Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 21

' Dasaratha agrees to send Rama' !!!

With Sanskrit text in Devanagari, Telugu and Kannada

బాలకాండ
ఇరువదియొకటవసర్గము
( వసిష్ఠుని ప్రేరణతో విశ్వామిత్రునితో శ్రీరాముని పంపుటకు అంగీకరించుట)

తచ్ఛ్రుత్వా వచనం తస్య తస్య స్నేహపర్యాకులేక్షణమ్ |
సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిమ్ ||

తా|| అట్లు పుత్రవాత్సల్యముతో తడబడుతూ చెప్పిన మాటలను విని కౌసికుడగు విశ్వామిత్రుడు కుపితుడై ఇట్లు పలికెను.

పూర్వమన్యుః ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి |
రాఘవాణాం అయుక్తోsయం కులస్యాస్య విపర్యయః ||
యదీదం తే క్షమం రాజన్ గమిష్యామి యథా గతమ్ |
మిథ్యాప్రతిజ్ఞః కాకుత్థ్స సుఖీభవ సబాంధవః ||

తా || ' ఓ రాజా ! పూర్వము ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఆ ప్రతిజ్ఞకు విరుద్ధముగా చేయుటకు సిద్ధ పడుచున్నావు. ఇది రాఘవ కులమునకు తగని మాత. ఇట్లు చేయుట మీ కులమునకు కళంకము. ఇట్లు మాట తప్పుట నీకు యుక్తము అనిపించినచో నేను వచ్చిన విధముగనే పోయెదను. కకుత్స్థవంశమున పుట్టిన నీవు మాట తప్పితివి. నీవు నీవారితో సుఖముగా నుండుము'.

తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః ||
చచాల వసుధా కృత్శ్నా వివేశ చ భయం సురాన్ ||
త్రస్తరూపం తు విజ్ఞాయ జగసర్వం మహాన్ ఋషిః |
నృపతిం సువ్రతో ధీరో వసిష్ఠో వాక్యమబ్రవీత్ ||

తా|| ఆ ధీమంతుడైన విశ్వామిత్రుడు కోపొద్రిక్తుడు కాగా భూమండలమంతయూ చలించెను. సురదేవతలు భయపడిరి. జగత్తు అంతయూ చలించుట గమనించి ఆ ధీరుడైన మహాఋషి వసిష్ఠుడు దశరథునితో ఇట్లనెను.

ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాద్ధర్మ ఇవాపరః |
ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్ న ధర్మం హాతుమర్హసి ||
త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ |
స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మంవోఢుమర్హసి ||

తా|| ఓ రాజా ! నీవు ఇక్ష్వాకుకులవంశమున జన్మించినవాడవు. సాక్షాత్ ధర్మమూర్తివి, ధైర్యశాలివి, సత్యవ్రతమును పాలించువాడివి, కనుక నీవు ధర్మ హానికి తలపడవలదు. ఓ రాఘవా ! ముల్లోకములందు ధర్మాత్ముడవని ప్రఖ్యాతికెక్కిన వాడవు. స్వధర్మమును ఆచరింపుము. అధర్మమునకు పాల్పడవలదు'.

సంశ్రుత్యైవం కరిష్యామీత్యకుర్వాణస్య రాఘవ |
ఇష్టాపూర్తవధో భూయాత్ తస్మాద్రామం విసర్జయ ||
కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్ష్యంతి రాక్షసాః |
గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా ||

తా|| ' ఓ రాఘవా ! ' మీ కోరిక నెరవేర్తును' అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టు కొనని వానికి అశ్వమేధయాగఫలము, ధర్మకార్యములను ఆచరించిన ఫలము నశించును. కావున విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుము. రాముడు అస్త్రవిద్యలో కుశలుడు కాకున్ననూ విశ్వామిత్రుని రక్షణ లోన ఉన్నంతవఱకూ అగ్ని రక్షణ లో నున్న అమృతము వలె ఆయనను రాక్షసులు ఏమీ చేయలేరు.'

