సుబ్బలక్ష్మిగారి కలం నుంచి
కర్మ సిద్ధాంతము ఎవరికోసం?
కర్మ సిద్ధాంతము ఎవరికోసం?
****
"వాడు ఉట్టి వేదాంతము చెపుతున్నాడండి" అంటారు.
అంటే దాని అర్థము వ్యవహారాలకి వేదాంతానికి చాలా దూరము అని.
వేదాంతము అంటే అదేదో అధ్యాత్మిక చింతనకి సంబంధించినది కష్టమైన పని అని
అధ్యాత్మ చింతన అంటే
పద్మాసనము వేసికొని ఇంద్రియాలు నిగ్రహించి చేయవలసి కష్టతరమైన పని అని
మోక్షము అంటే
అడవులలో తపస్సు చేసికొనే మహనీయులకే తప్ప మిగతావారికి అసాధ్యము అని
అని అనుకుంటారు చాలామంది.
అధ్యాత్మ చింతనే కష్టము అనుకునే వాళ్ళకి మోక్షము అన్నమాటే వుండదు.
భగవద్గీత లో కృష్ణుడు చెప్పేది మన ఊహలన్నీ తప్పు.
కర్మ సిద్ధాంతము ముఖ్యముగా లౌకిక వ్యవహారాలలో మునిగి తేలుతున్నవారికి అని.
బండి కదిలి చక్రాలు తిరుగుతూ వున్నా
బండి ఇరుసు ( axle) ఎలా నిశ్చలముగా వుంటుందో
అలాగే మనిషి వ్యవహారాలలో తిరుగుతున్నా
మనస్సు ను నిశ్చలముగా ఉంచవచ్చు అని.
అలాగే ధ్యానము చేయవచ్చునని
తను చేస్తున్న కర్మ లు కృష్ణార్పితము చేసి కర్తవ్యము నిర్వహించినచో
అంటే ఆ వ్యవహారాలు లేక చేసే పనులను చేసేది దైవ భావనతో చేస్తే
వ్యవహారములో ఉన్నవాళ్ళు కూడా మోక్షానికి అర్హులే అని.
కృష్ణభగవానుని మాట .
అదే భగవద్గీతలో రాసిన పాట
అదే కర్మయోగము.
ఈ విధముగా కర్మయోగము సంసారికులకు వ్యవహారికులకు
అంటే సామాన్యులకు కూడా దోవను చూపే యోగము.
ఏ పని చేసినా చేయవలసిన విధానములో పట్టుదలతో చేయవలసినదే.
అది లౌకికము. అంటే అది తెలిసినదే .
ఆ పని చేయవలసిన విధానము గురించి కృష్ణుడు చెపుతాడు.
"యోగస్థః కురు కర్మాణి" - మనస్సును యోగస్థితిలో నుంచి కర్మ చేయుము.
అంటే మనస్సుని దేవుని మీద నిలిపి
అంటే ఆ కర్మ యొక్క ఫలితములపై ఆశ లేకుండా అని.
అయితే ఫలితములపై ఆశలేకుండా
అంటే ఫలితములను దైవార్పితము చేసి అని.
అంటే కర్మచేస్తున్నప్పుడు లాభాలాభములను గురించి కాని,
వాటివలనవచ్చే సుఖ దుఃఖాలను కాని అలోచించకుండా అని.
అలోచించ కుండా అంటే కష్టమే.
దాని అర్థము
సుఖమైన పరవాలేదు దుఃఖమైనా పరవాలేదు అని భావించడము.
మనము చాలాసార్లు వినేది ఒక గీతలో చెప్పిన వాక్యము
"సుఖదుఃఖే సమే కృత్వా"
వ్యావహారిక భాషలో ఒక పని చేస్తూ
ఆ పని వలన ప్రమోషన్ వస్తుందా
లేకా "రివార్డు" వస్తుందా అని అలోచించక
చేయవలసిన విధానములో
చేయడమే తన విథిగా తలచి
ఆ పని చెయ్యాలన్నమాట.
అలా చేసిన కర్మతో ఒకరకమైన ఉత్సాహము
ఒకరకమైన అనందము కలుగుతాయి .
అలాగ చేసిన కర్మే నిష్కామకర్మ.
ఆ నిష్కామకర్మ ప్రయోజనాలు మనకి తెలుసు.
అలా ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినప్పుడు భయము పోతుంది.
ఆ కర్మలో అడ్డంకులు కలిగినా ఫలాపేక్షలేని కర్మ కాబట్టి
సహాయకులు అనేకమంది పుడతారు ఆ అడ్డంకులు తొలగించడము కోసము.
ఇంకో ముక్క కూడా ముఖ్యము. కృష్ణుడు చెప్పినదే.
ఇలా నిష్కామకర్మ చెయ్యడానికి అడ్డంకులు ఏమిటీ?
ఓక్కటే ఒక్కటి.
"కామ ఏష" కామము ఓక్కటే ( 3:37)
ఆ కామం అంటే ఆ కోరికలే మనకు పెద్దశత్రువులు
ఆ శత్రువులను కృష్ణుడు "మహాశనో" "మహా పాప్మా" అంటాడు.
చివర కృష్ణుడు చెప్పినది;
" జహి శత్రుం మహాబాహో"
ఓ అర్జునా ! ఆ శత్రువును చంపుము అని.
మనకి కూడా కర్మయోగము చెప్పేది
ఆ కోరిక అనే శత్రువును చంపి కర్మ చేయమని.
అదే కర్మయోగము.
అదే మనలాంటి వాళ్ళకోసము !
||ఓమ్ తత్ సత్||
.