Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 26

' Death of Tataki !'

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ఇరువది ఆఱవసర్గము
( తాటక వధ)

మునేర్వచనమక్లీబం శ్రుత్వానరవరాత్మజః|
రాఘవః ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః ||

తా|| నరులలో శ్రేష్ఠుడైన ఆ రాఘవుడు విశ్వామిత్రునియొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢనిశ్చయము కలవాడై ఇట్లు పలికెను.

పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ |
వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా ||
అనుశిష్టోsస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా |
పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం హి తద్వచః ||
సోsహం పితుర్వచః శ్రుత్వా శాసనాత్ బ్రహ్మవాదినః |
కరిష్యామి న సందేహః తాటకవధముత్తమమ్ ||
గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ |
తవచైవాప్రమేయస్య వచనం కర్తుముద్యత ||

తా|| ' విశ్వామిత్రునియొక్క వచనములను నిశ్శంకముగా పాటింపమని తండ్రిచెప్పిన ఆదేశము. పిత్రు వచనమును గౌరవించుటకునూ , మహాత్ముడు మా తండ్రి అయిన దశరథుడుఅయోధ్యలో వశిష్ఠాది గురువులసమక్షములో ఆజ్ఞాపించుటవలననూ, నాకు ఆ మాట ఉల్లంఘింపరానిది. నేను తండ్రి వచనముల ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనము ప్రకారము ఆ తాటకిని వధించి తీరెదను. గో బ్రాహ్మణ హితము కోసము ఈ దేశముయొక్క సౌఖ్యము కొఱకు మీ వచనమును పాటించుటకు పూనుకొనుచున్నాను'.

ఏవ ముక్త్వా ధనుర్మధ్యే బద్ద్వాముష్టిం అరిందమః |
జ్యా శబ్దం అకరోత్ తీవ్రం దిశశ్శబ్దేన నాదయన్ ||
తేన శబ్దేన విత్రస్తాః తాటకావనవాసినః |
తాటకాచ సుసంకృద్దా తేన శబ్దేన మోహితా ||
తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్చ్ఛితా |
శ్రుత్వాచాభ్యద్రవద్వేగాత్ యతశ్శబ్దో వినిశ్రుతః ||

తా|| ఇట్లు చెప్పి ఆ శత్రుమర్దనుడైన రాఘవుడు ధనుస్సును మధ్యలో పిడికిట బట్టి అన్ని దిక్కులలో మారుమోగునటుల ధనుష్ఠంకారమును చేసెను. ఆ శబ్దముతో తాటకావనవాసులు భయకంపితులైరి . తాటకి కూడా అ శబ్దముతో మిక్కిలి క్రుద్ధురాలయ్యెను. ఆ శబ్దమును విని క్రోధముతో మూర్ఛపోయిన తాటకి ఎక్కడనించి ఈ శబ్దము వచ్చెనో ఆ దిశకి వేగముగా పరుగులు తీసెను.

తాం దృష్ట్వా రాఘవః కృద్ధాం వికృతాం వికృతాననాం |
ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం సోభ్యsభాషత ||

తా|| క్రోధముతో వికారమైన రూపము వికృతమైన ముఖము పెద్ద ప్రమాణములు గల ఆ తాటకిని చూచి రాఘవుడు లక్ష్మణునితో ఇట్లు పలికెను.

పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః |
భిద్యేరన్ దర్శనాదస్యా భీరూణాం హృదయానిచ ||
ఏనాం పశ్య దురాధర్షాం మాయాబలసమన్వితామ్ |
వినివృత్తాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాశసికామ్||
న హ్యేనాముత్సహే హంతుం స్త్రీభావేన రక్షితమ్ |
వీర్యం చాస్యాగతిం చాపి హనిష్యామీతి మే మతిః ||

తా||' ఓ లక్ష్మణా ! ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారము చూడుము. ఈమెను చూచినచో భీరువుల హృదయములు బద్దలగును. మాయాబలములతో గూడినదియూ, ఎదిరింప శక్యముగాని బలముకలదియూ అగు ఈ తాటకి యొక్క చెవులు ముక్కులని ఖండించి వెనుకకు పోవునటుల చేసెదను చూడుము. ఈమె స్త్రీ అగుటవలన చంపుటకు నేను ఇష్ట పడుట లేదు.ఈమె వీర్యమును గతిని నశింపచేయుట యుక్తము'.

