడిచి పెట్టునో అప్పుడు అతడు యోగారూఢుడు యోగి అన్న స్థితి ని సంపాదించినవాడు అన్నమాట.

కర్మసన్యాసయోగములో మనుష్యుని పాపాలకి పుణ్యాలకి భగవంతునికి ఏమీ సంబంధము లేదు అన్న మాటను మళ్ళీ ధృవపరుస్తూ కృష్ణుడు ఇలా అంటాడు:

శ్రీభగవానువాచ:
ఉద్ధరేదాత్మానా ఆత్మానం నాత్మాన మవసాదయేత్ |
అత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః ||5||

"ఆత్మానం ఆత్మనా ఉద్ధరేత్ " ప్రతి మనుజుడును తన్నుతానే ఉద్ధరించుకొనవలెను. ఎవడు వివేకముతో తన మనస్సును జయించునో అట్టి మనసు అతనికి మిత్రుడగును. లేనిచో శత్రువగును.

ఇది చెప్పే మాట ఏమిటీ అంటే శాస్త్రములు మనకి మార్గము చూపించునేగాని చేయవలసినది మనమే. కనుక మన కృషిద్వారా మనమే మనలను ఉద్ధరించుకోవాలి . అదే కృష్ణుని మాట.

అలా తనను తానే ఉద్ధరించుకుంటే తన ఆత్మే తన బంధువు అవుతుంది.

మన మనస్సులో మంచి చెడుకూ ఎప్పుడూ సంగ్రామము అవుతూ ఉంటుంది. మంచి ఎప్పుడూ ధర్మానికి అనుగుణముగానూ చెడు ఎప్పుడూ అధర్మానికి అనుగుణముగానూ పోతాయి. తనను తాను ఉద్ధరించుకోడము అంటే మంచి కి విజయము అన్నమాట.

అంటే తన వివేకముచేత ఏవరు మనస్సుని జయించారో వాళ్ళ మనస్సు వాళ్లకి బంధువులాగా ప్రవర్తిస్తుంది. ఏవరు మనస్సుని జయించలేక పోయారో వాళ్లకి వాళ్ళమనస్సు ఎప్పుడూ చెడుమార్గములలోకి దారితీస్తూ తనకి తానే శత్రువులాగా అవుతుంది. (6.06)

అలాగ తనను తానే ఉద్ధరించుకొనగలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు?
"జితాత్మనః" జయింపబడిన మనస్సు కలవారు ;
"ప్రశాన్తస్య" ప్రశాంతముగా వుండు వారు ;
సుఖదుఃఖములు మాన అవమానములు , ఇంకా అలాంటి ద్వందములన్నిటికి చలించరు.(6.07)

అలాగే జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందినవాడు ఏలాంటి వాడు
"విజితేంద్రియః"- ఇంద్రియములపై జయము సాధించినవాడు
"సమలోష్టాశ్మకాంచనః"- మట్టిగడ్డ, రాయి, బంగారము లను సమానముగా చూచువాడు
ఆట్టి వాడు "యోగీ" - యోగి అనబడును. (6.08)

అలాగ సమానముగా చూడడము అన్నది అన్నిచోటలా వర్తిస్తుంది.

సుహృత్ ( మంచిహృదయము కలవాడు) , మిత్ర ( మిత్రుడు) అరి (శత్రువు) ఉదాసీన(ఉదాసీనులు) మధ్యస్థ( మధ్యస్తులు) ద్వేష్య(ద్వేషింపబడతగినవారు) , బన్ధుషు ( బంధువులు) సాధుషు(సాధువులు) పాపేషు ( పాపులు) - అంటే అనేక విధములైన మనస్తత్వము గలవారు అన్నమాట. (6.09)

వీరందరియందు సమత్వముగలవాడు శ్రేష్ఠుడు.
అందరియందు సమత్వము ఉంటే కలిగే శాంతి లాంటి శాంతి ఇంకోటి ఉండదు
అయితే ఈ సమత్వము ఏలా వస్తుంది.

కర్మద్వారా ఒక స్థాయికి వచ్చి అప్పుడు చిత్తశుద్ధి లభించినతరువాత శ్రవణ మనన ధ్యాన కర్మలద్వారా రెండో మెట్టు ఎక్కాలి అని ఇంతకు ముందే చెప్పాడు. ఆ మెట్టు ఎక్కిన తరువాత సమత్వము లభిస్తుంది.