ఏష విగ్రహాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః |
ఏష బుధ్యాsధికో లోకే తపసశ్చ పరాయణమ్ ||
ఏషోsస్త్రాన్ వివిధాన్ వేత్తి త్రైలోక్యే స చరాచరే |
నైనమన్యః పుమాన్ వేత్తి న చ వేత్సంతి కేచన ||
న దేవా నర్షయః కేచిత్ నాసురా న చ రాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః స కిన్నరమహోరగాః ||

తా|| విశ్వామిత్రుడు ఆకృతిదాల్చిన ధర్మము. శక్తి సామర్థ్యములు గలవారిలో శ్రేష్ఠుడు. లోకమునందలి తాపసులలో కూడా శ్రేష్ఠుడు. వివిధాస్త్ర ప్రయోగములను తెలిసిన వాడు. చర అచరాత్మకములైన ముల్లోకములో ఈయనతో సమానుడైన వాడు లేడు, ఇకముందు ఉండడు కూడా . దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మొదలగువారిలో విశ్వామిత్రునితో సమానమైనవారు లేరు'.

సర్వాస్త్రాణి కృశాశ్వస్య పుత్త్రాః పరమధార్మికాః |
కౌశికాయ పురాదత్తా యదారాజ్యం ప్రశాసతి ||
తేsపి పుత్త్రాః కృశాశ్వస్య ప్రజాపతిసుతాసుతాః |
నైకరూపా మహావీర్యా దీప్తిమంతో జయావహాః ||

తా|| 'విశామిత్రుడు రాజ్యము చేయుచున్నప్పుడు కృశాశ్వుడను ప్రజాపతి తన కుమారులను అస్త్ర రూపములో ఆయనకు ఇచ్చెను. కృశాశ్వుని కుమారులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు. వారు పెక్కురూపములు గలవారు మహావీరులు, తేజోమయులు , జయము కూర్చువారు'.

జయా చ సుప్రభాచైవ దక్షకన్యే సుమధ్యమే |
తే సువాతేsస్త్ర శస్త్రాణీ శతం పరమభాస్వరమ్ ||
పంచాశతం సుతాన్ లేభే జయా నామ పరాన్ పురా |
వధాయా సుర సైన్యానామ్ అమేయాన్ కామరూపిణః ||
సుప్రభాsజనయచ్చాపి పుత్త్రాన్ పంచశతం పునః |
సంహారాన్ నామ దుర్దర్షాన్ దురాక్రమాన్ బలీయసః ||

తా|| జయ సుప్రభా అను దక్షకన్యలు సుందరాంగులు. వారు శత్రువులను జయించు ప్రకాశవంతములైన నూరు అస్త్ర శస్త్రములను సృష్ఠించిరి. అసుర సైన్యములను సంహరించుటకై జయ అను ఆమె మిక్కిలి శక్తి సంపన్నులు కామరూపులు శ్రేష్ఠులు అయిన ఏబది కుమారులను కనెను. సుప్ప్రభ అను ఆమె 'సంహారులు' అను పేరుగల ఏబదిమంది పుత్త్రులను కనెను. వారు జయింప శక్యము గానివారు పరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు.

తాని చాస్త్రాణి వేత్యేష యథావత్ కుశికాత్మజః |
అపూర్వాణాం చ జననే శక్తో భూయస్సధర్మవిత్ ||
ఏవం వీర్యో మహాతేజా విశ్వామిత్రో మహాయయశాః |
న రామగమనే రాజన్ సంశయం కర్తుమర్హసి ||
తేషాం నిగ్రహేణ శక్తః స్వయం చ కుశికాత్మజః |
తవపుత్త్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే ||

తా||'కుశికుని పుత్త్రుడైన విశ్వామిత్రుడు ఆ అస్త్రములన్నింటినీ పూర్తిగా ఎఱుగును. ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను సృష్ఠించగలడు కూడా .ఇట్టి ప్రతిభావంతుడైన విశామిత్రుడు, మహావీరుడు మిక్కిలి వాసికెక్కిన వాడు. కావున ఓ రాజా ! ఈయన వెంటన శ్రీరాముని పంపుటకు సందేహము వలదు. విశ్వామిత్రుడు స్వయముగనే రాక్షసులను నిగ్రహింప సమర్థుడు. నీ కుమారునికి మేలు చేకూర్చుటకు నీ కడకు వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుచున్నాడు.'

ఇతి మునివచనాత్ ప్రసన్నచిత్తో
రఘువృషబస్తు ముమోద భాస్వరాంగః |
గమనమభిరురోచ రాఘవస్య
ప్రథిత యశాః కుశికాత్మజాయ బుద్ధ్యా ||

తా|| అనిన ముని వచనములతో ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగి పోయెను. సూక్ష్మబుద్ధిగల అ మహరాజు విశ్వామిత్రునితో శ్రీరాముని పంపుటకు మనస్పూర్తిగా అంగీకరించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకవింశ స్సర్గః |
సమాప్తం||


|| om tat sat ||