Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 37

Story of Kumaraswami !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా |
సేనాపతిం అభీస్సంతః పితామహముపాగమన్ ||

తా|| పూర్వకాలములో మహదేవుడు ఇట్లు తపస్సు చేయచుండగా , దేవతలూ ఋషి గణములూ సేనాపతిని కోరుకునుచూ బ్రహ్మదేవుని కడకు ఏతెంచిరి.

బాలకాండ
ముప్పది ఏడవసర్గము
( కుమారస్వామి కథ)

విశ్వామిత్రుడు చెప్పసాగెను

'ఓ రామా ! పూర్వకాలములో మహదేవుడు ఇట్లు తపస్సు చేయచుండగా , దేవతలూ ఋషి గణములూ సేనాపతిని కోరుకునుచూ బ్రహ్మదేవుని కడకు ఏతెంచిరి.ఇంద్రాది దేవతలు ఇంద్రును అగ్నిని ముందుంచుకొని పితామహుడైన బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఇట్లు చెప్పిరి. "ఓ దేవా పూర్వము నీవు ఏవరిని సేనాపతిగా నియమించితివో ఆ పరమేశ్వరుడు దేవితో సహా తపమొనర్చుచున్నాడు. ఇప్పుడు లోకహితముకోసము తదనంతర కార్యక్రమము అన్నికార్యక్రమములను ఏరిగిన మీరే ఆలోచించవలెను" అని'.

'దేవతలయొక్క ఆ వచనములను వినిన బ్రహ్మదేవుడు మధురమైన వాక్యములతో వారిని ఓదార్చుచూ ఇట్లు పలికెను. " ఆ శైలారాజు పుత్రిక చెప్పినటుల మీకు పత్నులద్వారా పిల్లలు పుట్టరు. ఆవిడ వచనముల క్లిష్టమైనవి. సందేహములేకుండా అవి సత్యము కూడా. ఈ ఆకాశమున ప్రవహించు గంగాదేవియందు అగ్నిదేవుడు ఒకపుత్రుని పొందగలడు. అతడే శత్రువులను సంహరించు సేనాపతి. శైలేంద్రుని జ్యేష్ఠ పుత్రిక ఆ పుత్రుని ఆదరింపగలదు. అతడు ఉమాదేవికి ప్రీతిపాత్రుడగును. అందుకు సంశయము లేదు."

'ఓ రఘునందనా ! ఆ బ్రహ్మదేవుని మాటలను విని దేవతలు తాము కృతార్థులైనట్లు భావించి, బ్రహ్మదేవునకు ప్రణమిల్లిరి. వారు అనేక ధాతువులతో కూడిన కైలాసపర్వతము పోయి ఆ పుత్రునికోసము అగ్నిదేవుని నియమించిరి. "ఓ అగ్ని దేవా ఇది దేవకార్యము. శైలపుత్రిక అయిన గంగా దేవిలో ఆ మహాతేజమును ఉంచుము" అని'.

' అప్పుడు అగ్ని ఆ దేవతలకు అట్లేనని ప్రతిజ్ఞచేసి గంగాదేవి కడకు పో యి ,"ఓ దేవీ గర్భము ధరింపుము , ఇది దేవతలకు హితమొనర్చు కార్యము" అని చెప్పెను. అగ్నియొక్క ఆ వచనలను విని గంగ దివ్యమైన రూపమును ధరించెను. ఆ దివ్యరూపమును చూచి ఆ శివతేజస్సు ఆమెయందు అంతయూ వ్యాపించెను. ఓ రఘునందనా ! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివ తేజముతో గంగాప్రవాహములన్నియూ నిండిపోయెను.
అప్పుడు ఆ తేజస్సు ధాటికి తట్టుకొనలేక , ఆ గంగ దేవతలందరుకూ పురోహితుడైన అగ్నితో ఇట్లు పలికెను." ఓ దేవా ఉధృతమగుచున్న నీ తేజస్సు ను భరించలేకున్నాను" అని. అప్పుడు అన్ని దేవతలకూ ఆహుతులను స్వీకరించు అగ్ని గంగాదేవితో ఇట్లు పలికెను." ఇక్కడ హైమవతీ పాదము కడ నీగర్భమును ఉంచుము " అని.