ఇందులో ధ్యానము ఒక ముఖ్య భాగము

ఇప్పుడు అ ధ్యానము ఎక్కడ ఎలాచేయ్యాలి అన్నది కూడా కృష్ణుడు చెపుతాడు
- శుభ్రమైన ప్రదేశములో (ఎందుకు అంటే చెత్తా చెదారము మీద మనసు పోకుండా)
- ఆసనానికి తగు దర్భలు మృగ చర్మము, వస్త్రము పరిచి ( ఇది కూర్చోడానికి)
- అసనానిని స్థిరముగా నిలిపి
అప్పుడు అక్కడ ధ్యానము చెయ్యాలి. ఏలా ?
- మనస్సుని ఆని విషయాలనుంచి మరల్చి ఏకాగ్రతతో
- మనస్సుని స్థిరపరచి , ఇంద్రియాలను వశములోనుంచుకొని
ధ్యానము చెయ్యాలి . ఎందుకు ? చిత్త శుద్ధికి. ( 6-11,12)

ఆలాగ ధ్యానము చేసేవాడి మనస్థితి ఎలావుండాలోకూడా కృష్ణుడు వర్ణిస్తాడు :

ఆ ధ్యానము చేసేవాడు
"ప్రశాన్తాత్మా" "విగతభీః" "బ్రహ్మచారివ్రతేస్థితః" "మనః సంయమ్య"
"ప్రశాంతచిత్తుడై , భయమువదిలినవాడై, బ్రహ్మచర్యముపాటించువాడై , మనస్సును అధినములో ఉంచుకున్నవాడై"
మనస్సును ఆత్మయందే లగ్నమొనర్చి ఆత్మనే ధ్యానించవలెను.(6.14)
ఆత్మ పరమాత్మ ఒకటే అన్న సందర్భములో "మచ్చిత్తః మత్పరాయణః" అంటే భగవంతుని మీదే మనస్సుగలవాడై భగవంతునే నమ్మి ధ్యానము చేయవలెను అని అనుకున్నా మనము చేరే గమ్యము ఓకటే.

అలాగ పొందే గమ్యము - "నిర్వాణ పరమాం శాన్తిం అధిగచ్ఛతి" - అంటే పరమోత్కృష్టమైన శాంతిని పొందుతాడు (6.15).

అదే మోక్షము.

నిష్కామకర్మ ఎవరికి కుదరదో ( వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః .. )మూడో అధ్యాయములో చెప్పినట్లే ఇక్కడ కూడా ధ్యానము ఎవరికి కుదరదు అని చెపుతాడు కృష్ణుడు.

ధ్యానము ఎవరికి కుదరదు ? వాళ్ళేవరు అంటే ..
ఎక్కువగా తినేవారు , అసలు తినని వారు
ఎక్కువగా నిద్రపోయేవారు , అసలు నిద్రపోని వారు.(6.16)

అంటే మితముగా జరుగు మిత ఆహారము , మిత విహారము, మిత కర్మ, మిత నిద్ర, మిత జాగరణ కలవారికి ధ్యానము సులభము.

అలాంటి వాళ్ళు అన్ని విషయాలలో కోరికలు విడిచి మనాసు ఆత్మయందే నిలిపి నపుడు యోగస్థితికి చేరారు అన్నమాట.(6.18)

ఈ ధ్యానములో ఉన్నవాళ్ళ మనస్సు ఎలాఉంటుందో చాలా అద్భుతము గా వర్ణిస్తాడు.( 6.19)

శ్రీభగవానువాచ:
యథా దీపో నివాతస్థో నేఞ్గతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః ||19||

అంటే - గాలి లేని చోట దీపము ఎలా నిశ్చలముగా ఉంటుందో అలాగే
ధ్యానము చేస్తున్న యోగి మనస్సు కూడా నిశ్చలముగా ఉంటుంది అన్నమాట.

అలా నిశ్చలమైన మనస్సుతో ధ్యానమగ్నుడైన వానికి లభించే యోగస్థితి ఏమిటి ? అదే ఆత్మసాక్షాత్కారము.
అంటే అది ఏమిటి? అన్నప్రశ్నరావచ్చు.

