Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 20

' Do not ask for Rama' !!!

With Sanskrit text in Devanagari, Telugu and Kannada

బాలాకాండ
ఇరువదియవ సర్గము
( దశరథుడు విశ్వామిత్రుని అభ్యర్థనను తిస్కరించుట)

తచ్ఛ్రుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితమ్ |
ముహూర్తమివ నిస్సంజ్ఞః సంజ్ఞావానిదమబ్రవీత్ ||

తా|| విశ్వామిత్రునిచే చెప్పబడిన మాటలను విని ఆ రాజులలో శార్దూలమంటి దశరథ మహారాజు క్షణకాలము స్పృహలేనివాడై మరల స్పృహను పొంది ఇట్లు పలికెను.

ఊన షోడషవర్షో మే రామో రాజీవ లోచనః |
న యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః ||
ఇయ మక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః |
అనయా సంవృతో గత్వా యోద్దాహం తైర్నిశాచరైః ||
ఇమే శూరాశ్చ విక్రాంతా భృత్యామే అస్త్రవిశారదాః |
యోగ్యా రక్షోగణైర్యోద్దుం న రామం నేతుమర్హసి ||

తా|| 'రాజీవులోచనుడైన నా రాముడు పదునారుగేండ్లు నిండనివాడు . కనుక ఆ రాక్షసులతో యుద్ధము చేయుటకు యోగ్యుడు అనుకొనను. ఈ అక్షౌహిణీ సేనలకు నేను అధిపతిని. ఈ సైన్యములతో వచ్చి నేను ఆ నిశాచరులతో యుద్ధము చేయగలను . ఈ సేనలోని భటులు శూరులూ పరాక్రమవంతులూ అస్త్రవిద్యలలో ప్రతిభాశాలులు రాక్షసులతో యుద్ధము చేయగలు సమర్థులు. కాని రాముని మాత్రము కోరవలదు'.

అహమేవ ధనుష్పాణిః గోప్తా సమరమూర్థని |
యావత్ ప్రాణాన్ ధరిష్యామి తావద్యోత్సే నిశాచరైః ||
నిర్విఘ్నా వ్రతచర్యా సా భవిష్యతి సురక్షితా |
అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి |

తా|| 'నేనే ధనుర్బాణములను చేపట్టి నీ యాగ సంరక్షణ చేయగలను. నాలో ప్రాణమున్నంతవరకూ ఆ నిశాచరులతో యుద్ధము చేసెదను. నీ వ్రతచర్య నిర్విఘ్నముగా పూర్తి అగునట్లు చేసెదను . కనుక రాముని పంపమని అడగవలదు'.

బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్ |
న చాస్త్ర బలసంయుక్తో న చ యుద్ధ విశారదః ||
న చాసౌ రక్షసాం యోగ్యః కూతయుద్ధా హి తే ధ్రువమ్ |
విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే ||
జీవితుం మునిశార్దూల న రామం నేతుమర్హసి |||

తా|| 'రాముడు బాలుడు. ధనుర్విద్యను పూర్తిగా నేర్చుకొనలేదు. శత్రువుల బలాబలములను ఎరగనివాడు. అస్త్రములను ప్రయోగించుట పూర్తిగా ఎరగనివాడు. యుద్ధము చేయుటలో విశారదుడు కాడు. ఆ రాక్షసులందరూ కపట యుద్ధములో ఆరితేరినవారు. కనుక వారితో యుద్ధము చేయుటకు రాముడు చాలడు. మునీశ్వరా రాముని సంగతి అట్లుండనిండు. రాముని ఎడబాసి నేను ఒక్కక్షణము బ్రతుకజాలను . కనుక రాముని పంపవలసినది అని కోరవద్దు'.

యది వా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్ఛసి సువ్రత |
చతురంగ సమాయుక్తం మయాచ సహితం నయ ||
షష్టిర్వర్ష సహస్రాణి మమ జాతస్య కౌశిక |
దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి ||

తా|| 'ఓ సువ్రతా ! తప్పనిసరిగా రాముని వెంటగొని పోవదలచినచో నేనును చతురంగబలములతో వచ్చెదను . అనుమతింపుడు. నాకు అరువదివేల సంవత్సరములు నిండిన పిమ్మట అతికష్టములతో ఈ బాలకుని పొందితిమి , కనుక ఈ రాముని పంపమని కోరవలదు'.

చతుర్ణామాత్మజానాం హి ప్రీతిః పరమికా మమ |
జ్యేష్ఠం ధర్మప్రధానం చ న రామం నేతుమర్హసి ||

తా|| 'నా నాలుగురు కుమారులలో రాముడనిన నాకు అత్యంత ప్రేమ. పైగా అతడు జ్యేష్ఠుడు. కనుక ధర్మాత్ముడైన రాముని తీసికొని వెళ్ళవలదు'.

కిం వీర్యా రాక్షసా స్తే చ కస్య పుత్రాశ్చ కే చ తే |
కథం ప్రమాణః కేచైతాన్ రక్షంతి మునిపుంగవ ||
కథం చ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసామ్ |
మామకైర్వా బలైః బ్రహ్మన్ మయా వా కూటయోధినామ్ ||
సర్వం మే శంస భగవన్ కథం తేషాం మయా రణే |
స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః ||

తా|| 'ఓ మునిపుంగవా ! ఆ రాక్షసులెవరు? వారి పరాక్రమమెట్టిది? వారు ఎవరి కుమారులు ? వారి ఆకారములెట్టివి ?వారికి రక్షణ ఎవరు ? ఓ బ్రహ్మర్షీ ! కపట యుద్ధములో దిట్టలైన వారిని నేనుగాని నా సేనలు గాని రాముడు గాని ఎట్లు ఎదురుకొనవలెను ?అ పరాక్రమముచే గర్వపడుతున్న ఆ దుష్ఠాత్ములను మెము ఎట్లు నిలుపవలెను ? ఇది నాకు విశదీకరించుడు'.

