Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 24

' Story of Tataki !'

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ఇరువది నాలుగవ సర్గము.

(విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగాసరయూనదుల సంగమప్రదేశము గురించి , మలద కరూశ ప్రదేశములగురించి తాటక గురించి తెలుపుట)

తతః ప్రభాతే విమలే కృత్వాహ్నికం అరిందమౌ |
విశ్వామితం పురస్కృత్య నద్యాస్తీరముపాగతౌ ||

తా|| శత్రువులను అంతముచేయగల వారిద్దరూ అప్పుడు నిర్మలముగా నున్న ప్రభాతసమయములో ప్రాతఃకాల దైవిక కర్మలను ముగించుకొని విశ్వామిత్రుని అనుసరించి గంగా తీరమునకు చేరిరి.

తే చ సర్వే మహాత్మానౌ మునయ స్సంశితవ్రతాః |
ఉపస్థాప్య శుభాం నావం విశ్వామిత్రం అథాబ్రువన్ ||
ఆరోహతు భవాన్ నావం రాజపుత్రపురస్కృతః |
అరిష్టం గచ్ఛపంథానం మాభూత్ కాలవిపర్యయః ||
విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తాన్ ఋషీనభిపూజ్య చ|
తతార సహితస్తాభ్యాం సరితం సాగరంగమామ్ ||

తా|| వ్రతనిష్ఠాపరులు మహాత్ములు అయిన ఆ మునులు అందఱూ ఒక చక్కని నావని తెప్పించి మహాముని విశ్వామిత్రుని తో ఇట్లనిరి. 'ఓ మహామునీ మీరు ఇంకా ఈ రాజకుమారులు ఈ నావని ఎక్కుడు. ఆలస్యముకాకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయుడు'. ఆ మునులను పూజించి విశ్వామిత్రుడు అట్లే అని పలికి రామలక్ష్మణులతో గూడి సాగరములో సంగమమగు ఆ గంగానదిని దాటెను.

తతః శుశ్రావ వై శబ్దం అతిసంరంభవర్ధితమ్ |
మధ్యమాగమ్య తోయస్య సహ రామః కనీయసా ||
అథ రామస్సరిన్మధ్యే ప్రపచ్ఛ మునిపుంగవమ్ ||
వారిణో భిద్యమానస్య కిమయం తుములో ధ్వనిః ||
రాఘవస్య వచశ్రుత్వా కౌతూహలసమన్వితః |
కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయమ్ ||

తా|| నావ నదియొక్క మధ్యభాగమున చేరగానే అలల తాకిడి కి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినబడెను. అప్పుడు శ్రీరాముడు " ఈ నదీ మధ్యభాగమున జలతరంగముల ఘర్షణవలన ఉత్పన్నమైన అ మహాధ్వనికి కారణమేమి" అని విశ్వామిత్ర మహర్షిని అడిగెను. కుతూహలముతో కూడిన శ్రీరాముని మాటలను విని అంతట ధర్మాత్ముడైన ఆ విశ్వామిత్రుడు ఆ మహాధ్వని యొక్క కారణము తెలుపసాగెను.

కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః |
బ్రహ్మణా నరశార్దూల తేనేదంమానసం సరః ||
తస్మాత్ శుశ్రావ సరసః సాయోధ్యాముపగూహతే |
సరః ప్రవృతా సరయూః పూణ్యా బ్రహ్మ సరశ్చ్యుతా ||
తస్యాయమతులః శబ్దో జాహ్నవీం అభివర్తతే |
వారిసంక్షోభజో రామ ప్రణామం నియతః కురు ||

తా|| 'రామా ! ఓ నరశార్దూలా ! బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఓక సరస్సు నిర్మించెను. అది మానససరస్సు అని పేరుతో ప్రసిద్ధి పొందినది. సరయూ నది అ మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యని చుట్టి ప్రవహించుచున్నది. సరస్సునుంచి పుట్టినది కావున ఇది సరయూ అని పేరుపొందినది. బ్రహ్మ సరస్సునుంచి పుట్టినందువలన ఇది పుణ్యమైన నది. సరయూనది గంగానదిలో సంగమించునప్పుడు నీటి తరంగముల ఘర్షణవలన అ మహాధ్వని ఉద్భవించుచున్నది. ఓ రామా ఈ నదీ ద్వయములకు శ్రద్ధగా ప్రణామము చేయుము'.