ఏవం బ్రువాణే రామే తు తాటకా క్రోధమూర్ఛితా |
ఉద్యమ్యబాహూ గర్జంతీ రామమేవాభ్యధావతా ||
విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిః హుంకారేణాభిభర్త్స్యతామ్ |
స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత ||

తా|| ఈవిధముగా రాముడు పలుకు చుండగా క్రోధముతో వీగుచున్న తాటకి తన భుజములను ఎత్తుగా చేసి గర్జించుచూ రాముని పై విజృంభించెను. అప్పుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడును హుంకారము చేసి , 'రామలక్ష్మణులకు శుభమగుగాక', 'జయమగుగాక' అని అశీర్వదించెను.

ఉద్ధూన్వానా రజో ఘోరం తాటకా రాఘవావుభౌ |
రజోమోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్ ||
తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ |
అవాకిరత్ సుమహతా తతశ్చుక్రోధ రాఘవః ||
శిలావర్షం మహత్ తస్యాః శరవర్షేణ రాఘవః |
ప్రతిహత్యోపధావంత్యాః కరౌ చిచ్ఛేద పత్రభిః ||
తతశ్చిన్నభుజాం శ్రాంతాం అభ్యాశే పరిగర్జతీమ్|
సౌమిత్రిరకరోత్ క్రోధాత్ హృతకర్ణాగ్రనాసికామ్ ||

తా|| అంతట ఆ తాటకి రామలక్ష్మణుల పైకి భయంకరముగా ధూళిని చిమ్ముచూ , తీవ్రమైన ఆ ధూళి ప్రభావముతో వారిని క్షణమాత్రము సమ్మోహితులను చేసెను. ఆ తాటకి మాయా ప్రభావముచే వారికి కనపడకుండా శిలావర్షము కురిపించెను. అంతట రాముడు క్రుద్ధుడై తన శరపరంపరచే ఆ శిలావర్షమును భగ్నమొనర్చెను. తన మీదికి విఝృంభించుచున్న ఆ తాటకియొక్క చేతులని ఖండించెను. ఈ విధముగా చేతులు తెగి యున్ననూ తమ పైకి గర్జించుచూ వచ్చుచున్న తాటకి చెవులు ముక్కులను లక్ష్మణుడు కోసి వేసెను.

కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః |
అంతర్థానం గతా యక్షీ మోహయంతీవ మాయయా ||
ఆశ్మవర్షం విముంచంతీ భైరవం విచచార హ ||
తతస్తావశ్మ వర్షేణ కీర్యమాణౌ సమంతతః |
దృష్ట్వా గాధిసుతః శ్రీమాన్ ఇదం వచన మబ్రవీత్ ||

తా || కామరూపిణి అయిన ఆ యక్షిణి బహురూపములనుపొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకు చూచెను. రామలక్ష్మణులకు కనపడకుండా మళ్ళీ శిలావర్షము కురిపించుచూ అటు నిటు తిరగసాగెను. అన్ని వైపులనుండి కురుయుచున్న శిలా వర్షములో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు ఇట్లు పలికెను .

అలం తే ఘృణయా రామా పాపైషా దుష్టచారిణీ |
యజ్ఞవిఘ్నకరీ యక్షీ పురా వర్ధతి మాయయా ||
వధ్యతాం తావదేవైషా పురా సంధ్యా ప్రవర్తతే |
రక్షాంసి సంధ్యాకాలేషు దుర్దర్షాణీ భవంతి వై ||

తా|| 'ఓ రామా! ఇంతవఱకు ఆమెపై చూపిన జాలి చాలును. పాపాత్మురాలైన ఈ యక్షిణి దుర్మార్గురాలు. ఈమె యజ్ఞములకు విఘ్నము కలిగించును. మాయా ప్రభావముచే ఈమె ఇంకనూ బలపడును సంధ్యా కాలము సమీపించుచున్నది. రాక్షసులు సంధ్యాకాలములో బలోపేతులగుదురు. ఈ లోపలనే ఈమెను హతమార్చుము'.

ఇత్యక్తస్తు తదా యక్షీం అశ్మవృష్ట్యాభివర్షతీమ్ |
దర్శయన్ శబ్దవేధిత్వం త్వాం రురోధ స సాయకైః ||
సా రుద్ధా శరజాలేన మాయాబల సమన్వితా |
అభిదుద్రావ కాకుత్ స్థం లక్ష్మణం చ వినేదుషీ ||
తమపతంతీం వేగేన విక్రాంతం అశనీమివ |
శరేణోరసి వివ్యాథా సా పపాత మమార చ ||

తా|| ఈ విధముగా చెప్పబడిన శ్రీరాముడు రాళ్ళవర్షము కురిపించుచున్న ఆ యక్షిణి ని రాముడు శబ్ధబేధి యను అస్త్రముతో నిలువరించెను. ఈ విధముగా ఆడగింపబడి క్రుద్ధురాలైన తాటకి రామలక్ష్మణులవేపు దాడిచేయుటకు పరుగులు తీసెను. ఆవిధముగా వేగముగా వచ్చుచున్న ఆ తాటకిని బాణములతో విక్రాంతుడగు శ్రీరాముడు కొట్టెను. వేంటనే ఆ యక్షిణి కిందబడి ప్రాణములు కోల్పోయెను.

