!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 236-237
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 236- 237
ముందు శ్లోకములో ...
బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని విన్నాము. బ్రహ్మ
సత్యము అన్నమాట అథర్వణ వేదములో ( ముండకోపనిషత్తులో)
చెప్పబడినది.
బ్రహ్మ సత్యం అన్నది నిజము (అది వేదవాక్కుకనక). మరి
జగత్తు కూడా సత్యమే మనకి మూడు నష్టాలు (
అసత్యములు) కలుగుతాయి అని గురువు
చెపుతున్నాడు. ఆ నష్టాలు జరగ కూడని పని కనుక, జగత్తు
సత్యము కాదు అని చెప్పి - గురువు - కృష్ణభగవానుడు
అదే మాట ( జగత్తు మిథ్య అని) గీతలో చెప్పాడు
అని కూడా వింటాము.
ఈ ముందు రెండు శ్లోకాలలో - జగత్తు మిథ్య అని -
తర్క స్వరూపముగా నిరూపిస్తాడు గురువు.
ఇక 236 , 237 వ శ్లోకాలు.
యది సత్యం భవేత్ విశ్వం
సుషుప్తావుపలభ్యతామ్ |
యన్నోపలభ్యతే కించిత్
అతోఽసత్ స్వప్నవత్ మృషా||236||
అతః పృథక్ నాస్తి జగత్ పరాత్మనః
పృథక్ ప్రతీతిస్తు మృషా గుణాహివత్
అరోపితస్యాస్తి కిమర్థవత్తా
అధిష్ఠానమాభాతి తథా భ్రమేణ||237||
శ్లోకము 236
యది సత్యం భవేత్ విశ్వం
సుషుప్తావుపలభ్యతామ్ |
యన్నోపలభ్యతే కించిత్
అతోఽసత్ స్వప్నవత్ మృషా||236||
యది సత్యం భవేత్ విశ్వం
ప్రపంచము నిజము అయితే
సుషుప్తావుపలభ్యతామ్
గాఢనిద్రలో కూడా చూడబడవలెను
యన్నోపలభ్యతే కించిత్
ఏ కారణము వలన ఏమీ చూడబడుట లేదో
అతోఽసత్ స్వప్నవత్ మృషా
అతః - అందువలన
స్వప్నవత్ అసత్ - స్వప్నము వలె అసత్యము
మృషా - మిధ్యయే
తాత్పర్యము:
విశ్వము నిజమైతే గాఢనిద్రలో కూడా ప్రపంచము
కనపడవలెను. ఏ కారణము వలన చూడబడుటలేదో , అందువలన అది
స్వప్నము వలె అసత్యము. మిథ్యామాత్రమే. ( ఇది గురువు
చెప్పినమాట- శ్లోకతాత్పర్యము)
ఇక్కడ , విశ్వము నిజమైతే గాఢనిద్రలో కూడా ప్రపంచము
కనపడవలెను అన్న మాటకి ఆధారము మనకి సులభముగా కనపడదు.
అయితే ఆత్మ నిత్యము , సత్యము అని ఎలాగ అన్నాము? అది
ఒకమారు పరిశీలిద్దాము.
మనకి ఆత్మవిషయములో ఈ మాట విన్నాము. జాగ్రత్
స్వప్నావస్థలలో, ఆత్మ సాక్షిలా వుంది. ఆ మాట మనకు
అర్థమైంది. గాఢనిద్రలో మన బుద్ధి మొదలగు
మనోవ్యాపారములు నిద్రపోయినా, నిద్ర లేవగానే మనకి,
"ఆహా చాలామంచి నిద్రవచ్చింది" అని తెలుస్తుంది.
మంచి నిద్రవచ్చింది అని ఎవరికి తెలిసింది? మనలో
వున్న ఆత్మకి తెలిసింది.
ఎలాతెలిసింది అంటే, అన్ని వ్యాపారములు ( బుద్ధి
మొదలగునవి) నిద్రలో వుంటే, తను నిశ్చలముగా
సాక్షిగా వుంది కాబట్టి, అన్ని వ్యాపారములకి తెలివి
వచ్చినప్పుడు, మళ్ళీ మన ఆత్మద్వారా , ఆహా నిద్రలో
అన్నీ కులాసాగా నిద్రపోయి , నాకు ఏమీ తెలియనంత
నిద్రపట్టినది అని అంటాము, వింటాము
కూడా.
అంటే మన నిద్రలో ఆ ఆత్మ అలాగే కాపలా వుంది అన్నమాట.
అంటే మనకి అర్థమైనది, ఆత్మ మూడూ అవస్థలలో మెలకువగా
సాక్షిలా వున్నది అన్నమాట. అలా అన్ని అవస్థలలో
వున్నది కాబట్టి అది నిత్యము . అదే సత్యము.