అదే యోగాభ్యాసముచేత నిగ్రహింపబడిన మనస్సు శాంతిపొందడము
- పరిశుద్ధమైన మనస్సుతో తన స్వరూపము ను చూడగలిగి దానియందే సంతోషము పొందడము(6.20)
- ఆత్మను గ్రహించి ఇంద్రియములకు కనపడని బుద్ధిచేతనే గ్రహింపబడగల ఆనందమును పోందడము(6.21)
- ఇలాగ వచ్చిన ఆనందముకన్నా ఇంక ఏవిధమైన గొప్ప సుఖము లేదు అనగలగడము (6.22)
- ఎంతో మహత్తరమైన దుఖముచే కూడా చలింప బడక పోవడము
- దుఃఖసంబంధము లేకపోవడము

అటువంటి స్థితిని యోగము అంటారు
అదే ఆత్మసాక్షాత్కారము కూడా !
అటువంటి యోగి మనస్సులోని మోహములు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన మనస్సుగలవాడై బ్రహ్మమే అయి ఉత్తమమైన సుఖము పొందుతాడు (6.27).

అటువంటి యోగస్థితిలో ఉన్నవాడు ఏలాంటివాడు?

శ్రీభగవానువాచ:
సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ||(6.29)||

అన్నిచోటల ( సర్వత్ర) సమదృష్టిగలవాడై (సమదర్శనః)
"ఆత్మానం" తనను "సర్వభూతస్థం" సర్వభూతములయందు
అలాగే సర్వభూతములను తనయందు చూచుచున్నాడు.|

ఇంకోమాట.
శ్రీభగవానువాచ
"యోమాం పశ్యతి సర్వత్రమయి పశ్యతి |
తస్యాహం న ప్రణస్యామి స చ మే నప్రణస్యతి" ||(6.30)||

"ఎవరైతే సమస్తభూతములయందు నన్ను చూచుచున్నాడో , నాలో సమస్తభూతములను చూచుచున్నాడో వానికి నేను కనపడకపోను నాకు అట్టివాడు కనపడకపోడు".

మళ్ళీ ఇంకోసారి ఎవరు శ్రేష్టుడు అన్నమాట కృష్ణుడు చెపుతాడు.
సమస్తప్రాణుల సుఖదుఃఖాలు తన సుఖదుఃఖాలతో సమానముగా చూడగలడో అ యోగి పరమశ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. (6.32)

అంతావిని అర్జునిడికి సందేహము వస్తుంది.(6.34)
"ఓ కృష్ణా! మనసు చంచలమైనది, విక్షోభమును కలుగజేయునది. ధృఢమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని అణచిపెట్టుట వలె మిగుల కష్టసాధ్యము కదా " అని .

అర్జునుని మాటలకు భగవానుడు అంగీకరించుచు, ఇట్లనెను

శ్రీభగవానువాచ:
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||35||

"అసంశయం మహాబాహో " ఓ అర్జునా దాంట్లో సంశయములేదు !
"మనో దుర్నిగ్రహం చలమ్" మనస్సు చంచలమైనది నిగ్రహించుట కష్టము .
కాని అర్జునా ! "అభ్యాసేన" అంటే ఆభ్యాసముతో
"వైరాగ్యేణ"అంటే వైరాగ్యముతో అ మనస్సుని నిగ్రహించవచ్చు.

అర్జునుడుకి మళ్ళీ ఇంకొక సందేహము వస్తుంది (6.37).

అర్జున ఉవాచ :
అయతిశ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ||(6.37)||

అంటే "శ్రద్ధయాపేతో" - శ్రద్ధకలిగైనవాడై
"యోగాత్ చలిత మానసః" - యోగమునుంచి జారిన మనస్సుకలవాడై
"యోగసిద్ధిం అప్రాప్య" - యోగ సిద్ధి పొందక
"కాం గతిం గచ్ఛతి" - ఏ గతిని పొందుతున్నాడు

అంటే శ్రద్ధవుండవచ్చు శ్రద్ధవున్నంత మాత్రాన యోగము సంపాదించకపోవచ్చు. మరి యోగస్థితి పొందనిచో శ్రద్ధగాచేసిన పని నిష్ఫలము అవుతుందా? అట్టివానికి ఏమిటి గతి ?. అట్టివాడు "ఉభయవిభ్రష్టః" రెండిటికి చెడినవాడు అవుతాడా ? అని అర్జునుని భావము(6.38,39)

యోగస్థితి పొందితే మోక్షము వస్తుంది.
యోగస్థితి పొందకపోతే ఏమిటి అని.