తాభ్యాం తు తా వుభౌ కృత్వా ప్రణామమ్ అతిధార్మికౌ |
తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘువిక్రమౌ ||
సవనం ఘోర సంకాశం దృష్ట్వా నృపవరాత్మజః |
అవిప్రహత మైక్ష్వాకః ప్రపచ్ఛ మునిపుంగవమ్ ||

తా|| అతి ధార్మికులైన వారిద్దరూ ఆ రెండు నదులకూ నమస్కరించి దక్షిణ తీరము చేరి వేగముగా ముందుకు నడువ దాగిరి. జనసంచారము లేని దట్టముగా నున్నఆ అడవిని చూచి , ఇక్ష్వాకు వంశజుడైన శ్రీరాముడు ముని పుంగవుని ఇట్లు అడిగెను.

అహోవన మిదం దుర్గం ఝిల్లికాగణనాదితమ్ |
భైరవైః శ్వాసదైః పూర్ణం శకుంతైర్దారుణారుతైః ||
నానా ప్రకారైః శకునై వాశ్యద్భిః భైరవస్వనైః |
సింహవ్యాఘ్రవరాహైశ్ఛ వారణైశ్చోపశోభితమ్ ||
ధనాశ్వకర్ణకకుభైః బిల్వతిందుకపాటలైః |
సంకీర్ణం బదరీభిశ్చ కిన్న్వేతద్దారుణం వనమ్ ||

తా|| 'అహో ! ఈ వనము దుర్గమమైనది, కీచురాళ్ళ గణముల నాదములతో నిండినది. భయంకరమైన మృగములతో నిండినది, భయంకరమైన కూతలుగల పక్షులతో నిండినది. సింహ వ్యాఘ్ర వరాహ ఏనుగులు శ్వేచ్ఛగా తిరుగుచున్నవి. చండ్ర నల్లమద్ది , ఎర్రమద్ది, చెట్లతోనూ మారేడు వృక్షములతోనూ అట్లే తదితర వృక్షములతో నిండియున్న ఈ కాననము పేరేమి?

తమువాచ మహాతేజా విశ్వామిత్రో మహమునిః |
శ్రూయతాం వత్స కాకుత్ స్థ యస్యైతద్దారుణం వనమ్||
ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమ |
మలదాశ్చ కరూశాశ్చ దేవనిర్మాణ నిర్మితౌ ||

తా|| మహాతేజోమయుడైన విశ్వామిత్రుడు శ్రీరామునితో ఇట్లుపలికెను. వత్సా ! ఈ దుర్గమమైన వనము ఎవరిదో తెలిపెదను వినుము. ఓ నరోత్తమా! పూర్వకాలమున ఇచట 'మలదము' 'కరూశము' అను రెండు ప్రదేశములు దేవ నిర్మితములై యుండెను. అవి ధన ధాన్య సంపదలతో తులతూగుచుండెను.

పురా పుత్రవధే రామ మలేన సమభిప్లుతమ్ |
క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్ ||
తమింద్రం భుమ్యాం మలం దత్వా దత్వా కారూశమేవ చ
శరీరజం మహేంద్రస్య తతో హర్షం ప్రపేదిరే ||

తా||"ఓ రామా ! పూర్వము ఇంద్రుడు వృత్తాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మ హత్యా పాతకము కలిగెను. అందువలన అతడు అపవిత్రుడయ్యెను. ఆయనను ఆకలి దప్పులు భాధింపసాగెను . దేవతలూ తపోధనులైన ఋషులు ఇంద్రుని గంగోదకములచే మంత్ర పూరితమైన కలశోదికములచే స్నానము చేయించిరి. అందువలన అతని అపవిత్రత ఆకలిబాధ తొలగెను. ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరముకు ఏర్పడిన అశుచిత్వము అకలిబాధా పోవుట వలన దేవతలూ ఋషులు మిక్కిలి ఆనందపడిరి'.