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోsభ్యభాషత ||
పౌలస్త్య వంశ ప్రభవో రావణో నామ రాక్షసః |
స బ్రహ్మణా దత్తవరః త్రైలోక్యం బాధతే భృశమ్ ||
మహాబలో మహావీర్యో రాక్షసైః బహుభిర్వృతః |
శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిపః ||
సాక్షాత్ వైశ్రవణ భ్రాతా పుత్రో విశ్రవసో మునేః |
యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః ||
తేన సంచోదితా ద్వౌతు రాక్షసౌ మహాబలౌ |
మారీచశ్చ సుబాహూశ్ఛ యజ్ఞవిఘ్నం కరిష్యతః ||
ఇత్యుక్తో మునినా తేన రాజోవాచ మునిం తదా |
నహి శక్తో స్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః ||

తా|| ఆ రాజుయొక్క ఆ వచనములను విని విశ్వామిత్రుడి ఇట్లు పలికెను. ' ఓ రాజా ! అతడు పౌలస్త్యవంశము లో జన్మించిన రాక్షసుడు , రావణుడను పేరు గలవాడు. బ్రహ్మ చేత ఇవ్వబడిన వరముతో ముల్లోకములను భాధించుచున్నాడు. అతడు మిక్కిలి బలవంతుడు , గొప్ప పరాక్రమము గలవాడు. అతనికి చాలా రాక్షస బలములు గలవు. రాక్షసరాజైన ఆ రావణుడు విశ్రవశుడు అను మునియొక్క పుత్త్రుడు, సాక్షాత్ కుబేరును యొక్క సోదరుడు మహావీరుడు అని ప్రతీతి. అతడు స్వయముగా విఘ్నములు కలగించుట లేదు. అతనిచే ప్రేరేపింపబడిన రాక్షసులు ఇద్దరూ మహాబలము కలవారు. వారు యజ్ఞమునకు విఘ్నము కలిగించుచున్నారు'.

ఇత్యుక్త్వా మునినా తేన రాజోవాచ మునిం తదా |
నహి శక్తోస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః ||
స త్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమపుత్త్రకే |
మమ చైవాల్పభాగ్యస్య దైవతమ్ హి భవాన్ గురుః ||

తా|| ఈ విధముగా ఆ ముని చేత చెప్పబడిన తరువాత ఆ రాజు మునితో ఇట్లు పలికెను. ' సంగ్రామములో అతని ఆపుటకు నాకు శక్తి లేదు. ఓ ధర్మజ్ఞా! నీవే నా పుత్త్రునకు అనుగ్రహింపవలెను. నేను అల్పమైన భాగ్యము కలవాడను . మీరే మాకు దైవము మీరే మాకు గురువులు'.

దేవదానవగంధర్వా యక్షాః పతగపన్నగాః |
న శక్తా రావణం సోఢుం కిం పునర్మానవా యుధి ||
సహి వీర్యవతాం వీర్యం ఆదత్తే యుధి రాక్షసః |
తేన చాహం న శక్తోస్మి సంయోద్ధుం తస్య వా బలైః |
స బలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మజైః ||

తా|| ' దేవతలు దానవులూ గంధర్వులు , యక్షులు గరుత్మంతుడు నాగులు ఎవరును రావణుని సంగ్రామములో ఎదుర్కొనలెరు . అప్పుడు మానవులకు ఎట్లు సాధ్యమగును ? ఆ రావణుడు యుద్ధరంగములో వీరులు అందరి పరాక్రమములను హరించును . అందువలన ఓ మునిపుంగవా ! నేను నా సైన్యములతో గూడిగాని , పుత్రునితో గూడిగాని అతనిని అతని బలములనూ ఎదుర్కొనుటకు అశక్తుడను.'

కథమప్యమరప్రఖ్యం సంగ్రమాణాం అకోవిదమ్ |
బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్త్రకమ్ ||
అథ కాలోపమౌయుద్ధే సుతౌ సుందోపసుందయోః |
యజ్ఞవిఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్త్రకమ్ ||
మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ |
తయోరన్యతరేణాహం యోద్ధా స్యాం ససుహృద్గణః ||

తా|| 'ఓ బ్రహ్మర్షీ ! నా కుమారుడు బాలకుడు . యుద్ధవిద్యలయందు ఆరితేరినవాడు కాదు. కావున అతనిని పంపజాలను. యజ్ఞమునకు విఘ్నము కలిగించుచున్నవారిద్దరూ సుందోపసుందుల కుమారులు. వారు యుద్ధములో యమునితో సమానులు. కనుక నా పుత్త్రుని పంపలేను. మారీచ సుబాహులు సుశిక్షుతులు. వారిలో ఒక్కనితో గూడా నామిత్రులతో గూడి అయిననూ నేను యుద్ధము చేయజాలను '.

ఇతి నరపతి జల్పనాత్ ద్విజేంద్రం
కుశికసుతం సుమహాన్ వివేశ మన్యుః |
సుహుత ఇవ సమిద్భిరాజ్యసిక్తః
సమభవదుజ్జ్వలితో మహర్షివహ్నిః ||

తా|| ఆ దశరథుని మాటలకు బ్రాహ్మణోత్తముడు, కుశికవంశ జాతుడూ మహాపురుషుడూ అయిన విశ్వామిత్రుడు మిక్కిలి ఆగ్రహము కలవాడయ్యెను. సమిథలతో ఆజ్యాహుతులతో ప్రజ్వరిల్లుచున్న అగ్ని వలె ఆ మహర్షి మండిపడెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే వింశస్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||