'ఓ అనఘా ! అగ్నియొక్క ఆ మాటలను విని గంగా దేవి మిక్కిలి తేజోమంతమైన ఆ గర్భమును అచట వదిలెను'.

' అ విధముగా విడవబడిన తేజస్సు బంగారమువలే తేజోమయముగా ఉండెను. ఆ ధరణీప్రదేశమంతయూ సువర్ణమయమాయెను.అ తేజస్సు యొక్క తీక్షత్వము వలన రాగి ఇనుము పుట్టెను. దానియొక్క మలము తగరము సీసము ఆయెను. ఆవిధము గా ఆ తేజస్సు భూమినిచేరి వివిధ ధాతురూపములను పొందెను. ఆ తేజస్సు అచటనుంచబడగనే దాని ప్రభావముచే ఆ పర్వతమంతయూ అందలి వనములన్నియూ సువర్ణమయములై తేజరిల్లసాగెను. ఓ రాఘవా ! అప్పటినుండి అగ్నితో సమానమైన కాంతిగల బంగారము 'జాతరూపము" అని ప్రసిద్ధి పొందెను. అచటి తృణములు, వృక్షములు లతలూ మొదలగువన్నియూ స్వర్ణమయములాయెను'.

'ఆ విధముగా అచట జన్మించిన బాలునికి ఇంద్రుడు తదితర మరుత్గణములూ పాలుఇచ్చుటకు కృత్తికలను నియోజించిరి. అ కృత్తికలు " ఈ బాలుడు మాకందరికీ పుత్రుడగును" అని దేవతలతో ఒప్పందము చేసికొని , అప్పుడే పుట్టిన శిశువునకు పాలియ్యసాగిరి. ఆ దేవతలందరూ " ఈ బాలుడు మూడు లోకములలోనూ కార్తికేయుడను పేరుతో ఖ్యాతి పొందును. ఇందుకు సంశయములేదు"అని అనుకొనిరి. దేవతల మాటలను విని ఆ కృత్తికలు శివతేజస్సు ప్రభావమున పుట్టి అగ్నివలే వెలగొందుచున్న ఆ బాలకునకు స్నానము చేయించిరి.
దేవతలు గంగాగర్భమునుండి స్ఖలితుడైనందువలన దేవతలు ఆ బాలుని స్కందుడు అని పిలవసాగిరి. కృత్తికలపోషణవలన ఆ బాలుడు కార్తికేయుడు అనబడెను'.

'ఆ ఆఱుగురు కృత్తికలలో సమృద్ధిగాపాలు వచ్చెను. ఆ ఆఱుగురు కృత్తికలనుంచి ఆ బాలుడు ఆఱుముఖములుగలవాడై పాలు తాగెను. సుకుమారుడైన ఆబాలుడు ఒక దినము మాత్రమే పాలు త్రాగి తన పరాక్రమముచే రాక్షస గణములను జయించెను. అప్పుడు దేవతలు అగ్నితో సహా వచ్చి సాటిలేని తేజముగల ఆ బాలుని సేనానాయకునిగా అభిషేకించిరి'.

'ఓ రామా ! నీ కు గంగాదేవి కథయూ, కుమారసంభవము గురించి విస్తారముగా వివరించితిని.ఈ కథను వినువారు ధన్యులగుదురు.'
విశ్వామిత్రుడు మరల చెప్పెను.

' ఓ రామా ! కుమారస్వామిపై భక్తి గలమానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్త్రపౌత్రులతో వర్థిల్లును. స్కంధలోకమును గూడ పొందును'

||ఈ విథముగా వాల్మీకి రామాయణములోని బాలకాండలో ముప్పది ఏడవ సర్గ సమాప్తము ||
|| ఓమ్ తత్ సత్ ||

భక్తశ్చ యః కార్తికేయే కాకుత్ స్థ భువి మానవః |
ఆయుష్మాన్ పుత్త్రపౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ ||

తా|| ' ఓ రామా ! కుమారస్వామిపై భక్తి గలమానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్త్రపౌత్రులతో వర్థిల్లును. స్కంధలోకమును గూడ పొందును'

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||