Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 31

Rama told about the Siva's Bow in the court of Janaka !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ముప్పదియొకటవ సర్గము
( రామలక్ష్మణులు విశ్వామిత్రునితో మిథిలానగరమునకు ప్రయాణము)

అథ తాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ |
ఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాంతరాత్మనా ||

తా|| అప్పుడు కృతార్థులైన వీరులగు ఆ రామలక్ష్మణులు అంతరంగముగా సంతోషముతో ఆ రాత్రి అచటనే విశ్రాంతి తీసుకొనిరి.

ప్రభాతాయాం తు శర్వర్యాం కృత పౌర్వాహ్ణిక క్రియౌ |
విశ్వామిత్రమ్ ఋషీంశ్చాన్యాన్ సహితానభిజగ్మతుః ||

తా|| ప్రభాత సమయములో ఉదయకాలపు సంధ్యావందనాది కార్యక్రమములను ముగించి పిమ్మట ఆ ఇద్దరూ ఋషులతోగూడియున్న విశ్వామిత్రుని ఎదుట నిలబడిరి.

అభివాద్య మునిశ్రేష్ఠం జ్వలంతమివ పావకమ్ |
ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ ||
ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ |
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవాన కిమ్ ||

తా|| అగ్నిదేవునివలె వెలుగుచున్న ఆ మునివరునికి నమస్కరించి మృదుమధురముగా భాషించునట్టి వారిద్దరూ ఆ మహామునితో ఇట్లు పలికిరి.'ఓ మునిశార్దూలా ! మేము మీ పనిచేయువారము. ఎదుట నిలిచియుంటిమి. మీ కోరికప్రకారము ఇంకనూ ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు'.

ఏవముక్తా తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః |
విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్ ||
మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి |
యజ్ఞః పరమధర్మిష్ఠః తత్ర యాస్యామహే వయమ్ ||
త్వం చైవ నరశార్దూల సహస్మాభిర్గమిష్యసి |
అద్భుతం ధనురత్నం చ తద్ద్రష్టుమర్హసి ||

తా|| ఆ విధముగా చెప్పబడిన వారి మాటలను విని విశ్వామిత్రునితో కలిసి ఆ మహర్షులందరూ రామునితో ఇట్లు చెప్పిరి. 'ఓ నరోత్తమా! మిథిలానగరముయొక్క పరమ ధర్మిష్టుడైన జనకుని చేత ఒక యజ్ఞము కానున్నది. మనమందరమూ ఆచటికి వెళ్ళుదము. ఓ నరశార్దూలా ! నీవుగూడ మా అందరితో వెళ్ళెదవు గాక . అచట ఒక అద్భుతమైనది , ధనస్సులలో రత్నమువంటిది అగు ధనస్సు కలదు. అక్కడ దానిని నీవు చూడవచ్చు'.

తద్ది పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః |
అప్రమేయ బలం ఘోరం మఖే పరమభాస్వరమ్||
నాస్య దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసాః |
కర్తుమారోపణం శక్తా న కథంచన మానుషాః ||
ధనుషస్తస్య వీర్యం తు జిజ్ఞాసంతో మహీక్షితః |
న శేకు రారోపయితుం రాజపుత్త్రా మహాబలాః ||

తా|| 'ఓ నరశ్రేష్ఠా ! అది సాటిలేని శక్తిగలది. తేజోవిరాజమైనది. భయంకరమైనది. పూర్వము ఒక సదస్సులో దేవతలచేత జనకునకు ఇవ్వబడినది. అది దేవులు, గంధర్వులు,అసురులు, రాక్షసులకి సైతము ఎక్కుపెట్టజాలనది. ఇంక మనుష్యులగురించి చెప్పనేల ! ఆ ధనుస్సు యొక్క వీర్యము తెలిసికొనగోరి మహాబలశాలురైన రాజులెందరో దానిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించి విఫలులైరి'.

తద్ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః |
తత్ర ద్రక్ష్యసి కాకుత్ స్థ యజ్ఞం చాద్భుతదర్శనమ్ ||
తద్ధి యజ్ఞ ఫలం తేన మైథిలోనోత్తమం ధనుః |
యాచితం నరశార్దూల సునాభం సర్వ దేవతైః ||
ఆయాగభూతం నృపతేః తస్య వేశ్మని రాఘవ |
అర్చితం వివిధైర్గంధైః ధూపై శ్చాగరుగంధిభిః ||

తా || ఓ నరశార్దూలా ! ఆ మహత్ముడైన మిథిలాధిపతియొక్క ఆ ధనస్సును అక్కడ నీవు చూచెదవు. అక్కడ అద్బుతమైన యజ్ఞమును కూడా చూచెదవు. ఓ నరశార్దూల ! పూర్వము అందరు దేవతలచేత ఆ మిథిలాధిపతికి యజ్ఞఫలముగా ఆ సునాభమైన ఉత్తమమైన ధనస్సు ఇవ్వబడినది. ఓ రాఘవా! యాగభూతమగు అ భవనములో ఆ ధనస్సు గంధములతోనూ పుష్పములతోనూ అగరు ధూపములతోనూ అర్చింపబడినది'.

ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్ తదా |
సర్షిసంఘః సకాకుత్ స్థ ఆమంత్ర్య వనదేవతాః ||
స్వస్తి వోsస్తు గమిష్యామి సిద్ధ సిద్ధాశ్రమాదహమ్ |
ఉత్తరే జాహ్నవీ తీరే హిమవంతం శిలోచ్చయమ్ ||

తా|| ఈ విధముగా చెప్పి ఆ మునివరుడు ఋషులతో , కాకుశ్థ్స వంశజులతో అచటినుండి ప్రస్థానము అవుతూ అచటి వనదేవతలను ఉద్దేశించి ఇట్లు పలికెను.' మీకు శుభమగుగాక. సిద్ధి పొంది సిద్ధాశ్రమమునుంచి జాహ్నవీనదికి ఉత్తరతీరమున గల హిమవంతమునకు వెళ్ళుచున్నాను'అని.

ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమమనుత్తమమ్ |
ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే ||
తం ప్రయాంతం మునివరం అన్వయాదనుసారిణమ్|
శకటీ శతమాత్రం తు ప్రాయేణ బ్రహ్మవాదినామ్ ||
మృగపక్షి గణాశ్చైవ సిద్ధాశ్రమనివాసినః |
అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిమ్ |
నివర్తయామాస తతః పక్షిసంఘాన్ మృగానపి ||

తా|| పిమ్మట ఆ మహర్షి ఉత్తమమైన సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణమొనర్చి ఉత్తర దిశగా ప్రయాణమయ్యెను. ఆవిధముగా ఉత్తర దిశగా ప్రయాణము అవుతున్న ఆ మునీశ్వరుని వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంభారములతో గూడిన వంద శకటములు అనుసరించెను. సిద్దాశ్రమములో నివశించు చున్న మృగములు పక్షులు కూడా ఆమహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరింపగా ఆయన వాటిని వెనుకకు పంపివేసెను.

తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే |
వాసం చక్రుర్ముని గణాః శోణాకూలే సమాహితాః ||
తేsస్తంగతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః |
విశ్వామిత్రం పురస్కృత్య నిషేదురమతౌజసః ||

తా|| వారందరూ కొంత దూరము ప్రయాణింపగా సూర్యాస్తమము అయ్యెను. అంతట ఆ మునులందరూ శోణ నదీ తీరమునకు చేరి ఆరాత్రికి అచట బసచేసిరి. ఆ సూర్యాస్తమయ సమయములో స్నానముచేసి అగ్ని కార్యములను పూర్తిచేసికొని అమిత తేజోవంతులైన ఆ మునులు విశ్వామిత్రునితో ఆసీనులైరి.

రామోsపి సహసౌమిత్రిః మునీం స్తానభిపూజ్యచ |
అగ్రతో నిషసాదాథ విశ్వామిత్రస్య ధీమతః ||
అథ రామో మహాతేజా విశ్వామిత్రం మహమునిమ్ |
పప్రచ్ఛ నరశార్దూలః కౌతూహలసమన్వితః ||
భగవన్ కో న్వయం దేశః సమృద్ధ వన శోభితః |
శ్రోతుమిచ్ఛామి భద్రం తే వక్తుమర్హసి తత్త్వతః ||

తా|| శ్రీరామ లక్ష్మణులు కూడా ఆ మునులందరికి నమస్కరించి ధీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండిరి. అప్పుడు మిక్కిలి కుతూహలముతో శ్రీరాముడు మహాముని అయిన విశ్వామిత్రుని ఇట్లు ప్రశ్నించెను. ' ఓ మహాత్మా శోణ నదీ తీరమున దట్టమైన వృక్షములతో శోబిల్లుచున్న ఈ ప్రదేశమెవరిది? ఈ విషయము వినగోరుచున్నాను . దయతో విస్తరముగా తెల్పుడు'అని.

చోదితో రామ వాక్యేన కథయామాస సువ్రతః |
తస్య దేశస్య నిఖిలం ఋషిమధ్యే మహాతపాః ||

తా|| అప్పుడు ఆ ఋషుల మధ్య వ్రతనిష్ఠగల మహాతపశ్వి అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని వాక్యములకు సమాధానముగా ఆ దేశముయొక్క వృత్తాంతమును చెప్పసాగెను.

||ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే ఏకత్రింశ స్సర్గః ||
సమాప్తం ||

|| ఈవిధముగా బాలకాండలోని ముప్పదియొకటవ సర్గ సమాప్తము.||
|| ఓమ్ తత్ సత్ ||


||om tat sat ||