Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 31

Rama told about the Siva's Bow in the court of Janaka !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

అథ తాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ |
ఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాంతరాత్మనా ||

అప్పుడు కృతార్థులైన వీరులగు ఆ రామలక్ష్మణులు అంతరంగముగా సంతోషముతో ఆ రాత్రి అచటనే విశ్రాంతి తీసుకొనిరి.

బాలకాండ
ముప్పదియొకటవ సర్గము
( రామలక్ష్మణులు విశ్వామిత్రునితో మిథిలానగరమునకు ప్రయాణము)

అప్పుడు వీరులు కృతార్థులు అయిన ఆ రామలక్ష్మణులు అంతరంగముగా సంతోషించుతూ ఆ రాత్రి అచటనే విశ్రాంతి తీసుకొనిరి. ప్రభాత సమయములో ఉదయకాలపు సంధ్యావందనాది కార్యక్రమములను ముగించి పిమ్మట ఆ ఇద్దరూ ఋషులతోగూడియున్న విశ్వామిత్రుని ఎదుట నిలబడిరి.

అగ్నిదేవునివలె వెలుగుచున్న ఆ మునివరునికి నమస్కరించి మృదుమధురముగా భాషించునట్టి వారిద్దరూ ఆ మహామునితో ఇట్లు పలికిరి.'ఓ మునిశార్దూలా ! మేము మీ పనిచేయువారము. ఎదుట నిలిచియుంటిమి. మీ కోరికప్రకారము ఇంకనూ ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు'.

రామలక్ష్మణుల మాటలను విని విశ్వామిత్రునితో కలిసి ఆ మహర్షులందరూ రామునితో ఇట్లు చెప్పిరి. 'ఓ నరోత్తమా! మిథిలానగరముయొక్క పరమ ధర్మిష్టుడైన జనకుని చేత ఒక యజ్ఞము కానున్నది. మనమందరమూ ఆచటికి వెళ్ళుదము. ఓ నరశార్దూలా ! నీవుగూడ మా అందరితో వెళ్ళెదవు గాక . అచట ఒక అద్భుతమైనది , ధనస్సులలో రత్నమువంటిది అగు ధనస్సు కలదు. అక్కడ దానిని నీవు చూడవచ్చు'.

'ఓ నరశ్రేష్ఠా ! అది సాటిలేని శక్తిగలది. తేజోవిరాజమైనది. భయంకరమైనది. పూర్వము ఒక సదస్సులో దేవతలచేత జనకునకు ఇవ్వబడినది. అది దేవులు, గంధర్వులు,అసురులు, రాక్షసులకి సైతము ఎక్కుపెట్టజాలనది. ఇంక మనుష్యులగురించి చెప్పనేల ! ఆ ధనుస్సు యొక్క వీర్యము తెలిసికొనగోరి మహాబలశాలురైన రాజులెందరో దానిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించి విఫలులైరి'.

'ఓ నరశార్దూలా ! ఆ మహత్ముడైన మిథిలాధిపతియొక్క ఆ ధనస్సును అక్కడ నీవు చూచెదవు. అక్కడ అద్బుతమైన యజ్ఞమును కూడా చూచెదవు. ఓ నరశార్దూల ! పూర్వము అందరు దేవతలచేత ఆ మిథిలాధిపతికి యజ్ఞఫలముగా ఆ సునాభమైన ఉత్తమమైన ధనస్సు ఇవ్వబడినది. ఓ రాఘవా! యాగభూతమగు అ భవనములో ఆ ధనస్సు గంధములతోనూ పుష్పములతోనూ అగరు ధూపములతోనూ అర్చింపబడినది'.

ఈ విధముగా చెప్పిన పిమ్మట ఆ మునివరుడు ఋషులతో , కాకుశ్థ్స వంశజులతో అచటినుండి ప్రస్థానము అవుతూ అచటి వనదేవతలను ఉద్దేశించి ఇట్లు పలికెను.' మీకు శుభమగుగాక. సిద్ధి పొంది సిద్ధాశ్రమమునుంచి జాహ్నవీనదికి ఉత్తరతీరమున గల హిమవంతమునకు వెళ్ళుచున్నాను'అని.

పిమ్మట ఆ మహర్షి ఉత్తమమైన సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణమొనర్చి ఉత్తర దిశగా ప్రయాణమయ్యెను. ఆ విధముగా ఉత్తర దిశగా ప్రయాణము అవుతున్న ఆ మునీశ్వరుని వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంభారములతో గూడిన వంద శకటములు అనుసరించెను. సిద్దాశ్రమములో నివశించు చున్న మృగములు పక్షులు కూడా ఆమహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరింపగా ఆయన వాటిని వెనుకకు పంపివేసెను.

వారందరూ కొంత దూరము ప్రయాణింపగా సూర్యాస్తమము అయ్యెను. అంతట ఆ మునులందరూ శోణ నదీ తీరమునకు చేరి ఆరాత్రికి అచట బసచేసిరి. ఆ సూర్యాస్తమయ సమయములో స్నానముచేసి అగ్ని కార్యములను పూర్తిచేసికొని అమిత తేజోవంతులైన ఆ మునులు విశ్వామిత్రునితో ఆసీనులైరి.

శ్రీరామ లక్ష్మణులు కూడా ఆ మునులందరికి నమస్కరించి ధీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండిరి. అప్పుడు మిక్కిలి కుతూహలముతో శ్రీరాముడు మహాముని అయిన విశ్వామిత్రుని ఇట్లు ప్రశ్నించెను. ' ఓ మహాత్మా శోణ నదీ తీరమున దట్టమైన వృక్షములతో శోబిల్లుచున్న ఈ ప్రదేశమెవరిది? ఈ విషయము వినగోరుచున్నాను . దయతో విస్తరముగా తెల్పుడు' అని.

అప్పుడు ఆ ఋషుల మధ్య వ్రతనిష్ఠగల మహాతపశ్వి అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని వాక్యములకు సమాధానముగా ఆ దేశముయొక్క వృత్తాంతమును చెప్పసాగెను.

|| ఈవిధముగా బాలకాండలోని ముప్పదియొకటవ సర్గ సమాప్తము.||
|| ఓమ్ తత్ సత్ ||

చోదితో రామ వాక్యేన కథయామాస సువ్రతః |
తస్య దేశస్య నిఖిలం ఋషిమధ్యే మహాతపాః ||

అప్పుడు ఆ ఋషుల మధ్య వ్రతనిష్ఠగల మహాతపశ్వి అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని వాక్యములకు సమాధానముగా ఆ దేశముయొక్క వృత్తాంతమును చెప్పసాగెను.

||ఓమ్ తత్ సత్ ||||om tat sat ||