తాం హంతాంభీమసంకాశాం దృష్ట్వా సురపతిస్తదా |
సాధు సాధ్వితి కాకుత్ స్థం సురాశ్చ సమపూజయన్ ||
ఉవాచ పరమప్రీతః సహస్రాక్షః పురందరః |
సురాశ్చ స్సర్వే సంహృష్టా విశ్వామిత్ర మథాబ్రువన్ ||
మునే కౌశిక భద్రం తే సేంద్రా స్సర్వే మరుద్గణాః |
తోషితాః కర్మణానేన స్నేహం దర్శయ రాఘవే ||

తా|| భయంకరమైన ఆకారముగల ఆ తాటకి ఈ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు 'బాగు' 'బాగు' అని ప్రశంసించిరి. పరమప్రీతులైన ఇంద్రుడును తదితర దేవతలూ విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి. ' ఓ విశ్వామిత్ర మునీ నీకు శుభమగుగాక. ఈ తాటక వధవలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతసించిరి. ఆ రామలక్ష్మణులపై ప్రేమ జూపుము'.

ప్రజాపతే ర్భృశాశ్వస్య పుత్త్రాన్ సత్య పరాక్రమాన్ |
తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ ||
పాత్రభూతాశ్చ తే బ్రహ్మన్ తవానుగమనే ధృతః |
కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా ||
ఏవముక్త్వా సురా సర్వే హృష్టాజగ్ముర్యథాగతమ్ |
విశ్వామిత్రం పురస్కృత్య తతసంధ్యా ప్రవర్తతే ||

తా|| 'ఓ బ్రహ్మర్షీ ! ప్రజాపతి అయిన భృశాస్వుని కుమారులు సత్య పరాక్రములు. వారు తపొ బల సంపన్నులు. అస్త్రరూపములో నున్నవారిని శ్రీరామునకు సమర్పింపుము. ఓ మునీ! శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలను చేయుచున్నాడు. కావున ఈ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఇతడు దేవతల కొఱకై ఒక మహాకార్యమును చేయవలసి యున్నది. దేవతలందరూ ఈ విధముగా పలికి , విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమతమ నివాసములకు పోయిరి.

తతో మునివరః ప్రీతః తాటకవథతోషితః |
మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్ ||
ఇహాద్య రజనీం రామ వసేమ శుభ దర్శన |
శ్వః ప్రభాతే గమిష్యామః తదాశ్రమ పదం మమ ||
విశ్వామిత్రవచః శ్రుత్వా హృష్టో దశరథాత్మజః |
ఉవాస రజనీం తత్ర తాటకయా వనే సుఖమ్ ||

తా|| అంతట ఆ మహర్షి తాటక వధకు సంతుష్ఠుడాయెను. ప్రేమతో శ్రీరాముని తలను మూర్కొనెను. పిమ్మట ఆ రాఘవునితో ఇట్లనెను. ' శుభదర్శనుడవగు ఓ రామా ! ఈ రాత్రికి ఇచటనే నివశింతము . రేపు ఉదయముననే బయలు దేరి మన ఆశ్రమమునకు వెళ్ళేదము'. విశ్వామిత్రుని వచనములను విని రాముడు సంతసించెను . వారందరూ ఆరాత్రి అచటనే గడిపిరి.

ముక్త శాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాsహని |
రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనమ్ ||

తా|| అంతట ఆ వనము శాపవిముక్తమై అప్పటినుండి యే రమణీయమైన చైత్ర రథము వలె విరాజిల్లెను.

నిహత్య తాం యక్షసుతాం స రామః
ప్రశస్యమానః సురసిద్ధ సంఘైః |
ఉవాస తస్మిన్ మునినా సహైవ
ప్రభాత వేలాం ప్రతిభోధ్యమానః ||

తా|| ఆ రాముడు ఆ యక్షసుతను హతమార్చి , సురులు సిద్ధులచే ప్రశంసింపబడి మునీశ్వరునితో గూడి అచటనే గడిపెను. ప్రాతః కాలమున మునీశ్వరుడు వారిని మేలు కొలిపెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే షద్వింశ స్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||