నిర్మలో నిష్కరూశశ్చశుచిరింద్రో యదాsభవత్ |
దదౌ దేశస్య సుప్రీతో వ్రరం ప్రభురనుత్తమమ్ ||
ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యతః |
మలదాశ్చ కరూశాశ్చ మమాంగ మలధారిణౌ ||
సాధు సాధ్వితి తం దేవాః పాకశాసనమబ్రువన్|
దేవస్య పూజాం తాం దృష్ట్వా కృతాం శక్రేణ ధీమతా ||
ఏతౌ జనపదౌ స్ఫీతో దీర్ఘకాలమతిందమ |
మలదాశ్చ కరూశాశ్చ ముదితౌ ధనధాన్యతః ||

తా|| 'అపవిత్రత ఆకలిబాధ తొలగి శుచియగుటకు ఇంద్రుడు సంతసించి ఈ దేశమునకు అత్యుత్తమమైన వరము ప్రసాదించెను. " నాశరీర మాలిన్యములు తొలగించిన ఈ రెందు ప్రదేశములు 'మలద' 'కరూశ' అను పేరులతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూగుచుండును" .శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమమైన వరము నిచ్చి ఆదరించుటనుచూచి దేవతలందరూ 'బాగు ' 'బాగు' అని ప్రశంశించిరి. ఓ శత్రు సంహారకా రామా! 'మలద' 'కరూశ' అను ఈ ప్రదేశములు అట్లు ధనధాన్య సంపదలతో చిరకాలము వర్ధిల్లినవి'.

కస్యచిత్త్వథ కాలస్య యక్షీ వై కామరూపిణీ|
బలం నాగసహస్రస్య ధారయంతీ తదాహ్యభూత్ ||
తాటకా నామ భద్రంతే భార్యా సుందస్య ధీమతః |
మారీచో రాక్షసః పుత్త్రో యస్యాః శక్రపరాక్రమః ||
వృత్తబాహుర్మహావీర్యో విపులాస్యతమర్మహాన్ |
రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజాః ||

తా|| కొంత కాలము తరువాత పుట్టినపుడే వేయి ఏనుగుల బలము కలదియూ, కామరూపిణీ అయిన తాటక అను యక్షిణీ ఇచట నివశించెను. ఆమె బలశాలి అయిన 'సుందుడు' అనువానికి భార్య అయ్యెను. రామా! నీకు భద్రమగుగాక. ఆ తాటకికి మారీచుడు అనబడు రాక్షసుడు పుత్త్రుడుగా గలిగెను. అతడు ఇంద్రునివంటి పరాక్రమము గలవాడు. అతని బాహువులు బలిష్ఠమైనవి. అతడు మహావీరుడు. అతని శరీరము ముఖము విశాలమైనవి. భయంకరుడైన ఆరాక్షసుడు ఎల్లప్పుడూ ప్రజలను బాధింపసాగెను.

ఇమౌ జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ |
మలదాంశ్చ కరూశాంశ్చ తాటకా దుష్టచారిణీ ||
సేయం పంథాన మావార్య వసత్య ధ్యర్థయోజనే |
అత ఏవ చ గంతవ్యం తాటకయా వనం యతః ||
స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టచారిణీమ్ |
మన్నియోగాదిమం దేశం కురు నిష్కంటకం పునః ||

తా|| 'ఓ రామా దుష్టచారిణి అగు తాటక 'మలద' 'కరూశ' అను ఈ రెండు జనపదములను ధ్వంసమొనర్చుచున్నది. ఇచటికి ఒకటిన్నర యోజనముల దూరమున ఆ తాటకి ఈ దారిని ఆక్రమించి నివశించుచున్నది. అందువలన మనము ఆ తాటక యున్న దారిలోనే వెళ్ళవలెను. నీ బాహుబలము ఉపయోగించి ఆ దుష్టచారిణిని వధింపుము . నామాటను పాటించి ఈ దేశమును ఇదివఱకు వలె ఉపద్రవములు లేకుండా చేయుము'.

న హి కశ్చిదిమం దేశం శక్నోత్యాగంతుమీదృశమ్ |
యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదితమసహ్యయా ||

తా|| 'ఓ రామా! ఘోరమైన అసహ్యకరమైన ఈ యక్షిణి ధ్వంసమొనర్చిన ఈ దేశమునకు ఎవ్వరునూ రాజాలకున్నారు".

ఏతత్ తే సర్వమాఖ్యాతుం యథైతద్దారుణం వనమ్ |
యక్ష్యా చోత్సాదితం సర్వం అద్యాపి న నివర్తతే ||

తా|| 'ఈ దేశమును తాటక ద్వంసమొనర్చిన తీరును , తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధానమును తెలిపితిని . ఈ తాటకి ఇప్పటికిని ఈ అడవిని విడిచిపెట్టలేదు.'

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే చతుర్వింశ స్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||