అప్పుడు కృష్ణుడు చెపుతాడు:
"పార్థ నైవేహ నాముత్ర వినాశః తస్య విద్యతే"
ఓ పార్థ !
"ఇహ"- ఈ లోకములో
"వినాశః నవిద్యతే" - వినాశము లేదు.
"అముత్ర" అక్కడ - అంటే పరలోకములో కుడా "న" నాశనములేదు !!
అంటే శ్రద్ధగా సత్కార్యముచేస్తే - బ్రహ్మ సాక్షాత్కారము పొందకపోవచ్చు కాని వినాశము పొందడు !(6.40)
అంతేకాదు
పుణ్యలోకములను పొంది మళ్ళీ సదాచారపరులైన శ్రీమంతుల ఇళ్ళలో పుట్టును అని
ఆ పూర్వజన్మ సుకృతము వలన ఆ మళ్ళీ యోగసిద్ధికోసము ప్రయత్నము చేయును.
అంటే ఒకసారి సదాచార తత్పరుడైన వాడు అదే శ్రద్ధతో జన్మజన్మలకీ ఆ ప్రయత్నము చేయుచూ వుండును.
"అనేకజన్మ సంసిద్ధః "
అంటే అనేక జన్మలందు అభ్యాసముచే పొందిన యోగసిద్ధి కలవాడై
"తతో యాతి పరాంగతిమ్" అప్పుడు సర్వోత్తమమైన గతిని ( మోక్షమును) పొందుచున్నాడు.(6.45)

అంటే కృష్ణుడు అర్జునుని సందేహానికి జవాబుగా - శ్రద్ధవుంటే ఎన్ని జన్మలైనా చివరికి యోగము పోందును అని చెపుతాడు
చివరికి :
యోగి "తపస్విభ్యః అధికః" - తపస్సు చేసేవారికన్న అధికుడు
"జ్ఞానిభ్యో అపి" - జ్ఞానము కలవారికన్ననూ అధికుడు >
అందుకని
"తస్మాత్ యోగీ భవ అర్జునా" |
అందుకని ఓ అర్జునా యోగి వి కమ్ము !(6.46)

శ్రీభగవానువాచ
యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా |
శ్రద్ధవాన్ భజతే యొ మాం స మే యుక్తతమో మతః ||47||

"సర్వేషాం యోగినాం" - అందరు యోగులలో
"మద్గతేన అంతరాత్మనా" నా యందు నిలకడతో మనస్సుతో
"యో మాం భజతి" - ఎవరు నన్ను సేవించుచున్నాడో
సః - వాడు
యుక్తతమః - మిక్కిలి శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము

ఓ అర్జునా! తపస్సులు చేయువారి కంటెను, శాస్త్ర జ్ఞానము గల వారికంటెను, కర్మలు చేయువారి కంటె గూడ నాయందు మనసు నిలిపి శ్రధ్ధతో నన్ను ధ్యానించువాడు సర్వశ్రేష్ఠుడు.

ప్రతి మనుజుడు ఆధ్యాత్మ మార్గమున తన ఉన్నతిని తానే చూచుకొనవలెను. ఏలయనిన రోగముచే బాధపడు రోగి ఔషధమును తానే తీసుకొనవలెను, కానీ ఇతరులు ఔషధము సేవించిన ఈ రోగికి రోగము తగ్గదుకదా!

ధ్యానమునకు కూర్చుండుటకు ముందే సాధకుడు ధృడమైన సంకల్పమును తీసికొనవలెను. ధ్యానములో కూర్చున్ననూ మనస్సు పరుగులు తీయవచ్చు . అప్పుడు దానిని అదుపులోకి తీసుకువచ్చి మరల ధ్యానములో నిమగ్నము అవ వలెను. దీనిని గురించి అర్జునుడు అడిగెను కూడా. కృష్ణుడు చెప్పిన మాట మన అందరికి వర్తిస్తుంది. మనస్సు అదుపు లో ఉంచుకొని ధ్యానము చేయడానికి అభ్యాసము అవసరము . అభ్యాసమే కాకుండా వైరాగ్యము కూడా అవసరమని కృష్ణుడు చెప్పిన మాట కూడా మనకి వర్తిస్తుంది. వైరాగ్యముతో కొన్ని సుఖదుఃఖాలని అదుపులో పెట్టవచ్చు.