ఆత్మ నిత్యము అన్నది, షుషుప్తి దశలో కూడా షుషుప్తి
దశని గ్రహించినది కాబట్టి , నిశ్చలమైన ఆత్మ నిత్యము
అని మనకి తెలిసింది. మరి నిత్యమైనది సత్యము కదా.
ఇదే కథనములో, షుషుప్తిలో ప్రపంచము కనపడలేదు కాబట్టి
, ప్రపంచము అనిత్యము అనడానికి తర్కజ్ఞానము ద్వారా
కష్టమే అనిపించవచ్చు. కాని ఈ మాట ఒకసారి
పరిశీలిద్దాము.
నిద్రలో కల వస్తుంది. అదే కల నిద్రనుంచి లేవగానే
మారుతుంది. ఏదైతే నిద్రావస్థనుంచి జాగ్రదావస్థలో
మారుతుందో, అది మార్పులేనిది కాదు. అలా మారుతూ
వున్నది నిత్యము కాదు. నిత్యము కానిది సత్యము కాదు.
అంటే కల సత్యముకాదు. కల మిథ్య మాత్రమే.
అలాగే, ప్రపంచము.
మెలకువగా వున్నప్పుడు జాగ్రదావస్థలో ప్రపంచము అంటే
మనగది, మనమంచము, మనస్నేహితులూ, మనపరిసరాలు చూస్తాము.
నిద్రలో చూసిన స్వప్నములో మనము మరెన్నో విషయాలు,
ఎక్కడికో వెళ్ళినట్లు, ఎవరితోనో మాట్లాడి నట్లు,
ఇంకో ప్రపంచాన్ని చూస్తాము. అంటే
జాగ్రదావస్థలో చూచే ప్రపంచము, నిద్రలో చూచే ప్రపంచము
భిన్నము అన్నమాట. అంటే మనము చూచే ప్రపంచము మన
శరీరావస్థమీద ఆధారపడివున్నది అన్నమాట. అంటే మనము
చూచే ప్రపంచము మార్పులేని నిత్యము కాదు. అంటే
ప్రపంచము నిత్యము కాదు.
నిత్యము కాని ప్రపంచము సత్యము కాదు. అది కూడా
స్వప్నము వలె మిథ్యయే. ఇది గురువు ఆలోచన.
శ్లోకము 327
అతః పృథక్ నాస్తి జగత్ పరాత్మనః
పృథక్ ప్రతీతిస్తు మృషా గుణాహివత్
అరోపితస్యాస్తి కిమర్థవత్తా
అధిష్ఠానమాభాతి తథా భ్రమేణ||237||
అతః - అందువలన
అంటే ముందు శ్లోకములో చెప్పబడిన మాట,
జగత్తు నిత్యము కాదు, సత్యముకాదు కనుక
మిథ్యయే. అందువలన.. ఇక్కడ గురువు ఇంకా ఏదో
చెప్పుచున్నాడు.
పృథక్ నాస్తి జగత్ పరాత్మనః - అంటే-
జగత్ పరాత్మనః పృథక్ నాస్తి
జగత్తు పరమాత్మకన్నా వేరే కాదు.
జగత్తు పరమాత్మస్వరూపమే.
మట్టిచేత చేయబడిన కుండలన్నీ, వేరే వేరే రూపాలు
వున్నా, నిజానికి మట్టి స్వరూపములే అని
, ముందు అర్థము చేసుకున్నాము . అలాగే బ్రహ్మము చేత
చేయబడిన ఈ జగత్తు కూడా వేరే వేరే రూపాలలో
రంగులలో కనపడినా , అది అంతా బ్రహ్మ స్వరూపమే.
పృథక్ ప్రతీతిస్తు మృషా గుణాదివత్
పృథక్ ప్రతీతిస్తు - వేరుగా కనపడుట
మృషాగుణాదివత్ - త్రాడుని చూచి పాము అనుకున్న
విధముగా అసత్యము.
అరోపితస్యాస్తి కిమర్థవత్తా-
అరోపింపబడినదానికి అర్థము ఏమన్నావుందా?
అధిష్ఠానమాభాతి తథా భ్రమేణ -
అది అధిష్టాన స్వరూపమే భ్రమపోతే
తాడుని ( అధిష్టాన స్వరూపమును) పాము అనుకున్నాము (
తాడు మీదా అరోపింపబడిన రూపము - పాము) . అది పాము
కాదు అని భ్రమపొతే మిగిలినది తాడే ( అధిష్టాన
స్వరూపమే)
బ్రహ్మస్వరూపమును ( అధిష్టాన స్వరూపమును) వేరేగా
కనపడే ప్రపంచము అనుకున్నాము ( బ్రహ్మము మీద
అరోపింపబడిన రూపము ప్రపంచము ). చూస్తున్నది
ప్రపంచము కాదు అన్న భ్రమ పోతే మిగిలేది బ్రహ్మ
స్వరూపమే.
అదే ఈ శ్లోక తాత్పర్యము .
||ఓమ్ తత్ సత్||