ధ్యానములో స్థిరత్వము పొందవలెనన్న మన దిన చర్య సక్రమముగా, ప్రశాంతముగ, లౌకిక విషయములకు దూరముగ నుండవలెను. ఈ విషయమున చాల శ్రద్ధగా నుండవలెను. లేనుచో మనసు అశాంతిగ యుండి ధ్యానము కుదరదు.

ఇక్కడ మనము తెలిసికొనవలిసిన ముఖ్యవిషయము ధ్యానము అనగా, ఒక స్థలమునందు నిటారుగా కూర్చుని, మౌనముగా యుండుట, ఆలోచనల నరికట్టుటకు ప్రయత్నించుట అని మాత్రమే కాదు. ధ్యానములో సత్వర ఫలితములను పొందవలెననిన, సాధకుడు యమ నియమములను పాటించవలయును . అప్పుడే మౌనముగా ఉండి, ఆలోచనలను అరికట్టగల స్థితికి చేరుకొనగలడు. ఇది అంతయు ధ్యానమునకు పూర్వము నుండి అనుసరించవలసిల విధి. వీటిని అనుసరించుటచే ధ్యానము చేయుటకు యోగ్యము కలుగును.

కొంతమంది సంవత్సరముల తరబడి, రోజుకు 1గం, 2 గంటలు ధ్యానము చేయుచున్నామనియు, ఫలితమేమీ పొందలేకున్నామనియు చెప్పుట గమనించు చున్నాము. దానికి కారణము శుధ్ధి కాని మనస్సు సిధ్ధిని పొందలేదు. కనుక సాధకుడు ప్రథమ దశలోనే యమ నియమములను అనుసరించుట ఆవశ్యకమై యున్నది.

ఉదాహరణకు, ఒక విద్యార్థి పై చదువులు చదవవలెనన్న, యోగ్యత పరీక్ష యందు ఉత్తీర్ణుడు కావలసి యుండును. అట్లు కానిచో పై చదువులకై విశ్వవిద్యాలయములలో చేరవలెనన్న అర్హత పరీక్షయందుత్తీర్ణుడు కానందున ప్రవేశము లభించదు కదా! అట్లే చిత్తశుధ్ధి లేని మనసు ధ్యానము నందు ఏకాగ్రతను పొందుటకు యోగ్యత లేనిదే యగును. కాబట్టి యమ, నియమముల ద్వారానే చిత్తశుధ్ధి సాధ్యమని తెలిసికొని, వాటిని ఆచరించుచు, ధ్యానము నందు ప్రవేశము పొందవచ్చును. బాహ్యము నందు ఆసక్తి గల మనసు ధ్యానమునందు స్థిరపడుట సాధ్యము కాదు. పరమ పవిత్రమైన జ్ఞానమును పొందుటకు పవిత్రమైన మనసు మాత్రమే అంతరంగిక ప్రయాణమునకు సహకరించును. ఈ విషయము నవగాహన చేసికొని పెద్దవారు తమ పిల్లలకు, ఇతరులకు, శాంతితో కూడిన జీవితమును గడుపుటకు మార్గదర్శకులు కావలెను.

సాధకుడు ప్రాథమిక స్థాయి నుండి యమ, నియమములను పాటించుట చాల అవసరము.
యమం: అనగా అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహంలు
నియమం: అనగా శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, భగవదారధన అను విధులు .
ఈ యమ నియమములను పాటిస్తే ధ్యానమార్గమున యోగస్థితి పొందవచ్చు.

||ఓమ్ తత్ సత్ ||

శ్రీభగవానువాచ:
యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా |
శ్రద్ధవాన్ భజతే యొ మాం స మే యుక్తతమో మతః ||47||
"యోగులందరిలోను ఎవడు నాయందు మనస్సుని నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్టుడు అని నా అభిప్రాయము"
||ఓమ్ తత్ సత్ ||


||ఓమ్ తత్ సత్ ||